బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఈముచ్చటెన్నాళ్ళో…

    గుర్తుండే ఉంటుంది, టెలిఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చిన రోజుల్లో, ఓ స్కీము మొదలెట్టారు. రాత్రి 11.00 నుండీ, ఉదయం 7.00 దాకా అనుకుంటా, సగం రేటుతో పనైపోయేది.. స్వంతరాష్ట్రంలో మాటెలా ఉన్నా, బయటి రాష్ట్రంలో ఉండే , చుట్టాలకీ, స్నేహితులకీ, హాయిగా సగంరేటుతో మాట్టాడేసేవారు. మనవైపు చాలామందికి ఓ అలవాటుంది, రాత్రి తొమ్మిదయేసరికల్లా పడకెక్కేయడమూ, ఏ తెల్లారుఝామునో లేవడమూనూ. అయినా , ఆరోజుల్లో తెలుగువారిళ్ళల్లో , మంచి మంచి అలవాట్లుండేవి. చదువుకునే పిల్లలు, తెల్లారకట్ల లేచి, చదువుకోవడం, అందులో ముఖ్యభాగం. ఈరోజుల్లోలాగ , ప్రొద్దుటే టిఫినీలూ అవీ ఉండేవి కావు. ఏ పొరుగూరినుండి చదువుకోవడానికి వచ్చే , పిల్లలు , దగ్గరలో ఉండే ఏ పాక హొటల్ లోనో ఇడ్లీలు తినేవారు. ఇంక స్వంతఇళ్ళల్లో, తల్లితండ్రుల అజమాయిషీలోనో, అన్నావదినల ఏడ్మినిస్ట్రేషన్లోనో ఉండేవాళ్ళకి, బ్రేక్ ఫాస్టులూ అవీ ఉండేవికావు. మహ అయితే, ఆవకాయ పెచ్చేసికుని, ఏ తరవాణీ అన్నమో పెట్టేవారు. తొమ్మిదయేసరికి హాయిగా భోజనం చేసేసి, స్కూళ్ళకీ కాలేజీలకీ వెళ్ళిపోవడం. రాత్రి రేడియోలో ఇంగ్లీషు వార్తలొచ్చేసరికి , లైట్లార్పేయాల్సిందే, ఈలోపులోనే ఏం చేసినా. తెల్లవారుఝామున నాలుగింటికల్లా పుస్తకం తెరవాల్సిందే. అలాటి క్రమశిక్షణలో పెరిగారు కాబట్టే, అవే అలవాటు పడిపోయారు. అందుకే చూడండి, 60 వ దశకానికి పూర్వం పుట్టిన వారందరిలోనూ ఇదే దినచర్య చూస్తూంటాము.

    ఈరోజుల్లో,కాలమానపరిస్థితులను బట్టి, నిద్రపోవడానికీ, మంచం మీదనుండి లేవడానికీ, ఓ టైమంటూ లేదు. ఉద్యోగాలూ అలాగే ఉన్నాయి.. ఏ అర్ధరాత్రో ఆఫీసునుండి రావడం, పొద్దెక్కినతరువాత లేవడం. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకి వెళ్ళేటట్టయితే, పరిస్థితి ఇంకా చిత్రంగా ఉంటుంది. మధ్యలో, పిల్లల దారి పిల్లలదీ, అందరూ కలిసేది ఏ శలవురోజున మాత్రమే. దానితో తిండి అలవాట్లు కూడా , చిత్రవిచిత్రంగా మారిపోయాయి, ఓ వరసా వావీ లేకుండా పోయింది.
ఏమిటో కానీ, దేనితోనో మొదలెట్టి, దేంట్లోకో వెళ్ళిపోయాను. ఇదివరకటి రోజుల్లోనే హాయిగా ఉండేది. వారానికి నాలుగైదు టపాల చొప్పున, నాలుగేళ్ళపాటు టపాలు టకటకా వ్రాసేసేవాడిని. టాపిక్కులు కూడా కావాల్సినన్నుండేవి. నా అదృష్టం కొద్దీ, నన్నూ, నా రాతలనీ అభిమానించేవారు కూడా చాలా మందే ఉండేవారు. 2014 తరువాత, కారణమేమిటో స్పష్టంగా చెప్పలేనుకానీ, బ్లాగులో టపాలు వ్రాయడం తగ్గిపోయింది. కానీ, అలనాడు నేను వ్రాసిన టపాలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుని, నన్నూ, నా టపాలనీ, తమ ఇంటర్వూ లలో ప్రస్తావించిన శ్రీ శ్యామలీయం గారికి మనసారా ధన్యవాదాలు చెప్పుకుందామని ఈ టపా.. శ్రీ శ్యామలీయం గారు తణుకులో పుట్టడమూ, అమలాపురం ఎస్.కే.బి.ఆర్ కాలేజీలో చదివారనీ చెప్పారు, వారి ఇంటర్వ్యూలో. అంతకంటే మంచి కారణం ఏముంటుంది చెప్పండి, నాకు ఆయనంటే ఇష్టం అని చెప్పడానికీ?
Thanks Shyamaliyam garu for the kind words you said, about me.

    తీరా రాద్దామని కూర్చునేసరికి, అసలు టాపిక్కే తట్టదే. కారణం మళ్ళీ కాలమానపరిస్థితులే. రాజకీయవాతావరణం గురించి పోనీ రాద్దామా అంటే, లేనిపోని చర్చలూ, గొడవలూ వస్తాయి. సరీగ్గా అప్పుడు తట్టింది ఓ విషయం- ఈమధ్యన మన ప్రభుత్వ టెలిఫోను సంస్థ వారు ప్రారంభించిన, రాత్రి 9.00 నుండీ, ఉదయం 7.00 వరకూ ఇస్తూన్న ఉచిత సేవ. పైగా ఏ నెట్ వర్క్ కైనా చేసేయొచ్చుట. ఆ విషయం తెలియచేస్తూ ఎస్.ఎం.ఎస్. లు కూడా పంపించారు. ఎందుకైనా మంచిదని ఫోను చేసి కూడా కనుక్కున్నాను లెండి.
ఈ రోజుల్లో యువతరానికి ఫోను ముఖ్యం కానీ, ఉచితమా కాదా అన్నదానితో పనిలేదు. పైగా బి.ఎస్. ఎన్.ఎల్ అంటే చిన్న చూపోటీ. ఇదనే కాదు, ప్రభుత్వరంగానికి సంబంధించిన ఏ సంస్థైనా సరే… దానిజోలికి వెళ్ళడం ఏదో పాపం చేసినంతగా బాధపడిపోతారు. ఎప్పుడు పడితే అప్పుడు, అంతర్జాలం లభించే సెల్ ఫోన్లూ, టాబ్లెట్లూ చేతులో ఉండగా, ఏదో ఫలానాటైమునుండి ఉచిత సేవలు వాడుకోడం ఎంత నామోషీ ? కానీ, ఇంకా “ పాతచింతకాయ పచ్చళ్ళు” ఉన్నారుగా, పాపం వాళ్ళందరికీ మాత్రం ఎంతో సంతోషంగా ఉంది. నేనూ, ఆ కోవకి చెందినవాడినే అని చెప్పుకోడానికి గర్వపడతాను. ఆ స్కీము వచ్చినప్పటినుండీ, రాత్రి తొమ్మిదయిందంటే చాలు, నేను కొంతసేపూ, మా ఇంటావిడ కొంతసేపూ వీటితోనే కబుర్లు చెప్పుకోవడం. కానీ వచ్చిన గొడవంతా ఎక్కడంటే, మనవైపునుండి చేసేవారు మాత్రం , తెల్లవారుఝామున ఫోన్లు చేయడం మాత్రం మానలేదు. మరీ అంత ప్రొద్దుటే కాకపోయినా, ఆరున్నర కూడా ‘పెందరాళే” లోకే వస్తుంది. అప్పటికింకా వెలుగైనా రాదాయె. కానీ అలవాటు పడిపోయాము.

    ఈ“ ముచ్చట “ ఎన్నాళ్ళుంటుందో చూడాలి. అసలు నిజంగా ఉచితమేనా, లేక ఎంతమంది ఉపయోగించుకుంటారో చూడడానికి ఈ స్కీము మొదలెట్టారా అన్నది వచ్చే బిల్లులో తేలిపోతుంది. అప్పటిదాకా, ఎడాపెడా ఉపయోగించేసికోడమే…
సర్వేజనా సుఖినోభవంతూ…

%d bloggers like this: