బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

NLaw

   నేను ఓ వారం రోజులపాటు బ్లాగులు వ్రాయకపోవడానికి, ఆయనెవరో పెట్టిన వ్యాఖ్య ఓ పేద్ద కారణం కాదు.It was purely coincidental… ఏదో మూడ్ లేక వ్రాయలేదు. కానీ, నిన్నటి టపా చదివినవారి సంఖ్యా, వ్యాఖ్యలూ చదివిన తరువాత అనిపించింది– ఇంక మిమ్మల్ని వదిలేది లేదూ.. అని. ఏదో అసలు ఉండేదెంతకాలం, అందులో మళ్ళీ మూడ్లూ, అలకలూ అంటూ కూర్చుంటే మీరందరూ సుఖపడిపోరూ? వామ్మోయ్, నేను వ్రాస్తూనే ఉంటాను, మీరు భరించకా తప్పదు…

    నిన్న పెట్టిన నార్వే సంఘటన సుఖాంతమయింది మొత్తానికి. సర్వే జనా సుఖినోభవంతూ !! పైన పెట్టానే దాన్ని ఓ నొక్కు నొక్కండి. ఈవేళ్టి సాక్షిలో కూడా చదివాను. ఈవేళ మన రిపబ్లిక్ దినోత్సవంట. అసలు గుర్తే లేదు, నిజం చెప్పాలంటే. మా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను. ఆరోజుల్లో టివీ లూ అవీ ఉండేవా ఏమిటీ? ఏదో 25 వ తేదీ రాత్రి ఎనిమిందిటికి రేడియో ముందర కూర్చోడం, మన రాష్ట్రపతి సందేశాన్ని శ్రధ్ధగా వినడం, ఆ తరువాత వచ్చే జాతీయగీతం వినేటప్పుడు నుంచోడం. వెంటనే , ఆ సందేశం తెలుగులో వినడం. పైగా ఆరోజుల్లో మన దేశాద్యక్షులు ఎలాటి ఉద్దండులుండేవారో! ఇంక మర్నాడు ప్రొద్దుటే, ఏడు గంటలకి ఏ పన్యాల రంగనాధరావు గారో, తమదైన unique style లో, ప్రభుత్వం వారిచ్చిన పద్మ పురస్కారాలు పొందిన వారి పేర్లు చెబుతూంటే, ఓ పెన్సిలూ, కాగితం తీసికుని నోట్ చేసికోడం. ఎందుకంటే న్యూస్ పేపర్ సాయంత్రం దాకా రాదు కనుక.తొమ్మిదింటిలోపల స్కూలుకి తెల్ల చొక్కా, తెల్ల నిక్కరూ, తెల్లబూట్లూ వేసికుని వెళ్ళి, అక్కడకూడా పతాకవందనం,ఏసీసీ,ఎన్ సీ సీ, పెరేడ్ చూసి, స్కూల్లో పంచిపెట్టిన మిఠాయిలో, చాక్లేట్లో తెచ్చుకుని, మళ్ళీ రేడియో పెడితే, దాంట్లో ఢిల్లీ లో జరిగే పెరేడ్ మీద ఏ Melville D’Mellow, V.M.Chakrapani, Roshan Menon లో చెప్పే ప్రత్యక్షప్రసారం విని, అప్పుడు భోజనం చేయడం. మళ్ళీ సాయంత్రం స్కూల్లో ఏవో సాంస్కృతిక కార్యక్రమాలూ, అబ్బ ఏం హడావిడండి బాబూ..

   ఇప్పుడేమిటీ, ఓ రోజుముందుగానే పద్మ ఎవార్డులు వచ్చినవాళ్ళపేర్లూ, పైగా ఓ వారం ముందునుంచీ ఎవరెవరి పేర్లు రికమెండు చేయబడ్డాయో, వాటి వెనక ఎన్నెన్ని పైరవీలో వివరాలూ. ఎవడిక్కావలిసిన వాడికి, వారి పేర్లు రికమెండు చేయడం, పైగా వీటిలో“కోటా” ఒకటీ ! ఒక విషయం అర్ధం అవదూ, ఎప్పుడో పోయినవాళ్ళకి అసలు ఈ ఎవార్డులెందుకూట? ఇవ్వకపోతే ఏమైనా వాళ్ళు కోప్పడతారా? ఈ ఎవార్డులవలన వాళ్ళకి ఒరిగేదేమీ లేదు. ఇవ్వకపోయినా వాళ్ళకి తరిగేదీ లేదూ. ఊరికే ఎలెక్షన్ స్టంట్లు.ఈరోజుల్లో మన దేశాద్యక్షుల్ని చూసినా, విన్నా అసలు ఆ inspiratioనే ఉండడం లేదు. పైగా ఆవిడ పదవీకాలం ఈ ఏడు పూర్తవుతుందిట, పూణె లో ఆవిడుండడానికి ఓ ఇల్లూ అవీ ఎరేంజ్ చేస్తున్నారులెండి. ఈమధ్యనే పేపర్లో చదివాను- ఆవిడ ఇదివరలో నడిపించిన పంచదార ఫాక్టరీ, వేలం వేస్తున్నట్టు. పేద్ద కారణం అని కాదు, ఏదో బ్యాంకులకీ, వాళ్ళకీ ఈ ఫాక్టరీ వాళ్ళుఓ నూట ఇరవై కోట్లు ఋణ పడి ఉన్నారుట, ఇప్పుడీ వేలం వేస్తే, ఏదో సగం తీరుతుందిట. మిగిలినది, మిమ్మల్నీ, నన్నూ వేలం వేస్తారు. అదేనండి, exempt చేయడం అన్నమాట. ఎంతైనా మాజీ అద్యక్షులు కూడానూ ! మరి ఇలాటి వారిని చూస్తే inspiration రమ్మంటే ఎక్కడ వస్తుందీ? ఈవిడ అయినతరువాత ఇంకోర్ని వెదకాలి. వెదికేదేమిటిలెండి, ఎక్కడో ఏ రాజకీయనాయకుడో ఉండే ఉంటాడు.

   ఊరికే మనందరమూ మొత్తుకోడం తప్ప, శ్రీ బాపూ గారికి పద్మ ఎవార్డ్ ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? ఎవార్డులు వస్తాయనే ఆయన , వారి చిత్రాలద్వారానూ, కార్టూన్లద్వారానూ, మన తెలుగువారందరికీ అంత ఆనందం ఇస్తున్నారా? అసలు దానిగురించి, ప్రతీ ఏడూ అనుకోడం, తీరా రాకపోతే నిరాశ చెందడం, అసలు అవసరమంటారా? ఆ మాయదారి ఎవార్డు ఇచ్చి, ఆయన్ని అగౌరవపరచడం కంటే, అసలు ఆయన పేరే ఎత్తకుండా ఉంటే, ఆయన్ని గౌరవించినట్టు. ఎనిమిదేళ్ళనుండీ రికమెండు చేయడం, కేంద్రప్రభుత్వం, దానిగురించే ప్రస్తావించకపోవడం చూస్తూంటే, వెధవ కబుర్లు చెప్పే ఈ రాజకీయ నాయకులు without exception ప్రతీవాడూ, ఎంత దౌర్భాగ్యులో తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎప్పుడో, ఆ జయలలిత తల్చుకుంటే, భారతరత్న కూడా ఇప్పించొచ్చు. She is capable of that. ఎలాగూ శ్రీ బాపు గారు ఉండేది చెన్నై లోనే, ఆయన కడుతున్న పన్నులూ అవీ, తమిళనాడుప్రభుత్వానికే. ఎస్పీ కి రాలేదూ, అలాగే ఇదీనూ. తరువాత ప్రతీ తెలుగువాడూ చంకలెగరేసుకోవచ్చు బాపూ మా వాడే అని ! ఎలాగూ మనవాళ్ళకి అలవాటే కదా!