బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అపాత్ర సహాయాలు…

   అపాత్ర దానాలని విన్నాము. ఇప్పుడు ఈ అపాత్ర సహాయాలేమిటా అని అనుకుంటున్నారా? దానాల్లాగే సహాయాలు కూడా అవతలివారిని చూసి చేస్తూండాలి. అడిగినవాడికీ, అడగనివాడికీ సహాయాలు చేస్తూ పోతూంటే లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుంటూ ఉంటాము. ఈ సహాయాలు పొందినవారుంటారే, వారి పని సవ్యంగా జరిగిపోతే చాలు, ఆ సహాయం చేసినవాడు ఎలా పోయినా, ఏ గంగలో దూకినా ఏమీ పట్టింపనేది ఉండదు.

   సినిమాల్లోనూ, కథల్లోనూ చూస్తూంటాము, ఏ ఎయిర్ పోర్టులోనో, రైల్వే స్టేషన్ లోనో, మన దారిన మనం ఉంటున్నా సరే, ఎవడో ఓ ఆగంతుకుడు వచ్చి, మా సామాను చూస్తూంటారా అనగానే , ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా, సరే అంటాము. ఊరికే చూడడమేగా ఇందులో అంత శ్రమ పడేదేముందీ అని అనుకుంటారు.అలాగే, రైల్వే స్టేషనులో కూడా, ఎవరో ఒకరు అడుగుతూంటూనే ఉంటారు.ఆ అడిగినవాడు మామూలువాడైతే ఫరవాలేదు, కానీ కొన్ని సందర్భాల్లో avoidable చిక్కుల్లో పడుతూంటారు, ఈ పరోపకారులు. రైల్లో చూడండి, రిజర్వేషను చేయించుకున్నా, భార్యకోచోటా, భర్తకో చోటా సీటు దొరుకుతుంది. మరీ వేరు వేరు కోచ్ లైతే ఏమో కానీ, ఒకే కోచ్ లో కూడా , విడివిడిగా కూర్చోడానికి కూడా ఏదో ప్రాణం మీదకొచ్చినంత హడావిడి చేసేస్తూంటారు. ఎవడో బక్రా దొరుకుతాడు, ఆతన్ని కాళ్ళావేళ్ళా పడి, మొత్తానికి ఆ పెద్దమనిషిని ఒప్పించి, సీటు మార్చుకుంటారు. బస్.. వాళ్ళక్కావలసినది అయిపోయిందిగా, ఎవరెలా పోతే మనకేం అనుకుంటారు. ఏదో అలా అనుకుంటే ఫరవాలేదు, కానీ అతి ఉత్సాహానికి వెళ్ళి అవతలి వారిని అదీ ఎవరివల్ల సహాయం పొందేరో వారిని చిక్కుల్లో పెడతారే, అలాటివారి గురించన్నమాట ఈ టపా.

    క్రిందటి ఆదివారం నాడు, మా అగస్థ్య, నవ్య లని హైదరాబాదునుండి తీసికుని, పూణె బయలుదేరారు వాళ్ళ అమ్మమ్మా, తాతయ్యలు, శతాబ్ది లో. వాళ్ళెవరికో పైన చెప్పేనే అలాటి పరిస్థితి వస్తే, మా వియ్యంకుడూ, వియ్యపరాలినీ అడిగేరు సీటు మార్చుకోవచ్చా అని. సరే అన్నారు,సామాన్లు అన్నీ పై లగేజీ షెల్ఫ్ లో పెడుతూ, ప్రయాణం లో పిల్లలు తినే సరుకులూ, మొబైల్ ఛార్జర్లూ, అలాగే కొన్ని బట్టలూ ఉన్న బ్యాగ్గుని క్రిందే ఉంచారు. మా వియ్యంకుడు గారేమో, ఎవరో తమ సీటు నెంబర్లు ఛార్టులో చూడమని అడిగేరుట,ఆయన క్రిందకు దిగేరు. వియ్యపురాలు మనవడూ, మనవరాలితో కొద్దిగా వెనక సీట్లలో కూర్చున్నారు. అదండీ దృశ్యం.

    ట్రైను కొంతదూరం వెళ్ళిన తరువాత పిల్లల తిండి సరుకుల బ్యాగ్గుకోసం చూస్తే కనిపించలేదు. అందరినీ అడిగేరు, ఎవరికివారే తెలియదంటే తెలియదన్నారు. చివరకి TC ని అడిగితే తెలిసింది, ఆ బ్యాగ్గు కాస్తా, క్యాటరింగువాడు తీసికెళ్ళి సికిందరాబాద్ స్టేషన్ లో రైల్వే పోలీసు స్టేషనులో ఇచ్చి వచ్చాడుట. అదేమిటీ అలా ఎందుకు చేశాడూ అని విచారించగా, తేలిందేమిటంటే, ఏ దంపతులైతే కాళ్ళా వేళ్ళా పడి సీటు మార్పించుకున్నారో వాళ్ళ నిర్వాకంట. వాళ్ళ సామాన్లు సద్దుకుని, కూలబడ్డాక చూస్తే పక్క సీట్లో ఓ బ్యాగ్గు కనిపించిందిట, ఆ బ్యాగ్గు ఎవరిదీ అని అందరినీ ( మా వాళ్ళను తప్పించి) అడిగిందిట, ఎవరూ తమది కాదంటే తమది కాదన్నారుట, ఆవిడేమో భారతీయ responsible citizen పాత్రలోకి ఒదిగిపోయి, TC ని పిలిచి, ఇక్కడ ఒక unclaimed bag ఉందీ, చూడండీ అందిట, ఏ బాంబైనా ఉందేమో, ఎందుకొచ్చిన గొడవా అని, క్యాటరింగు వాడిని పిలిచి, దాన్ని కాస్తా రైల్వే పోలీసులకి అప్పచెప్పొచ్చాడుట. మా వియ్యంకుడు గారు వచ్చేసరికి తెలిసిన విషయం ఇదీ.

    ఆ సీటు పుచ్చుకున్నావిడని అడిగితే, మాకేం తెలుసూ ఆ బ్యాగ్గు మీదనీ అని దబాయింపోటీ.చివరకి TC కి విషయం చెబితే, అతను ఫోను చేసి సికిందరాబాదు రైల్వే పోలీసులకి సమాచారం ఇచ్చాడు, కంగారేమీ లేదూ, ఆ బ్యాగ్గులో బాంబులూ అవీ లేవూ, అందులో ఉన్న సామాన్లు ఫలానావీ. స్టేషనులోనే ఉంచండీ, వీరి తరఫువారు వచ్చి తీసికుంటారూ అని. మా వియ్యపురాలు తన తమ్ముడి కొడుక్కి వెంటనే ఫోను చేసి, Railway Police Station కి వెళ్ళి బ్యాగ్గు collect చేసికోమన్నారు. తీరా ఆ అబ్బాయి వెళ్ళేసరికి ఆ తిండి సరుకులు కాస్తా, ఆ పోలీసులే లాగించేశారుట. ఊరగాయల సంగతి తెలియలేదు. ఛార్జర్ల విషయం ఆ దేవుడికే తెలియాలి. పైగా 200 రూపాయల దక్షిణ కూడా తీసికుని మొత్తానికి ఆ బ్యాగ్గు తిరిగి ఇచ్చారుట.

    దీన్నే అంటారు పుణ్యానికి వెళ్తే తలకి చుట్టుకుందని. మీలో ఎవరైనా సహాయం చేద్దామని అనుకుంటే, ఒళ్ళు దగ్గరపెట్టుకుని మరీ చేయండి. అడిగినవాళ్ళందరికీ చేస్తూ పోతూంటే ఇదిగో ఇలాటి చిక్కుల్లో పడుతూంటారు. తస్మాత్ జాగ్రత్త...

%d bloggers like this: