బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అయినా సరే బతికేస్తున్నాం…

   తెలుగువాళ్ళకి ములక్కాడలంటే ఎంత మక్కువో అందరికీ తెలిసిందే. అదేం ఖర్మమో ఈమధ్యన మార్కెట్ లో వాటి ధర కొండెక్కేసింది. మరీ పావుకిలో 20 రూపాయలంటే కొనే పరిస్థితా మనది? ఏదో చవకలో దొరికితే కొనొచ్చు కానీ, మరీ కిలో 80 రూపాయలంటే, కొని పూజ చేయాలనిపిస్తుంది. ఈలోపులో అవి ఎండిపోయి, నా వయస్సుకి వచ్చేస్తాయి, అది వేరే సంగతనుకోండి. దానితో ఈమధ్యన మార్కెట్ కెళ్ళినప్పుడల్లా, దూరం నుంచే చూసేసి, “మమ” అనుకొని వచ్చేస్తున్నాను. అంతేసి డబ్బులు పెట్టి కొనే ఓపిక లేదమ్మోయ్. అలాటిది ఈ మధ్యన ఆదివారం, తెలిసిన కొట్టులో నవనవలాడుతూ కనిపించాయి, పక్కనే ఇంకో ఆవిడ ఏదో కొంటోంది. నాకైతే పావు పదిరూపాయలూ అని వినిపించింది. అమ్మయ్యా ధర తగ్గిందిరా బాబూ అనుకుని, ఓపావిమ్మన్నాను. వాడు తూచి, మరీ పొడుగ్గా ఉన్నాయి కదా అని కోసిపెట్టనా అన్నాడు. మరీ వాటిని ముక్కలు చేయడం ఇష్టం లేక, ( ఇంటికెళ్ళిన తరువాత, ఇంటావిడ పులుసులోకో, చారులోకో ఎలాగూ చేస్తుంది, మరీ ఆ “పాపం” నేనెందుకు కట్టుకోడం అని) వద్దని, ఓ పది రూపాయల నోటిస్తే, కాదూ ఇరవై అన్నాడు. అదేమిట్రా, పదన్నావు కదా అంటే, ములక్కాయలు కాదూ, పనస చెక్క ఖరీదదీ అన్నాడు. మంచిదయింది, వాటిని ముక్కలు చేసుంటే, నాకంటగట్టేవాడు. విడవలేక విడవలేక, సంచీలోంచి వాటిని బయటకు తీసి, తిరిగిచ్చేశాను. ఓ దండం పెట్టుకుని! పోనీ ధరేదో తగ్గేదాకా ఆగొచ్చు కదా, అబ్బే, అప్పుడెప్పుడో తెచ్చి, ఫ్రిజ్ లో దాక్కున్న ములక్కాడముక్కలు వేసి, ఇంటావిడ ఆ ముందురోజే బ్రహ్మాండమైన చారు పెట్టింది. దాంతో మళ్ళీ ములక్కాడలవైపు పోయింది దృష్టి. వెధవ జిహ్వచాపల్యం, బతికున్నంతకాలమూ వదలదు! నిన్న దగ్గరలో ఉన్న మార్కెట్ లో ఏదో కొంటూంటే మళ్ళీ వినిపించింది పావు పదీ… అని. ఆ అర్ధ అనేది మింగేశాడు. అడిగితే చెప్పనే చెప్పాడు మరీ పావు ఇరవై అంటే ఎవడూ ఈపక్కకే రావడం లేదూ, అందుకే అశ్వథామా కుంజరహ అని, అర్ధ మింగేసి, పావే వినిపించేలా అరుస్తున్నానూ అని!మొత్తానికి పదిరూపాయలూ ఇచ్చి అర్ధపావు తీసికున్నాను, రెండంటే రెండు కాడలొచ్చాయి. ఒకటి నాకూ, ఇంకోటి ఇంటావిడకీనూ! చూస్తూండగానే ఆ కొట్టువాడు నలుగురికి అరపావు చొప్పున అమ్మేడు.

   పైన చెప్పినది ప్రత్యక్షంగా చూసిన marketing technique. అందరూ అంటారూ, తెలివిమీరిపోయారండీ ఈ రోజుల్లోనూ, అక్కడికేదో వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నట్టు. కానీ పేద్ద పేద్ద కంపెనీలు చేస్తున్నదేమిటిట? పైన ఇచ్చేనే బొమ్మ అందులో indiatimes వాడి యాడ్ చూడండి– అన్ని పుస్తకాలమీదా 40% discount అని పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాశాడు. ఏదో చవకలొ వస్తున్నాయని తీరా ఆ సైట్ లోకి వెళ్ళి చూస్తే కనిపించేదేమిటీ- ఏదో ఒకటీ రెండు వెరైటీలు తప్పించి, దేనిమీదా 25% discount మించి లేదు. బళ్ళమీద అరుస్తూ వస్తారు చూడండి అరటిపళ్ళవాళ్ళు డజను పదిరూపాయలూ.. అంటూ, తీరా బండి ఆపి చూస్తే, నా వయస్సుకు వచ్చేసి, మిగలముగ్గిపోయిన పళ్ళు చూపిస్తాడు. వాడికీ, ఈ indiatimes వాడి యాడ్ కీ తేడా ఏమీ లేదు.

   అన్నిటిలోకీ ఈ రిలయన్స్ వాళ్ళు దోచేస్తున్న పధ్ధతి- వాడి Broadband speed 3.1 Mbps అంటాడు. ఎప్పుడు చూసినా దాని స్పీడ్ 0.00. దీంతో ఏమౌతుందీ అంటే, ఏ రైల్వే టికెట్ బుక్ చేసేటప్పుడో, ఆఖరి పేమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి, బ్యాంకు వాడిది బాగనే ఉందికదా అని,పేమెంటు పూర్తిచేస్తాము ,redirecting to irctc… అంటుందే కానీ, ఛస్తే పూర్తిచేయదు, పైగా please do not ” refresh” or ” back”….. అని మెసేజ్ ఓటీ. ఏం చేస్తే ఏం కొంపములుగుతుందో అని దాన్ని చూస్తూ ఊరుకుంటాము. అది తిరుగుతూంటుందేకానీ, ఆ redirecting to irctc… మాత్రం పూర్తవదు. ఓ పదినిముషాలు అయిన తరువాత, పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది.Your log in time expired. please log in again.. గోవిందో… గోవిందా... మనం బుక్ చేసిన టిక్కెట్టు అయిందో లేదో తెలియదు. మళ్ళీ లాగ్ ఇన్ అయితే, ఎక్కడున్నావే గొంగళీ అంటే అక్కడే అన్నట్టు మళ్ళీ మొదలూ.. ఓ నాలుగు రోజులు పోయిన తరువాత డబ్బులు తిరిగొస్తాయనుకోండి. కానీ ఇంత అసౌకర్యం కలగాలంటారా? పోనీ ఆ Broadband వాడికి ఫోను చేద్దామా అంటే, ఒకటి నొక్కూ, రెండు నొక్కూ.. పీకనొక్కూ… అంటాడేకానీ, ఓ జీవించిన మనిషితో మాటాడ్డం మాత్రం కుదరదు..

   ప్రొద్దుటే అబ్బాయితో ఇవన్నీ మాట్లాడుతూంటె తను ఓ బ్లాగ్ పోస్ట్ గురించి చెప్పాడు, అదే రెండో ఫొటో… ఇలాటివన్నీ మన దేశంలోనేనా, ప్రపంచం అంతా ఇంతేనా? ఇంకోటండోయ్ నిన్న ప్రొద్దుటే, ఆయనెవరో బ్రేక్ ఫాస్ట్ తీసికుని, తన Volkswagon కారులో కూర్చుని, ఇగ్నిషన్ తిప్పాడో లేదో పరిస్థితి పైన పెట్టిన ఫొటోలో చూశారుగా…

    అయినా సరే బతికేస్తున్నాం…..