బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Jinxed money…..

   ఒక్కొక్కప్పుడు, ఒక్కక్క సంఘటన ఎందుకు సంభవిస్తుందో చెప్పలేము. ఓ కారణం ఉండదు.It just happens! ఎప్పటికో, దానికి సంబంధించిన ‘గ్రహణం’ వదిలిపోయి,అంతా బాగానే ఉంటుందని ఎదురుచూడ్డం తప్పించి ఏమీ చేయలేము. అలా అని వదిలేయకుండా, పరిస్థితిని బాగుచేయడానికి, మన వంతు ప్రయత్నమేదొ చేయాలి కదా! మరీ గాల్లో దీపం పెట్టేసి, దేముడా నీదే భారం అని వదిలేయలేమూ. కానీ, ఏదో కొంత చదువుకున్నవారి పరిస్థితే ఇలా ఉంటే, ఏ చదువూ లేని వారి గోడు ఎవడు పట్టించుకుంటాడు? అలాగని నేను ఏదో పెద్ద చదువులు చదివేశానని కాదు, Unintentional mistakes కీ, callousness కీ తేడా ఆ మాత్రం తెలుస్తుంది లెండి, ఎంత చెప్పినా నేనూ 42 ఏళ్ళపాటు, ఆ సర్కారీ నౌకరీయేగా వెలిగించిందీ? నెలనెలా తీసికునే జీతానికి, కొద్దిగా న్యాయంచేయాలనే బుధ్ధే ఉంటే, అందరూ బాగానే ఉంటారు. అదిలేకే కదా, ఈ సోదంతానూ !

   ఎప్పుడో రిటైరయినప్పుడు వచ్చిన డబ్బుల్లో, ఖర్చు పెట్టగా మిగిలినవి, for a rainy day ఉపయోగిస్తాయని, దాచుకుంటాము. మరీ రాత్రికి రాత్రే, గుడారం ఎత్తేయరుకదా అని, ప్రభుత్వ బ్యాంకుల్లోనూ, పోస్టాఫీసుల్లోనూ పెడతాము.అక్కడికేదో ఇవన్నీefficient అని కాదు, just for security. దానికే, ఆ పోస్టాఫీసు వాళ్ళూ, షెడ్యూల్ద్ బ్యాంకులవాళ్ళూ, ప్రపంచం లో వాళ్ళంతటివారు అసలు లేరే లేరని అనుకుంటూంటారు. ఏ బ్యాంకుకి వెళ్ళండి, ఏ పోస్టాఫీసుకి వెళ్ళండి, ఎక్కడ చూసినా ఒకటే body language. To hell with customers. ఏ సంగతి విచారించండి, ఏదో అడుక్కుతినేవాడిని చూసినట్లు చూస్తారు. మనం ఊరుకుంటే, ఇంకా పేట్రేగిపోతారు.

   విషయం ఏమిటంటే, 2006 లో ఇక్కడ (పూణె) లో పోస్టాఫీసులో, కొంత డబ్బు Term Deposit చేశాను అదేమో 2009 లో మెచ్యూర్ అయేటట్లు. అప్పటికి మేము రాజమండ్రీ లో టెంపరరీ కాపరం పెట్టడంతో, ఆ డబ్బేదో, అక్కడే తీసికోవచ్చని తెలిసి,పాస్ బుక్కూ, అవీ రెండు నెలల ముందే ఇచ్చాను, టైముకి డబ్బులొస్తాయని. తీరా చూస్తే జరిగిందేమిటీ, టైముకి రాలేదు సరి కదా, రాజమండ్రీ లో పోస్టాఫీసు వాళ్ళు చెప్పిన ప్రకారం, ఆ ట్రాన్స్ఫర్ గొడవంతా, మన బాధ్యతే అన్నట్లు మాట్లాడారు. చివరికి, నెట్ లో వెదికి, పూణె లో ఉండే
PMG లెవెల్ దాకా వెళ్తేనే కానీ నా డబ్బు దొరకలేదు. మళ్ళీ పోస్టాఫీసులో వేసే ధైర్యం లేక, ఏదో మా వియ్యపరాలుగారు పనిచేస్తున్న బ్యాంకు కదా అనీ, మిగిలినవాళ్ళకంటే కొద్దిగా ఎక్కువ ఇంటరెస్ట్ ఇస్తున్నారనీ, అదృష్టం బాగోక, SBH లో డిపాజిట్ చేశాను. ఈ పుణె-రాజమండ్రి ట్రాన్స్ఫర్ హడావిడిలో, అదేదో ఇన్ఫ్లేషనో ఏదో తగ్గిందిట, ఇంటరెస్ట్ రేట్లు కాస్తా తగ్గేపోయాయి.పుణ్యకాలం కాస్తా అయిపోయింది. మళ్ళీ ఇంకో బ్యాంకుకి వెళ్ళే ఓపిక లేక, ఆ SBH లోనే వేసేశాను.

   2009 చివరలో రాజమండ్రి కాపరం ఎత్తేసి, పూణే వచ్చేశాము.క్రిందటేడాది, ఆ TDR మెచ్యూర్ అయే వేళకి ముందుగా, పూణె లో ఉన్న SBH కి వెళ్ళి, కథంతా చెప్పి, ఓ ఎప్లికేషనిచ్చి, ఆ TDR కాపీ ఒకటిచ్చి, ఆ డబ్బేదో ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించమన్నాను.ఓ వారం పోయిన తరువాత రమ్మన్నారు, సరే అని వెళ్తే, ఆ రిసీట్ వెనక్కాల కొత్త తేదీ ఎండార్స్ చేసి, తిరిగిచ్చారు. పోన్లే మన డబ్బు క్షేమంగా ఉందికదా అని నేనూ, పెద్దగా పట్టించుకోలేదు. ఏవో కాగితాలు చూస్తూంటే, ఇదికూడా కనిపించింది. మెచ్యూర్ క్రిందటి నెలే అయింది. అయినా ప్రస్తుతం వడ్డీ రేట్లేవో పెరిగాయన్నారు కదా, ఈ డబ్బూ అంత అవసరం లేదూ, ఆ బ్యాంకులోనే, maximum interest పిరియడ్ కి రెన్యూ చేద్దామూ అని నిన్న ఇక్కడి బ్రాంచికెళ్ళాను. ఆటోమేటిక్ గా ఓ రేటుకి రెన్యూ అయిందీ అన్నారు. అలా కాదూ, ఎక్కువ వచ్చే పీరియడ్ కి చెయ్యండీ అన్నాను. ఆ రిసీట్ వెనక్కాలే, రాసి సంతకం పెట్టించుకున్నారు. కొంచం సేపు ఆగితే, దానిమీద ఎండార్స్ చేసిస్తామన్నారు. ఎక్కడెక్కడో వెదికి, కెలికి అరగంట పోయిన తరువాత తేల్చిందేమిటయ్యా అంటే, రాజమండ్రీ బ్రాంచ్ వాళ్ళు, అసలు ఆ డబ్బే ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదుట! మళ్ళీ ఓ ఎప్లికేషనివ్వండీ, ఓ వారం రోజుల్లో ట్రాన్స్ఫర్ చేయించేస్తామూ అన్నారు. ఏణ్ణర్ధం నుండీ జరగని ట్రాన్స్ఫర్, వారంలో చేయించేస్తామంటే, నమ్మడానికి నేనేమైనా చెవిలో పువ్వెట్టుకున్నట్లు కనిపిస్తున్నానా ఏమిటీ అనుకుని, మీ బ్రాంచ్ మేనేజర్ తో మాట్లాడాలీ, అన్నాను. మరీ ఈమాత్రం దానికి, ఆయనదాకా ఎందుకూ అన్నారు. No way అని చెప్పి, ఆయన కాబిన్ లోకి వెళ్ళి ఆయనతో మొత్తం విషయమంతా చెప్పాను. ఆయనంటారూ, రాజమండ్రీ బ్రాంచ్ వాళ్ళ,negligence కి మేమేం చేయమూ అన్నారు. అప్పుడు, నేను దేశంలో ఉన్న SBH బ్రాంచీలన్నిటికీ, MD/ Chairman ఒక్కరే కదా, మీకు మాత్రం బాధ్యత లేదా, అని ఝణాయించేసరికి, ఆయన విషయం అర్ధం చేసికుని,ఓ వారం లో పని పూర్తిచేస్తామన్నారు. చూద్దాం నా అదృష్టం ఎలా ఉందో?
అదేం ఖర్మమో, ఆడబ్బు ఏ ముహూర్తంలో వేశానో, పని పూర్తయేదాకా jinxed money లాగే కనిపిస్తోంది……