బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “అచ్చే దిన్.”..


    దేశానికి స్వాతంత్రం వచ్చి 67 సంవత్సరాలయింది… ఈ విషయం ఈయనకి ఇప్పుడే గుర్తొచ్చిందా అని అనుకోకండి. ఈ అరవైఏళ్ళనుండీ ప్రభుత్వాలు కేంద్రం అనండి, రాష్ట్రం అనండి, లలో ఏదో కొంతమంది పనిచేస్తేనే కదా, రథాలు కదిలిందీ? ఓ వయసొచ్చిన తరువాత, వాళ్ళని ఇళ్ళకి పంపేసి, అన్ని రోజులు విశ్వాసపాత్రంగా పనిచేసినందుకు కొంత భ్రుతి “పెన్షన్ ” పేరిట ఇచ్చేవారు, ఇస్తున్నారు కూడా/ ఈ ప్రభుత్వాలూ, పెన్షనూ స్వాతంత్రం పూర్వంలోనూ ఉండేవి.ఈయనకి పనీ పాటా లేదూ, ఇంతకంటే మంచి సబ్జెక్టే దొరకలేదా అనుకోకండి… ఏదైనా వ్యవస్థలో అనుకోని మార్పు జరిగినప్పుడూ, ఆ మార్పుద్వారా కొంతమందికైనా మంచి జరుగుతూన్నప్పుడూ, ఆ మార్పు తేవడానికి బాధ్యుడైన వారికి మన థాంక్స్ చెప్పుకోవద్దూ?

   పెన్షన్ ఇవ్వడం వరకూ బాగానే ఉంది. కానీ ప్రతీ ఏడాదీ, ఈ ” పింఛనీదారు ” బతికున్నాడో, లేక ఈయన పేరున ఇంకోడెవడో తినేస్తున్నాడో అని తెలిసికునే కార్యక్రమంలో , ప్రతీ ఏడాదీ నవంబరు నెలలో ఈ పెన్షనిచ్చే చోటుకి వెళ్ళి ” నేను బతికే ఉన్నాను మహప్రభో ” అని విన్నవించుకోవాల్సొచ్చేది. ప్రతీ సంవత్సరమూ నవంబరు నెలొచ్చిందంటే చాలు, దేశంలో ఉండే ఈ “ ప్రాణు” లందరూ, స్వంత ఊళ్ళకి బయలుదేరేవారు. మరి అక్కడేగా వీళ్ళ పెన్షన్ దొరికేదీ? అసలు ఈ నవంబర్ ముహూర్తం ఎక్కణ్ణించివచ్చిందా అని బుర్ర పగలుకొట్టునేవాడిని. అప్పుడు తట్టింది- ఆ బ్రిటిష్ వాళ్ళకి, డిశంబరు లో క్రిస్మసూ అవీ ఉంటాయీ, శలవలూ హడావిడీ, తరువాత కొత్త సంవత్సర వేడుకలూ అవీనూ, నవంబరైతే శ్రేష్టఃమూ అనుకున్నట్టున్నారు. ఏదో మొత్తానికి ఆ పధ్ధతే మనవాళ్ళూ కంటిన్యూ చేసేశారు. ఆ నవంబరు నెలలో పడే పాట్లు నేను ఇదివరకెప్పుడో ఓ టపా లో వ్రాశాను.అందులో వ్రాసింది ఏదో అతిశయోక్తిగా వ్రాసింది కాదు. అనుభవం మీదే వ్రాసింది, నేనూ పెన్షనరేగా మరి.

   ఉద్యోగంలో ఉన్నంతకాలం జనాలు నీరాజనాలు పట్టేవారు. ఎంతైనా ప్రభుత్వోద్యోగం కదా! రాజకీయనాయకులకి కూడా వీరి అవసరం ఉండేది. ఉద్యోగంలోంచి రిటైరవడం తరవాయి, వీళ్ళ మొహం చూసేవాడూ లేడూ, పట్టించుకునేవాడూ లేడూ. ఏదో భుక్తి పడేస్తున్నాంగా..పైగా పనీపాటాకూడా లేదూ అని ఒకటీ.నవంబరొచ్చిందంటే చాలు, బ్యాంకుల్లో ఈ ” బతికేఉన్నాం మహాప్రభో” అని విన్నవించుకోడానికి వచ్చే వారి క్యూ చూస్తే బాధవేస్తుంది. ఒక్కరూ రాలేరూ, కొడుకునో, కూతురినో తోడు తెచ్చుకోపోతే పనవదు.వాళ్ళకి శలవు దొరకాలి, వారం వర్జ్యం కలిసిరావాలి.. ఎంత తతంగం.. ఆ క్యూలో అంతంతసేపు తిండీ తిప్పలూ లేకుండా నుంచుంటే ఈయనకేమైనా జరిగితే ఎవడు చూస్తాడూ? అలాగని నవంబరు నెలలో బతికున్నట్టు సంతకం పెట్టకపోతే, పై నెల పెన్షన్ రాదూ.. పైగా ఈ పెన్షన్ మీదే బతికే వారు చాలామందాయె. పోనీ అలాగని ఈ బ్యాంకులవాళ్ళు ఏమైనా విశాలహృదయులా అంటే అదీ లేదూ, ఒకే ఒక్క కౌంటరూ, ఆయనగారిఎదురుగా, ఆపసోపాలు పడుతూ కొల్లేరుచాంతాడులాటి క్యూలూ.. అడక్కండి, ఎద్దు పుండు ఎద్దుకే అన్నట్టు, అక్కడ పడే పాట్లు పెన్షనర్లకే తెలుసు. పైగా రైల్వే రిజర్వేషన్ లో లాగ ఇక్కడ సీనియర్ సిటిజెన్లకి ప్రత్యేక క్యూలు కూడా ఉండవు. మరి అందరూ “ఒకే జాతి పక్షులు “ గా ! వెళ్ళినవాడి అదృష్టం బాగుంటే, మధ్యాన్నం మాటెలా ఉన్నా, సాయంత్రం భోజనానికి కొంపకు చేరే అవకాశం ఉంది.

   గత పదేళ్ళగా వెళ్తున్నాను, ప్రతీ సంవత్సరమూ ఏదో ఒక గొడవే.. ఓసారి మనం నింపిన ఫారం సరీగ్గా లేదనేవాడు, ఇంకోసారి ఎకౌంటు నెంబరు సరీగ్గా లేదంటాడు ( చిత్రం ఏమిటంటే పాస్ బుక్కులో వాళ్ళు వేసిన నెంబరే ! ) అడక్కండి, కొద్దో గొప్పో వానాకాలపు చదువులు చదివిన నాలాటికే ఇలాటి కష్టాలొచ్చాయంటే, ” వేలిముద్రల ” వారి గతేమిటీ? అదృష్టం బాగుండి, ఈ ఏడాదీ, గతేడాదీ ఏదో తెలిసినవారుండబట్టి పని కానిచ్చేశాను. వచ్చే ఏడుండొద్దూ వాళ్ళూ? ఒకాయన రిటైరవుతారుట, ఇంకొకాయన ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నారుట. “దరిద్రుడి నెత్తిమీద వడగళ్ళ వాన ” లాగ, వచ్చే ఏడాది ఇంకోళ్ళని పరిచయం చేసికోవాలిరా భగవంతుడా అనుకున్నాను.

   రోజులన్నీ ఓలాగే ఉండవుగా, ఎప్పుడో అప్పుడు బాగుపడతాయి అనే అనుకోవాలి మరి. ఆ సందర్భంలోనే నరేంద్ర మోదీగారు “అచ్చే దిన్ ” అంటూ రంగంలోకి వచ్చారు.మిగిన విషయాలు ఎలా ఉన్నా, ఈ పెన్షనర్లకి మాత్రం మొత్తానికి ” అచ్చే దిన్ “ వచ్చినట్టే. ప్రతీ ఏడూ నవంబరులో వెళ్ళి బ్యాంకుల్లోనూ, ట్రెజరీల్లోనూ ఆపసోపాలు పడఖ్ఖర్లేకుండా మొత్తానికి, పధ్ధతిని మార్చారు. వివరాలు ఇక్కడ చదవండి.. దేశం మొత్తంమీద అందరు పెన్షనర్లందరికీ ఎలా వీలౌతుందీ అనకండి. e-seva లో ప్రారంభిస్తే అదే వీలవుతుంది. ఆ బ్యాంకుల్లో నుంచోవాల్సిన అవసరం లేకుండా, ఓ పదో పాతికో చెల్లించేసి ” బతికుండడం “ more economical కదూ.. ఈ విషయంలో మాత్రం మోదీ జిందాబాద్...

Advertisements

12 Responses

 1. మీరిచ్చిన లింక్ లో ఏం లేదు 🙂 ముల్లు తీసికొఱ్ఱు కొట్టుకున్నట్టుకాని అవుతుందేమోనని భయం 🙂

  Like

 2. అత్తా ఒకింటి కోడలే వంటి పరిస్థితి. ఇవ్వాల్టి అధికారి రేపటి పెన్షనర్ ఈ విషయం అర్ధం చేసుకోకుండా పెన్షనర్లను ఇలా బాధించటం బాధాకరమే. కాని, మరొక మార్గం ఏమిటి? బాకుల్లో ఖాతాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఈ “లైవ్” సర్టిఫికేట్ సులభం అని ప్రవేశ పెట్టారు. అక్కడ కూడా పెన్షనర్ల ఖాతాలు ఎక్కువ అయ్యి వరుసలో నిలబడే అవసరం వస్తున్నది.

  నా ఉద్దేశ్యంలో పెన్షనర్ తనకు తానుగా బాంకుకు డబ్బులు తీసుకోవటానికో / వెయ్యటానికో వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే, ఆ విషయం అక్కడ వాళ్ళ కంప్యూటర్లో రికార్డు/వ్రాసుకునే ఏర్పాటు చెయ్యాలి. ఎప్పటికప్పుడు క్రితం సారి వచ్చినప్పటి కంటే పన్నెండు నెలలు మళ్ళీ ఆ పెన్షనర్ బాంకుకు వచ్చి ఉండకపోతే అటువంటి వారికి, వారి చిరునామాకు బాంకు సిబ్బందే వెళ్ళి వాకబు చేసే పద్ధతి పెట్టాలి. ఇది కష్టమైన పనే అంటే బాంకు సిబ్బంది ఇందుకోసం ప్రత్యేకంగా నియమించుకోవాలి. అలా నియమించబడ్డవాళ్ళు ఐదు పదులు దాటినవారైతే, రేపు మనకి కూడా ఇదే కదా జరిగేది అని సానుభూతి ఉంటుంది.

  పెద్ద నగరాల్లో పెన్షనర్లకు ప్రత్యెక శాఖ ఏర్పాటు చేసి అన్ని పెన్షన్ ఖాతాలను అక్కడే ఉంచాలి. ఆ శాఖలో అందరూ ఏభై ఏళ్ళు దాటినవాళ్ళనె వెయ్యాలి. వాళ్లకి అతి త్వరలో తమకు కూడా ఇదే పద్ధతి అన్న సానుభూతి ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది.

  ఎంత అచ్చే దిన్ అయినా మనం అనుకున్నవన్నీ జరగాలి కదా! వేచి చూద్దాం, దాదాపు ఏడూ దశాబ్దాలు చూశాము, మరొక నాలుగేళ్ళు చూడలేమా!

  Like

 3. A self cheque cash withdrawal at the cash counter of the branch where the account holder’s account exists could be a idea which should work theoritically equivalent to the idea of life certificate which could be recorded in the computers of this era which could be treated for next ‘expiry’ date ( not person’s expiry but life certificate expiry!)

  Its time Pensioners forum represents this to the big shots who design the modus oeprandi of ‘life’ of a pensioner!

  cheers
  zilebi

  Like

 4. ప్రస్తుతం ఉన్న పూపూర్తి కంప్యూటర్ బాంకు ప్రపంచంలో పెన్షనర్ ఖాతాకు ప్రత్యెక “ప్రోడక్ట్” గా గుర్తించి, అటువంటి ఖాతాలో ఆపరేషన్ ఎప్పుడు జరిగినా, కంప్యూటర్ ఒక ప్రశ్న వేసేట్టుగా ప్రోగ్రాం చెయ్యాలి. ఆ ప్రశ్న కంప్యూటర్లో డెబిట్ చెయ్యటానికి చెక్ నంబరు నమోదు చేసిన వెంటనే “ఖాతాదారు, పెన్షనర్, స్వయంగా వచ్చారా లేదా వేరే ఎవరన్నా వచ్చారా” రావాలి. అప్పుడు ఆ అధికారి పెన్షనర్ స్వయంగా వచ్చారా లేదా ఇంకెవరన్నా వచ్చారా అని నిర్ధారణ చేసుకుని కంప్యూటర్లో ఆ విషయం పొందు పరుస్తారు. సెల్ఫ్ చెక్ అయినంత మాత్రాన ఖాతాదారుడే వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. అన్ని చేక్కుల్లోనూ పే టు లేదా బేరర్(అంటే ఎవరు తెస్తే వారు అని) ఉంటుంది. బేరర్ కొట్టేస్తే అప్పుడు మాత్రమె చెక్కులో వ్రాసి ఉన్న వ్యక్తి లేదా సెల్ఫ్ ఐతే ఖాతాదారు వచ్చి తీరాలి.

  ఈ విధంగా చెయ్యటం వల్ల పెన్షనరు బాంకుకు చివరిసారి స్వయంగా ఎప్పుడు వచ్చారు తెలుస్తుంది. ఆ తారీకు నుంచి సంవత్సరం లోపల మళ్ళీ రాకపోతే అటువంటి ఖాతాలో ఆపరేషన్లు బందు చేసి తనిఖీ చెయ్యటానికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అటువంటి ఖాతాలో ఆపరేషన్ చెయ్యటానికి ఇంటర్నెట్ కాని ఏ టి ఎం కాని వాడటానికి ప్రయత్నిస్తే, లైవ్ సర్టిఫై కాలేదు కాబట్టి ఖాతాలో ఆపరేషన్లు బందుచేయ్యతమైనది అన్న మెసేజీ రావాలి. బాంకార్లే పెన్షనర్ జీవించి ఉన్నారా లేదా తనిఖీ చెయ్యాలంటే అది ఖర్చుతో కూడిన పని. ఆ విధంగా తనిఖీ చెయ్యటానికి బాంకులను బాధ్యులు చేస్తే పెద్ద మొత్తంలో “తనిఖీ ఖర్చులు” ఖాతాలో డెబిట్ చేసే ప్రక్రియ మొదలు పెట్టవచ్చు. ప్రతి విషయానికి అటు ఇటు ఉంటాయి, అది చూసి ఒక పద్ధతి మొదలు పెడితే కొత్త వరవడి రావచ్చు, లేదంటే ఎప్పుడో బ్రిటిష్ వాడు వాళ్ళ “పరిపాలితులకు” పెట్టిన పద్ధతులే ఇంకా ఆచరించే “దురాచారం” పెన్షనర్ల విషయంలోకూడా తప్పక పోవచ్చు.

  Like

 5. meeku evaraina friends ayipotaaru baabaayigaaru…dont worry 🙂

  Like

 6. నేను రెండున్నర సంవత్సరాలయింది మా బ్యాంకు ముఖం చూసి. ప్రతినెలా నా పెన్షన్‍ను ఎటియం ద్వారా డ్రా చేసుకుంటున్నాను. మరి నాలాంటివాళ్ళ సంగతి బ్యాంకు వాళ్ళకు ఎలా తెలుస్తుంది?

  Like

 7. శర్మగారూ,

  మీరన్నది కరెక్టే. ఏంచేయనూ నేను పెట్టిన లింకు మోదీ గారి సైట్ లోదే మరి.ఎత్తేశారేమో..ఇంకో లింకు పెట్టాను. అయినా పేపర్లలో కూడా వచ్చేసిందిగా మాస్టారూ…

  శివరామ ప్రసాద్ గారూ,

  మీరు బ్యాంకులకి చెందినవారు కాబట్టి మీకు ఆ వివరాలన్నీ తెలుసు. కానీ, మాలాటి అర్భకులమాటేమిటి సారూ? ప్రతీ నెలా పెన్షన్ పడితేనే పొయ్యిలో పిల్లి లేస్తుంది .మీరు చెప్పినవన్నీ , మన ప్రభుత్వాలకీ, అధికారులకీ తెలియకనా ఇన్నాళ్ళూ ఇంత క్షోభ పెట్టారూ? వాళ్ళ చావేదో వాళ్ళే చస్తారూ అనే కానీ, ఒక్కడికైనా తట్టిందా? ఏదో ఇన్నాళ్ళకి ఒక్కరికైనా పెన్షనర్ల కష్టాలు గుర్తించి, పధ్ధతి మార్చినందుకు ఏదో సంతోషం వేసి వ్రాశిన టపా..

  జిలేబీ,

  మీ సలహా బాగానే ఉంది in theory.. నాలాటివాడికి సంతకం చేయడం చాలా కష్టం అవుతోంది, వివిధ కారణాలవలన. ఇన్నాళ్ళూ నేను ఏడాదికోసారి సంతకం చేసేది, ఈ నెలలోనే. అదికూడా ఇంట్లోనే కష్టపడి ఫారాలు నింపి, మొక్కుబడికి బ్యాంకుకి వెళ్ళి, మొహం చూపించి,, బతికున్నట్టు హాజరీ వేయించుకునే వాడిని. పై ఏడు నుండి ఈ గొడవొదిలిందిగా, హాయిగా ఓ వేలిముద్ర వేస్తే biometric లో .. మళ్ళీ ఈ చెక్కులూ సంతకాలూ అని మెలిక పెట్టకండి. ఇలా మిగిలిన జీవితం సంతకాల అవసరం లేకుండా లాగించేయనీయండి…

  నీరూ,

  నామీద మీ అభిప్రాయానికి థాంక్స్…

  శంంకరయ్యగారూ,

  మీలాగే నేనూ ATM నుండే పెన్షన్ తీసికుంటానండీ. కానీ ఏడాదికోసారి నవంబరులో వచ్చే ఆ thద్దినం మాటేమిటి?

  Like

 8. పేపర్లో వచ్చినది మరీ తికమకగా ఉంది సార్ అదీ బాధ. పెనం మీంచి పొయ్యిలో పడుతున్నామేమోనని…..

  Like

 9. శర్మగారూ,

  ఇప్పుడు నేను పెట్టిన లింకు చూడండి… అయినా ఇంకా టైముందిగా..

  Like

 10. ఫణిబాబు గారూ చిత్రం ఏమంటే ఉద్యోగం చేస్తున్నన్నాళ్ళూ పెన్షనర్ల కష్టాల గురించి ఏ ఉద్యోగీ ఆలోచించడు. ఉద్యోగంలో ఉండే వాళ్ళందరి దృష్టి తాము రిటైర్ అవ్వటం అనేది ఉండదని, అప్పుడప్పుడు కనిపించే పురాతన పెన్షనర్లు పుడుతూనే పెన్షనర్లుగానే పుట్టారన్న ఆలోచనలో ఉంటారు. సర్వీసులో ఉండగా పెన్షనర్ల కష్టాల గురించి ఆలోచించేవారు, తమదగ్గరకు వచ్చే పెన్షనర్లను సానుభూతిగా చూడగలిగిన ఉద్యోగులు బహు కొద్ది! యూనియన్లు సర్వీసులో ఉన్న ఉద్యోగుల కష్టాలే తీరుస్తాయి కాని పెన్షనర్ల కష్టాలు అంత సీరియస్ గా పట్టించుకోవు. కారణం పెన్షనర్లు ఆ యూనియన్లల్లో మెంబర్లు కాదు, యూనియన్ల నాయకులను ఎన్నుకునే ఓటు పెన్షనర్లకు లేదు.

  అందుకని సర్వీసులో ఉండగానే పెన్షనర్ల గురించి ఆలోచించి, పెట్టకూడని రూళ్ళు ఉద్యోగులు పెట్టకూడదు. అందులో ఉండే కష్టం రేపు పెన్షన్ పుచ్చుకునేప్పుడు తెలిసి వగచి ఉపయోగం లేదు. అప్పటికి మరొకడు ఆ కుర్చీలో కూచుని ఈ పెన్షనరు మూడు దశాబ్దాల క్రితం ఆలోచించినట్టుగానే, చించుతూ ఉంటాడు. మళ్ళీ ఆ ఉద్యోగి పెన్షనరు అయ్యి అక్కడ ఉండే కష్టాలు తెలుసుకుని గోలపెడతాడు. ఇలా ఈ వలయం తిరుగాడుతూనే ఉంటుంది. అచ్చే దిన్ ఎవరో తేలేరు. మనమే తెచ్చుకోవాలి. అందుకనే మొదట్లోనే నేను చెప్పినట్టు అత్తా ఒకప్పటి కోడలు-ఈనాటి పెన్షనరు ఒకప్పటి ఉద్యోగే. . కాబట్టి ఇప్పుడు ఉన్న రూల్సు అన్నీ కూడా ప్రస్తుతం పెన్షనర్లుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు కాకపొతే వాళ్ళ ముందువాళ్ళు, ఉద్యోగులుగా ఉన్నప్పుడు పెట్టిన రూల్సే. కాస్త భవిష్యత్తులోకి ఆలోచించగల తెలివి, మోకాలు కంటే కొద్దిగా ఒక అంగుళం పైభాగాన మెదడు ఉన్న ఉద్యోగులు వస్తే కానీ ఈ పెన్షనర్ల కష్టాలు తీరవు మరి. .

  Like

 11. ఫణిబాబుగారూ

  మీరు పడుతున్న, నాలాంటివాళ్ళు త్వరలో పడనున్న బాధలు ప్రభుత్వం విన్నట్టున్నది. అచ్చే దిన్ లో “అ” వరకూ వచ్చిన భ్రమ కలుగుతున్నది. ఇవ్వాళే ఆర్ బి ఐ వారి సర్క్యులర్ చూశాను ఈ కింది లింకు నొక్కి చదువవచ్చు.

  http://rbidocs.rbi.org.in/rdocs/notification/PDFs/IDLCP09122014.pdf

  OR

  http://rbi.org.in/scripts/NotificationUser.aspx?Id=9394&Mode=0

  ఇందులో ప్రభుత్వం వారు పెన్షనర్లకు ఈ లైవ్ సర్టిఫికేట్ వల్ల కలుగుతున్న బాధలను నివారణ చెయ్యటానికి కొంత ప్రయత్నం మొదలుపెట్టినట్టున్నారు. ఒక్కసారి చూసి కూలంకషంగా మీ బ్లాగులో అందరి కొరకూ వ్రాయగలరు

  Like

 12. Today I have come to know that Banks are providing the facility of pension to Pensioners at their Door Step. Main features are as follows;

  1. Facility of delivery of Monthly Pension to Pensioners aged 75 years and above at their door steps.
  2. In case of sickness and hospitalization, payment either in cash or by DD or by electronic remittance of funds in favour of the Hospital for all Pensioners.
  3. Pensioners drawing pension under all the categories Central, Civil, Defense, Telecom, Railways, Postal and State Pensions are eligible for this.
  4. Services available in Delhi, Bangalore, Chennai, Mumbai and Mysore cities for the present.
  5. For availing this facility, Pensioner has to execute an agreement

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: