బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-కొంతమంది చేసికున్న అదృష్టం!!

    ఈ మధ్యన బయటకు బస్సులో గానీ, లోకల్ ట్రైన్ లో గానీ వెళ్తున్నప్పుడు చూస్తూంటాను–చిన్న చిన్న పిల్లలు 5 ఏళ్ళవాళ్ళుకూడా, ఒక్కళ్ళూ స్కూలికో, ఇంకెక్కడికో వెళ్ళడం చూస్తూంటే బలే ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఉద్యోగంలో చేరేవరకూ అంటే 18 ఏళ్ళు వయస్సు వచ్చేవరకూ, ఒక్కడినీ ఎప్పుడూ ఎక్కడికీ అంటే బయట ఊళ్ళకి వెళ్ళనిచ్చేవారు కాదు.ఇప్పటి వాళ్ళని చూస్తూంటే బలే ముద్దొస్తూంటుంది.

   మా రోజుల్లో స్కూలునుండి ఎప్పుడైనా ఎక్స్కర్షన్ కి వెళ్ళాలంటే, వరదలొచ్చినప్పుడు గోదావరీ ( గట్టుమీద దాకానే), లేకపోతే రాజమండ్రీ పేపర్ మిల్లూ, జైలూ. జైలు మాత్రం రెండు సార్లు చూశాను( అంటే దాంట్లో పెట్టారని కాదు), ఎక్స్కర్షన్ ద్వారానండిబాబూ.ప్రొద్దుటే వెళ్తే సాయంత్రానికి వచ్చేయడమే. ఆ మర్నాడు చూసివచ్చిన దానిమీద ఓ కాంపోజిషన్ వ్రాయమనేవారు, అదొక్కటే బాగుండేది కాదు !!కాలెజీ కి వచ్చిన తరువాత బైయాలజీ, జూఆలజీ వాళ్ళూ ఎక్కెడెక్కడికో , అవేవో ఆకులూ, అలమలూ చూడ్డానికి వెళ్ళేవాళ్ళు. లెఖ్ఖల వాళ్ళం కాబట్టి అలాటివేమీ
ఉండేవి కావు. దానితో ఏమయ్యిందంటే అదేదో ఈస్థటిక్ సెన్స్ అంటారు, అది నాకు వంటబట్టలేదు.అలాటిది ఉండాలంటే పెట్టిపుట్టాలండి బాబూ. అప్పుడెప్పుడో అమ్మాయీ, అల్లుడూ మమ్మల్ని,
తాజ్ మహలూ అవీ చూపించడానికి తీసికెళ్ళారు.అంతకుముందరే రెండు మూడు సార్లు ఆగ్రావెళ్ళాను ఒక్కడినీ ( ఫాక్టరీ పనిమీద). ఆగ్రాదాకా వెళ్ళి తాజ్ మహల్ చూడలేదంటే తిడతారని భయం!! అందుకోసమని అక్కడికి వెళ్ళాను.అక్కడ ఫోటోలు తీసేవాళ్ళు, మన వెనక్కాల పడి, అన్ని రకాల ఫోజుల్లోనూ ఫోటోలు తీస్తామంటారు. మనం తాజ్ మీద ఉన్నట్ళూ, తాజ్ మన చేతిల్లో ఉన్నట్లూ వగైరా వగైరా..అవన్నీ తీయించుకున్నాను, వెళ్ళినట్లు ఫ్రూఫ్ ఉండాలిగా, పైగా తాజ్ చూసివచ్చామంటే అదో స్టేటస్ సింబలూ. నాకైతే తాజ్ ఏమీ పేద్దగొప్పగా అనిపించలేదు, అలా అంటే డొక్క చీరేస్తారు. అందువలన ఏవేవో మాటలు చెప్పవలసివచ్చింది ‘ఇట్ వజ్ బ్యూటిఫుల్’నథింగ్ లైక్ దట్ ఇన్ ద వల్డ్ ‘ (అక్కడికి ప్రపంచంలో ఉన్నవన్నీ చూసేసినట్లు!!).ఇలాటి ఫాల్తూ ఖబుర్లు చెప్పెసి తీయించుకున్న ఫొటోలు చూపిస్తే గొడవ వదిలిపోతుంది !!

    అందుకనే ఎక్కడికైనా వెళ్ళడానికి అంత ముందుండను. మా ఇంటావిడకి అలా కాదే. తనకి ఈ ఈస్థటిక్ వ్యవహారం ఎక్కువ. ప్రతీదాంట్లోనూ అదేదో కనిపిస్తూంటుంది. ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ, ఎక్కడికీ వెళ్ళలెదు. పిల్లలూ, చదువులూ అంటూ వెర్రిమొర్రి వంకలు పెట్టి.ఎప్పుడైనా వెళ్ళినా తిరుపతీ, లేకపోతే ఇంటికీ ను.ఇప్పుడనిపిస్తూంది, నన్ను ఎలా భరించారో అని!!
మేము ఎప్పుడైనా ఇంటికి వెళ్ళవలసి వస్తే, విజయవాడ దాకా ట్రైన్ లో వెళ్ళి, అక్కడినుండి బస్సులో తణుకు వెళ్ళేవాళ్ళం.స్టేషన్ లో దిగ్గానే, పోనీ ఆటోలో వెళ్ళొచ్చుగా, అబ్బే, అదేమిటో సైకిల్ రిక్షాలోనే ఆపసోపాలు పడుతూ, మేమూ, సామాన్లూ,ఇద్దరుపిల్లలతో బస్ స్టాండ్ దాకా వెళ్ళడం. అసలు ఆటోలో హాయిగా వెళ్ళొచ్చూ అనే ఆలోచన ఎందుకు వచ్చేది కాదో? తణుకు బస్ స్టాండ్ లో దిగి, మళ్ళీ సైకిల్ రిక్షా !! అప్పుడప్పుడు మా పిల్లలు ఇప్పుడు అడెగుతూంటారు–‘డాడీ ఆంధ్రాలో ఇంకా సైకిల్ రిక్షాలున్నాయా’అని.చెప్పానుకదండీ, మానసికంగా ఎదగాలంటే
ఎంతో పుణ్యం చేసికోవాలి.నాలాటి వాళ్ళు ఎప్పుడూ ఎదగలెరు.పోనీ జీవితంలో చేయవలసినవి అన్నీ పూర్తయ్యాయికదా, ఇప్పుడైనా సుఖపడొచ్చుగా, అబ్బే, ఇప్పటికీ బయటకు నేను ఒక్కడినీ వెళ్ళవలసివస్తే, నడకా,బస్సూ, లెక లోకలూ. అంతేకానీ ఎప్పుడూ ఒక్కడినీ ఆటో ఎక్కను. కొంతమందికి సుఖపడే యోగం ఉండదుట.మా ఇంటావిడనిమాత్రం ఎప్పుడూ ఆటోలోనే తీసికెళ్తానండోయ్.

    ఇప్పుడు పూణే వచ్చేసిన తరువాత, టైమున్నప్పుడు, వీకెండ్స్ లో ఎప్పుడైనా పిల్లలు ఎక్కెడెక్కడికో తీసికెళ్తూంట్టారు.వాళ్ళతో పాటు వెళ్ళడం,’ఆహా ఓహో ‘అనడం తప్పించి, నా బుర్రలో ఏమీ పడదు.అందులో వాళ్ళందరికీ కనిపించే అందాలు అదేమిటో నాకు చచ్చినా కనపడవు.నా దారిన నేనేదో పడిఉంటాను. మా ఇంటావిడకైతే ఆ ప్రకృతి చూసేటప్పడికి ఇంక ఒళ్ళు తెలియదు.పోన్లే పిల్లలద్వారా అయినా తన కోరికలు తీరుతున్నాయీ అనుకుంటూంటాను.

   ప్రతీ భార్యా, తన భర్తతో స్కూటర్ మీదైనా,కారులోనైనా, ఆఖరికి సైకిలు మీదైనా వెళ్ళాలనిఉంటుంది. తను చేసికున్న అదృష్టమేమిటో, నాకు సైకిలు కూడా రాదు.అందువలన ఆ కోరిక కూడా తీరలేదు!!