బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– కొత్త గొడవ….


    మొత్తానికి Nestle వారు noodles ని వెనక్కి ( అదీ తాత్కాలికంగా) తీసికున్నారుట. శుభం.. ప్రభుత్వాలు చేస్తూన్న ఈ “ నిషేధాల” వలన ఏదైనా ఒరుగుతుందంటారా? అంటే NO అనే సమాధానం వస్తుంది. దేశంలో వందలాది వస్తువులమీద ఇలాటి నిషేధాలు సవాలక్ష ఇప్పటికే ఉన్నాయి. అలాగని అవి లభించడం ఏమైనా ఆగిందా? హాయిగా కావాల్సినవారికి దొరుకుతూనే ఉన్నాయి. ఇదివరకటిరోజుల్లో, అంటే మద్యనిషెధం ఉన్నరోజుల్లో, సారాబట్టీలు అనేవి ఉండేవి. అలాగే మత్తు కలిగించే పదార్ధాల మీద కూడా నిషేధం ఉంది. అలాగని అవి దొరకడం లేదా? అలాగే 60- 70 లలో విదేశీ వస్తువుల మీద నిఘా ఉండేది. బంగారం, వాచీలూ, ఎలక్ట్రానిక్కు వస్తువుల మీద ఎన్నెన్ని నిషేధాలున్నా, హాయిగా దొరికేవి. అంతదాకా ఎందుకూ, సినిమాల సీడీ లు పైరసీ చేయకూడదూ అన్నారు, ఏ ఫుట్ పాత్ మీద చూసినా దొరుకుతాయి. సినిమా విడుదలతో సంబంధంలేదు. అదేదో “ ఘుట్కా” విషయమే తీసికోండి, తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. ఏ కిళ్ళీబడ్డీలో చూసినా వేళ్ళాడుతూ ఉంటాయి. మరి ప్రభుత్వ ఆర్డర్లు ఏ గంగలోకెళ్ళినట్టూ?

   అక్కడికేదో మన దేశంలో చట్టం అంటే అక్కడికేదో పెద్ద “గౌరవం “ ఉన్నట్టు మాట్టాడేస్తూంటారు, అందరూ. విమానాల్లో లైటర్లూ అవీ నిషేధం అన్నారు. దానికి ఓ “ గౌరవనీయ” కేంద్ర మంత్రిగారైతే… “ కొన్నేళ్ళనుండి నేనైతే సిగరెట్టూ, లైటరూ జేబులోనే పెట్టుకుంటున్నాను..” అని ఓ “ఘనకార్యం “ లా చెప్పుకున్నాడు. చిత్రం ఏమిటంటే, ఆయనగారే విమానాలూ గట్రా విభాగానికి మంత్రి. ఇలా ఉంటుంది.. చట్టాల దారి చట్టాలదే, నాయకుల దారి నాయకులదే… పర్వారణం మీదైతే లెక్కలేనన్ని చట్టాలున్నాయి. అలాగని అన్నీ పాటిస్తున్నారా? నదులలో నీళ్ళు ఎలా ఉన్నాయో చెప్పక్కర్లేదు.

    ఈ మాయదారివన్నీ దేశంలోకి ఎప్పుడొచ్చాయిట? ఇదివరకటిరోజుల్లో ఎప్పుడైనా విన్నామా అసలు? ఏదో “ గొల్లభామ “ మార్కు పాలడబ్బాతొ మొదలయిన Nestle వారు ప్రతీ దాంట్లోకీ వచ్చేశారు. ఈ జంక్ ఫుడ్ అన్నది ఓసారి రుచిచూశారా అంటే చాలు, వదిలేది లేదు. ఏం కలుపుతారో తెలియదు. అలాగని రాత్రికి రాత్రి ఏదో అయిపోతుందనీ కాదూ, మరీ అలా అయిపోతే వాళ్ళ వ్యాపారాలు పెరగొద్దూ, ఆరారగా తింటూండాలి, డబ్బులు తగలేస్తూండాలి, ఆరోగ్యాలు మంట కలుపుకుంటూండాలి… ఎంత కథా ఎంత కమామీషూ?

    ఎక్కడ చూసినా రెడీ మేడ్ తిళ్ళే. ఒళ్ళొంచి పనిచేయడానికి బధ్ధకం. ఓ ప్యాకెట్ పిల్లాడికిచ్చేస్తే, తినేసి పడుంటాడు. పైగా వాటిల్లో ఎకానమీ ప్యాక్కులూ, ఫామిలీ ప్యాక్కులూనూ. ఏదో మాయదారి బ్రాండు ఒకటి రావడం తరవాయి, మన సినిమావాళ్ళూ, లేదా ఆటగాళ్ళూ తెయ్యిమంటూ హోరెత్తేయించేయడం. రాత్రీ పగలూ. టీవీ ముందర కూర్చోడం తరవాయి, ఒకడేమో ఫలానాది తినమంటాడు, ఇంకోడేమో ఫలానా హౌసింగులో డబ్బెట్టమంటాడు, ఇంకోడు ఫలానా బట్టలసబ్బే వాడమంటాడు, ఇంకో చిత్రం ఏమిటంటే, ఆ బట్టలుతకమనేవాడు, సాధారణంగా సినిమాల్లో ఛాన్సొస్తే, పైబట్టలు విప్పేస్తాడు, కానీ ఈ బట్టలసబ్బు యాడ్ లో మాత్రం తీయడు. అంటే తనకే నమ్మకం లేనట్టా? అలాగే ఇంకోడు గిన్నెలు తోమే పవుడర్, Toilets లో వాడుకునే liquid ఇలా అర్ధం పర్ధం లేకుండా, డబ్బులొస్తున్నాయి కదా అని ఎడా పెడా వాగేయడం. అసలు ఆ వస్తువులు/ డ్రింకులు/ తిండి పదార్ధాలూ వాడిన మొహాలేనా అవి? వాడెమంటే నమ్మాలి.. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే చాలు, ఎవడెగంగలోకి పోయినా, వాళ్ళకేమీ నష్టం లేదు. కొన్నేళ్ళ క్రితం , మన భారతరత్నం గారు, అదేదో Hometrade అని ఓ కంపెనీకి ప్రకటనలు చేశాడు, తీరా నమ్మి డబ్బులు పెట్టినవాళ్ళందరికీ చిప్ప చేతికొచ్చింది. బాగుపడ్డవాళ్ళెవరయ్యా అంటే, భారతరత్నాలూ, సినిమా వాళ్ళూ, ఆ కంపెనీ వాళ్ళూనూ.

    ఈ నూడుల్స్ మాటలా ఉంచితే, ఇంకా చాలానే ఉన్నాయి. అవేవో బర్గర్లూ, పీజాలూ—ఎప్పుడో ఎవడొ వీళ్ళ వెనక్కాలకూడా పడతాడు. అసలు ఎవరో ఏదో చెప్పాలని కాకుండా, మనంతట మనమే ఓ నియంత్రణ పెట్టేసికోవచ్చుగా. నికమే, ఈరోజుల్లో ఎవరికీ టైముండడంలేదు, వంటా వార్పూ చేసికోడానికి, ఆ కారణం తోనే కదా, వీటన్నిటి వెనక్కాలా పడుతున్నది. తినొద్దని ఎవరూ అనరు. కానీ దానిక్కూడా ఓ లిమిటంటూ ఉండాలి. చాలామంది వైద్యం పేరుతో, ఓ “ చుక్క “ వేసికుంటారు. అలాగని వారి ఆరోగ్యాలు పాడైపోవడంలేదుగా, ఏదో “ ఔషధం” లాగ తీసికుంటారు.

    అఛ్ఛా, ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు న్యూడుల్స్ ని తీసేశారండి, రేపణ్ణుంచి తినడం మానేస్తారంటారా? ఇదివరకు పబ్లిక్ గా తినేవారు, ఇటుపైన చాటుగా తింటారు అంతే తేడా. మనదేశంలో ఏదైనా నిషేధించారంటే దానిమీద “ మోజు” ఎక్కువైపోతుంది. ఏది తీసికోండి, ఈ ఒరవడే కనిపిస్తుంది. అందులోనూ, చిన్నపిల్లలకి ఇన్నేళ్ళనుండీ అలవాటు చేసి, ఇప్పుడు మానేయమంటే అంత సుళువా? ఇంట్లో పెట్టకపోతే ఏ స్నేహితుడింటికో వెళ్ళి తింటాడు. పెద్దవారికే దిక్కులేదు, ఇంక చిన్నపిల్లల్ని నియంత్రించగలరంటారా? ఈవేళ టీవీల్లో దేశమంతా జరుగుతూన్న so called ఆందోళనలు చూపించారు. అందులో చిన్నపిల్లలందరూ ఆ మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లని మంటల్లో వేస్తున్నట్టు. టీవీల్లో కనిపిస్తారంటే, ఎవడైనా చేస్తాడు.పైగా అలా చేసినందుకు , ఫీజు గా ఓ పదిపదిహేను ప్యాకెట్ల మ్యాగీలిచ్చినా ఇచ్చుండొచ్చు. ఎవడు చూడొచ్చాడు? Endorsement లు చేసేవాళ్ళు డబ్బులు తీసికోవడం లేదూ, ఇదీ అలాగే…

    చివరగా ఇంకో సంగతి—బజారులో దొరికే నానా చెత్తా పిల్లలకి పెట్టొద్దని ఇళ్ళల్లో పెద్దవారు మొత్తుకుంటూనే ఉంటారు. వింటేగా… ఎవడో బయటివాడు చెప్తే అదే వేదవాక్కు…

   సర్వేజనా సుఖినోభవంతూ…

Advertisements

4 Responses

 1. > ” …….. ఫీజు గా ఓ పదిపదిహేను ప్యాకెట్ల మ్యాగీలిచ్చినా ఇచ్చుండొచ్చు. ఎవడు చూడొచ్చాడు? ”

  హ హ్హ హ్హ ఫణిబాబు గారూ, ఇప్పటి వాళ్ళ పరిభాషలో చెప్పాలంటే “సూపర్” (“గా” ఒక్కోసారి ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు) చెప్పారు మీరు. కార్పొరేట్లు ఎంతకైనా సమర్ధులే. (మీ టపాకి సంబంధంలేదు గాని, ప్రతి పదాన్నీ కురచ చేసే అలవాటున్న ఈకాలం వారికి “సూపర్” అంటే ఓ ఎరువుకి పొట్టిపదం అని తెలుసా అని ఈ పదం వాడకం చూసినప్పుడల్లా / విన్నప్పుడల్లా నాకు వచ్చే సందేహం. అదే మనకి తెలిసున్న “సూపర్ ఫాస్ఫేట్” ఎరువు).

  కేవలం నిషేధం విధిస్తే దొంగచాటు అమ్మకాలకి దారి తీయటం తప్పించి ఆశించిన ప్రయోజనమేమీ ఒనగూడదు. దేశంనుంచి మొత్తంగా బహిష్కరణే మార్గం. దానికి కావలసిన చిత్తశుద్ధి మన ప్రభుత్వానికి లేదు.

  అయినా ఓ కొత్త ఆహార ఉత్పాదనని మార్కెట్లో ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వ ఫుడ్ ఇన్ స్పెక్టర్ గారి అనుమతి అవసరం ఉండదంటారా (నాకు తెలియకే అడుగుతున్నాను)? మ్యాగీ మనదేశంలోకి వచ్చి నాకు గుర్తుండి 25 సంవత్సరాలు అయ్యుంటుంది. ఇంతకాలం ఎవరూ పట్టించుకోలేదు. మేరా భారత్ …..??……..

  Like

 2. అంతా విష్ణుమాయ. రెండ్రోజుల తరవాత అంతా మామూలే! అదేకదా మన భారత దేశం

  Like

 3. చ చ అనవసరం గా నెస్లే మీద పడి ఏడవడం మొదలెట్టారు ! మ్యాగీ అంత టేష్టైన తిండి వేరే ఏదన్నా ఉందా అంట ! ఇక మీదట సిటీ వాసులకి ఏమి గతి ? ఆఫీసు కి లేటు అయితే చెప్పు కోవడానికి కారణం టూ మినిట్ నూడుల్ లేక పోవడమే !

  ఇరవై ఐదు సమవత్సాల బట్టి మ్యాగీ తింటున్న భారత్ జిలేబి ఇప్పుడు ఇట్లా కాదూ కుదరదూ అంటే ఎట్లా ?!

  దీని వెనుక ఏమైనా ‘కుంభ’ కోణం ఉందా ? ఎవరికైనా నెస్లే నించి రావలసిన దస్కం రాకుండా పోయిందా ? అందుకే ఈ సడెన్ ఫ్లాష్ వచ్చిందా ? ఇది రాబోయే కాలం లో మరో తెహెల్కా యా ? లేక బోఫర్స్ కుంభ కోణమా ?

  ప్రశ్నలు వేయడం వరకు మాత్రమె మా వంతు 🙂

  జిలేబి

  Like

 4. నరసింహారావు గారూ,

  ధన్యవాదాలు… ఏదో ఈ గొడవంతా ” తాటాకు మంట” లా ఉంది. ఓ నెలరోజులు హడావిడి చేయడం, మళ్ళీ ఓ కొత్తపేరుతో మార్కెట్ లోకి రావడం తథ్యం. ఎలాటి ” చెత్త” అయినా స్వీకరించే “తరం” మనవాళ్ళది. ఇన్నేళ్ళలో ఎన్నెన్ని చూడలేదూ?

  శర్మగారూ,.

  నేను రెండు నెలలన్నాను, మీరైతే రెండురోజులన్నారు. మీమాటే నిజం అవొచ్చు…

  జిలేబీ,

  So…. s…a… d… నూడులాభిమానుల సంఘం తరపున ఓ ” దీక్ష” మొదలెట్టరాదూ? రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ దీక్షలే గా… వాటితో మీది మరోటి.. కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది. టీవీ చానెళ్ళవాళ్ళు , మీ ఇంటర్వ్యూకూడా తీసికుంటారు..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: