బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– తెలుభాషా దినోత్సవం


    ఆ మధ్యనెప్పుడో ఓ టపా వచ్చింది.ఈ నెల 29 న మాతృభాషోత్సవం సందర్భంగా, తెలుగుబాట కార్యక్రమం జరుపుతున్నారని.ఏదో మన భాషమీదుండే అభిమానం కొద్దీ, తెలుగుబాట కార్యక్రమంలో, నేనూ పాలుపంచుకుందామనే సదుద్దేశ్యంతో, భాగ్యనగరానికి వెళ్ళాను.వారిచ్చిన లింకులో నా పేరు నమోదుకూడా చేశాను.అందులో,వారు చెప్పిన ప్రకారం, కార్యక్రమంలో మార్పులూ, చేర్పులూ ఉంటే తెలియచేస్తామన్నారు. నా ఐ.డి.,సెల్ నెంబరూ ఇచ్చాను.

    శుక్రవారం 27 కే చేరుకుని, రామూ తో మూడుగంటలు గడిపాను( ఆ విషయాలన్నీ ఇంకో టపాలో)వాళ్ళ కార్యాలయంలో.శనివారం ఫోను చేసి, తెలుగుబాట కార్యక్రమ స్థలంలో, ఏదో మార్పున్నట్లు విన్నానని చెప్పారు. ఏదైనా మార్పున్నట్లయితే తెలియచేస్తామన్నారూ, నాకైతే ఏ సమాచారం లేదూ, అయినా ఏదో పేద్ద పాత్రికేయుడు చెప్పాడు కదా అని, శ్రీ సతీష్ కి ఫోను చేసి అడిగితే, కొన్ని ‘కారణాల’ వలన ఎచ్.ఎం టివీ లో అలా స్క్రోలు చేస్తున్నామనిన్నూ, స్థలమార్పేమీ లేదనీ చెప్పారు.ప్రొద్దుటే 7.30 కి’ తెలుగుతల్లి’ విగ్రహానిదగ్గరకు వచ్చేయమన్నారు.

    మర్నాడు ప్రొద్దుటే, వారు చెప్పినట్లుగా తెలుగుతల్లి విగ్రహం దగ్గరకు( ఆటో డ్రైవరు ధర్మమా అని క్షేమంగా) చేరాను!నన్ను మా చుట్టాలడిగారు, అక్కడికి వచ్చేవారు మీకు తెలుసునా అని, నేను చెప్పాను అక్కడికి వచ్చేవారందరిపేర్లూ విన్నానూ, కొంతమందితో ఫోను ద్వారా పరిచయం ఉందీ, అయినా నా మొహం అందరికీ సుపరిచితమే ఎవరో ఒకరు గుర్తు పడతారూ అని.అలాగే అనుకున్నట్లుగా, సుజాత ( మరీ వాళ్ళందరినీ ‘ గారు’ అనడం లేదు, ఒక్కళ్ళకీ నా సర్వీసంత వయస్సు లేదు.పైగా నా కంటె వయస్సు తక్కువున్నవారికి నమస్కారం పెట్టినా, మరీ ఎక్కువగా ‘గారూ’ ‘ బీరూ’ అంటే ఆయుక్షీణంట బాబూ, ఎందుకొచ్చిన గొడవా, ఇంకా కొన్ని సంవత్సరాలు మిమ్మల్నందరినీ బోరు కొట్టద్దూ!!)వచ్చి పలకరించి, అక్కడున్నవారికి పరిచయం చేసి, ఓ టీషర్టిచ్చారు. దానికి ఓ బ్యాడ్జి తగిలించారు. ఈ అలంకరణలయ్యాక, ఓ ఫారం ఇచ్చి నింపమన్నారు.నా చేతివ్రాత ఎవరికీ అర్ధం అవదని, సుజాత నే నింపమన్నాను.అందులో ఆఖరి కాలం ఏమిటంటే ‘ మీరు ఈ తెలుగు సభ్యత్వం తీసికుంటారా’ అని.సంవత్సరచందా ఎంతని అడిగితే,500/- అన్నారు! అదేం పెద్దమొత్తం కాదనుకోండి,అయినా మరీ బలవంతంగా ఓ టీషర్టు తొడిగేసి, సభ్యత్వం తీసికుంటారా లేదా అని అడిగితే ఎలాగండి బాబూ, కాదంటే ఆ టీషర్టు పీకేస్తారేమో అని ‘ భయపడి‘ సరే అన్నాను!

    ఇంతలో కొంతమంది వచ్చారు. అందరినీ పరిచయం చేసికుని, సుజాత అందరికీ చాయ్ ఇప్పించారు, అది త్రాగి, ఏవో కొన్ని ఫుటోలు తీసికున్నాను.అంతా కలిపి ఓ యాభై మందుంటారు.
అదీ భాగ్యనగరంలో మనవారి ‘ భాషాభిమానం’. చాలా బాధేసింది.వారంలో అదీ శలవురోజున ఆమాత్రం ఇటువంటి కార్యక్రమాలకి సమయం, అదీ ఎంత ఓ మూడు గంటలు,ఓ దిక్కుమాలిన సినిమా చూసిందానికంటే తక్కువ!– కేటాయించలేకపోయారంటే, మనవాళ్ళందరికీ, మాటల్లో తప్ప చేతల్లో అంత ఉత్సాహం లేదనే అనుకోవాలి.రాకపోవడానికి ఎన్నెన్నో కారణాలకేముందీ, కావలిసినన్ని చెప్పొచ్చు.అక్కడికి, ఈ కార్యక్రమానికొచ్చిన వారందరికీ పనులే లేవా, అయినా ఓ మంచి పని చేస్తున్నారూ, వారందరినీ ఉత్సాహపరచాలనే కదా వెళ్ళిందీ.అంతే కానీ, టి.వీ ల్లో రావచ్చూ, ఓ ఫ్రీ టీషర్టు ( అని అనుకుంటున్నాను!) కొట్టేయొచ్చూ అని కాదుగా.ఎవడో ఎక్కడో ‘వాకథాన్’ ‘మారాథాన్’ అనగానే మాత్రం, వర్షమైనా ఎండైనా సరే తోసుకుంటూ వచ్చేస్తారు, ఎందుకంటే అక్కడ సెలిబ్రెటీస్ కూడా వస్తారు కాబట్టి.ఇక్కడే వస్తుంది గొడవంతా, ప్రభుత్వం తెలుగు గురించి ఏమీ చేయడంలేదూ అని గోల పెట్టేకంటే,మనం ఏం చేస్తున్నామూ అని ఆలోచించండి.మీకే దొరుకుతుంది సమాధానం!

   ఆ కార్యక్రమంలో ఏం జరిగిందీ అనే వివరాలు చాలా టపాల్లో వచ్చాయి. మళ్ళీ ఆ వివరాల్లోకి వెళ్ళడం అనవసరం!అక్కడున్న చాలా మందిని అడిగాను- పి.వీ జ్ఞానభూమి దాకా నడవాలనే ఎందుకు అనుకున్నారూ అని. అందరూ చెప్పిన సమాధానం ఏమిటంటే, శ్రీ గిడుగు రామ్మూర్తిగారి విగ్రహం భాగ్యనగరంలో లేదనిన్నూ,తెలుగువారికి కీర్తితెచ్చిన శ్రీ పీ.వీ. నరసింహరావు గారి జ్ఞానభూమి అయితే బాగుంటుందనిన్నూ. మరి ఆయనమీదంత అభిమానం ఉంటే, మరి పార్లమెంటు చర్చలో ఈ మధ్యన ఓ దరిద్రుడు అర్జున్ సింగు, భోపాల్ విషయంలో ఆండర్ సన్ ని వదిలేయడంలో తప్పంతా శ్రీ పీ.వీ దే అన్నప్పుడు, ఏ ఒక్క తెలుగు రాజకీయనాయకుడికీ, ఆఖరికి ఏ ఒక్క బ్లాగరుకీ ఏమీ అనిపించలేదా, అనిపించినా ‘పోన్లెద్దూ మనకెందుకులే’ అని వదిలేశారా? బ్రతికున్నంతకాలం, ఆయన పేరుచెప్పుకుని పబ్బం గడుపుకున్నారు.

    ఊరేగింపులో ముందర ఓ పాతికమంది బ్యానర్లు పట్టుకుని వెళ్ళారు.అందరూ నడిచారో లేదో నేను చూడలేదు, కానీ నేనూ, వేణూ మాత్రం కలిసే నడిచాం.ఇంతలో కొంతమంది ప్రముఖులు, గాడీల్లో వచ్చి దారిలో ఉన్న టి.వీ. వాళ్ళకి ‘ బైట్లు’ ఇచ్చారు. పక్కనుంచే మేము ( నేనూ, వేణూ) వెళ్తున్నా, ఎవడూ మమ్మల్నేం ఆపి అడగలేదూ, మేము చెప్పాలేదూ!అందుకని దుధ్ధతో వ్రాస్తున్నానని అపోహ పడకండి! పాపం మధ్యలో స్వాతీ, ఇంకో సుజాతా మంచినీళ్ళ ప్యాకెట్లు కావాలా, నడవలేకపోతే, మా స్కూటీ ఎక్కండీ అని అడిగారు. థాంక్స్!<b. ఆ నీళ్ళ ప్యాకెట్టు తీసికుంటే, దాన్ని చించడానికి నాకు పళ్ళులేవూ, మళ్ళీ ఈగోలెందుకులే అని తీసికోలేదు!

    మొత్తానికి జ్ఞానభూమి దగ్గర ‘ కార్యక్రమం’ ముగిసిన తరువాత, వర్షం వచ్చేసింది. భాష మీద మన వారికున్న అభిమానాన్ని చూసేసరికి! అవి కన్నీళ్ళా, ఆనందభాష్పాలా మీరే నిర్ణయించండి!
అదేదో హొటల్ లో ‘కడుపునిండుగా’ బ్రంచ్ తీసికుని కొంపకి చేరాను. మొత్తానికి ఇదేదో బ్లాగర్ల సమావేశం లా ఉంది.మనందరికీ భాష మీద అభిమానం ఉండబట్టే తెలుగులో వ్రాస్తున్నాము.
ఆంధ్రదేశంలో ఎవడికి నచ్చినా, నచ్చకపోయినా సరే మనందరం ఇలాగే కొనసాగిద్దాం !! సర్వేజనాసుఖినోభవంతూ !

30 Responses

  1. బాబుగారూ!

    యెందుకండీ మనకి ఈ “……ఆయాసం?”

    బ్లాగుల్లో ప్రతీవాళ్లూ వాళ్లకి తోచింది వ్రాస్తున్నారు.

    మీరు అంతా ఐపోయాక యేదో మాట్లాడారని కోళ్లు కూస్తున్నాయి.

    సుజాత పాపం మంచి పిల్లే. మీకు వాటర్ పేకెట్లు ఇచ్చింది. కానీ తన వృత్తిధర్మం తాను నిర్వర్తించాలికదా!

    పోనీ లెండి. మనం నడుస్తూనే వుందాం మన తెలుగు కోసం.

    Like

  2. *ఆండర్ సన్ ని వదిలేయడంలో తప్పంతా శ్రీ పీ.వీ దే అన్నప్పుడు, ఏ ఒక్క తెలుగు రాజకీయనాయకుడికీ, ఆఖరికి ఏ ఒక్క బ్లాగరుకీ ఏమీ అనిపించలేదా, అనిపించినా ‘పోన్లెద్దూ మనకెందుకులే’ అని వదిలేశారా? *
    Please read thes two posts. Perfect analysis.

    భోపాల్ పాపాలు పీవీజీవేనా? – 1
    http://ammaodi.blogspot.com/2010/08/1.html
    భోపాల్ పాపాలు పీవీజీవేనా? – 2
    http://ammaodi.blogspot.com/2010/08/2.html
    http://ammaodi.blogspot.com/2010/07/blog-post_25.html

    Like

  3. హమ్మయ్య, నా గురించి ఏమీ రాయలేదు. బతికిపోయాను. అయినా నేనేదో మీకు మేలు చేయబోయి చెడ్డపేరు తెచ్చుకున్నాను. పిన్ని గారికి చెప్పి మీ సంగతి చూస్తాను. చిన్న వాడిని చేసి రెండు రోజులు ఆడుకున్నారు కదా సార్ భాగ్యనగరంలో.
    ఈ ఈ-తెలుగు వారు మీకు టీ షర్టు, సభ్యత్వం ఇచ్చారు. నా లాంటి వాళ్లకు రెండూ ఇవ్వలేదు. బ్రంచ్ కూడా ఇచ్చారా? కానివ్వండి సార్…కానివ్వండి. అల్లా ఉన్నాడు.
    రాము
    apmediakaburlu.blogspot.com

    Like

  4. శ్రీని ( అమ్మఒడి),

    ముందుగా క్షమించండి. ఏ కారణం చేతో నేను మీరు వ్రాసిన అద్భుతమైన రెండు టపాలూ చూడలేదు (ఇదివరలో). దేశంలో ఉన్న కోట్లాది తెలుగువారిలోనూ, మీరొక్కరే ఈ విషయం గురించి స్పందించారు ( పబ్లిక్కుగా). ఇంకోపర్యాయం ఎపాలజీ.

    Like

  5. బాగా చెప్పారు.

    Like

  6. అయ్యా నాకు అమ్మఓడి బ్లాగు కి ఎమీ సంభన్dam లేదు. ఆ టపాలు కొన్ని రోజుల క్రియం నేను మీలాగె చదివాను. మీరు పి.వి. గారి ని అంతా మరచి పోయారు అంటె లింక్ ఇచ్చాను అంతె. అదొకటే కాదు ఆమే చాలా బాగా పి.వి. గారి మీద వేసిన అభాండాన్ని తప్పు అని నిరూపించిది కూడాను. ఈ విధంగా ఎవ్వరు విశ్లేషణ చేయటం నేను ఎక్కడ చదవలేదు.

    Like

  7. ఆ అమ్మఒడి టపాలు, ఒపికగా చదవాలిగాని, చాలా సమాచారం ఉంటుంది వాటిలో

    Like

  8. ఖచ్చితంగా మీ అంత బాగా,వాస్తవికంగా నేను రాయలేదు. కొంతమంది ప్రముఖులు, గాడీల్లో వచ్చి దారిలో ఉన్న టి.వీ. వాళ్ళకి ‘ బైట్లు’ ఇచ్చారు! అనుకుంటూనే ఉన్నా ఇలాంటిదేదో మీరు రాస్తారని! ప్రముఖులు కాదూ పాడూ కాదు!వాళ్ల వాన్ వచ్చేసరికి మేమే కనపడ్డాం వాళ్ళకి! అంతే మేము మీ కంటే వెనకపడిపోయాం కదండీ మరి,నడుస్తూ వచ్చి మిమ్మల్ని కలవాలంటే అయ్యేపనిలా లేదు.అయినా సరే అని నడుస్తూ ఉంటే మా డ్రైవరొచ్చి “ఎక్కండి,వాళ్ళ దగ్గరికి త్వరగా చేరుస్తా”నన్నాడు. మిమ్మల్ని త్వరగా కలుసుకోవాలనే ఆశతో ఎక్కి వచ్చాము.

    (సరిగ్గా చెప్పానా లేదా?)

    మీతో గడిపిన సమయం చాలా ఆత్మీయంగా గడిచింది. ఎక్కడో బయట కాక, ఇంట్లో గడిపినట్లే ఉంది.

    కృష్ణశ్రీ గారూ,
    పని లేని కోళ్ళు వేళా పాళా లేకుండా కూసే కూతల్ని పట్టించుకోకండి!
    వాటి మానాన వాటిని వదిలేయండి. ఫణి బాబు గారు లేకపోతే ఆ నడక చాల నీరసంగా ఉండేది అనిపించింది. ఇంతకీ మీరెక్కడ? హైద్రాబాదు కాదా?

    రాముగారికి బ్లాగ్ముఖంగా క్షమాపణలు చెప్పినా, శాంతించేలా లేరు. కానివ్వండి! ఏం చేస్తాం! మా స్వయంకృతం!

    Like

  9. >>ఒక్కళ్ళకీ నా సర్వీసంత వయస్సు లేదు
    కొద్ది మంది మీకలా కనిపించి ఉంటారు 🙂

    Like

  10. సుజాత గారూ…
    మీరు క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు మేడం. మీ ప్రయత్నాలు మీరు చేశారు. మీరు, సతీషు చాలా కష్టపడ్డారు నాకు కనిపించినంత వరకు.
    మీకు అభినందనలు. స్వయంకృతం నాది.
    బాబాయ్ జి…నేను, తాడేపల్లి గారు మాట్లాడుతుండగా తీసిన ఫోటో నాకు పంపగలరా..నా మెయిల్ కు?
    కృతఙ్ఞతలు
    రాము

    Like

  11. >> ఈ -తెలుగు వారు మీకు టీ షర్టు, సభ్యత్వం ఇచ్చారు. నా లాంటి వాళ్లకు రెండూ ఇవ్వలేదు. బ్రంచ్ కూడా ఇచ్చారా? కానివ్వండి సార్…కానివ్వండి. >>

    రాము గారూ! మీరూ, నేనూ కాస్త లేటుగానే కదా అక్కడికి వెళ్ళాం? ఫణిబాబు గారిలాగే సకాలంలో వెళ్ళుంటే సభ్యత్వమూ, టీ షర్టూ ఇచ్చుండేవాళ్ళే కాదా? అలాగే మీరు మాలాగా నడక లో పాల్గొనివుంటే బ్రంచ్ కూడా ఇచ్చేవారు. ఏమంటారు? 🙂

    Like

  12. నమస్తే ఫణి బాబు గారు,

    మనం మనం “యూత్” అని ఆరోజే చెప్పాను. నా పేరు పక్కన శ్రీ ఏమిటండీ బాబు? నేనెంత? నా వయసెంత? మీరన్నట్లు “ఒక్కళ్ళకీ నా సర్వీసంత వయస్సు లేదు” అక్షర సత్యం. మీరు వచ్చిన తర్వాత కాస్త హుషారు వచ్చింది మాలో- తెలుగు బాట మొత్తం నడవలేరేమో అనుకున్నాను కానీ ఎంతైనా “యూత్” కదా- నడిచి చూపించారు…సంతోషం….
    ——————————
    పీవీ గారిపై నేను, నా స్నేహితురాలు కలిసి రాస్తున్న ఒక టపా లోని కొన్ని మాటలు:
    ———————————————————————
    “మనోహర్ లాంటి మూర్ఖుల గురించో..నిత్యానంద లాంటి
    గ్రేట్ స్వామీజీల గురించో…శ్యామలాంటి అనే ఊరూ పేరు లేని జోగినీ గురించో
    సెర్చ్ చేస్తే..వందల సంఖ్యలో లింక్స్ ఓపెన్ అవుతాయి. కానీ బహుభాషా
    కోవిదుడుగా, దేశాన్ని ఐదేళ్లు పరిపాలించిన తొలి కాంగ్రెసేతర
    ప్రధానమంత్రిగా, ఆర్థిక సంస్కరణలను అమలు చేసి గ్లోబలైజేషన్‌కు పునాదులు
    వేసిన పీవీ గురించి ఒక్క నిమిషం వీడియో కూడా దొరకలేదంటే ఆయనపై మన మీడియాకున్న ప్రేమేంటో అర్థమవుతోంది.”

    ఎక్కడో ఊర్లో తప్పిపోయిన గొర్రె
    గురించో…నిన్నగాక మొన్నపుట్టిన మహేష్ బాబు కొడుకు గురుంచో మనకు
    యూట్యూబ్‌లో వీడియోలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయి. కానీ…న్యూస్
    అప్‌డేట్స్ లో భాగంగా దివంగత ప్రధాని పీవీ వీడియోకోసం ఎంత వెదికినా కనిపిస్తేనా. తెలుగు జాతి ప్రతిష్టనే దేశ వ్యాప్తంగా చాటిచెప్పిన
    పీవీ నరసింహరావు గారిది ఒక్క సరైన వీడియో కూడా దొరకలేదంటే అంతకన్నా
    దౌర్భాగ్యం ఏముంటుందో.”
    ———————————————————————-
    @రాము గారు,

    అయ్యా-.సభ్యత్వం విషయమై నేను ఇంక ఏమీ మాట్లాడదలుచుకోలేదు… …జరిగిన విషయాలు మీతో చెప్పాను. మీరు వచ్చేటప్పటికే మనం వేయించిన 25 టీ-షర్ట్స్ లో ఓ ఐదు పోలీస్ బాబాయిలు దొబ్బేశారు. ఏమీ చెయ్యలేని పరిస్థితి…. మీరు, చక్రపాణి గారు, నందం నరేష్ చాలా సహాయం చేశారు.దానికి మరో సారి ధన్యవాదాలు….
    మీ కోపం ఎప్పుడు తగ్గుతుందో చెప్తే అప్పుడు వచ్చి కలుస్తాను….

    @వేణు గారు,

    అయ్యా-సంస్థకు ఎప్పుడు అవసరమైనా అడిగిన వెంటనే ఎంతో సహాయం చేసే మీకు సంస్థ తరఫున ధన్యవాదాలు….

    – ఆదివారం నాడు ఎంతో బిజీగా ఉండే మీరు మన కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరో సారి నెనర్లు.

    Like

  13. ” మీరు, సతీషు చాలా కష్టపడ్డారు నాకు కనిపించినంత వరకు.”- అయ్యా రాము గారు-

    సమయాభావం మించిపోవడం వల్ల మీకు కష్టపడుతూ కనిపించలేకపోయాం.

    ఈ సారి కార్యక్రమంలో మీరు చూస్తున్నప్పుడు చెప్పండి, మిగిలినవారందరం “సమయాభావం” మించిపోయినా కష్టపడి మీ కళ్ళల్లో పడతాం.!.

    ఒక్క విషయం- సమయాభావం మించిపోవడం వల్ల మీరు నడవలేకపోయారు 😦 కానీ నడిచుంటే మా కష్టం మీ కళ్ళ ముందు కనపడేది.
    🙂 🙂 🙂

    Like

  14. ఫణిబాబుగారు,
    మీరు చివరి వరకు నడిచి రావటం మాకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆనందాన్ని కూడా. మీరు మాకు తెలియనివారు ఎప్పుడూ కలవనివారు అనే ఊహకూడా రాలేదు మాకు. ఎవరు సహకరించినా లేకున్నా ఇలానే కొనసాగిద్దాం అన్న మీ మాట మాకు శిరీధార్యం.

    Like

  15. డియర్ సుజాత!

    ఆయ్! మాది ఐద్రాబాదు కాదండి. పచ్చింగోదారంటారు….అందులో నర్సాపురవండి.

    నిజెంజెప్పాలంటే ఐద్రాబాదంటే అసియ్యమండి……మన రాజధాని ఐనా!

    ఇదిగో….ఇలాంటి నడకలూ అవీ వుంటాయనే!

    పీవీ ఙ్ఞాన భూమి అంటే–ఆయన శవం సగం కాలి కుక్కలు పీక్కు తిన్న చోటేనా?

    సంతోషం!

    Like

  16. కశ్యపు గారు…
    కాస్త మీరు మీ ఫోన్ ఎత్తడం అనే పని ఒకటి మీరు చేస్తే…నేను ఎప్పుడు చూస్తానో మీకు తప్పకుండా తెలియజేస్తాను. మీ ఫోన్ నంబరు మారినట్లు సుజాత గారు చెప్పారు. ఈ సారి అది కూడా ట్రై చేస్తాను.
    మీరు నడవక ముందే….సమయాభావం మించిపోక ముందే….మీరు పడిన శ్రమ అక్కడ మాకు అర్థమయ్యింది. మీ శ్రమకు జోహార్లు. మీరు ఏమీ అనుకోను అంటే…మీరు పడిన శ్రమను నేను ఒక పోస్టు గా రాస్తాను.
    రాము

    Like

  17. ఆయన కాంగ్రెస్సేతర ప్రథాన మంత్రా?

    యెలాగ?

    Like

  18. Make no mistake. ఆ రోజు పి.వి.జ్ఞానభూమి దగ్గర విమర్శలకు దిగినది ఫణిబాబుగారు కాదు. పలనాడు ప్రాంతానికి చెందిన ఒక యువపండితుడు.

    Like

  19. తెలుగుబాటసారి గారు,

    “యువకుడు”అనండి చాలు! పండితుడో కాదో తర్వాత తేల్చుకోవచ్చు!

    Like

  20. కృష్ణశ్రీ గారూ,
    అయ్ బాబోయ్, పచ్చింగోదారే? ఆయ్, మా అత్తారూరు బీవారం పక్కనున్న ఉండీ లెండి. అన్నట్టు నేను నర్సాపురం కూడా చూశానడోయ్, రుస్తుం బాదలో మా పెద్దత్త గారుంటారు మరి! అంతేనా,ఇటేపు ఫంటెక్కి అటేపు సఖినేటిపల్లి లో దిగి మరీ అంతర్వేది వెళ్లాం ఒకసారి, అన్నాచెల్లెలి గట్టు చూడ్డానికి!

    పీవీ జ్ఞానభూమి అంటే అదే, మనోళ్ళు ఆయనకు “అశ్రద్ధాంజలి” ఘటించిన చోటే! చివరిగా ఆయనకు జ్ఞానోదయం అయిన చోటు! అప్పుడు అలా చేసిదానికి గుర్తుగా ఇప్పుడు ఒక పెద్ద తోట కట్టారక్కడ. సమాధికి నమస్కరించుకుని వచ్చేశాం , నేనూ సత్యవతి గారూ, ఇంకా మిత్రులూనూ!

    Like

  21. కృష్ణశ్రీ గారూ,

    నేనెవరినీ నొప్పించేటట్లు మాట్లాడలేదు.నా టపాలో వ్రాసింది నా అభిప్రాయాలు మాత్రమే. అవి ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలి.

    Like

  22. రామూ,

    ఎవరితోనూ చెప్పుకోనఖ్ఖర్లెదు! ఎవరు ఎవరితో ఆడుకున్నారో ఈ వేళ ఓ టపా వ్రాశాను!!

    Like

  23. సుజాతా,

    టీ షర్టుకీ, చాయ్ కీ, బ్రంచ్ కీ ధన్యవాదాలు. క్యాప్ ఇవ్వలెదు అది వేరే విషయం. ఏదో సరదాగా వ్రాస్తూంటాను. ప్రతీదీ పట్టించుకోకూడదు!

    Like

  24. రవిచంద్రా,

    ఉన్న యాభై మందిలోనూ, ఓ కర్రపుచ్చుకుని నడిచినాయనా, ఇంకొకాయనా,సమరయోధుడుగారూ తప్ప మిగిలినవారందరూ నలభై, ఏభై యేళ్ళవారిలాగ కనిపించారు! మరీ మేకప్పులు చేసికొచ్చారని అనుకోవడంలెదు!!

    Like

  25. మురళీధర్,

    నడవడం లో అంత వింతేమీ లేదండి బాబూ! నేను ద్విచక్రవాహనం (సైకిలు తో సహా) నడపడం నేర్చుకోలేదు. నడకే దిక్కు!

    Like

  26. సతీష్,

    ఎరక్కపోయి ‘పి.వి.గారి గురించి, ఒక్కరాజకీయనాయకుడూ అనబోయి,’బ్లాగర్లని కూడా కలిపాను.పైన శ్రీని ఇచ్చిన ‘అమ్మఒడి’ టపా, మీరూ మి మిత్రురాలూ వ్రాసిన టపా చూడలెదు.మీరూ నాలాగే స్పందించినందుకు సంతోషం.

    Like

  27. వేణూ,

    దేనికైనా పెట్టిపుట్టాలి నాయనా! ఆ intellectual తో అంతసేపు కబుర్లుచెప్పేటప్పటికి, హడిలిపోయి ఎవరికీ చెప్పకుండా స్లిప్ అయిపోతే ఎవరేం చేస్తారు! దేనికైనా ‘దంతసిరి’ ఉండాలి బాబూ !!

    Like

  28. బాబుగారూ!

    మీరెవరినీ నొప్పించారని నేను వ్రాయలేదు. మిగిలిన బ్లాగుల్లో ‘కూసిన కొన్ని కోళ్ల’ గురించి వ్రాస్తే, సుజాత వాటిని పట్టించుకోవద్దు అని చెప్పారు.

    తెలుగు బాటసారి ‘విమర్శలకు దిగినది…….యువ పండితుడు.’ అని కూడా వ్రాశారు.

    స్వతహాగా మీరెవరినీ నొప్పించగలరని అనుకోను.

    ధన్యవాదాలు.

    Like

  29. డియర్ సుజాత!

    ప గో జి తోనూ, నరసాపురం తోనూ మీకున్న అనుబంధానికి చాలా సంతోషం.

    నిజానికి మా యిల్లు రుస్తుంబాద పిల్లకాలువ ప్రక్కనే!

    మీవాళ్లందరూ నాకు తెలిసే వుంటారు. “మీవాళ్లని” తెలియదు అంతే!

    Like

  30. కృష్ణశ్రీ గారూ,

    ఆమాట చాలు. ధన్యవాదాలు.

    Like

Leave a comment