బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ” మన పని అయిపోయింది.. చాల్లెద్దూ…”


    ఇదివరకటి రోజుల్లో ఎవడైనా , ఏ సరుకైనా ఎరువుకి తీసికెళ్తే, ఆ వస్తువు మనకి తిరిగిరావడమనేది, మన అదృష్టం మీద ఆధారపడి ఉండేది. అధవా, ఎప్పుడైనా కనిపించినా , అసలు ఓ వస్తువు తీసికున్నట్టే గుర్తులేదన్నట్టు మొహం పెట్టేవారు. పోనీ , ఆ వస్తువులు ఏమైనా విలువైనవా అంటే అదీ కాదు. కానీ, అవసరాన్ని బట్టి వాటికి విలువ కూడా ఎక్కువే. అవసరం వచ్చినప్పుడే కదా తెలిసేది వాటి విలువ. ఉదాహరణకి , బూజులు దులుపునే కర్ర, వేసవికాలంలో, మామిడికాయలు కోసుకోడానికి చిక్కం తో ఉన్న కర్ర, అలాగే ఆవకాయకాయ లకి మడత కత్తిపీట, నూతిలో చేద పడిపోతే తీయడానికి గేలం, పనసపొట్టు కొట్టడానికి కత్తి, సత్యన్నారాయణ పూజకి దేవుడి పీటా, మర్చేపోయాను నిచ్చెన ఒకటీ… ఇలా చెప్పుకుంటూ పోతే, ఇవన్నీ నిత్యావసరాల్లోకి రావు, కానీ ఏదైనా అవసరమంటూ ఉంటే, పైచెప్పిన వస్తువులన్నీ ఉండాలే. ఎప్పుడో అవసరానికి ఉపయోగిస్తాయి కదా అని, వాటన్నిటినీ కొనరు కదా. ఏ పక్కింటి పరోపకారి పాపన్ననో అడిగితే పనైపోయేదానికి, ఈ “ చిల్లర” వస్తువులన్నీ ఇంట్లో పెట్టికోవడం దేనికీ అనుకోవడం.

పైచెప్పినవే కాకుండా, కొద్దిగా స్థాయి పెంచి, ఓ సైకిలో, కాలక్రమంలో ఓ స్కూటరో, కాదూ అంటే, కూతురి పెళ్ళిచూపులున్నాయని నగా నట్రా కూడా ఎరువుతీసికునేవారు చాలామందే ఉండేవారు. ఆరోజుల్లో అడిగేవారున్నట్టే, అడగడం తరవాయి ఇచ్చేవారుకూడా ఉండేవారు.. కానీ, పనైపోయిన తరువాత ఇవ్వడం అనేది, సునాయసంగా మర్చిపోవడం. అదికూడా మర్చిపోయారనడంకంటే, అడిగితే ఇద్దాములే అనే ఓ స్వభావం. ఎవరైతే అడగ్గానే ఇచ్చారో, వాళ్ళకీ అవసరం ఉంటుందేమో, లేదా మనలాటివాళ్ళకింకోరికివ్వాల్సొస్తుందేమో అనేది మాత్రం ఛస్తే తట్టదు.. సంఘంలో ఇలాటి “ పక్షులు” కోకొల్లలు.

అవసరం వచ్చినా అడగడానికి మొహమ్మాట పడతాడు పరోపకారి పాపన్న గారు. ఎంతో అవసరం ఉండే పాపం, ఆయన తీసికెళ్ళాడూ, ఇంకా పని అయుండదు అనుకోడం. అడగడానికి మొహమ్మాటం, ఇంక ఆ తీసికెళ్ళినాయనంటారా, పనైపోగానే, అదేదో “అంటరాని వస్తువు” లా ఓ మూలన పడేయడం. అడిగినప్పుడే చూద్దాం అనుకోవడం. తీరా అడిగేసరికి “ అర్రే మర్చేపోయాను.. అవసరం ఉంటే మీరే అడుగుతారని చూస్తున్నాను.. “ అని కొడుకునో, కూతురునో పిలిచి “ అక్కడ పెరట్లో మాస్టారి తుప్పుపట్టేసిన గేలం/ చిక్కం చిరిగిపోయిన కర్ర/ పనసపొట్టు కొట్టినప్పుడు పూసిన నూనె మరకలతో కత్తీ/ ఇలా చెప్పుకుంటూ పోతే, నామరూపాలు మారిపోయిన వస్తువు….. తీసికునిరా” అని ఆర్డరు వేస్తాడు. తీసికున్న వస్తువు శుభ్రపరిచి ఇద్దామూ అనే ఇంగిత జ్ఞానం మాత్రం ఉండదు. మన పనైపోయింది కదా అనేదే ముఖ్యం. ఇవన్నీ పాతరోజులు.

ఈ రోజుల్లో నూతులూ లేవు, మామిడి చెట్లూ లేవు, పనసకాయలూ లేవాయె. అంతా instant యుగం. అలాటివి కాకపోతే ఇంకోటి. అవసరాలూ, స్వభావాలు మాత్రం అలాగే నిరాటంకంగా సాగిపోతున్నాయి. ప్రస్తుతం అంతా సమాచార యుగం. దానితో, మహానగరాల్లో కొన్ని సంస్థలు Just Dial లాటివి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. “ గూగులమ్మ” అయితే ఉండనే ఉంది. కానీ వాటిని ఉపయోగించుకోడానికి బధ్ధకం ఒక కారణమైతే, అడగడం తరవాయి, చెప్పడానికి సిధ్ధంగా ఉండే వెర్రిబాగులోళ్ళు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు, ఎన్నాళ్ళైనా ఉంటూనే ఉంటారు..

కొత్తగా ఏదైనా ఉద్యోగార్ధం ఊరెళ్తే, అక్కడ ఆబ్దీకాలు, పెట్టేవారో, మడిగా వంటలు చేసేవారో కావాల్సొస్తుంది, మరి ఆ వివరాలు ఆ Just Dial ని అడిగితే వారికేం తెలుస్తుందీ? ఎవరికో ఫోను చేసి అడగడం, ఆయనేమో అడగడమే మహాభాగ్యంగా భావించేసి, ఏవో రెండు మూడు ఫోనునెంబర్లూ అవీ చెప్పడం. అంతవరకూ బాగానే ఉంది, కానీ, వచ్చిన గొడవల్లా ఏమిటంటే, కనీసం పని అయినతరువాతైనా ఒకసారి తిరిగి ఫోను చేసి, చెప్తే వీళ్ళ సొమ్మేపోయిందో అర్ధం అవదు. అదేదో ఆజన్మాంతం ఋణపడిపోయి ఉండాలని కాకపోయినా, కనీసం వారిచ్చిన సమాచారం ఇంకొకరికి కూడా చెప్పొచ్చూ అని, ఆ సమాచారం ఇచ్చినాయన సంతోషిస్తాడూ అని ఎందుకు తట్టదో. కొంతమందికి తెలిసిన వైద్యుడి సమాచారం అవసరం రావొచ్చు. కొంతమందికి ఏదో వస్తువో, ఓ పుస్తకమో అవసరం రావొచ్చు. అవసరానికి గుర్తొచ్చిన వారికి, ఓ follow up గా, పనైపోయిన తరువాత తిరిగి చెప్పడంలో వీరికొచ్చిన నష్టం ఏమిటో? ఇలాటివాటన్నిటికీ కావాల్సింది సంస్కారం. ఏదో “మన పని అయిపోయిందిగా, మళ్ళీ చెప్పేదేమిటీ, ఫోను ఖర్చు తప్పా..” అనుకునేవారిని ఏమీ చేయలేము.. కానీ నష్టపోయేది వారే అని గుర్తించాలి. ఇచ్చేవాడి చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుందనేది జగమెరిగిన సత్యం.

చెప్పొచ్చేదేమిటంటే, ఎవరైనా సరే, ఎప్పుడైనా ఓ సమాచారం ఇంకొకరినుండి తెలిసికున్నప్పుడు, , కనీసం ఆ పని పూర్తయిన తరువాత ఒక్కటంటే ఒక్క ఫోను చేసి తెలియచేయండి. థాంక్స్ కాదు ఆశించేది అవతలివారు, తను ఇచ్చిన సమాచారం సరైనదేనా, కాదా అని తెలిసికోడానికి మాత్రమే అని తెలిసికుంటే, మానవసంబంధాలు ఇంకా పెరుగుతాయి.

సర్వేజనాసుఖినోభవంతూ…

2 Responses

 1. మానవనైజం ఫణిబాబు గారూ.

  ఈకోవ లోనిదే మరో ఉదాహరణ. మారేజ్ బ్యూరోల్లో తమ కొడుకు పేరో, కూతురి పేరో రిజిస్టర్ చేయించుకుని, సంబంధాల లిస్టులు తీసుకువెళ్ళేవారు పెళ్ళి కుదిరిన తర్వాత ఆ బ్యూరో వారికి సమాచారం ఇవ్వరు చాలామంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తూ ఓ sms పంపించినా సరిపోతుంది. అసలు శుభలేఖ ఇచ్చి ఆ బ్యూరోవారిని కూడా పెళ్ళికి ఆహ్వానించటం ఉత్తమమైన పని, రెండు విధాలా పనికొస్తుంది. ఈ సమాచారం అందకపోవటం వల్ల సంబంధాలు వెతుక్కునే వేరే వారు వివాహం అయిపోయినవారికే ప్రొపోజ్ చేస్తూ ఫోన్లు చేస్తుండటం సర్వసాధారణం.

  మీరు చెప్పినట్లు తమ పని అయిపోతే చాలనుకునేవారే ఎక్కువ. టపా బాగుంది.

  Like

 2. నరసింహారావు గారూ,

  మీరు ప్రస్తావించిన మారేజ్ బ్యూరోలతో అనుభవం లేనిమూలాన, వాటిగురించి వ్రాయలేదు. సరుకులయితేనేమిటి, ఇంకోటేదో అయితేనేమిటి, ” మూలసూత్రం ” ఒకటే !! మన పనైపోయింది.. చాల్లెద్దూ…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: