బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–జైసే కో తైసా

ఒకనొకప్పుడు  ఇంట్లొ పెళ్ళంటే పెద్దహడావిడిగా ఉండేది.. పెళ్ళిచూపులూ,  నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుని,ముహూర్తాలు నిశ్చయించుకోగానే,  ఆఇంటికి పెళ్ళికళ దానంతట ఆదే వచ్చెసేది.వంట బ్రాహ్మలు, గాడిపొయ్యిలు తవ్వించడం, చలవ పందిరి వేయడం, బాజా బయంత్రీలు కుదర్చడం, పెళ్ళివారికి ఓ విడిదీ, పెళ్ళికి కావాల్సిన పానకం బిందెలూ, పెళ్ళికొడుకు  ఉంగరానికి  వేలి ఆదె తీసికొవడమూ, మధుపర్కాలూ, ఇలా ఒకటేమిటి, ఓ నెలరోజులు  ముందునుంచీ పన్లు  మొదలెట్టెసేవారు.ప్రతీ పనికీ ఒక్కొరికి బాధ్యత అప్పచెప్పేవారు. వాళ్ళు  చుట్టాలే కానక్కర్లేదు,  చివరి నిముషంలో అభాసు పాలుచేయకుండా ఉండే నమ్మకస్థుడైనా చాలు.. వంట సామగ్రి విషయం, వంట బ్రాహ్మలే చూసుకునేవారు. ఇంట్లో ఓ గదిని ఈ పెళ్ళిసామాన్లు భద్రంగా ఉంచడానికి కేటాయించేవారు.. మళ్ళీ ఆ Store room  కి ఓ incharge. తాళాలాయనదగ్గరే ఉండేవి. ఆయనకి తెలీకుండా ఒక్కవస్తువూ బయటకెళ్ళేది కాదు.

ఇవన్నీ పూర్తయినతరువాత శుభలేఖలు. దగ్గరలో ఉండే ఏ ప్రెస్ లోనో అచ్చేయడానికి , ఇవ్వడం. ఎవరెవరికి పోస్టులో పంపాలో, ఎవరెవరికి స్వయంగా, పొరుగూరైనా సరే వెళ్ళి పిలవాలో, ఎవరెవరికి పోస్టులో పంపినా ఓ సారి ఫోను చేయాలో లాటి వివరాలు తయారు చేసికోడమో, మళ్ళీ ఈ శుభలేఖలో బంధుమిత్రసపరివారం అంటే సరిపోతుందా, లేదా  కుటుంబ సభ్యులందరిపేర్లూ రాయాలా అని చర్చించడం. ఎవరిపేరు వేయకపోతే ఎవరిక్కోపాలు వస్తాయో, మళ్ళీ ఇదో గొడవా. దూరప్రాంతాలవారికి ముందుగానే ఉత్తరాలు రాసి ముహూర్తం తేదీ, టైమూ చెప్పడం,ఉండేది. తరవాతి రోజుల్లో ఫోన్లు చేసి చెప్పి, వారి  ఎడ్రెసు అడిగేవారు, పోస్టులో పంపడానికి. ఇంక కవర్లకి  అంచులకి పసుపు బొట్టెట్టి, కొన్ని బుక్ పోస్టుల్లోనూ, కొన్నిటికి అంటించి అదనపు స్టాంపులు పెట్టి పోస్టు డబ్బాలో పట్టకపోతే, పోస్టాఫీసుకే వెళ్ళి అక్కడే అందజేయడమూ, ఓ పదిరోజులు ముందుగా.    ఓ విధంగా పిలుపైపోయినట్టే. ఊళ్ళోవారికి, పెళ్ళికూతురు చేసే రోజుకి పేరంటానికి పిలవడం. చెప్పొచ్చేదేమిటంటే  పెళ్ళంటే ఇంత హడావిడుండేది.

 ఓ పదేళ్ళు అంటే 21 వ శతాబ్దానికి వచ్చేటప్పటికి, ఈవెంట్ మానేజ్మెంట్లూ గట్రా  మొదలయ్యాయి. ఇంక శుభలేఖలంటారా, పిల్లనో పిల్లాడినో అడగడం, ఎన్ని వేయించమంటారూ అని. పోనీ వాళ్ళైనా చెప్పొచ్చుగా, అబ్బే, నా ఫ్రెండ్స్ ఓ 50 మందిదాకా ఉంటారనేవారు.. పోనీ ఉండనీ అని,ఓ 50 శుభలేఖలు ఇస్తారు. వాడికెక్కడ తీరికా ఇవన్నీ పోస్టుచేయడానికీ, ఓ కార్డు  scan  చేసేసి, email  లో ఫ్రెండ్సందరికీ పంపేయడం. ఆమాటేదో ముందరే చెప్తే, ఆ ఖర్చేనా తగ్గేదిగా. ఒక్కోకార్డూ, పైగా వందల్లో ఉంటుంది. పెళ్ళికొడుకు కదా, ఏమీ అనకూడదూ. కొడుకు పెళ్ళై ఏ అమెరికాకో వెళ్ళిపోయిన తరువాత, వాడిరూమ్ములో ఓ మూల దొరుకుతాయి మిగిలిపోయిన 49 కార్డులూనూ. పోనీ చింపేద్దామా అంటే మళ్ళీ సెంటిమెంటోటీ, అలాగని ఏ పాతపేపర్లతోనో ఇచ్చేద్దామా అంటే, మనసొప్పదాయె.అదో tricky situation which every parent faced.

  క్రమక్రమంగా, ఈ శుభలేఖలకీ రెక్కలొచ్చాయి.. లేనిపోని ఖర్చంతా ఎందుకూ అనుకుని, ఏ web designer దగ్గరకో వెళ్ళి ఒక్కటంటే ఒకటే కార్డు, design చేయించుకుని, తన పేరే రాసుకుని, ఇంకో కార్డు తండ్రిపేర వేయించి, హాయిగా నయాపైసా ఖర్చు లేకుండా, ఏ  Whatsapp   లోనో పంపడం.. మొహమ్మాటానికి రాత్రి 9 తరువాత ఫుకట్ గా ఏ  BSNL  ఫోనులోనో చెప్పడం. పైగా ” రాపోతే ఊరుకోనురోయ్..” అనికూడా చెప్పడం.వచ్చేవాడొస్తాడు, లేనివాడు రాడు. కానీ గొడవంతా ఊళ్ళోవాళ్ళకే. ఏ పన్నెండింటికో ముహూర్తమో, రిసెప్షనో అయితే, ఆ  Uber వాడికి  surgepricing  లో 500 ఖర్చుపెట్టి, గిఫ్ట్ గా కవర్ లో ఓ 501 పెట్టి,, అక్కడ జైల్లోవాళ్ళలాగానో, హాస్పిటల్ లో రోగుల్లానో, లైన్లో పళ్ళాలు పట్టుకుని నుంచుని, భవతి భిక్షాందేహీ అనుకుంటూ బిక్షం వేయించుకుని, మళ్ళీ uber  వాడిని పిలిచి కొంపచేరడం. మధ్యలో లైన్లో నుంచుని, మొహంమీద  రాని నవ్వు పులుముకుని, ఓ ఫోటో తీయించుకోడం. హాయిగా కొత్తావకాయవేసికుని ఇంట్లో తినక, ఎందుకొచ్చిన రిసెప్షన్లూ? మనం వచ్చేమా లేదా అన్నది ఎవడికీ పట్టింపుండదు.  ఉన్నామో ఊడేమో పట్టింపుండదు. అంతా గుంపులో గోవిందా…

Wedding

 కానీ గుళ్ళోలింగాన్ని మింగేవాడొకడైతే, గుడినే మింగేవాడూ ఉంటాడు. పై పెట్టిన ఫొటో బావుంది కదూ.. అందుకనే ఈరోజుల్లో సంబంధ బాంధవ్యాలు అలా దిగజారిపోయాయి….

 

%d bloggers like this: