బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– బిజీ బిజీ ..weekend…

    ఇదివరకే చెప్పాను, ఉద్యోగంలో ఉన్నప్పుడే బావుండేది, ఏదో టైముకి వచ్చేసి ఇంటిపట్టునుండడమూ అదీనూ. రిటైరయిన తరువాత ఎప్పుడు చూసినా బిజీయే బిజీ.. అందులోనూ, ఈ వారం ఎన్ని పనులో! మా మిస్టరీ షాపింగు వాళ్ళు ఫోను చేసి, ఫలానా Cream Centre హొటల్ కి వెళ్ళి లంచ్ చేసి రమ్మన్నారు. అదేదో నెల విడిచి నెల, మరీ “ మాశికాల్లా” కాకుండా, దక్షిణ తాంబూలాలిచ్చి, మా ఆదిదంపతులకి విందు భోజనం పెట్టి పుణ్యం కట్టుకుంటున్నారు! ఇదీ బాగానే ఉంది. నన్ను వెళ్ళమంటే మహ అయితే, ఏ ఉడిపీ హొటల్ కో వెళ్ళి, ఏ ప్లేట్ మీల్సో లాగించేసేవాడిని అవసరం అయితే. ఈసారి ఓ వెయ్యి రూపాయలదాకా తినమన్నారు. అంత హరాయించుకునే ఆకలెక్కడుంటుందీ మా ఇద్దరికీ, అందుకోసం, మా అబ్బాయి, కోడలుతోనూ వెళ్ళి భోజనం చేసొచ్చాము.

    రేపేమో , “బిజినెస్ మాన్” సినిమాకి టిక్కెట్లు తెచ్చాను పన్నెండు గంటలాటకి. ఏదో పెద్దాళ్ళమయిపోయామని మరీ “శ్రీరామరాజ్యా” లే కాకుండా, ఇలాటివీ చూడొద్దు మరీ! అదేదో Bodyguard కూడా వచ్చిందిట. మరీ మా చిన్నప్పటిలాగ, back to back సినిమాలు చూసేస్తే, చూసేవాళ్ళకి బాగోదు. ఇదివరకు పక్కనుండే పల్లెటూళ్ళనుండి, మా చుట్టాలు వచ్చి, అమలాపురం లో, మార్నింగు షో నుంచి, మ్యాట్నీ, మొదటాట, రెండో ఆటా చూసుకుని సైకిళ్ళమీద తిరిగి వెళ్ళిపోయేవారు!! అంత ఓపికెక్కణ్ణుంచి వస్తుందా అనుకునేవాణ్ణి.

    అఛ్ఛా, ఇది రేపటి కార్యక్రమమూ. ఇంక ఎల్లుండి శనివారం, మా మనవరాలు తాన్యా పుట్టినరోజు. ఇంకా ఎక్కడో చెప్పలేదు. మా అబ్బాయి కి గెస్టులు వస్తున్నారు, అందువలన మా నవ్య, అగస్థ్య మాతోనే ఈ రెండురోజులూ! ఏమిటో ఈ కార్యక్రమాలన్నీ ఎటెండవడం ఓ ఎత్తూ, మా అగస్థ్యతో రెండురోజులు అంటే 48 గంటలు గడపడం ఓ ఎత్తూ!వామ్మోయ్ ఊహించుకుంటూంటేనే దడొచ్చేస్తోంది! మా ఇంటావిడంటుందీ, అక్కడికేదో మీరే శ్రమ పడ్డట్టు ఊహించేసికుంటున్నారూ, ఛాన్సొస్తే బయటకు పారిపోవడం అలవాటేగా అని. ఏమిటో అర్ధం చేసికోదూ, నా పన్లు నాకుంటాయిగా. అయినా ఈసారి బుధ్ధిమంతుడి లా, ఉంటానని ప్రామిస్ అయితే చేశాను, కానీ ఎంతవరకూ నిభాయించుకోగలనో చూడాలి.

    ఇలా బిజీ బిజీ గా ఉంటామండీ అంటే నమ్మరే మా ఫ్రెండ్సూ! మీకు మా ఇంటికి రావడానికే కుదరదూ అంటూ కోపాలోటీ! ఏం చెయ్యను చెప్పండి? మా చిన్నప్పటి మాస్టారు, ఈ ఊళ్ళోనే ఉంటున్నారు, పాపం మొన్ననే ఫోనుకూడా చేశారు “ఏమిటి ఫణీ, కనిపించడమే లేదు, అప్పుడప్పుడు వస్తూండూ..” అని. ఆయనతో చెప్పాను ఈవారం సెంట్ పెర్సెంటు వచ్చి మీతో గడుపుతానూ అని. ఆ ప్రామిస్ కొండెక్కేసింది. అందుకే అనుకుంటా, నేను irctc వాళ్ళని పోషిస్తున్నాను. ఇప్పటికి రాజమండ్రీ అవీ వెళ్దామని నాలుగుసార్లు రిజర్వేషన్ చేసి క్యాన్సిల్ చేశాను. ఎప్పటికి వీలౌతుందో వెళ్ళడానికి? మా కజిన్ కి చెప్పడం కూడా మానేశాను, ఎప్పుడు వస్తున్నామో, ప్రతీసారీ చెప్పడం, క్యాన్సిల్ చేయడం. ఎప్పుడో వీలు చేసేసికుని ఓసారి వెళ్ళొస్తేనేకానీ, నా మనస్సూ తీరదూ. ఎంతచెప్పినా రాజమండ్రీలో ఉన్న 16 నెలలూ ఎంతబాగా ఉందండీ. ప్రొద్దుటే లేచి తలుపుతీయగానే, ఆ గోదావరీ, చల్ల చల్లగా గాలీ, గోదావరి గట్టునున్న దేవాలయాలూ, పనసపొట్టూ, బొంత అరిటి కాయలూ, దబ్బకాయలూ, వాటితో మా ఇంటావిడ పెట్టే ఊరగాయా, పూతరేకులూ, బెల్లం మిఠాయుండలూ, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని మధుర జ్ఞాపకాలూ! ఏదో వంట్లో ఓపికున్నప్పుడే వెళ్ళాలి.

    ఈసారి అమలాపురం వెళ్ళి కనీసం ఒక్కరోజైనా గడపాలనుంది, చిన్నప్పుడు తిరిగిన వీధులూ, కాలేజీ, హైస్కూలూ, మోబర్లిపేటలోని వెంకటేశ్వరుడు గుడీ, చెరువు గట్టు( ఆరోజుల్లో ఉండేది లెండి) మీదుండే సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడీ, చంద్రమౌళీశ్వరుడి గుడీ.. ఇవన్నీ ఇంకోసారి చూసేయాలని మూడ్డొచ్చేస్తోంది. మరీ ఒకేరోజుంటే, కమలేశ్వర లో సినిమా చూడ్డానికి వీలవదు. మనసైతే ఉంది, ఎంత తీరుతుందో చూడాలి!

   ఇదంతా పిచ్చిగోల లా కనిపిస్తోంది కదూ. కానీ ఏం చేస్తాం చెప్పండి, బతికున్నంతకాలం, ఈ జ్ఞాపకాలు మనల్ని వదలవు.