బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- రాకపోకలు

   ఇదివరకటి రోజుల్లో ఒకరితో ఒకరికి, సంబంధ భాంధవ్యాలు ఉండేవి. ఎవరింట్లోనైనా మంచికీ, చెడుకీ, ఎవరూ పిలవ్వలసిన అవసరం ఉండేది కాదు. ఎవరింటిలోనైనా కష్టం వచ్చిందని తెలిస్తే చాలు, కబురు పెట్టకపోయినా వచ్చేసి, వారి కష్టాల్లో పాలు పంచుకునేవారు. అలాగే ఏ శుభ కార్యమైనా సరే, బాధ్యతంతా తమమీద పెట్టుకుని, పని పూర్తిచేసేవారు.ప్రత్యేకంగా అడిగే అవసరం ఉండేది కాదు.పైగా,థాంక్స్ చెప్తే ‘ సర్లేవోయ్, మేమైనా పరాయివాళ్ళమా ఏమిటీ, నీ పిల్లోటీ,నాపిల్లోటీ నా ఏమిటీ’ అనేవారు.ఇప్పుడో సీనే పూర్తిగా మారిపోయింది. ఊళ్ళోవాళ్ళ సహాయం దేముడెరుగు,కన్న బిడ్డలే, కొంతమంది చెయ్యి చూపిస్తున్నారు! ఏ కట్నం డబ్బేనా,పెళ్ళిఖర్చులేనా తక్కువైతే, ‘మేమేమైనా అంత పెద్ద సంబంధం చూడమన్నామా’అని మొహం చాటేసికునే పిల్లల్ని కూడా చూస్తూంటాము! మనుష్యుల్లో ప్రవర్తన ఎంతలా మారిపోయిందో చెప్పడానికి వ్రాశాను.

ఆ గొడవ వదిలేయండి, ఎప్పుడైనా ఊళ్ళో ఉన్న ఓ స్నేహితుడింటికో, చుట్టాలింటికో వెళ్ళి కొంతసమయం గడిపివద్దామని వెళ్ళేమనుకుందాం. చాలా రోజులతరువాత కలుసుకోవడం వలన బాగానే ఉంటుంది. ఎప్పటెప్పటివో జ్ఞాపకాలు నెమరేసుకుని,రోజంతా గడుపుతారు.వచ్చేటప్పుడు, వీలున్నప్పుడు ఓ సారి మా ఇంటివైపుకూడా రండీ, అని చెప్తారు.వీళ్ళిద్దరిళ్ళూ, ఊరికి చెరోవైపూ ఉంటాయి, అది వేరే సంగతనుకోండి.అయినా శ్రమతీసికుని, రెండు బస్సులు మారి వచ్చేడాలేదా? అంతదూరం ఆటోల్లో వెళ్ళే ఓపికుండదు.అలాగని ప్రతీవారికీ,కార్లలో తీసికెళ్ళే కొడుకులూ, కూతుళ్ళూ ఉండరు. ఏదో స్నేహబంధంతో వెళ్ళడమే.మనం ఇంత శ్రమచేసికుని వెళ్ళేక,the minimum we expect ఏమిటంటే, వాళ్ళుకూడా ఓ సారి మనింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తారని. అబ్బే ఇక్కడే వస్తుంది గొడవ.ఆ తాపత్రయం అంతా మనకే ఉన్నట్లూ, అవతలివాళ్ళకేమీ లేనట్లూ తేలుతుంది.

కొందరిళ్ళకి భార్యాభర్తలిద్దరూ కలిసి వెళ్తారు. కొంతమంది ఇద్దరిలో ఒకరితోటే స్నేహం ఉండిఉండవచ్చు. అలాటప్పుడు, ఎవరి స్నేహితుడింటికి వాళ్ళు వెళ్తారు. కామన్ ఫ్యామిలీ ఫ్రెండయితే ఇద్దరూ కలిసి వెళ్తారు.ఎప్పుడో ఓసారి ఏ బజారులోనో
కనిపించి, ‘ ఏమండీ, మళ్ళీ మా ఇంటికి రానేలేదూ’ అంటే, ‘అసలు టైమే ఉండడంలేదండీ,మీలా కాదు, మీకేమిటీ హాయిగా ఉన్నారు, ప్రతీరోజూ ఏదో ఒకపనే, చూస్తానులెండి, ఎప్పుడో వీలు చేసికుని వస్తామూ‘అంటాడు. ఆ అనడం ఎలా అంటాడంటే, అక్కడికి తనకే పన్లున్నట్లూ,మనం రికామీగా తిరుగుతున్నట్లూ. అలాగని వాళ్ళేమీ ఎక్కడకూ వెళ్ళడంలేదనికాదు,మనింటికిందే ఉన్న మాల్ కి ప్రతీనెలా, ఏవేవో కొనుక్కోడానికి, వస్తూనే ఉంటారు, అయినా సరే మనింటికి రావడానికి బధ్ధకం. అదేదో రాకూడదనికాదు, వెళ్ళేదేమిట్లే అని ఓరకమైన ఫీలింగు.

