బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–గృహసూత్రాలు–1


    నేను ఈ మధ్యన వ్రాస్తున్న కొన్ని బ్లాగ్గులు చదివి, మా ఇంటావిడ,’అస్తమానూ నేనే ఏదో మిమ్మల్ని హింసిస్తున్నట్లు వ్రాస్తున్నారూ, మీరు చేసే ఘనకార్యాల గురించి ఏమీ వ్రాయరే ‘ అని ఓ డోసు ఇచ్చేసింది.’రాముడు మంచిబాలుడు’లాగ అవేవో నేనే రాసేస్తే మంచిదీ,లేకపోతే తను అప్పుడప్పుడు చెసే కందా బచ్చలి కూరలాటిది చేయడం మానేస్తుందేమో అనే ‘భయం’ తో ఈ పోస్ట్ !

   స్వతహాగా నేను బుధ్ధిమంతుడినే.కానీ ఒక్కొక్కప్పుడు కొన్ని పనులు తను చెప్పినవి చేయడం మర్చిపోతూంటాను.గత 37 సంవత్సరాలనుండీ, నా జీతం ఎంతో, ప్రస్తుతం పెన్షన్ ఎంతో తనకి తెలియదు ! చాలా సార్లు అనుకున్నాను,పొన్లే తనకీ చెప్తే సంతోషిస్తుందీ అని. అదేమిటో ఎప్పుడూ సందర్భం కలిసి రాలేదు.చాలా సార్లు తనే అడిగింది-ఎవరైనా అడిగితే నాకు తెలియదూ అంటే నమ్మరూ, వివరాలు చెప్పకూడదా అని.అదేం పేద్ద ఎక్జిక్యూటివ్స్ కి వచ్చేటంత కాదూ, ఏదో మనకి సరిపోతుందీ, ‘నీకు కావలిసినది చెప్పు, తెస్తాను అని ప్రతీసారీ దాటేస్తుంటాను.అదేదో తననుండి దాచుదామని కాదు, జస్ట్ లైక్ దట్ ! కారణం ఏమీ చెప్పలేను. ఈ విషయం మీద మాత్రమే మా ఇద్దరికీ ఒక్కొక్కప్పుడు హోరాహోరీ
మాటలు దొర్లుతూంటాయి.అయినా ఇన్నాళ్ళూ లాగించేశాము. !!

   ఏదో ఇల్లు తుడుస్తూనో, బూజులు దులుపుతూనో ఏదో ఫలానా వస్తువు అయిపోయిందీ అంటుంది,బజారుకెళ్ళినప్పుడు నా అదృష్టం బాగోక, తను అడిగిన ఆ వస్తువొక్కటీ తేవడం మర్చిపోతాను.అంతే ఇంటికి రాగానే నామీద ఝూం అంటూ
కోప్పడేస్తుంది ‘నేను చెప్పాను ప్రత్యేకంగా కాబట్టి, తీసికొని రావఖ్ఖర్లేదు, అవసరం లేనివన్నీ మాత్రం గుర్తుంటాయి...’అని. తను ఎలాగా అన్ని పనులూ చేస్తుంది కాబట్టి, నన్నోసారి ‘కోలిన్’ పెట్టి, ఫ్రిజ్, మైక్రోవేవ్,టి.వి లాటివి తుడవమంటుంది. ఆ టైములో నేనేదో కంప్యూటర్ లో చూస్తూండి, ఆ విషయం మర్చిపోతాను.తన పనులన్ని పూర్తిచేసికొని, కోలిన్ పెట్టి తుడిచారా అంటుంది,రియాక్షన్ తెలుసుగా, నేను ఓ వెర్రి మొహం పెట్టి, లేదూ అంటాను.ఇంటికి ఇంత చాకిరీ చేస్తున్నాను,నడుం నొప్పి అని, ఓ చిన్న పని చెప్తే,‘పెళ్ళాం చెప్పిందీ, చేసేదేమిటిలే అని మానేశారు కదూ ‘ అంటుంది.

   తను బ్రేక్ఫాస్ట్ పూజా పునస్కారాలయిన తరువాత, ఆలశ్యంగా తీసికుంటుంది, నేనేమో ప్రొద్దుటే లేవగానే,స్నానం చేసిన తరువాత తీసేసుకుంటాను. సహజంగా 12.30 కి ఆకలెస్తుందికదండీ,తనుమాత్రం అంతకు కొంచెం పూర్వమే బ్రేక్ఫాస్ట్ తీసికున్న మనిషీ. నాతో తినేయమంటే ఎలాగ తింటుందీ?ఇవన్నీ ఆలోచించకుండా, టేబిల్ మీద కంచాలూ,వంట పాత్రలూ అన్నీ సద్దేస్తాను. అంతే మళ్ళీ ధూం ధాం అంటుంది.ఇంకా ఆరోజుకి ఎడమొహం పెడమొహం పెట్టుకుని, ఎవరి తిండి వాళ్ళదే. పోనీ అలాగని ఏమైనా ఇంప్రూవ్మెంటుందా అంటే, పురిటి వైరాగ్యం లాగ మళ్ళీ మర్నాడు ఇదే రంధి!!

   ఏదో పేద్ద పనిచేసేవాడిలాగ,ఏదేదో పొడిచేద్దామని, తనని ఇంప్రెస్స్ చేసేద్దామని, కోలిన్ పెట్టి ముందర, బయట సరుకులన్నీ తుడిచేసి, తను పూజ చేసికునేదాకా ఆగి ( తను చూడకపోతే ఎలా?) అప్పుడు, కిచెన్ లో ఉన్న ఫ్రిజ్జీ, మైక్రోవేవూ, తుడవడం మొదలెడతాను. ఇంతా చేస్తే థుస్స్ మనిపించేస్తుంది, మీరేమీ చెయ్యఖ్ఖర్లేదు, ప్రొద్దుటే అన్నీ చేసేశాను అంటుంది. ఏదో గొప్పగా పోజిద్దామనుకుంటే ఫ్లాప్ షో అవుతూంటుంది.

    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నని కన్ఫెస్ చేయాలో!!అయినా ఇవాళ్టికి ఇవి చాల్లెండి.ఊరికే నవ్వేసుకోకండి, ప్రపంచంలో అందరు భర్తలకీ ఇలాటి అనుభవాలే. చెప్పుకోవడానికి మొహమ్మాట పడతారు.

9 Responses

  1. అయ్యా. నేను కూడా పొద్దున్నే లేచి స్నానాదికాలు కాగానే చక్కగా “లాగించే” మనిషినే. నా జీతమెంతో ఇప్పటివరకూ మా ఆవిడకు తెలియదు. ఇతర విషయాల్లో మా ఆవిడ అమ్మగారి లాటిదే. అయితే ఇంకేం భేష్ – నీ పరిస్థితి కూడా నాదేనోయి అంటారు. 🙂 ఇప్పుడు ఇంకా చిన్నవారం కాబట్టి ఫరవాలా. మీ వయస్సుకు వచ్చాక నేనెన్ని “కన్ఫెస్సులు” చెయ్యాలో. హరోం హరహర మహాదేవ. జై కపిరాజా

    Like

  2. శాస్త్రీ,
    బుధ్ధిమంతుడివి (నా లాగ!)కాబట్టి ఒప్పేసుకున్నావు.అప్పుడే ఏమయింది?ముందుంది ముసళ్ళపండగ !!

    Like

  3. మీ మగాళ్ళున్నారే..
    మీ తప్పుల గురించి రాస్తానని మొదలెట్టి, ఇందులొ కూడా ఆవిడ నేరాలే Bold చేసి మరీ రాసారు .
    హమ్మా..కనుక్కోలెమనుకున్నారా.
    మా ఆడవాళ్ళందరమూ ఘట్టిగా ఖండిస్తున్నాం

    Like

  4. రాణీ,
    నిజంగా నేను గమనించలెదు.అసంకల్పిత ప్రతీకారచర్య అంటారే అలాగ అయిపోయింది!!

    Like

  5. >>>కందా బచ్చలి కూరలాటిది చేయడం మానేస్తుందేమో అనే ‘భయం’ తో ఈ పోస్ట్ !
    తను పూజ చేసికునేదాకా ఆగి ( తను చూడకపోతే ఎలా?) >>
    ఇలా వ్రాసి నవ్వించటంలో మీకు మీరే సాటి సార్.
    ఇకనైనా ఆమె చెప్పిన పనులు మన్స్పూర్తిగా చేస్తారని ఆశిస్తున్నాను.

    Like

  6. భవానీ,
    ఇప్పుడేమిటీ,37 సంవత్సరాలనుండీ,నచ్చినా, నచ్చకపోయినా చేస్తూనే ఉన్నాను.ఎదో ఇప్పుడు మీలాటి వారి సహాయ సానుభూతులున్నాయని ఇలా బయటకి చెప్పుకోగలుగుతున్నాను !!

    Like

  7. మీరిద్దరూ “మిధునం” కధలోని దంపతుల్లా ఉన్నారే!
    అన్నట్టు కంద-బచ్చలి కూర నాకు చాలా ఇష్టమండి.
    మీరు ఈసారి రాజమండ్రి వచ్చినప్పుడు చెప్పండి. మీ ఇంటికి వస్తాం.

    Like

  8. బోనగిరీ,

    రాజమండ్రీ లో పూర్తిగా మకాం ఎత్తేసి,పూణే వచ్చేశామండి.ఇక్కడకూడా నాకు ప్రియతమమైన ‘బచ్చలి కూర’ దానిలోకి కావలిసిన ‘కంద’ దొరుకుతాయి.ఎప్పుడైనా సరే మీరు రావొచ్చు !!

    Like

  9. Many thanks for your invitation sir.

    Like