బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కలా పోసణ…

20140511_120109

    పైన పెట్టిన ఫొటో ఏమిటంటారా… భోజనాలు చేసే డైనింగు టేబిల్ అంటే నమ్ముతారా? నమ్మాలి.. తప్పదు మరి.. ప్రత్యక్షంగా చూసి అదే టేబుల్ మీద వెండి కంచాల్లో , వేడివేడిగా షడ్రసోపేతమైన విందు ఆరగించాము, నేనూ, మా ఇంటావిడానూ మొన్న ఆదివారం నాడు. ఎంతో అభిమానంతో, మమ్మల్ని ఆహ్వానించి విందుభోజనం పెట్టిన వారు మరెవరో కాదు.. శ్రీ యేనుగు కృష్ణమూర్తి. శ్రీమతి రమణ దంపతులు. ఈ డైనింగు టేబుల్ మచ్చుకి మాత్రమే. అలాటి చిత్రవిచిత్రమైనవి ఎన్నో..ఎన్నెన్నో ..చూడగలిగాము. ఏదో పురావస్తు ప్రదర్శన శాల (Museum) అనుకోకండి. అచ్చంగా వారు నివసిస్తూన్న ఇల్లు. ఇంటినిండా ఎక్కడ చూసినా, నేతి జారీలూ, పులుసు గోకర్ణాలూ, గరిటెలూ,రాచ్చిప్పలూ, అన్నం వండే అడ్డెడు గిన్నీ, మానెడు గిన్నీ, కొబ్బరి తురుముకునే కోరం. కత్తిపీట, కుంపటి- పైగా ఇత్తడిదండొయ్. అడక్కండి, అక్కడ లేని వస్తువంటూ లేదు.వీటికి సాయం దేవుడి ఊరేగింపుతో వెళ్ళే కాగడాల జంట, వాటిలో నూనె పోసే జారీ ఒకటీ.

20140511_122149

   పైన పెట్టిన ఫొటో గంగాళంలా ఉంది కదూ? కదూ ఏమిటీ గంగాళమే, దానిమీద ఒక గ్లాసు వేసేసి దాన్ని ఓ సెంటర్ టేబుల్ (టీపాయ్ అంటామే అలా అన్నమాట)గా మార్చేశారు. వీటికి సాయం సైడు టేబుల్స్ కూడా ఇంకో గంగాళం !! ఇంట్లో ఉండే సామాన్ల మాట అటుంచి, ద్వారబంధం కూడా అలా సమకూర్చుకున్నదే. ఇంక తలుపులంటారా, బయట ఒక గొళ్ళెం, లోపల ఒక అడ్డ గడియ !! మన చిన్నతనం అడుగడుగునా కనిపిస్తుంది.
శ్రీ కృష్ణమూర్తి గారి ఇంట్లో చూసిన వస్తువులు అన్నీ మనచిన్నతనంలో చూసినవే, కానీ ఈరోజుల్లో ఎన్ని ఇళ్ళల్లో చూడగలమంటారు? ఇదివరకటి రోజుల్లో ఇళ్ళు కూడా పెద్దగానే ఉండడంతో పెద్దపెద్ద సామాన్లు ఉంచుకోడానికి సమస్య ఉండేది కాదు. అలాగని ప్రతీ ఇంట్లోనూ ఉండేవని కాదు, ఏ కొద్దిమంది ఇళ్ళల్లోనో ఉండేవి. ఊళ్ళో ఎవరికి అవసరమైనా, ఇవ్వడానికి సంకోచించేవారు కాదు. ఎవరింట్లోనైనా శుభకార్యం జరిగితే, ఎవరో ఒకరి ఇంటినుండి సామాన్లు తెచ్చుకునేవారు. శ్రీరామనవమికి పానకం కలపాలంటే గంగాళాలే ఉపయోగించేవారు. ఓ సంతర్పణ/సమారాధన జరిగితే కావాల్సిన పులుసు గోకర్ణాలూ, నేతి జారీలూ, గరిటెలూ ఎవరో ఒకరి ఇంటినుండి తీసుకునివస్తే హాయిగా పనైపోయేది.

    కాలక్రమేణా ఇళ్ళూ ఇళ్ళస్థలాలూ మాయం అయిపోయి ఎపార్టుమెంట్లలోకి మారిపోయాయి.పదేసి గదులున్న ఇళ్ళల్లోంచి, అగ్గిపెట్టెల్లా ఉండే ఎపార్టుమెంట్లలోకి, మారగానే, ఉండడానికే స్థలం సరిపోవడంలేదాయె, ఇంక ఈ పాతసామాన్ల సంగతి ఎవడు పట్టించుకుంటాడు? అదేం చిత్రమో, ఈ రోజుల్లో చూస్తూంటాం, ఫ్లాట్ ఇరుగ్గా ఉందీ అంటే, అందరి కళ్ళూ ముందర, వంశపారంపర్యంగా వచ్చిన పాత సామాన్లమీదే. పైగా ఎక్కడికో మోసుకునికూడా వెళ్ళఖ్ఖర్లేదు. ఓసారి నెట్ లోకి వెళ్తే quikr, olex లూ ఉండనే ఉన్నాయి.వాళ్ళేవచ్చి తీసుకుపోతారు. ఎక్కడచూసినా ప్లాస్టిక్ సామాన్లే !

    ఈరోజుల్లో చూస్తూన్నదేమిటంటే, ఇంట్లో ఉండే “పాత” సామానులని, సాధ్యమైనంత త్వరలో మార్చేసి, వాటి స్థానంలో మార్కెట్ లోకి వచ్చిన ఏ electronic లేదా plastic వస్తువో కొనేసి, పని కానిచ్చేయడం. దానితో మనం ఏ ఏ వస్తువులతో పెరిగిపెద్దయామో ఆ వస్తువులు ఎవరో చెప్పగా, అంతర్జాలంలోనే చూసి సంతోషించే దుస్థితి లో ఉన్నాము.వాటిని ఏ museum లోనో చూసినప్పుడు, అలనాటి పాత సంగతులు గుర్తుచేసికుని, ఒకసారి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం… అదంతా nostalgia అని ఓ పేరు పెట్టి అందరితో పంచుకోవడం…
కానీ రాత్రనకా పగలనకా ఆ పాత సామాన్లతోనే జీవిస్తూన్న ఒక పుణ్యదంపతుల గురించి మీకు పరిచయం చేస్తున్నాను.పుణ్య దంపతులూ అని ఎందుకంటున్నానంటే, ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు, జీవితభాగస్వామి సహకారం తప్పనిసరి. లేకపోతే ఏమౌతుందంటే, భర్తగారు ఊళ్ళన్నీ తిరిగి విలువైన పాత సామాన్లు తెస్తూంటే, భార్య “ ఎందుకొచ్చిన సంత అండీ.. ఈ పాతసామాన్లన్నీ చేరేస్తున్నారూ… వాటిని తోమించలేక నా ప్రాణం మీదకొస్తోందీ..” అని కానీ అంటే, ఆ భర్త ఉత్సాహం మీద చన్నీళ్ళు చల్లేసినట్టే కదా… ఇక్కడ అలాటిదేమీలేదు. ఎందుకంటే వారిద్దరూ ఒకరిని మించినవారింకొకరు. దేశంలో ఎక్కడ “పాత” వస్తువు దొరుకుతోందని తెలిసినా వెంటనే వారిని సంప్రదించడమూ, ఆ సరుకేదో ఎంత ఖరీదైనా సరే తెచ్చేసికోవడమూ. ఊరికే కొనేసి సేకరించడంతో సరిపోతుందా, వాటికి తగిన జాగా చూసుకోవాలి. అంతే ఇద్దరికీ ఓ అద్భుతమైన ఆలోచన వచ్చేసింది– ఎలాగూ పూర్వపురోజుల్లో ఆ వస్తువులు ఉపయోగకరమైనవే కదా, వాటికి పూర్వస్థితిని కలిగిస్తే గొడవే ఉండదు. ఆలోచన రావడం ఏమిటి ఆచరణలో పెట్టేశారు. వాటన్నిటినీ functional చేసేశారు. చెప్పడం శులభమే కానీ, వాటి maintainence and upkeep మాటేమిటి, రెగ్యులర్ గా వాటిని తోమించడం.

    ఇవన్నీ చూసి శ్రీకృష్ణమూర్తిగారికి ఇంకేమీ పని లేదనుకోకండి. వృత్తి రీత్యా ఆయన ఓ గొప్ప consultant. ఈ రెండోది ప్రవృత్తిమాత్రమే. ఎంతమందికుంటుందండీ ఇంత శ్రధ్ధా? వీటన్నిటినీ చూడాలంటే ఎక్కడికో వెళ్ళఖ్ఖర్లేదు.. భాగ్యనగరం లోనే ఉంటున్నారు వీరు. వారింటికి వెళ్ళి మన చిన్నతనపు మధుర జ్ఞాపకాల్లోకి వెళ్ళడం మేము చేసికున్న అదృష్టం. నాకున్న limited పరిజ్ఞానం తో ఒక చిన్న విడియో తీశాను. ఇక్కడ చూడండి.ఇంకా వివరాలు తెలిసికోవాలంటే శ్రీ కృష్ణమూర్తిగారి సైట్ చూడండి.

20140511_133545

    అన్నీ చెప్పి ఇంకొక విషయం మర్చిపోయానండోయ్….పందిరి పట్టి మంచం20140511_122537

    ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు నోటివెంట శ్రీ ముళ్ళపూడి వారు చెప్పించినట్టు.. ” మడిసన్న తర్వాత కుసింత కలా పోసణ ఉండొద్దూ? “.

    YK sir.. you really made our day… Thanks a lot…

%d bloggers like this: