బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పులిని చూసి నక్క……

   ఇదివరకటి సినిమాల్లో, ఫైట్లూ గట్రా ఎక్కువ ఉండేవి కావు. హీరో ఏదో సీదా సాదా గా ఉండేవాడు. విలన్లు కూడా మరీ పెద్దపెద్ద డుషుం డుషుం.. లు లేకుండా, ఏదో నాలుగైదు దెబ్బలు సుతారంగా వేసేవారు.ఏదో పౌరాణికాల్లోనూ, జానపదాల్లోనూ, కత్తియుధ్ధాలూ,అస్త్రాలూ,శస్త్రాలూ ఉండేవి. ఏదో కాలక్షేపం అయిపోయేది. కానీ 70 దశకం నుండీ, అమితాబ్ బచన్ వచ్చి మొత్తం సీనే మార్చేశాడు. దానితో, మిగిలిన భాషల్లోనూ ఇదే ట్రెండు ప్రారంభం అయిపోయింది.
కానీ వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఉన్నదానికంటె ఎక్కువ exaggerate చేయడం.

   ఈమధ్యన వస్తూన్న సినిమాలైతే మరీ అన్యాయం. Entertainment,action పేరుతో, computer graphics సహాయంతో, సినిమాలు చూసినవారికి లేనిపోని ఆలోచనలు తెప్పించేయడం. ఒకటి చెప్పండి,హెలికాప్టరు లోంచీ, ఓ కారులోంచి ఇంకో కారులో దూకడాలూ అవీ,అందరికీ సాధ్యమౌతాయంటారా? ఒక్క హీరో, కనిపించిన బ్యాడ్డీలందరిని, కొట్టేస్తూ పోతాడు. అదేం ఖర్మమో, విలన్లు కాల్చిన పిస్టల్, విసిరిన సో కాల్డ్ బాంబులూ, ఈ హీరోకి తగలవు. పెద్ద పెద్ద హైరైజు బిల్డింగుల్లోంచి, ఝూమ్మని దూకేస్తూంటాడు. అలా మామూలు మనుష్యుల్ని చేయమనండి, కాలిరిగి ఛస్తాడు. మామూలుగా ఓ మెట్టు మిస్సయితేనే, కాలు బెణుకుతుంది కదా, అంతంత ఎత్తుల్నుంచి దూకితే, బతికి బట్ట కడతారంటారా? హెలికాప్టరులోంచి, క్రిందవెళ్ళే ట్రైనులో దూకేయడం! ఓసారి ప్రయత్నించి చూస్తే తెలుస్తుంది!

   ఒకళ్లకొకరు చెంపదెబ్బలు కొట్టుకుంటూంటారు, బ్యాక్ గ్రౌండులో ఓ పేద్ద మ్యూజిక్కు పెట్టేసి, నిజ జీవితంలో అలా కొట్టుకుంటే, ఉన్న పళ్ళూడుతాయి.ఏదో బల్లెమో, కత్తో,గునపమో గుచ్చుకుపోతూంటుంది,అయినా సరే వాడికేమీ అవదు! అన్నన్ని దెబ్బలు తగిలి,అసలు ఆ మనిషి బ్రతికి బయటెలా పడతాడో, ఆ సినిమా డైరెక్టరుకి తప్ప ఇంకెవరికీ తెలియదు! సరే, సినిమాకెళ్ళామూ అంటే, entertainment ఉండాలి,కాదనం. మరీ ఇంత ఎగ్జాజరేషనా? మనకి ఇష్టం ఉంటే చూస్తాము, లేకపోతే మానేస్తాము, కానీ ఆ చూసినవాళ్ళూరికే ఉండడం లేదు కదా, అలాటి స్టంట్లు నిజజీవితంలో కూడా చేసేయొచ్చని, ఓ అపోహ ఏర్పరుచుకుని, ఊళ్ళోవాళ్ళందరి ప్రాణాలూ తీస్తున్నారు.

   ఎప్పుడో ఏడాదికొకటో రెండో సినిమాలు వస్తూంటాయి,realistic గా ఉండేవి. అలాటి సినిమా కాస్తా రెండో రోజుకి వెళ్ళిపోతుంది.ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి, మనవాళ్ళు realistic గా తీయడం లేదూ అనీ అనడానికి లేదు, రాజకీయ నాయకుల పాత్రలు మాత్రం నూటికి నూరు పాళ్ళూ realistic గానే ఉంటాయి.ఎవరు ఎవరిని చూసి నేర్చుకుంటున్నారో తెలియదు. కానీ, సినిమాల్లో రాజకీయనాయకులకీ, మనం ప్రతీ రోజూ ధర్నాల్లోనూ, దీక్షల్లోనూ, పార్లమెంటులోనూ, శాసన సభల్లోనూ చూసే నాయకుల కీ తేడా ఏమాత్రం లేదు.ఓ సినిమా చూస్తే చాలు, మన ఎం.పి, ఎం.ఎల్.ఏ. ఎలా ఉంటారో తెలిసిపోతుంది.

   ఈ గోలంతా ఎందుకు రాస్తున్నానంటే, ఈవేళ నాకు జరిగిన అనుభవం వలన. ప్రొద్దుటే, కూరలు కొందామని, మార్కెట్ కి వెళ్ళాను. చాలావరకు కూరలు కొనడం పూర్తిచేసేసి, ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అని, పక్కనుండే ఇంకో మార్కెట్ లోకి వెళ్ళాను. అక్కడంతా నిన్నటి వర్షం మూలంగా, అంతా బురదగానూ, స్లిప్పరీగానూ ఉంది.అప్పటికీ క్రింద చూసుకుంటూ, జాగ్రత్తగానే నడుస్తున్నాను. అదేం ఖర్మమో, చటుక్కున జారి దబ్బుమని కిందపడ్డాను. ఇదేమైనా సినిమాయా ఏమిటీ, జస్ట్ అలా దులిపెసికుని, నవ్వుతూ వేవ్ చేసికుంటూ లేచి వెళ్ళిపోడానికి? ఏదో అదృష్టంకొద్దీ, కింద నేలమీద, కాలిఫ్లవర్ ఆకులూ, ఇంకా చెత్తా చెదారం ఉండడంవలన,పడ్డమంటే పడ్డాను కానీ, ఏ తుంటి ఎముకా విరిగినట్లనిపించలేదు. కానీ, ఆ దెబ్బ impact ధర్మమా అని, వెంటనే లేవలేకపోయేసరికి, పాపం చుట్టుపక్కలవాళ్ళు లేపి పక్కగా ఇంకో డబ్బామీద, ఆకులూ అలమలూ వేసి కూర్చోపెట్టి మంచినీళ్ళిచ్చారు. ఓ అయిదు నిమిషాల తరువాత,లేచి నుంచుని వాళ్ళకి థాంక్స్ చెప్పుకుని ( వాళ్ళందరూ సంస్కారవంతమైన ట్రిపుల్ ఎక్స్ సబ్బు వాడుతారా అని అడిగి మరీ!) కొంపకు చేరాను.

   క్రిందటి సారి లాగ ఈ సారి, ఈ విషయం మాఇంటావిడనుంచి దాచలేకపోయాను- కారణం బట్టలు, సంచీ అన్నీ బురదయిపోయాయి!” కొంచం చూసుకుని నడవ్వొచ్చు కదండీ, ఆ దిక్కుమాలిన చెప్పులు మార్చండి, అప్పుడే చెప్పాను, వాటికి హీల్లూ అదీ లేదూ,జాగ్రత్తా అని. వింటే కదా, తను చెప్పిందీ, నేనెందుకు వినాలనే కానీ…” లాటి, మసళా లేని చప్పిడి చివాట్లతో సరిపెట్టేసింది!

   అదేదో యాడ్ వస్తోందీమధ్యన, ఎక్కడో రోడ్డుమీద ఓ కారు టైరు ఇరుక్కుపోతుంది, ఇంతట్లో ఓ పిల్ల గజ్జలదాకా నిక్కరేసికుని, తన పొడుగాటి జడ ఆ కారు బంపర్ కి కట్టి, ఆ కారు కాస్తా బయటకెత్తేస్తుంది ! బ్రేవో !! అయినా ఈ రోజుల్లో అంతంత పెద్ద పెద్ద జడలెక్కడకనిపిస్తున్నాయీ? ఎక్కడ చూసినా అదేదో కట్టూ, ఇదేదో కట్టూనూ!ఆయనెవరో చెప్పినట్లుగా కొత్తిమిర కట్టలే! అయినా నాకెందుకూ, ఆ బుల్లి అమ్మడు చెప్పిన హెయిర్ ఆయిలేదో, రాసుకుంటూంటే, ఇలా బురదలో దిగిపోయిన టైర్లు ఎత్తొచ్చు! వర్షాకాలం కూడానూ!