బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–చెప్పులూ, బూట్లూ

    మా చిన్నప్పుడు,స్కూల్లో కొద్దిగా పైక్లాసులకొచ్చేదాకా, చెప్పులూ వగైరాలుండేవి కావు. బూట్లసంగతి దేముడెరుగు.నాకైతే ఉద్యోగం ఇంటర్వ్యూ కెళ్ళినప్పుడు, మొదటి బూట్లజత కొన్నారు. అదీ లెదరుది, నడుస్తూంటే చప్పుడయ్యేది. సినిమాల్లో విలన్లూ, డాక్తర్లూ వచ్చినప్పుడు వేసికునేదిలా అన్నమాట!జీవితంలో అదేదో పైమెట్టుకి వెళ్ళేమనే భావన వచ్చేది! పైగా ఆరోజుల్లో, లెదరు బూట్లు కొనుక్కుంటే, దానికి ఏ రోడ్డుపక్కనుండేవాడిచేతో నాడాలోటీ ! మామూలుగా, గుర్రాలకీ, ఎడ్లకీ వేస్తారు ఈ నాడాలు, మరి మనం ఎందుకు వేయించుకునేవాళ్ళమో నాకు తెలిసేదికాదు. ఇప్పటికీనూ! బహుశా మనం నడిచేటప్పుడు చప్పుడువస్తుంద్నేమో. ఈ బూట్లలో క్రేపు సోల్ అనేదొకటుండేది. వాటిని మామూలుగా, మన స్కూళ్ళ పరీక్షల్లో వచ్చే వాచర్లేసికునేవారు. చప్పుడు చెయ్యకుండా, మెల్లిగా వచ్చేసి కాపీలు చేసేవాళ్ళని ఠక్కున పట్టేసేవారు!
ఈ నాడాలేసికున్న బూట్లతో నడిస్తే,చప్పుడూ అదీ బాగానే ఉండేదికానీ, ఏ గచ్చుమీదైనా నడిచినప్పుడు ఝూం అని జారి, క్రింద పడి నడుం విరిగేది! వీట్లకి తాళ్ళూ, అవేనండి లేసులు.ఈ బూట్లతో ఎవరింటికైనా వెళ్తే, మరీ వాటితో లోపలకి వెళ్ళంకదా, గుమ్మం బయటే వదిలేసి,కొంతమంది సాక్సలాగే ఉంచేసికుని ఇంట్లోకి వెళ్తారు. కానీ దీంట్లో కూడా ఓ అసౌకర్యం ఉంది.కాళ్ళూ చేతులూ కడుక్కురమ్మని ఏ బాత్ రూంకో వెళ్ళమన్నప్పుడు, సింకులో చేతులు కడుక్కోడం వరకూ బాగానే ఉంటుంది, కాని ఆ బాత్ రూంలో కింద ఉన్న నీళ్ళతో సాక్సు తడిసిపోతాయి.మింగా లేమూ, కక్కాలేమూ, అలాగని ఆసాక్స్ తీసేసి మరీ జేబులోకూడా పెట్టుకోలేము.ఎవరికీ కనబడకుండా జేబులో కుక్కేసి, ఏదో పని కానిచ్చేస్తాము.ఇంక బయటకి వెళ్ళి అక్కడ పెట్టుకున్న బూట్లు( లేసులున్నవి) వేసికునేటప్పుడు చూడాలి అవస్థ! ఒంటికాలిమీద నుంచుని, ఆలేసులెవో కట్టుకునేటప్పడికి ప్రాణం మీదకొస్తుంది.పాపం ఆ ఇంట్లోవాళ్ళంటారు,’ఫర్వాలేదండీ, లోపలకొచ్చి కుర్చీలో కూర్చుని వేసుకోండీ’అంటారే కానీ, మొత్తం ఫామిలీఅంతా గుమ్మంలోనే నిలబడి ఛస్తే కదల్రు! పైగా బయట భరతనాట్యం( బూట్లు వేసికోడానికి)చేస్తున్న ఆసామీ, జేబులోంచి, తడిసిన సాక్సోటి తీసికుని వేసికోవాలి. ఈ గోలంతా భరించలేక,జీవితంలో మళ్ళీ తాళ్ళున్న బూట్లేసికోకూడదని ఓ శపథం చేస్తాడు.

ఈ బూట్లు కొనుక్కోడంతో అవదు.వాటికి వారానికో, పదిరోజులకో పాలిషోటి చేయించుకోవాలి. ఆ రోడ్డుపక్కన కూర్చునేవాడిదగ్గరకు వెళ్ళగానే, అతనో అక్కడేఉండి, అశేష ప్రజానీకంచేత వాడబడ్డ
ఓ హవాయి చెప్పుల
జతోటిచ్చి, మన్ని ఆ పక్కనే కూర్చోమంటాడు.అక్కడ కూర్చునుండగా ఏ తెలిసినవాడేనా పలకరిస్తాడేమో అని భయపడుతూ,ఎటో చూస్తున్నట్లుగా ఓ పోజు పెట్టేసి, కూతవేటు దూరంలో సెటిల్ అవుతాడు.ఇంక సదరు రోడ్డుపక్కనేఉండే అతను, ఏవేవో డబ్బాలు తీస్తాడు. ఏవేవో కలిపి, మన బూట్లకి పులిమేసి, ఆ బూట్లని ఓ పక్కకి పెట్టేస్తాడు.ఈ లోపులో ఇంకో బేరం,ఏ తెగిన చెప్పుకో కుట్టేయమనో, లేకపోతే ఏ చిరిగిపోయిన బ్యాగ్గుకో కుట్టేయమనో వచ్చే వివిధరకాల గిరాయికీల్నీ చూసుకుంటాడు.మన బూట్ల పాలిష్ తో అతనికి రోజెళ్తుందా ఏమిటీ? ఒకవిషయం మాత్రం గమనించాలి, మనబూట్లు మాత్రం తళతళామెరుస్తాయి, కొత్త పెళ్ళికూతురు/కొడుకు లాగ!
ఇంక దేవాలయాలకెళ్ళినప్పుడు,అక్కడ బయట ఓ బోర్డుంటుంది ‘ఉచిత పాదరక్షలుంచే స్థలమూ’అని. అతనికి మన బూట్లు, పెళ్ళికూతురిని అప్పగింతలు పెట్టినట్లుగా అప్పగించి,విషణ్ణవదనంతో లోపలికి వెళ్తాము.వెళ్ళేటప్పుడు, ఓ చిన్న అట్టముక్కమీదో నెంబరేసిన,ఓ టొకెనిస్తాడు.అది చూపించకపోతే, దేశప్రధానమంత్రైనా సరే మన బూట్లివ్వడు!లోపలికి దైవ దర్శనం చేస్తున్నంతసేపూ, మన దృష్టంతా ఆ బూట్లమీదా, తత్సంబంధిత టోకెన్ మీదే.ఇంక దేముడిగుళ్ళోకెళ్ళడం ఎందుకో? ఉచితం అన్నాడు కదా అని మన బూట్లు తీసికుని వచ్చేస్తే కుదరదు. వాడిచేతిలో ఓ రూపాయో రెండో పెడితేకానీ, మన బూట్లివ్వడు.ఆ మాత్రందానికి ఉచితం అని రాయడం ఎందుకో!

అన్నిటిలోకీ డేంజరస్ ఏరియా రైలు ప్రయాణాల్లో. ఏ పైబెర్తో దొరుకుతుంది, మరీ మనబూట్లు,నెత్తికింద పెట్టుకోడానికి సిగ్గూ, మొహమ్మాటమూనూ.క్రింది బెర్తు కింద మిగిలిన అయిదుగురి బూట్లూ, చెప్పులా కంపెనీలో వదిలేస్తాం.ఓ రాత్రివేళ ఏ టాయిలెట్టుకో వెళ్ళాలని,నానా తిప్పలూ పడి,క్రిందకు దిగి, మన బూట్లకోసం వెదికితే ఛస్తే కనబడవు.అదీ ఇదీ తడిమి, అక్కడ పడుక్కున్నవాళ్ళకి, మన చేతులేమైనా తగిలాయా, మన శీలాన్ని శంకిస్తారు అదో అప్రదిష్టా!లైటేసి వెతుక్కుందామంటే ఏ పసిపిల్లో లేస్తే, మన్ని తిడతారు.చివరకి ఏ సూట్కేసు వెనక్కాలో కనిపిస్తుందోటి, రెండోది ఇంకోవైపు ఎక్కడో దొరుకుతుంది.ఇంతకంటె ఏమీ వేసికోకుండావెళ్తే హాయనిపిస్తుంది, ఎవడు చూడొచ్చాడూ?

ఈ గుళ్ళల్లోకి వెళ్ళేవాళీమధ్యన ఓ కొత్త ఫార్ములా కనుక్కున్నారు. చెప్పులతో వెళ్ళకూడదుట, కానీ సాక్సేసికుని ప్రదక్షిణాలు చేయొచ్చట!ప్రతీ దానికీ ఓ షార్ట్ కట్టూ!ఒక్కో ఇంట్లో, మనవీ,ఇంటావిడవీ, పిల్లలవీ అన్నీ కలిపి ఓ బాటా షాప్పులా తయారవుతున్నాయి.ఇదివరకటిలా కాదుగా, రన్నింగ్ షూ, జాగ్గింగు షూ, అఫీసుషూ,పార్టీ షూ, వీటికి సాయం పిల్లలకి, మామూలు స్కూలుకెళ్ళే షూ, పీ.టీ.షూ.వెరసి ఓ పాతిక ముఫై జతలదాకా తేల్తాయి!

మా రోజుల్లో కాన్వాసు తెల్లవి బూట్లకి, పాలిషులూ వగైరా ఉండేవికావు.వారానికోసారి శుభ్రంగా ఉతికేసి, ఎండలో ఆరబెట్టేసి, ఏ సున్నం బట్టీలోదో ఎండగా మిగిలిన సున్నంలో నీళ్ళు కలుపుకుని, దాన్ని పట్టించేసి, మళ్ళీ ఎండ కార్యక్రమం మొదలెట్టడమే!ఇల్లూ, వళ్ళూ సున్నమే!ఇంటికి సున్నాలేసేవాడిలా! ఇప్పుడైతే అదేదో ‘కీవీ’యో ఇంకో సింగినాదమో తెల్ల పాలిష్ డబ్బాలొచ్చాయి.ఆ డబ్బామీదో పుల్లా, దానికి చివరగా ఓ స్పాంజిముక్కా, దాన్ని ముంచుకుని బూట్లకి పట్టించేయడం.ఆ స్పాంజిముక్క ఒక్కోప్పుడు, మనల్ని వీధులో పెట్టేస్తూంటుంది. ఆ ముక్క కాస్తా, ఆ డబ్బాలోకి ఊడిపోతుంది. మళ్ళీ మన సున్నాల కార్యక్రమం షురూ!దాంట్లో ఉన్న దాన్ని అరచేతిలో పోసుకుని, ఇంకో వేలితో ఆ బూట్లమీద రాయడం!

ఇవన్నీ కాకుండా, రైన్ షూసోటీ.అవి రబ్బరుతో చేసినవి, ఓ సీజను దాటితే చిరుగుపట్టేసేవి.ఆ తరువాత గంబూట్లూ.ఆ రోజుల్లో మోకాళ్ళదాకా ఉండేవి. అది ఓ పర్టిక్యులర్ పోజులో తొడిగితేకానీ పట్టేవికావు.వర్షంలో ఏ మోకాల్లోతులోనో వెళ్ళేటప్పుడు, దాంట్లోకి ఏ పురుగో పుట్రో చేరిందా అంతే సంగతులు!
ఇవండీ నాకు గుర్తొచ్చిన కబుర్లు.ఇంక చెప్పుల సంగతులు ఇంకో టపాలో !!