బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Wireless అనుబంధాలు…..


   ఈసారి ప్రయాణం లో మాకు, అంతర్జాలంద్వారా పరిచయమైన ఒకరిద్దరి వ్యక్తులను కలిసే అదృష్టం కలిగింది. అందులో ఒకరైతే మన “కష్టేఫలే” శర్మ గారు.అన్నవరం లో స్వామివారి కల్యాణ కార్యక్రమం పూర్తిచేసికుని, మర్నాడు రాజమండ్రీలో “సురేఖ” అప్పారావు గారిని ఓ గంట బోరుకొట్టి, మర్నాడు మళ్ళీ ఓ ట్రిప్పు వేసికుందామనుకున్నాము. తణుకు లో ఉండగానే, శ్రీ శర్మ గారు ఫోను చేసి, మమ్మల్ని కలవడానికి ఎప్పుడొస్తున్నారూ అన్నారు. అయ్యా, మేము ద్వారపూడి దాకా వస్తే తప్పకుండా , అనపర్తి వచ్చి మిమ్మల్ని కలుస్తానూ అన్నాను. మా కజిన్ తో మర్నాటి ప్రోగ్రాం ఫిక్స్ చేశాము. ద్వారపూడి,బిక్కవోలు, బలభద్రపురం,గొల్లలమామిడాడా వెళ్ళి దైవదర్శనం చేసికుందామనిన్నూ, వీలుంటే తిరుగుప్రయాణం లో ఆత్రేయపురం మీదుగా నిడదవోలు వెళ్ళి, రాత్రికి కొంపకు చేరేటట్టు.

   ప్రొద్దుట వెళ్ళే రూట్ లో మధ్యాన్న భోజనం ఎక్కడ చేయాలో తెలిసింది కాదు. ఓసారి శర్మగారికి ఫోను చేసి స్వామీ మా కార్యక్రమం ఫలానా, అనపర్తికి ఎప్పుడు రాకలమూ అన్నాను. ఆ లెఖ్ఖా ఈ లెఖ్ఖా వేసి భోజనానికి పిలవకపోతారా అని. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారూ, మరీ ఇలా నిస్సిగ్గుగా చెప్పేటప్పటికీ? ఆంధ్రదేశం వదిలి 50 ఏళ్ళవుతున్నా, పాతకాలపు ఆంద్ర లౌక్యాలు ఇంకా వదల్లేదు మరి, ఏం చేస్తాను? అనుకున్నట్టే పాపం ఆయనకూడా, మీ దైవదర్శన కార్యక్రమాలు పూర్తిచేసికుని, మధ్యాన్న భోజనానికి మా ఇంటికి వచ్చేయండీ అన్నారు. మరీ అడగ్గానే ఒప్పేసికుంటే, వీడేమిటీ మరీనూ అనుకుంటారేమో అని, “ఎందుకులెండి మీకు శ్రమా, ఓసారి కనిపించేసి వెళ్తామూ, పైగా మేము నలుగురం, డ్రైవరు అదనం”
అని ఓసారంటే ఓసారే చెప్పాను. మరీ నొక్కివక్కాణిస్తే, “పొన్లెండి, మీరు మరీ అంత మొహమ్మాట పడుతూంటే, వదిలేద్దాము…” అని ఆయనంటే వదిలేది నా రోగం... ఏదో ఒకటికి రెండుసార్లు అడిగించుకుని మొత్తానికి ఏదో ఆయన్నిoblige చేస్తున్నట్టుగా సౌండిచ్చి ఒప్పేసుకున్నాను! పైగా మా ఇటావిణ్ణి “చెల్లెమ్మా” అనికూడా చుట్టరికం కలుపుకున్నారాయే!
కానీ వారింటికి వెళ్ళినతరువాత తేలిందేమిటయ్యా అంటే, నేను ఆయన్ని oblige చేయడం కాదు, ఆయనా, వారి ధర్మపత్నీ, కోడలూ మాకుచేసిన మర్యాదలు చూస్తే, ఆయన మమ్మల్ని oblige చేసినట్టు, వారి పరిచయభాగ్యం కలగడానికి.

   తిరిగొచ్చేటప్పుడు ఫలానా జంక్షన్ లో ఆగండీ, నేనొచ్చి మిమ్మల్ని కలిసి ఇంటికి తీసికెళ్తానూ అన్నారు. ఆయన చెప్పినట్టే ఆగాము. ఓసారి కారులోంచి బయటకొచ్చి చూశాను, ఎవరైనా వచ్చి పలకరిస్తారేమో అని.ఆయనెలా ఉంటారో తెలియదాయే, ఇంతలో ఓ పెద్దాయన వచ్చి, పలకరించారు. రూపం, వేషం చూస్తే ఈయనే అయిఉంటారూ అనుకుని, ఆయన వెనక్కాలే వెళ్ళాము. అంతా సంప్రదాయ పధ్ధతిలో, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చి వగైరా ..వగైరా…ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుని భోజనానికి లేచాము.” బాబయ్య గారూ, పంచె కట్టుకుంటారా..” అని వారి కోడలు అడగడం తో, వామ్మోయ్ అంత ఆచారం లేదు తల్లీ అని చెప్పేసి,భోజనానికి సెటిల్ అయిపోయాము. శర్మగారేమో, మాస్టారూ బాత్రూం కి వెళ్ళాలా అంటే, మళ్ళీ స్నానం అదీ చేయమంటారేమో అని భయపడి పోయి, అలాటిదేదీ అవసరం లేదన్నాను. మరి ఇందుకే అంటారు ఊరికే ఏవేవో ఊహించేసికోకూడదు.శుభ్రంగా షడ్రసోపేతంగా పెట్టిన భోజనం తిని , “అన్నదాతా సుఖీభవా” అనుకోకుండా, ఇలాటి పిచ్చి పిచ్చి వ్రాతలెందుకూ అంట?

    శ్రీ శర్మ గారింట్లో మాకు జరిగిన మర్యాదలూ, వారూ,వారి కుటుంబమూ చూపించిన అభిమానమూ, మేము జీవితంలో మర్చిపోలేము. ఆయనకీ, మాకూ ఉన్నది Wireless అనుబంధం మాత్రమే. కానీ దగ్గర బంధువుల దగ్గరకూడా లభించని ఆప్యాయత మేము పొందకలిగాము.వారి మనవరాలిని కూడా చూసివెళ్తే బావుండేది కానీ, వెనక్కి వెళ్ళే హడావిడిలో ఆగలేకపోయాము. మా మరదలు కూడా ఏదో చుట్టరికాలు కలిపేసింది… దానితో ఇద్దరు ముత్తైదువలూ చెరో చీరా సంపాదించేశారు… ( ఎంతైనా “పుట్టింటి” వారు కదా!), నాచేతిలో, నా అభిమాన రచయిత ముళ్ళపూడి వారి పుస్తకం పెట్టి, వీడ్కోలు తీసికున్నారు. ఈ ట్రిప్పులో మేము కలకాలం గుర్తుపెట్టికునే పరిచయం ఇది.GOD BLESS THEM…..

7 Responses

  1. బాబుగారూ!

    మీ వైర్లెస్ సంబంధాలు బాగా నిలుపుకుంటూ, బ్లాగు మిత్రులందర్నీ చుట్టబెట్టేస్తున్నారు. నాకు చాలా అసూయగా వుంది.

    మా మీదమాత్రమే శీతకన్ను వేస్తున్నారు.

    మము బ్రోవమని చెప్పవే అని అక్కయ్యగారిని వేడుకోవాలేమో ఇంక!

    చూస్తాను మరి.

    Like

  2. ఆహా అదృష్టమండీ…… ఎంతైనా… రాసిపెట్టి ఉండాలని ఊరికే అన్నారా….

    Like

  3. విశ్రాంత జీవనంలోకూడా క్రొత్త స్నేహుతులను చేర్చుకుంటూ
    ముందుకు వెళ్తున్నమీ దంపతులకు నా అభినందనలు.
    ఇది అంతర్జాల యుగం.యుగ ధర్మాన్ని బాగా పాటిస్తూ మరింత
    హాయిగా హాయి హాయి గా మీరిద్దరూ కల కాలం కలిసి ఉండాలని కోరుకుంటాను.

    Like

  4. @కృష్ణశ్రీ గారూ,

    ఈసారి మరీ తక్కువ రోజులున్నాము. మరోసారి తప్పకుండా ప్రయత్నిస్తాము.

    @మాధవీ,

    అవును కదా…

    @మోహన్ గారూ,

    థాంక్స్…

    Like

  5. అనపర్తి ఎక్కడ ఉందండీ ?

    రేపే అనపర్తి కి ప్రయాణం !

    చీర్స్

    జిలేబి.

    Like

  6. జిలేబీ,
    వేశవి కాలం మరీనూ…

    Like

  7. అంతర్జాల యుగంలో వైర్లెస్ బంధాలు మరింతగా పెరిగి యుగధర్మాన్ని అందరూ పాటించాలని కోరుతున్నాను 🙂 పోస్టు బాగుంది ఫణిబాబు గారు. శర్మగారి ఆప్యాయత అభినందనీయం.

    Like

Leave a comment