బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Wi-f ( e ) i


    దేనికైనా అలవాటు పడకూడదు కానీ, అలవాటంటూ పడ్డామా, అంతే సంగతి. అదో వ్యసనంలా తయారవుతుంది, “నల్ల మందు” లా. కానీ కొన్ని కొన్ని వ్యసనాలు , అదేదో సర్ఫ్ వారి యాడ్డులా “ మరక కూడా మంచిదే..” లాటి కోవలోకి వస్తాయి.అలాటిదే, ఈరోజుల్లో ప్ర్రతీవారికీ ఉండే “ అంతర్జాల శోధన”. యువతరం వారైతే, చేతిలో ఉండే smart phone తో ఏదో ఒకటి వెదుకుతూనే ఉంటారు. మన నోటినుండి మాట వచ్చిందంటే చాలు, ఇదివరకటి రోజుల్లోలాగ, వినేసి ఊరుకోరు. వెంటనే టక..టకా గూగులమ్మని అడిగేయడం. మన అదృష్టం బాగుందా, మనం చెప్పినదానిలోని లోటుపాట్లు, విడిగా చెప్తారు, లేకపోతే అక్కడికక్కడే వీధిన పెట్టేస్తారు.. ఇదేదో బాగానే ఉందని, వయసులో పెద్దవారు, అంటే నాలాటి అర్భకులన్నమాట, ఈ smart phone ల హడావిడి భరించలేక, ఏదో ఓ desktop నే నమ్ముకుని బతుకుతున్నారు. అంటే, BMW, Merc, Audi ఉంటున్న ఈ రోజుల్లో ఇంకా, Maruti 800 నే నమ్ముకున్నట్టన్నమాట. అంతర్జాలంలో కెలకడం ప్రారంభించినప్పటినుండీ, అంటే గత పదేళ్ళనుండీ, ఆ desktop తోనే కాలక్షేపం చేస్తున్నాను, పిల్లలు ఓ కొత్త Laptop ఇచ్చినా. ఊరికే అలంకారార్ధం గంధం సమర్పయామీ అన్నట్టు కాకుండా, దానికో ప్రింటరూ, కెమేరా అన్ని కూడా ఏర్పాటు చేశారు. పాతికేళ్ళ క్రితం కొన్న 286 లాగ, బోసిగా ఉంచకూడదుగా. మళ్ళీ వాటికో Broadband ఒకటుండొద్దూ, “ సూక్ష్మం లో మోక్షం “ అన్నట్టు, మన ప్రభుత్వ BSNL వారిదే తీసికున్నాను. ఏదో పనైపోతోంది. చవకలోనే అవుతోంది. Unlimited కి 500 అంటే చవకే కదా, ఈరోజుల్లో చూస్తే. అయినా అదేదో Laptop ఒకటుండడం వలనైతేనేమిటి, ఎప్పుడైనా ఏ ఊరైనా వెళ్తే “ పోజు” పెట్టి చూపించుకోడానికైతే నేమిటి, Idea వారి అదేదో డాంగిల్ ట అదోటి తీసికున్నాను. నేనేదో సుఖపడిపోతున్నానని మా ఇంటావిడ, ఇంట్లో నేనొకత్తినున్నానని మర్చిపోతున్నారా అంటే, తన ఫోనుకీ, అమ్మాయిచ్చిన Tab కీ కూడా, network mobility సదుపాయం తీసికున్నాను. కండిషను ఏమిటంటే, ఇంట్లో ఉన్నంతవరకూ BSNL wi-fi మాత్రమే ఉపయోగించాలీ అని, లేకపోతే బిల్లులు తడిపిమోపెడయిపోవూ ?

    ఏదో అప్పుడప్పుడు తప్పించి, BSNL వారి ధర్మమా అని ఇన్నాళ్ళూ కాలక్షేపానికి లోటేమీలేదు. అదేమిటో, గత రెండు నెలలుగా, తిప్పలు పెట్టడం ప్రారంభం అయింది. ఓ పదినిముషాలు పనిచేయడం, ఆగిపోవడం. నేనేమో 198 కి ఫోనుచేసి ఫిర్యాదు చేయడం. వాళ్ళేమో 1 నొక్కూ, 2 నొక్కూ, 3 నొక్కూ.. కాదూ అంటే # * తో ఓ పాతికపైన ఫిర్యాదులు వెళ్ళాయి.పైగా మొబైల్ లో ఓ sms ఫలానా నెంబరూ..అంటూ. నేను చేయడం, వారి wireman ఏదో చేయడం, బాగుపడడం, Exchange నుంచి ఓ ఫోనూ “ బాగుపడిందా..” అంటూ. కర్మకాలి ఆ టైములో పనిచేసేది, చేస్తోందీ అనడం తరవాయి, మళ్ళీ ఓ sms… “ your complaint no…. has been resolved..” అంటూ. పట్టుమని పదినిముషాలైనా కాకుండా, మళ్ళీ ఆగిపోవడం, నేనేమో మళ్ళీ 198 వాళ్ళతో రిజిస్టరు చేయడం. Action replay ప్రారంభం. విసుగెత్తిపోయిందంటే నమ్మండి, గ్యాసు సిలిండరు ఎప్పుడయిపోతుందో, గుండె కొట్టుకోడం ఎప్పుడాగిపోతుందో చెప్పలేమనేవారు… ఆ చిఠ్ఠా లోకి నా BSNL Broadband కూడా చేరిపోయింది. Standby గా అదేదో idea ది ఉందిగా, దానితో నా పని కానిచ్చేసుకునే వాడిని. మా ఇంటావిడకి కూడా, ఇంక wi-fi గురించి పట్టించుకోకుండా, ఇంట్లోకూడా ఆవిడ mobile network వాడుకోమని, ఓ “వరం” ఇచ్చేశాను. ఏదో అనుకోవడమే కానీ, నేను చెప్పాలా ఏమిటీ…. మనం చెప్పామూ అనుకోడం ఓ తుత్తి. నిజం చెప్పాలంటే, నేను ప్రతీరోజూ Facebook లో పెడుతూన్న సమాచారం తనే వెదికి పెడుతూంటుంది.అంతే కాకుండా, రోజంతా పాత పుస్తకాలు చదవడం, ఏదైనా విషయం ఉంటే, నాకు ఆ లింకు పంపడం.

   చెప్పొచ్చేదేమిటంటే, ప్రొద్దుటే లేవగానే , net ఉందో, లేదో చూసుకోడం, నూటికి తొంభై సార్లు ఉండేది కాదు. పోనీ 198 వాడితో రిజిస్టరు చేద్దామా అంటే, “ your complaint is already registered.. present status.. technical repair is in hand..” చచ్చినట్టు, ఎక్స్చేంజ్ కి వెళ్ళడం, నా గోడు చెప్పుకోడం, వాళ్ళేమో చేస్తాననడం. ప్రతీరోజూ ఇదో పనిగా తయారయింది. ఇంక ఇలా కాదని, పైఅధికారులకి చెప్తేనే కానీ, అయే పని కాదూ అనుకుని, ఆయనెవరో ఉంటే, వెళ్ళి ముందర నా గొడవంతా చెప్పాను. నా ఎదురుగుండానే, అందరినీ పిలిచి, విషయమేదో అడిగారు, వాళ్ళూ చెప్పారు. చివరకి ఆయన, అదేదో drop అంటే “చుక్కలు” కాదు, కిటికీలోంచి వైరు లాగి, కనెక్టు చేయమన్నారు. ఆ వైరుమాన్ వచ్చి మొత్తానికి అదేదో చేశాడు… కథ సుఖాంతం.

    ఏ గొడవా లేకుండా ఉంటే తోచడంలేదు. ప్రొద్దుటే లేవడం, నెట్ ఉందో లేదో చూసుకోడం.. ఎక్కడకి పోతుందీ.. లక్షణంగా ఉంది. అయినా అలవాటు పడ్డ ప్రాణం కదూ.. చివరకి మా ఇంటావిడ “ అస్తమానూ wi-fi ఉందా అని కాదు, wife గురించికూడా పట్టించుకోవాలి…” అని చివాట్లేసింది…
సర్వేజనా సుఖినోభవంతూ…

7 Responses

 1. Nice Post

  Like

 2. Aha!don’t forget your wife engaged with WIFI.

  Like

 3. స్వానుభవం ఐతేగాని తత్త్వం వంటబట్టదుట, చెల్లాయి చెప్పిన మాట నిజమేగా 🙂

  Like

 4. wife ని నమ్ము కోవాల్సిన ‘కాలమ్’ లో wifi ని నమ్ము కుంటున్నారన్న మాట 🙂

  జిలేబి

  Like

 5. చాలా బాగా వ్రాసారు!!

  Like

 6. Yidhedho maa kadha laage vundhe

  Like

 7. పానీ పూరి,

  చిరకాల దర్శనం… ధన్యవాదాలు..

  రమణారావు గారూ,
  ఎలా మర్చిపోతామండీ? అదీ ఈ వయసులో unthinkable..

  శర్మగారూ,
  తత్త్వం భేషుగ్గా వంటపట్టింది మహానుభావా…

  జిలేబీ,

  అంత ధైర్యమా.. అదీ 70 ఏళ్ళొచ్చిన తరువాత?

  డాక్టరు గారూ,

  థాంక్సండీ…

  రాధారావుగారూ,

  గుమ్మిడికాయదొంగ అంటే భుజాలు తడుమునునేవారికి లోటేముందీ? అంతా ” కాల మహిమ”.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: