బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కొత్త సిమ్మూ, పాత సిమ్మూ……An Idea can change your life…


    ఈమధ్యన అంటే మరీ ఈమధ్యన కాదూ, ఓ రెండునెలల క్రితం అన్నమాట, ఓ ఫోనొచ్చింది. మీరు నెలకీ టాక్ టైము ఎంత కడుతూంటారూ అని IDEA వాడి దగ్గరనుండి. మా ఇంటావిడది ఆ నెట్ వర్కేలెండి. ఏదో నెలకీ 300 అవుతూంటుంది అన్నాను. అరే మీరు నెలకీ 250 కడితే 400 టాక్ టైమొస్తుందీ, Prepaid నుండి Postpaid మార్చేసుకోండీ. పోనీ ఇదీ బాగానే ఉందీ అని కక్కూర్తి పడి సరే అన్నాను. ఏ దుర్మూహార్తాన్న ఒప్పుకున్నానో అప్పటినుంచీ నా పాట్లు మొదలయ్యాయి. అవేవో ఎడ్రెస్ ప్రూఫూ, ఓ ఫొటో ఓ 250 రూపాయలూ ఇచ్చేస్తే, నిమిషాల్లో మీ పని పూర్తవుతుందీ అన్నారు. కాబోసు అని, మా స్వంత ఫ్లాట్ ఎడ్రస్ ప్రూఫూ, ఇంటావిడదో ఫొటో రెడీ చేసి, వాడి కోసం ఎదురుచూడ్డం లో ఓ నెల గడిచింది.మొత్తానికి వాడొచ్చి, ఓ నాలుగు సంతకాలూ, ఓ 250 రూపాయలూ, కాగితాలూ పుచ్చుకుని, ఓ కొత్త సిమ్ కార్డు చేతిలో పెట్టి వెళ్ళాడు.నా Prepaid లో మిగిలిన బ్యాలెన్స్ ఏమౌతుంది నాయనా అంటే, రెండు రోజుల్లో ఈ సిమ్ కార్డు పనిచేయడం ఆగిపోతుందీ, వెంటనే నేనిచ్చిన కొత్త సిమ్ వేసికోండీ, ఆ పాత బాలెన్స్ కొత్త బిల్లులోకి వెళ్తుందీ అన్నాడు. వాడు చెప్పిన విధం ఎలా ఉందీ అంటే, క్షణాల్లో అన్నీ అయేటట్టు.చివరికి క్షణంలో జరిగిందేమిటయ్యా అంటే, వాడు రావడం, పోవడం మాత్రమే...

   ఏదో మనవైపు వెళ్తున్నాము కదా, మధ్యలో ఆగిపోతే కష్టమూ అనుకుని, కొత్త సిమ్, జాగ్రత్తగా తీసికెళ్ళాము. ప్రాణం పోవడం చాలా సులభమేగా, అలాగే దారిలో టక్కున ఫోను పనిచేయడం మానేసింది. అలా ఆగిపోతే కొత్తది పెట్టేసికోమన్నాడుగా, నాకీ గొడవలన్నీ తెలిసి చావ్వు. ఏదో మా కజినూ, మా ఇంటావిడా కలిసి అదేదో పూర్తిచేశారు. పాత సిమ్ము లోని ఈవిడ కాంటాక్ట్స్ అన్నీ మాయం. అదేమిటో పాతదాంట్లోంచి ఫోనులోకి మార్చాలిట.ఆ తిప్పలేవో పడి, మొత్తానికి మార్చారండీ. ఆ దిక్కుమాలిన ఫోను పలకదే. మాటిమాటికీ ఇంటావిడ నన్నడగడం, పాత సిమ్మా కొత్త సిమ్మా అంటూ.ఏదో ఒకటీ మనప్రాణానికి అని నేను విసుక్కోడం. ఇవన్నీ ఎప్పుడూ, అన్నవరంలో మా పెళ్ళిరోజునన్నమాట.ఛాన్స్ దొరికితే వదులుతుందా మా ఇంటావిడా, ఎంత సంతోషంగా ఉందండీ, ఎవరైనా పెళ్ళిరోజుకి ఏదైనా గుర్తుండే బహుమతులిస్తారు, ఇక్కడ మీరేమో ఉన్న ఫోనుకూడా సైలెంట్ చేసేశారూ అంటూ.

   అసలు గొడవంతా దేనికంటే, ఈవిడ గంట గంటకీ పూణే లో ఉండే మా పిల్లలతోనూ మాట్లాడాలి. తణుకులో ఉండే మా అత్తగారేమో ఈవిడతో మాట్లాడాలి. నా ఫోనులో చేసికోడం నామోషీ మరి. పోనీ అదేదో అమ్మాయిచ్చిన 3G ఉపయోగించుకోచ్చా అంటే, అదేంఖర్మమో, ఎక్కడ నొక్కి చావాలో తెలియదాయే, ఓచోట నొక్కితే ఎవరికో వెళ్తుంది. ఈ గొడవ భరించలేక దాన్ని స్విచాఫ్ చేసి పారేశాను. ఆతావేతా జరిగిందేమిటంటే మా ఇంటావిడకి బాహ్యప్రపంచంతో సంబంధబాంధవ్యాలకి అంతరాయం కలిగింది. పోనీ ఆవిడ ఫోను పలకడం లేదూ అని నాఫోనుకి చెయ్యొచ్చుగా అబ్బే,మా అత్తగారికేమో మొహమ్మాటం, మరీ అల్లుడికి ఫోనుచేసి అమ్మాయికియ్యీ అనడం. ఇంక కూతురికేమో, డాడీకి ఫోను చేసి, మమ్మీ చేతిలో పెట్టూ అంటే నేనేమైనా ఫీల్ అవుతానేమో అని! చెయ్యకేం చేస్తారులెండి అవసరం వస్తే, అదిగో అలాటి ఎమర్జెన్సీలో మా ఇంటావిడ, వాళ్ళతో చెప్పేసింది, ఇలా ఉందీ నా పరిస్థితీ, మీఅల్లుడుగారూ/ మీ నాన్నగారూ ( ఇద్దరికీ విడివిడిగా చెప్పొద్దూ మరి) చేసిన నిర్వాకం మూలాన, నా ఫోను పనిచేయడం లేదూ. ఏదైనా అవసరం ఉంటే ఆయన్నే సంప్రదించండీ అంటూ…

   పోనీ పూణె లో ఉండే IDEA వాడికి ఫోనుచేద్దామా అంటే వాడినెంబరు లేదూ, ఇంతలో ఓ మెసేజీ ( ఇంటావిడ ఫోనులో) Call 12345 for activation అని. వాడి మొహమేం కాదూ, ఓ వైపున కాల్స్ వెళ్ళడంలేదు మొర్రో అంటే, ఎక్కణ్ణించి కాల్ చేయాలిట? పోనీ నాదాంట్లో చేద్దామా అంటే check your number అంటుందాయే. ఏదో ఓ గంటలో చుట్టపు చూపుగా ఓ పావుగంట ఆ ఫోనులో ప్రాణం వచ్చింది. అమ్మయ్య ఓ గొడవొదిలిందిరా బాబూ అనుకున్నంతసేపు పట్టలేదు, మళ్ళీ సైలెంటు.ఇంతలో ఓ మెసేజీ, నీ ఎడ్రస్ ప్రూఫ్ వెరిఫై అవలేదూ, అందుకోసం ఆగిపోయిందీ అంటూ.. మేమేమైనా గంధర్వులా ఏమిటీ, ఏదో లేపనం రాసుకుని, క్షణాల్లో పూణె లో తేలడానికీ? ఏదో ఆలెఖ్ఖా ఈలెఖ్ఖా వేసి ఫలానా రోజుకి రమ్మన్నాము. ఈ హింస ఇంకో వారం రోజులన్నమాట. ఆ నాలుగురోజులూ ఇంటావిడ మొహం లోకి చూసే ధైర్యం లేదు. ప్రతీవాళ్ళూ అడగడమే ఏమయ్యిందీ అంటూ. పైగా కొందరైతే నా “శీలాన్ని” శంకించేశారు, బిల్లు కట్టలేదా అంటూ. మనవైపు అలవాటేమో మరి ఇలాటివన్నీ, లేకపోతే అసలలాటి అనుమానం ఎందుకొస్తుందీ? ఇంక మా ఇంటావిడైతే, అడక్కండి,అసలు ఈ ప్రీ/పోస్టులు ఎందుకు చేయడం, ఏదో నాదారిన నేనేదో కాలక్షేపం చేస్తున్నా కదా, అసలు ఊరికే కూర్చోక చేసే పన్లు… వగైరా వగైరా… ఏం చేస్తానూ నోరుమూసుకుని వినవల్సొచ్చింది. పోనీ అందులో ఉండే సదుపాయం చెబ్దామా, ఇలా ఇంత లాభం ఉంటుందీ, ఓ రెండు వందలు మిగులుతాయీ, సంపాదిస్తే తెలుస్తుందీ డబ్బువిలువ ఏమిటోetc.. etc….. రిటైరయిన తరువాత ఆ హక్కూ పోగొట్టుకున్నాయే. ఇదివరకైతే ఉద్యోగంలో శ్రమ పడుతున్నానూ, ఆశ్రమకి తగ్గ జీతం ఇస్తున్నారూ అంటూ ఓ కారణమైనా ఉండేది. మరి ఇప్పుడో హాయిగా కొంపలో కూర్చోండీ అంటూ పెన్షనిస్తున్నారు.నిజం చెప్పాలంటే నాకంటే ఆవిడే ఎక్కువ శ్రమ పడుతోంది !అసలు ఎందుకొచ్చిన గొడవ చెప్పండీ, హాయిగా ఉన్న ఫోను ప్లాన్ ఉంచుకోవచ్చుగా, దిక్కుమాలిన ప్రీ పోస్టూ అంటూ కెలకడం ఎందుకూ? చివాట్లు తినే యోగం ఉంటే మరి ఇలాటి , తిన్నతిండరక్క చేసే పన్లు చేస్తామేమో?

   మొత్తానికి పూణె వచ్చిన తరువాత మొన్నఏడో తారీకున వచ్చి ఆ వెరిఫికేషనేదో చేసుకుపోయాడు. ఇదిగో సాయంత్రానికి మీ ఫోనుకి ప్రాణప్రతిష్ట జరిగిపోతుందీ అన్నాడు. ఇప్పటికి 72 గంటలెళ్ళాయి, ఎక్కడా ముక్తీ మోక్షం లేదు. ఇంటావిడ ఫోను సైలెంట్.. An Idea can change your life… అంటే మరీ ఇలాగుంటుందనుకోలేదు…..

2 Responses

 1. “మా ఇంటావిడకి బాహ్యప్రపంచంతో సంబంధబాంధవ్యాలకి అంతరాయం కలిగింది”–
  నలభై వ పెళ్లి రోజు సందర్భంగా
  పండగ రోజు మొగుడే గతి అనిపించేసారన్నమాట.
  what an idea sir ji !!

  Like

 2. మోహన్ గారూ,

  ఇంటావిడ అసలే కోప్పడేస్తోంది.”పండగ రోజు మొగుడే గతి అనిపించేసారన్నమాట.”, అని, మీరేమో between the lines చదివి, కొత్త గొడవోటి మొదలెట్టకండి స్వామీ….నాకు లేనిపోని ulterior motives అంటకట్టేస్తున్నారు…..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: