బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– రామాయణం లో పిడకల వేట….

   క్రిందటి వారం అంతా, మా కోడలు చెన్నై, తరువాత అబ్బాయి హైదరాబాదూ వెళ్ళడంతో, మేము మా ఇంటికి వెళ్ళి, ఆదివారం రాత్రికి, మేముండే ఫ్లాట్ కి వచ్చేశాము. ఛాన్స్ దొరికితే మేముండే ఫ్లాట్ కి వచ్చేయడానికి, మరీ పెద్ద కారణమంటూ లేదు. ప్రొద్దుటే 7.00 దాటిన తరువాత నిద్ర లేవొచ్చు. అక్కడైతే ఆ టైముకే, మా నవ్య స్కూలుకి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది, మరీ ఆ తరువాత లేస్తే, చూసేవాళ్ళకి బావుండదుగా.అదన్నమాట విషయం!

   నిన్న మధ్యాన్నం 3.30 కి జెమినీ టి.వీ. లో అదేదో “బంగారుబాబు” అని జగపతిబాబు నటించిన సినిమా వస్తూంటే చూస్తూ కూర్చున్నాము. అందులో థీం ఏమిటంటే, మురళీ మోహన్, జగపతిబాబుకి తండ్రి, అతను, ఎప్పుడో ఒక బలహీన క్షణంలో, ఇంకో ఆవిడతో కాపరం చేసి, ఇద్దరు పిల్లల తండ్రౌతాడు. ఏదో ఒకళ్ళంటే సరిపెట్టుకోవచ్చేమో కానీ, ఇద్దరు పిల్లల తండ్రి అయాడంటే, బలహీన క్షణం ఏమిటీ, నా తలకాయ! తిన్న తిండరక్క చేసే పనులు!Anyway that was the story of the movie.

   సాయంకాలం, మా ఇంటావిడతో వాహ్యాళికి బయలుదేరి, ఈవెనింగ్ వాక్ కి వెళ్ళాను. మధ్యలో వర్షం మొదలయింది. మరీ పరిగెత్తే వయస్సు కాదూ,మోకాళ్ళనొప్పులతో ఇంక పరిగెట్టడం కూడానా. ఛాన్స్ దొరికింది కదా అని ఆ వర్షంలోనే “ప్యార్ హుఆ ఇక్రార్ హుఆ” అంటూ పాటపాడుకుంటూ, ఆ వర్షంలోనే తడిసి కొంపకి చేరాము. 8.30 కి భోజనం చేసేసి, కొంతసేపు నెట్ బ్రౌజింగ్ చేసేసి, అబ్బూరి ఛాయాదేవి గారి కథల పుస్తకం ఒకటి చదువుతూ, పక్కమీదకు వాలాను.

   ఇంతలో ట్రింగ్ ట్రింగు మంటూ సెల్ ఫోనూ. ఇంతరాత్రెవరు చేశారా అనుకుంటూ తీసే లోపలే కట్ అయింది. నెంబరు చూసి, పోనీ నేనే చేద్దామని చూస్తే, ఆ నెంబరు అంత పరిచయమైనదిగా కనిపించలేదు. పైగా 13 digits ఉంది! అయినా ప్రయత్నించేసరికి, Please contact Reliance to get in touch with the number you are trying… అని ఓ సందేశమూ, ఇంగ్లీష్,హిందీ, మరాఠీ భాషల్లో. మళ్ళీ ఇంకోసారి ఫోనూ. Action replay… ఇంతరాత్రివేళ ఈ గొడవెమిటిరా బాబూ అనుకున్నాను. ఓ పదినిమిషాల్లో ఓ ఎస్.ఎం.ఎస్సూ అదే నెంబరు నుండి– ” cal me dad” అని. ఓ కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు. నేను ఆ ఫోను చేసిన వాడికి డాడ్ నా, లేక, ఆ మెసేజ్ పంపినవాడు నాకు డాడ్డా? రెండోదయితే ఫరవాలేదనుకుందాం, ఏ గత జన్మలోనో నాకు dad అయి, ఈ జన్మలో గుర్తొచ్చి ఫోను చేశాడనుకోవచ్చు. కానీ, రెండోదే కరెక్టనుకుంటే, కొంపలంటుకుంటాయి! వామ్మోయ్!

   పిల్లలేమైనా ఫోను చేశారేమో కనుక్కుందామని, వాళ్ళకి చేస్తే, మేమేమీ చేయలేదని సమాధానం. మా ఇంటావిడ, ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ, తన సీరియళ్ళ హడావిడిలో ఉండి, అంత పట్టించుకోలేదు. సావకాశంగా వచ్చి ” ఏమిటీ, ఇంత రాత్రివేళ పిల్లలని నిద్ర లేపి ఫోన్లు చేస్తున్నారూ…” అంటూ. విషయం చెప్పకపోతే ఇంకా పేద్ద గొడవైపోతే అమ్మో!
నాకొచ్చిన ఫోనూ, ఆ తరువాతొచ్చిన మెసేజీ గొడవంతా చెప్పుకొచ్చాను. మధ్యాన్నం చూసిన ఆ మాయదారి సినిమా నా జీవితంలోకి ఇలా నడిచొచ్చేస్తుందనెవరనుకున్నారూ?

   నాకేమీ తెలియదు మొర్రో అంటే నమ్మదే. నేనేమైనా ఆ సినిమాలో జయసుధ లాటి తల్లిననుకున్నారా ఏమిటీ అంటూ హడావిడి. ఇంక ప్రొద్దుటే, అబ్బాయి ఫోనూ- అసలు మీ మ్యారేజి సర్టిఫికేట్ లేనప్పుడే అనుకున్నాను ( మా పెళ్ళి టైముకి ఈ registrations వగైరా ఉండేవి కాదురా అంటే నమ్మడే) ఇలాటి గొడవేదో ఉండే ఉంటుందీ అని వాడూ. ఇంక అమ్మాయైతే డాడీ ఏమయిందీ రాత్రి గొడవా, నేనే కదా మనింట్లో పెద్దదాన్నీ అంటూ!

   ఇలా అయిపోయిందండి బాబూ నా దయనీయమైన పరిస్థితి! వాడెవడో నాకు ఫోను చేయడం ఎందుకూ, అది చాలదన్నట్లు, ఓ దిక్కుమాలిన మెసేజ్ పెట్టడం ఎందుకూ, హాయిగా వెళ్ళిపోతున్న కాపరాన్ని చెడగొట్టాలని కాకపోతే! ఆ ఫోనూ, మెసేజీ ఇంకా mystery యే !! ఏదో చీకూ చింతా లేకుండా లాగించేస్తున్నాను, మధ్యలో రామాయణం లో పిడకల వేట లాగ, ఇదో గొడవొచ్చి పడింది !!