బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఈముచ్చటెన్నాళ్ళో…


    గుర్తుండే ఉంటుంది, టెలిఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చిన రోజుల్లో, ఓ స్కీము మొదలెట్టారు. రాత్రి 11.00 నుండీ, ఉదయం 7.00 దాకా అనుకుంటా, సగం రేటుతో పనైపోయేది.. స్వంతరాష్ట్రంలో మాటెలా ఉన్నా, బయటి రాష్ట్రంలో ఉండే , చుట్టాలకీ, స్నేహితులకీ, హాయిగా సగంరేటుతో మాట్టాడేసేవారు. మనవైపు చాలామందికి ఓ అలవాటుంది, రాత్రి తొమ్మిదయేసరికల్లా పడకెక్కేయడమూ, ఏ తెల్లారుఝామునో లేవడమూనూ. అయినా , ఆరోజుల్లో తెలుగువారిళ్ళల్లో , మంచి మంచి అలవాట్లుండేవి. చదువుకునే పిల్లలు, తెల్లారకట్ల లేచి, చదువుకోవడం, అందులో ముఖ్యభాగం. ఈరోజుల్లోలాగ , ప్రొద్దుటే టిఫినీలూ అవీ ఉండేవి కావు. ఏ పొరుగూరినుండి చదువుకోవడానికి వచ్చే , పిల్లలు , దగ్గరలో ఉండే ఏ పాక హొటల్ లోనో ఇడ్లీలు తినేవారు. ఇంక స్వంతఇళ్ళల్లో, తల్లితండ్రుల అజమాయిషీలోనో, అన్నావదినల ఏడ్మినిస్ట్రేషన్లోనో ఉండేవాళ్ళకి, బ్రేక్ ఫాస్టులూ అవీ ఉండేవికావు. మహ అయితే, ఆవకాయ పెచ్చేసికుని, ఏ తరవాణీ అన్నమో పెట్టేవారు. తొమ్మిదయేసరికి హాయిగా భోజనం చేసేసి, స్కూళ్ళకీ కాలేజీలకీ వెళ్ళిపోవడం. రాత్రి రేడియోలో ఇంగ్లీషు వార్తలొచ్చేసరికి , లైట్లార్పేయాల్సిందే, ఈలోపులోనే ఏం చేసినా. తెల్లవారుఝామున నాలుగింటికల్లా పుస్తకం తెరవాల్సిందే. అలాటి క్రమశిక్షణలో పెరిగారు కాబట్టే, అవే అలవాటు పడిపోయారు. అందుకే చూడండి, 60 వ దశకానికి పూర్వం పుట్టిన వారందరిలోనూ ఇదే దినచర్య చూస్తూంటాము.

    ఈరోజుల్లో,కాలమానపరిస్థితులను బట్టి, నిద్రపోవడానికీ, మంచం మీదనుండి లేవడానికీ, ఓ టైమంటూ లేదు. ఉద్యోగాలూ అలాగే ఉన్నాయి.. ఏ అర్ధరాత్రో ఆఫీసునుండి రావడం, పొద్దెక్కినతరువాత లేవడం. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకి వెళ్ళేటట్టయితే, పరిస్థితి ఇంకా చిత్రంగా ఉంటుంది. మధ్యలో, పిల్లల దారి పిల్లలదీ, అందరూ కలిసేది ఏ శలవురోజున మాత్రమే. దానితో తిండి అలవాట్లు కూడా , చిత్రవిచిత్రంగా మారిపోయాయి, ఓ వరసా వావీ లేకుండా పోయింది.
ఏమిటో కానీ, దేనితోనో మొదలెట్టి, దేంట్లోకో వెళ్ళిపోయాను. ఇదివరకటి రోజుల్లోనే హాయిగా ఉండేది. వారానికి నాలుగైదు టపాల చొప్పున, నాలుగేళ్ళపాటు టపాలు టకటకా వ్రాసేసేవాడిని. టాపిక్కులు కూడా కావాల్సినన్నుండేవి. నా అదృష్టం కొద్దీ, నన్నూ, నా రాతలనీ అభిమానించేవారు కూడా చాలా మందే ఉండేవారు. 2014 తరువాత, కారణమేమిటో స్పష్టంగా చెప్పలేనుకానీ, బ్లాగులో టపాలు వ్రాయడం తగ్గిపోయింది. కానీ, అలనాడు నేను వ్రాసిన టపాలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుని, నన్నూ, నా టపాలనీ, తమ ఇంటర్వూ లలో ప్రస్తావించిన శ్రీ శ్యామలీయం గారికి మనసారా ధన్యవాదాలు చెప్పుకుందామని ఈ టపా.. శ్రీ శ్యామలీయం గారు తణుకులో పుట్టడమూ, అమలాపురం ఎస్.కే.బి.ఆర్ కాలేజీలో చదివారనీ చెప్పారు, వారి ఇంటర్వ్యూలో. అంతకంటే మంచి కారణం ఏముంటుంది చెప్పండి, నాకు ఆయనంటే ఇష్టం అని చెప్పడానికీ?
Thanks Shyamaliyam garu for the kind words you said, about me.

    తీరా రాద్దామని కూర్చునేసరికి, అసలు టాపిక్కే తట్టదే. కారణం మళ్ళీ కాలమానపరిస్థితులే. రాజకీయవాతావరణం గురించి పోనీ రాద్దామా అంటే, లేనిపోని చర్చలూ, గొడవలూ వస్తాయి. సరీగ్గా అప్పుడు తట్టింది ఓ విషయం- ఈమధ్యన మన ప్రభుత్వ టెలిఫోను సంస్థ వారు ప్రారంభించిన, రాత్రి 9.00 నుండీ, ఉదయం 7.00 వరకూ ఇస్తూన్న ఉచిత సేవ. పైగా ఏ నెట్ వర్క్ కైనా చేసేయొచ్చుట. ఆ విషయం తెలియచేస్తూ ఎస్.ఎం.ఎస్. లు కూడా పంపించారు. ఎందుకైనా మంచిదని ఫోను చేసి కూడా కనుక్కున్నాను లెండి.
ఈ రోజుల్లో యువతరానికి ఫోను ముఖ్యం కానీ, ఉచితమా కాదా అన్నదానితో పనిలేదు. పైగా బి.ఎస్. ఎన్.ఎల్ అంటే చిన్న చూపోటీ. ఇదనే కాదు, ప్రభుత్వరంగానికి సంబంధించిన ఏ సంస్థైనా సరే… దానిజోలికి వెళ్ళడం ఏదో పాపం చేసినంతగా బాధపడిపోతారు. ఎప్పుడు పడితే అప్పుడు, అంతర్జాలం లభించే సెల్ ఫోన్లూ, టాబ్లెట్లూ చేతులో ఉండగా, ఏదో ఫలానాటైమునుండి ఉచిత సేవలు వాడుకోడం ఎంత నామోషీ ? కానీ, ఇంకా “ పాతచింతకాయ పచ్చళ్ళు” ఉన్నారుగా, పాపం వాళ్ళందరికీ మాత్రం ఎంతో సంతోషంగా ఉంది. నేనూ, ఆ కోవకి చెందినవాడినే అని చెప్పుకోడానికి గర్వపడతాను. ఆ స్కీము వచ్చినప్పటినుండీ, రాత్రి తొమ్మిదయిందంటే చాలు, నేను కొంతసేపూ, మా ఇంటావిడ కొంతసేపూ వీటితోనే కబుర్లు చెప్పుకోవడం. కానీ వచ్చిన గొడవంతా ఎక్కడంటే, మనవైపునుండి చేసేవారు మాత్రం , తెల్లవారుఝామున ఫోన్లు చేయడం మాత్రం మానలేదు. మరీ అంత ప్రొద్దుటే కాకపోయినా, ఆరున్నర కూడా ‘పెందరాళే” లోకే వస్తుంది. అప్పటికింకా వెలుగైనా రాదాయె. కానీ అలవాటు పడిపోయాము.

    ఈ“ ముచ్చట “ ఎన్నాళ్ళుంటుందో చూడాలి. అసలు నిజంగా ఉచితమేనా, లేక ఎంతమంది ఉపయోగించుకుంటారో చూడడానికి ఈ స్కీము మొదలెట్టారా అన్నది వచ్చే బిల్లులో తేలిపోతుంది. అప్పటిదాకా, ఎడాపెడా ఉపయోగించేసికోడమే…
సర్వేజనా సుఖినోభవంతూ…

8 Responses

  1. మీ ఈ. నాటి బ్లాగ్ లో ప్రస్తావించిన BSNL వారి ఉచిత సేవల సౌకర్యం మాట ఎలాఉన్నా
    ఓ ఇద్దరి ప్రముఖ బ్లాగర్ల విశేషాలు తెలుసుకునే అవకాశం కలిగించారు
    ధన్యోస్మి .

    వారి ఇరువురి అభిప్రాయాలు నాకు బాగా నచ్చాయి

    1. తెలుగుబ్లాగు అంటే కాలక్షేపం సరుకు కాదు” అని అందరూ గర్వంగా అనుకునే రోజువస్తే సంతోషించే వాళ్ళల్లో నేను మొదటివాడిని.
    శ్యామలీయం గారు ఆశించినట్లుగా తెలుగు బ్లాగులు అభివృద్ధి చెందాలని ఆశిద్దాం. ఆ దిశగా అందరం కృషి చేద్దాం.

    ..తాడిగడప శ్యామలరావు

    2. – మీ బ్లాగు లక్ష్యం ?
    – సర్వే జనాః సుఖినో భవంతు.
    ……చిర్రావూరి భాస్కర శర్మ అనే మాచనవఝుల వేంకట దీక్షితులు.

    Like

  2. BSNL వారు చెప్పింది నిజమండి బాబూ! వాళ్ళమీద అంత అపనమ్మకం ఏర్పడిపోయింది, నిజం కూడా నమ్మలేనంతగా 🙂

    Like

  3. >>> >.. నా అదృష్టం కొద్దీ, నన్నూ, నా రాతలనీ అభిమానించేవారు కూడా చాలా మందే ఉండేవారు<<<<

    మా దురదృష్టం కొద్దీ,ఈ మధ్య బ్లాగులోళ్లు, బ్లాగు లోగిళ్ళు, బ్లాగుల్లో 'గిల్లు', జిల్లు, రాను రానూ తగ్గి పోతున్నాయి !

    వెంటనే మీరు డిసైడ్ అయి పొండీ, ఇక మీదట బ్లాగు లోకం లో రోజుకు రెండు టపాలు రాస్తానుస్మీ అని !

    చీర్స్
    జిలేబి
    (టపాలు ఉచితం గా వస్తే, కామెంట్లు ఫ్రీ!)

    Like

  4. అవునండీ. ఈ మధ్య మీ టపాలు తగ్గాయి. కాస్త జోరు పెంచండి, విషయంతో సత్కాలక్షేపం చేయించే మీ కబుర్లు ఆసక్తిగా చదువుకొనే వారు చాలా మందే ఉన్నారు కదా. ఇకపోతే తణుకులో పుట్టడమూ, అమలాపురం ఎస్.కే.బి.ఆర్ కాలేజీలో చదివటమూ కారణంగా మనకి బాదరాయణ సంబంధం అని తెలిసి ఆనందంగా ఉంది. నన్నిష్టపడే వారికి ఋణపడి ఉంటాను మరి – మైత్రి అన్నది గొప్ప అదృష్టం కదా.

    Like

  5. శాస్త్రిగారూ,
    ” . తెలుగుబ్లాగు అంటే కాలక్షేపం సరుకు కాదు” అని అందరూ గర్వంగా అనుకునే రోజువస్తే సంతోషించే వాళ్ళల్లో నేను మొదటివాడిని.” ఇదేనండి సారూ నాకు భయం !! నేనేమో వ్రాసేది “కాలక్షేపం ” కబుర్లాయె. శ్రీ శ్యామలరావు, శ్రీ శర్మగారి స్థాయికి తూగవు.
    శర్మ గారూ,
    మీరేమో “స్వామిభక్తి” కారణం గా బిఎస్ ఎన్ ఎల్ ని నమ్మమంటారు. కానీ, ఎవరి అనుమానాలు వారికి ఉంటాయిగా…

    జిలేబీ,
    మరీ రోజుకి రెండేసి వ్రాసే సామర్ధ్యం లేదు కానీ, వారానికి కనీసం ఓ నాలుగైదయినా వ్రాయాలని, బుధ్ధైతే పుట్టింది… చూద్దాం…

    శ్యామలరావుగారూ,

    బ్లాగులోకంలో నాలాటి ” జోకర్లు” కూడా ఉండాలిగా, కాలక్షేపం కోసం ! అంతకంటే మరో కారణం కనిపించదు, నా టపాలు అంతమంది చదవడానికి. అందుకోసమైనా ఇటుపైన టపాలు వ్రాయాలనే నిశ్చయించుకున్నాను. చదువరులందరూ సుఖపడిపోతే ఎలా?
    ” బాదరాయణ ” సంబంధం కలిగినందుకు సంతోషంగా ఉంది.

    Like

    • ‘కాలక్షేపం’ అనేమాటకి బ్లాగుల్లో చిరునామా నాదేనన్న సంగతి, ఆశీర్వదించి బ్లాగులోకి ముందుకు తోసిన మీకు తెలియదా 🙂 కాలక్షేపం మాటకి ఎంత డిమాండ్ వచ్చిందండీ 🙂

      Like

  6. ఫణిబాబు గారూ మంచి టపా వ్రాసారు.
    BSNL పట్ల కష్టేఫలే శర్మ గారికి మీరన్నట్లు “స్వామిభక్తి” ఉండటం సహజమే కదా 🙂 అయితే ఈ విషయంలో “స్వామిభక్తి” వర్తించని నేను కూడా BSNL కే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తాను. నాకు అవసరమైన సేవలు / సౌకర్యాలు ప్రభుత్వరంగ సంస్ధలు ఇస్తుంటే నేను ఆ ప్రభుత్వరంగ సంస్ధల్నే ఎంచుకుంటాను.నామట్టుకు నేను ఖర్చు పెట్టే ఆ రూపాయి డబ్బులు ప్రభుత్వ ఖజానాకే వెళ్ళాలని ప్రయత్నిస్తుంటాను. అందుకే నా ఫోన్లు, బ్రాడ్ బాండ్ కూడా BSNL వారివే (కష్టేఫలే శర్మగారు తరచూ అంటుంటారు నెట్ వస్తూ పోతూ ఉందని. చిన్న ఊళ్ళల్లో కరెంటు కోతలు ఎక్కువ కాబట్టి బహుశా అలా అంతరాయం కలుగుతుంటుందేమో మరి).
    మరో కారణం – ప్రైవేట్ రంగ వ్యాపారుల మీద నాకు డెవలప్ అయిన అపనమ్మకం. మార్కెటింగ్ కోసం చేసే హంగూ, ఆర్భాటం, అడ్వర్టైజ్ మెంట్ల హైప్ తప్పించి వారు చేసే వాగ్దానాల్లో, స్పందనలో నిజాయితీ తక్కువ అని నా అభిప్రాయం. వారికి కస్టమర్ గా బుట్టలో పడేసుకునేంత వరకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ మాట్లాడతారు. ఆ తర్వాత ప్రోబ్లం వస్తే వారి కస్టమర్లకి కష్టాలే ఎక్కువ. వాళ్ళ so called Customer Care Centre / Helpline ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పైగా సమస్య పరిష్కరించబడటం లేదని వాళ్ళ సంస్ధలో పైవాడితో మాట్లాడదామనుకుంటే వాళ్ళ పేర్లు గాని, ఫోన్ నెంబర్లు గాని దొరకవు / ఇవ్వరు. వాళ్ళ వెబ్ సైట్ లో ఏదో “నోడల్ ఆఫీసర్” అంటారు; వాళ్ళకి ఫోన్ చేస్తే తియ్యరు, ఈమెయిళ్ళకి జవాబివ్వరు – మహా అయితే ఓ ఆటో రిప్లై వస్తుంది. మరి ఈ private sector సూపర్వైజర్లు, మేనేజర్లు కస్టమర్లతో మాట్లాడటానికి భయపడి లోపలెక్కడో దాక్కుంటారనుకోవాలా? అదే ప్రభుత్వరంగ సంస్ధల్లో అయితే మనకి కనీసం పైఅధికారిని కలుసుకోవటానికి, మాట్లాడటానికీ అడ్డంకులేమీ ఉండవు (ఆ సంస్ధలు BSNL అవనీండి, పోస్టాఫీసు అవనీండి, ప్రభుత్వరంగ బ్యాంకులవనీండి, ఎలక్ట్రిసిటీ ఆఫీసు కానివ్వండి, RTC కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, etc).
    యువతరమేమో ఈ ప్రైవేటురంగ వ్యాపారుల మోజులో బాగా పడిపోయింది. ఈ తరం వారి పై మీ విసుర్లు అక్షరాలా నిజం. కానీ ఈ ఆలోచనా ధోరణి ఇప్పటికే పాతుకుపోయిందని చెప్పాలి.

    Like

  7. నరసింహారావు గారూ,
    నేనుకూడా, మీలాగే ప్రభుత్వ సంస్థలతోనే లావాదేవీలు పెట్టుకుంటాను. శ్రీ శర్మగారిచ్చిన చనువు మూలాన, అలా వ్రాశానంతే. SBI లో పెన్షనూ, BSNL లో టెలిఫోనూ ఎప్పుడైనా No 1 అనే నాఉద్దేశ్యం. అప్పుడప్పుడు వీరి సేవలు చిరాకు తెప్పిస్తూంటాయి. ఉదాహరణకి, నా broadband నెలలో కనీసం ఓ వారం వస్తూ..పోతూ.. ఉంటుంది. నేను complaint చేయడం, వారు చేయడం. అలాగే SBI ATM లు , ఛస్తే డబ్బులుండవు. ఇంకోదానికి వెళ్ళి డబ్బులు తీసికుంటే, వెంటనే ఓ sms వస్తుంది, మా ATM లు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అక్కడికేదో ” పాపం” చేసినట్టు.అయినా వాళ్ళతోనే లాగించేయడం లేదూ ?
    I prefer Government Agencies only.

    Like

Leave a comment