కొంతమందుంటారు, వాళ్ళకి ఇలాటివేవీ పట్టవు. అవతలివాడు మన చుట్టం/స్నేహితుడు, వాడెల్లాఉన్నాడో తెలిసికోవడం మన ధర్మం-అంతే.వీళ్ళు ఓ ప్రత్యేకమైన వారు.ఆ వచ్చినాయనేమీ, మననుండి ఏదో ఆశించి రారు, మనింటికే కాదు, స్నేహితుడన్నవారెవరింటికైనా అలాగే వెళ్తారు. పాపం అమాయకప్రాణి, వాళ్ళావిడ ఎప్పుడో చివాట్లు పెట్టేదాకా మానడు.ఆవిడంటుందీ’ మీరే అస్తమానూ ఊరికే పూసుకు వెళ్తూంటారూ, వాళ్ళకి ఒక్కసారైనా మనింటికి వచ్చేరా’అంటూ.ఇదేదో ఆడవారికే ఉంటుందనడంలేదు,మగాళ్ళకీ ఉంటూంటుంది.

చెప్పొచ్చేదేమిటంటే, మన చుట్టమో,స్నేహితుడో మనింటికి వచ్చేరంటే, వీలున్నంత త్వరగా మనం కూడా reciprocate చేయాలి. అప్పుడే స్నేహాలూ, చుట్టరికాలూ నిలుస్తాయి.అవతలివాళ్ళకేదో పనీపాటూ లేక, మనింటికి వచ్చేరనుకోకూడదు, అలాగని మనకేదో వారితో పనితగిలినప్పుడు, ఫోన్లు చెయ్యడమూ ,వాళ్ళింటికి వెళ్ళడమూ కాదు.అస్తమానూ వాళ్ళింటికి వెళ్ళి కూర్చోమనికాదు, అప్పుడప్పుడైనా ఓ సారి ఫోన్నైనా చేసి, వారి యోగక్షేమాలు విచారించినా చాలు.లేకపోతే ఏమౌతుందంటే, మనమీద సొసైటీలో ఓ ఇమేజ్ ఏర్పడిపోతుంది-పనేమైనా ఉంటేనే, మనం అవతలివాళ్ళను పలకరిస్తామని! ఇది మన ఇంటికీ, వంటికీ మంచిది కాదు. కనీసం నలుగురు స్నేహితులైనా ఉండాలనేవారు ఓ పెద్దాయన. ఎందుకో కారణం తెలుసుగా !!

ఉద్యోగంలో ఉన్నప్పుడు నా స్నేహితుడోరుండేవారు క్వార్టర్స్ లోనే మాకు దగ్గరలో, వాళ్ళింటికి మేమిద్దరమూ ఎప్పుడు వెళ్ళినా సరే, ఏదో పేద్ద పనున్నట్లు బయటకెళ్ళిపోయేవాడు.అదే వాళ్ళ ఫోర్మన్నో, ఇంకో పెద్దాడో వస్తే మాత్రం అడుగులకి మడుగులొత్తేవాడు.వచ్చిన గొడవేమిటంటే, ఫాక్టరీలో,అతను నాకంటే ఓ మూడు నెలలు సీనియరులెండి.ఇలా ఉంటుంది కొంతమందితో,డ్యూటీ అయిపోయినతరువాతకూడా, వాళ్ళు వారి official status మర్చిపోరు.ఉద్యోగంలోఉన్నంతకాలమే మన వేషాలు. రిటైరయ్యినతరువాత ఎవడూ పట్టించుకోడు.అందరికీ వచ్చేది పెన్షనే! పదిమంది మనగురించి మంచి చెప్పుకునేటట్లుండాలి. అదే మన తరువాత మిగిలేది!

ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి- మీ ఇంటికి మా ఇల్లెంతదూరమో, మాఇంటికి మీ ఇల్లూ అంతే దూరం. అదేదో కిలోమీటర్లనికాదు,రాకపోకలగురించి. ఎవరైనా మనింటికి వచ్చారూ అంటే, వీలుచూసుకుని మనం కూడా వాళ్ళింటికి వెళ్తేనే బావుంటుంది. అంతేకానీ,వాళ్ళకేదో పనీపాటూ లేనట్లూ, మనమే ఏదో పేద్ద బిజీగా ఉన్నట్లూ పోజు పెడితే, అవసరం వచ్చినప్పుడు మన మొహం ఎవడూ చూడడు.
Relationships have to be maintained by both, then only they will flourish.