బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–” భ్రమ” లు

    ప్రపంచంలో మనకంటె తెలివైన వాళ్ళు లేరూ, ఎవరు చేసే పనైనా, మనమూ చేసేయగలమూ అనే overconfidence ఉందే దాన్నే, మామూలు భాషలో ‘భ్రమ’ అంటారు. మామూలుగా తొంభై శాతం మొగాళ్ళలో ఇది తప్పకుండా ఉంటుంది.ఓస్ ఇంతేనా అని దేంట్లోనో వేలెట్టడం,బోర్లా పడడమూనూ! నిజం చెప్పాలంటే అవేమీ పేద్ద ఘనకార్యాలేమీ కాదు. కానీ మనం బోర్లాపడ్డతరువాత తెలుస్తుంది, అది ఎంత specialised జాబ్బో !

ఇదివరకటి రోజుల్లో, మన ప్యాంటులకి జిప్పులూవగైరాలుండేవి కావు. బొత్తాలే గతి. అవికూడా అదేం ఖర్మమో, చాకలాడు ఇస్త్రీ చేసి చేసి, వాటిని ఊడగొట్టేసేవాడు. పైగా వాటిక్కుడా ఓ shelf life లాటిదోటి ఉంటుందిగా. అదికాస్తా అయిపోగానే టపక్కున ఎక్కడో పడిపోతుంది. ఇప్పటిలాగ ఏమైనా, బీరువానిండా బట్టలుండేవా ఏమిటీ, ఏదో పండగకీ, పుట్టినరోజుకీ,ఎవరైనా పీటలమీద ఆతావేతా బట్టలు పెడితే, అవి మనం కుట్టించుకుంటే,అన్నీ కలిపి ఓ అరడజను జతలు తేలేవి. అందులో ఆఫీసుకేసికొని వెళ్ళేవి, మూడు పోగా మిగిలిన మూడూ ఏవైనా ఫంక్షన్లకి( ఎవరైనా పిలిస్తే) వేసికోవడం.ఇదండి కథ.అందులో మనం ఆఫీసుకెళ్ళే ప్యాంటు బొత్తాం ఊడిపోయిందన్నాము కదూ, రోజు మధ్యలో, వేళ్ళాడుతున్న flap కి ఓ సూదిపిన్నీసు పెట్టుకుని, పనికానిచ్చేద్దామనుకున్నా, అందులో కూడా కొన్ని అసౌకర్యాలున్నాయి.మరీ పిన్నీసు పెట్టుకుని ఆఫీసుల్లో తిరిగితే బావోదుకదా, అందుకోసమని, అప్పటిదాకా inshirt చేసికున్న షర్టుని బయటకు లాగేసి, ప్యాంటుమీదకి వదిలేస్తాము.

ఈ గొడవలన్నీ భరించలేక, ఇంటికెళ్ళగానే ఇంటావిడతో, ‘ఏమోయ్ ప్యాంటు బొత్తాం ఊడిపోయిందీ, కొంచెం కుట్టిపెడుదూ’ అంటాం.ఆవిడకిదేపనా ఏమిటీ, చూద్దాంలెండంటుంది.ఇలా ఆవిడని ఇంకోసారి అడగడానికి,ఇగో అడ్డం వచ్చి, ‘ఆమాత్రం నేను కుట్టుకోలేనా, ప్రతీ దానికీ పేద్ద పోజు పెడుతుందీ..వగైరా వగైరా..’ లోపలే అనేసికుని, మళ్ళీ బయటకి విసుక్కుంటే మర్నాడు లంచ్ డబ్బా ఇవ్వకపోతే..అమ్మో! ముందుగా సూదీ దారం ఉన్న ప్లాస్టిక్ డబ్బా తీస్తాడు.అందులో బొత్తాలు కుట్టుకోడానికి ఏ సూది వాడాలో తెలియదు. కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఓటి సెలెక్ట్ చేస్తాడు.ఏదో తను పెద్దాణ్ణి కదా అని, బొంత సూది తీస్తారా ఎవరైనా? ఆ తీసిందికూడా ఎందుకంటే, చిన్న సూదిలో దారం ఎక్కించలేడు,అందుకన్నమాట అసలు సంగతి! చివరకు, ఏ కూతురో,కొడుకో వచ్చి చెప్తారు, డాడీ ఆ సూది కాదూ,ఇదీ అని, ఇంకోటి చేతిలో పెడతారు.

ఇంక భాగవతం మొదలూ,ఆ సూదిలోకి దారం ఛస్తే దూరదు,ఏదో దాన్ని చివరలు నలిపితే, సన్నబడుతుందీ అని ఎప్పుడో గుప్తులకాలంలో చూసిన జ్ఞాపకం ఉంది.ఓ సారి దాన్ని నలపడం ఓసారి నోట్లో పెట్టుకుని తడపడం, మొత్తానికి ఏవేవో తిప్పలు పడి, సూదిలోకి దారం ఎక్కించాడు. ప్యాంటు రంగుతో దగ్గర దగ్గరగా మ్యాచ్ అయ్యే ఓ బొత్తాం( ఎందుకంటే ఒరిజినల్ బొత్తాం ఎక్కడో జారిపోయింది) సెలెక్ట్ చేసి, బొత్తాం కుట్టడం అభియాన్ మొదలెడతాడు.ఆ బొత్తాన్ని, ప్యాంటు పైభాగంలో, (అది ఎక్కడకి రావాలో తెలిసికోడానికి, పాత జారిపోయిన బొత్తాం దారం అవశేషాలుంటాయి, అదే కొండగుర్తు,/b>). పెట్టి, ఆ సూదిని కిందనుంచి గుచ్చి బొత్తాంకున్న చిల్లులోకి (ఒక్కోప్పుడు రెండే చిల్లులుంటాయి, అదృష్టం బాగోపోతే నాలుగు) గుచ్చడానికి ప్రయత్నిస్తే టప్పున మన చూపుడువేల్లోకి దిగిపోతుంది.వెధవ గొడవ వెధవ గొడవని తిట్టుకుంటూ, ఆవేలునోట్లో పెట్టుకుని చప్పరిస్తాడు.ఇంతట్లో కొంప మునిగిపోయినట్లు, కొడుకో,కూతురో వచ్చి, డాడీ రేపు స్కూల్లోకి కాంపాస్ బాక్స్ లేదూ, అదితీసుకురాపోతే క్లాసులో బయటనుంచోపెట్టేస్తారూ అని వస్తారు.అదేమిటో ప్రపంచంలో కష్టాలన్నీ ఒకేసారి రావాలా. ఇక్కడ వేల్లో సూదుగుచ్చుకుని నేను ఛస్తూంటే, వీడికి కంపాస్ బాక్స్ కావాల్ట.సాయంత్రంనుండీ ఇంట్లోనే ఉందిగా, మీఅమ్మతో చెప్పేడ్వకూడదూ,ఆవిడకి ఊళ్ళోవాళ్ళతో ఖబుర్లు చెప్పుకోడానికే టైముండడంలేదు,ఇంక ఇవన్నీ ఎక్కడచూస్తుందీ, అంటూ ఢాం ఢూం అని బి.పి. పెంచేసుకుంటాడు.పాపం స్వతహాగా నెమ్మదస్తుడే, ఇదిగో కట్టకట్టుకుని మీద పడ్డ కష్టాలు ఓర్చుకోలేక, ఇలా వీధిన పడ్డాడు!

ఇదంతా ఎందుకొచ్చిందీ,మనం చేసికోలేని పన్లో వేలెట్టడం వల్ల.ఇంటావిడ కొంచెం తీరికచెసికుని కుట్టిపెడతానందికదా, అబ్బే అలా ఆగితే, మన ఇంపార్టెన్సెక్కడ? చివరకి ఆవిడే కుట్టిపెడుతుంది, మర్నాడు హాయిగా ప్యాంటుకి మాచ్ అయ్యే బొత్తాంతో ఆఫీసుకీ వెళ్తాడు, కథ సుఖాంతం.

ఎప్పుడో పెళ్ళైన కొత్తలో షర్టు బొత్తాలూడిపోతే, పెళ్ళాన్ని పిలిచి, కొంచెంకుట్టిపెట్టవోయ్ అనగానే, ఆవిడ మనం నుంచునుండగానే టకటకా మని కుట్టేసి, దారం పంటితో తెంపడానికి, మనమీదకు వాల్తే, మనమెదో కక్కూర్తి పడ్డ మధురదృశ్యాలు గుర్తుకొచ్చి,చొక్కా బొత్తాం కావాలని తెంపేసుకుని, ఇంటావిడని బొత్తాం కుట్టమంటే(ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తండ్రైనతరువాత), ‘సర్లెండి సంబడం. మనకిదోటి తక్కువా’ అంటూంటే, అయ్యో జీవితం ఇంతేనా అనిపిస్తూంటుంది! మిగిలిన ఇంకెన్నో ‘భ్రమ’ లగురించి ఇంకో టపాలో….