బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Thaద్దినం….


   ఇదేమిటీ ఈయనకేం పనిలేదా, అస్తమానూ తద్దినాల గురించీ, మాసికాలగురించీ రాస్తూంటాడూ అని మీరందరూ అపోహ పడొచ్చు.ఏం చేయనూ, మామూలుగా అయితే ఈ తద్దినాలనేవి, స్వర్గస్థులైన మన పెద్దవాళ్ళని ఆ రోజు స్మరించుకోడానికి పెడతాము. ఇప్పుడు నేను వ్రాసేదేమంటే, మనది మనమే పెట్టుకోడం అన్నమాట!దానికి ఏదో గయ వెళ్ళి ‘గయోహం గయోహం..’ అనుకోనక్కర్లేదు. అక్కడకి ఒక్కసారి వెళ్తే, మళ్ళీ మళ్ళీ ప్రతీ సంవత్సరం, పెట్టుకోకపోయినా ఫరవా లేదుట.మనమే స్వయంగా పెట్టేసికుంటే, మన తరువాత పిల్లలు పెట్టకపోయినా, మన ‘ఆత్మ’లు సంతృప్తి పొందుటాయిట!

    ఇప్పుడు నేను వ్రాసేదేమిటంటే, ఈ ప్రపంచంలో ప్రభుత్వోద్యాగాలు చేసి రిటైర్ అయిన ‘ప్రాణులు’ ప్రతీ సంవత్సరం, నవంబరు నెలలో, పెన్షన్ తీసికునే బ్యాంకు కి వెళ్ళి, ‘ మేము బ్రతికే ఉన్నాం బాబోయ్’ అని, విన్నవించుకుంటే,మన మహారాజశ్రీ ప్రభుత్వం వారి ‘ఆత్మలు’ సంతృప్తి చెంది, ఏడాది పొడుగునా మన పెన్షన్ ని కంటిన్యూ చేస్తారన్నమాట! వచ్చే ఏడాది నవంబరులో మళ్ళీ ‘సీన్ రిపీట్’.అసలు ఈ నవంబరు నెలనే ఎందుకు ఎంచుకున్నారో బ్రహ్మక్కూడా తెలియదు.ఎప్పుడో ఆ బ్రిటిష్ వాళ్ళు చేసుంటారు, వాళ్ళకి డిశంబరులో క్రిస్మసూ,కొత్త సంవత్సరం శలవులూ కదా, ఓ గొడవ వదిలిపోతుందని, ఈ Thaద్దినం వ్యవహారం నవంబరులో ఫిక్స్ చేసేసుంటారు.గుడ్డెద్దు చేలో పడ్డట్టు, మనవాళ్ళు అదే కంటిన్యూ చేసేస్తున్నారు.

   గమనించుంటారు, ఎక్కడెక్కడిలేని పెన్షనర్సూ, ఈ నవంబరు వచ్చేసరికి, వాళ్ళ’స్వగ్రామం’ లాగ ‘బ్యాంకు గ్రామానికి’ వచ్చేస్తూంటారు. దీపావళి కూడా కలిసొస్తుందీ, పిల్లల్నీ, మనవళ్ళనీ, మనవరాళ్ళనీ చూసినట్టుంటుందీ, మన పాత స్నేహితులు ( వాళ్ళూ పెన్షనర్సే కదా) ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఊడేరో తెలిసికున్నట్టుంటుందీ అని, ఓ రెండు మూడు నెలలముందరే రిజర్వేషన్లు చేసికుని ఆ ఊరికి చేరతారు.అందుకనే ఈ నెలలో రైళ్ళలో చాలా మంది ‘కన్సెషన్’ గాళ్ళే కనిపిస్తూంటారు! ఏదో అమ్మాయిలకి సైటు కొట్టొచ్చుగదా అని రైల్వే స్టేషన్ల దగ్గర చక్కర్లు కొట్టే కుర్రాళ్ళందరికీ, ఓ పేద్ద disappointment. రైల్వే కూలీలకి కూడా మంచి గిరాకీ.ఈ పెన్షనర్సందరికీ, తమ సామాన్లు మోసుకునేటంత ఓపిక ఎక్కడ చచ్చిందీ!ఆ కూలీ ఎంతంటే అంతా చేతిలో పెట్టడం.బ్యాంకుకి వెళ్ళి బతికున్నట్లు సంతకం పెట్టకపోతే, సంవత్సరమంతా, రైల్వే స్టేషనులోనో, బస్ స్టాండులోనో, సామాన్లు మోసుకోవాలి!

    మొదటి వారం లో రష్ గా ఉంటుందని, ఓ పదిరోజులు ఆగి వెళ్ళొచ్చులే అనుకుంటే, రెండాదివారాలూ తీసేస్తే మిగిలేది ‘పక్షం’ రోజులే- మహళాయ పక్షాల్లాగ! పైగా పుణ్యంట కూడానూ. ఇదే కాకుండా, మన బ్యాంకోద్యోగులు ‘హాబీ’ గా చేసికునే వార, పక్ష, మాశిక, త్రైపక్ష, త్రైమాసిక,అర్ధసంవత్సర, సాంవత్సరీక ‘సమ్మె’ లోటీ ! వాళ్ళేదో సరదాగా చేసికునే సమ్మెలు కనీసం, ఈ నెలలో పెట్టకపోయినా బాగుండును. అయినా అనుకుంటాం కానీ, వాళ్ళదేం పోయిందీ,వాళ్ళేం ‘బ్రతుకు తెరువు’ సంతకాలు పెట్టాలా ఏమిటీ? పని చేసినా, చెయ్యకపోయినా, మనల్ని ఎంతంతసేపు క్యూల్లో వెయిట్ చేయించినా, ఏ.టీ.ఎం లు పనిచేసినా చెయ్యకపోయినా,పాస్ బుక్కులు అప్డేట్ చేయడానికి ఎంతంత సమయం తీసికున్నా, వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి-ఇందిరా గాంధీ ధర్మమా అని, ‘జాతీయం’ అయిపోయాయి!పెన్షనర్ బ్రతికుంటే ఏమిటీ, ఛస్తే ఏమిటీ, వీడు పోతే వాడి పెళ్ళానికి వస్తుంది, మనకి మన సమ్మె కన్నా ముఖ్యమా ఏమిటీ? అని బ్యాంకులవారి ఉద్దేశ్యం. ఈ నెల 25,26 తేదీల్లో వాళ్ళు సరదాగా చేసికునే సమ్మె ట. దాంతో 24 వ తేదీ లోపలే వెళ్ళి ఉన్నామో ఊడేమో చెప్పాలిట. లేకపోతే you will be treated as dead.

    అప్పటికీ రెండు మూడు సార్లు మా మహారాజశ్రీ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కి వెళ్ళి చూశాను, బాగా రష్ గా ఉంది. ఇంకొంచం ఆగుదామా అనుకున్నాను కానీ, రైల్వే స్టేషనూ, బస్ స్టాండూ, కూలీ, నెత్తిమీద ఎర్ర గుడ్డా, దానిమీద సామాన్లూ దృశ్యం మనో ఫలకం మీదకొచ్చేసరికి, నోరు మూసుకుని, ఈవేళ తిథీ, నక్షత్రం చూసుకుని ఆటో చేసికుని బ్యాంకు ముందర తేలాను.అస్తమానూ బస్సుల్లో వెళ్ళే నేను ఆటో ఎందుకెక్కేనా అని ఆశ్ఛర్యపోకండి. నిన్న వెళ్ళి, నింపి సంతకం పెట్టవలసిన ఫారాలు తెచ్చుకుని, కొంపలో నింపాను. ఈవేళ 10.30 కి బ్యాంకు తెరిచీ తెరవగానే క్యూలో ముందర నుంచోచ్చుకదా అని! ఇక్కడ ‘సీనియర్ సిటిజెన్స్’ కి ప్రత్యేకం అని లేదు. అందరూ ఆ ‘ప్రాణు’ లేగా!

   నేను ఇంత శ్రమా పడి వెళ్ళేటప్పటికే,ఓ వందా రెండొందలమందున్నారు నానా జాతి వారూ ( అంటే చలాన్లు కట్టే వారూ, డీడీ లు తీసుకునేవారూ వగైరా…).ఆ సెక్యూరిటీ వాడు దయతలచి ఏదో ఉధ్ధరించేస్తున్నట్లు మొహం పెట్టి, తలుపులు తెరవగానే పొలో మంటూ, కిందా మీదా పడుతూ, లేస్తూ, తిట్టుకుంటూ, ఒకళ్ళనోరు తోసుకుంటూ ఏ కాలూ చెయ్యీ విరక్కొట్టుకోకుండా మొత్తానికి లోపలికి చేరాను!వాడెవడో చెప్పాడని డూప్లికేట్ లో నింపాను. అక్కడ కూర్చున్న’ బుల్లెమ్మ’ అన్నీ చూసి, నేను వేసిన ఎకౌంటు నెంబరు తప్పంది. ‘ మా తల్లే, మీరిచ్చిన పాస్ బుక్కులో అచ్చేసిందే వేశానూ’ అంటే ‘ఠాఠ్ అది తప్పూ, ఏ.టీ.ఎం కి వెళ్ళి ప్రింటౌట్ తీసికుని రా, అందులో ఉంటుందీ’ అంది. దేముడా అనుకుంటూ, పక్కనే ఉన్న ఏ.టీ.ఎం. లో మినీ స్టేట్మెంట్ తీసికుని వచ్చాను. నా అదృష్టం బావుంది, మామూలుగా అయితే ‘unable to issue a printed statement’ అంటూంటుంది!

    మొత్తానికి వచ్చే ఏడాది దాకా బతికున్నట్లే.అయినా రేపు ముఫై యో తారీఖున చూడాలి వాళ్ళు ఒప్పుకున్నారో లేదో! క్రిందటేడాది ఈ వ్యవహారం అంతా పూర్తిచేసినా, ఏదో సర్వర్ లోపం వల్ల నాకు పెన్షన్ ఓ’నెల తప్పింది’ !ఇప్పుడు తెలిసిందా ఈ టపాకి శీర్షిక అలా ఎందుకు పెట్టానో? ఇంకో సంగతండోయ్ భోజనం అదీ అయ్యేసరికి మూడు దాటింది !!!!!

6 Responses

 1. మనం ఇంకా ఉన్నామని చెప్పుకొనే నెల వచ్చేసిందని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.ఈనెలలో ఏదినం అయినా ఫరవాలేదు కాబట్టి తద్మాసం అని అనుకుంటే బాగుంటుందేమో.

  Like

 2. Well written Phani Babugaaroo. There are some very good usages you have made like

  1. Thaద్దినం వ్యవహారం
  2. అమ్మాయిలకి సైటు కొట్టొచ్చుగదా అని రైల్వే స్టేషన్ల దగ్గర చక్కర్లు కొట్టే కుర్రాళ్ళందరికీ, ఓ పేద్ద disappointment. రైల్వే కూలీలకి కూడా మంచి గిరాకీ.
  3. తలుపులు తెరవగానే పొలో మంటూ, కిందా మీదా పడుతూ, లేస్తూ, తిట్టుకుంటూ, ఒకళ్ళనోరు తోసుకుంటూ
  4. నాకు పెన్షన్ ఓ’నెల తప్పింది

  Like

 3. శివ గారూ,

  చాలా చాలా థాంక్స్ !

  సుబ్రహ్మణ్యం గారూ,

  మరీ తద్మాసం అంటే అర్ధం అవదేమో,అని అలాగన్నాను. అయినా తిథీ, నక్షత్రం చూసుకుని ఈవేళే వెళ్ళానుగా. సరిపెట్టేసుకోండి !!

  Like

 4. సుబ్రహ్మణ్యంగారూ, మీకర్జంటుగా సంస్కృత సంధుల మీద క్లాసు పీకాలి.
  తత్+మాసం = తన్మాసం 🙂
  అంటే తన్నే మాసం అని కూడ అర్ధం చెప్పుకోవచ్చు 🙂

  మాస్టారూ, దీంట్లో ఇంకో తమాషా ఉండేది. ఇప్పుడు ఏడాదికోసారి అయిందేమోగాని ఇదివరలో మూణ్ణెల్లకోసారి చెప్పాల్సి వచ్చేది. జూన్ నెల సర్టిఫికేటు ఇస్తే, మార్చిలో బతికున్నట్టు ఏది, ఠాట్, పెన్షను కేన్సిల్ అన్న సందర్భాలు నాకు పరిచయమే 🙂

  Like

 5. కొత్తపాళీ గారూ,

  రిటైరయ్యాము కదా అని మరీ క్లాసులు పీకేస్తే ఎలాగండి బాబూ ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: