బాతాఖాని – లక్ష్మిఫణి కబుర్లు– Return of the native…

 ఏడాదైపోతోంది, బ్లాగులవైపు చూసి… అలాగని రాయడం మానేసానా అంటే అదీకాదూ… జస్ట్ బధ్ధకం..  ఈ ఏడాదిలోనూ   కొన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రం లోనూ ఎన్నికలు జరిగాయి.. ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.. కేంద్రంలోనూ, తెలంగాణా లోనూ , పాతవారే తిరిగి ప్రభుత్వాలు ఏర్పాటు చేసారు, ఆంధ్రరాష్ట్రంలో, కొత్త ప్రభుత్వం..

 పాత పార్టీయే తిరిగి ఎన్నికైనప్పుడు ఓ పేద్ద  disadvantage  ఉంటుంది, పాతవాళ్ళని తిట్టడానికి వీలుండదు.. ఆ తిట్టడాలూ, తప్పులు పాతవారిమీదకి తోసేయడాలూ, వీళ్ళు వారి మొదటి అయిదేళ్ళలోనూ చేసేసారు. ఇప్పుడు ఏమైనా లోటుపాట్లుంటే, అదంతా గత అయిదేళ్ళలోనూ, వీళ్ళ నిర్వాకమే కదా.. సాధారణంగా కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు, ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంటుంది, కారణం, తిరిగి అధికారంలోకి రావడానికి పాతప్రభుత్వం,  ఎడాపెడా, సంక్షేమ కార్యక్రమాల పేరిట, డబ్బు ఉదారంగా ఖర్చుపెట్టేస్తారు… ఖజానా ఖాళీగా ఉండడంతో , ఎన్నికలవాగ్దానాలు అమలు చేయడానికి డబ్బులుండవాయే.. దానితో ప్రతీదానిమీదా పన్నుల మోత మొదలూ.. మరో చిత్రం ఏమిటంటే, ఈ సంక్షేమపథకాలకి అర్హులు  Only BPL ( Below Poverty Line ).. వీళ్ళకిచ్చేదంతా మధ్యతరగతివారు కట్టే టాక్సుకే..  అందువలన ప్రభుత్వం వడ్డించే టాక్సులవలన ఆ  BPL  వాళ్ళకి వచ్చేనష్టం ఏమీ ఉండదు. ఎంత చెప్పినా మనది  Welfare State  కదా. 

 ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి– ఒకే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే , కొన్ని లాభాలుకూడా ఉంటాయి. ఉదాహరణకి, మొదటి దఫా పాలనలో ప్రారంభించిన ప్రాజెక్టులకి ముక్తీ మోక్షం ఉంటాయి.. అలా కాకుండా కొత్తవాడొస్తే, as a matter of principle  పాతవాటిని ఆపేయడమో, మార్పులు చేయడమో చూస్తూంటాము.

 ఎన్నికల ప్రచారాల్లో పాపం ప్రతీ పార్టీ వాళ్ళూ, ఎదురుపార్టీమీద బురదజల్లడంలోనే బిజీ గా ఉంటూంటారు. నోటికొచ్చిందల్లా వాగి వీధినపడిపోతూంటారు.. ఈ ప్రసంగాల మీద పరువునష్టం కేసులూ గట్రా ఉండవు అదేం చిత్రమో… పైగా అవతలివాడేదో వాగేడని కూడా పట్టించుకోరు. అదో కాలక్షెపం..ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి … ఏదో  public consumption  కోసం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు కానీ, పాపం ఎన్నికలయిన తరువాత, ఒకళ్ళ వీపులు మరొకరు గోక్కుంటారు..  అసలు ఓ విషయమైతే ఛస్తే అర్ధం అవదు.. ఓ  particular  నాయకుడు, ఏవేవో అరాచకాలు చేసేడంటారు, మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలుసు.. అయినా సరే అధికారంలో ఉన్న అయిదేళ్ళూ వీళ్ళకి చీమకుట్టినట్టైనా ఉండదు.. ఏదో ప్రజల్ని ఊరుకోపెట్టడానికి ఏవేవో  Special Investigation Teams  వేసామంటారు. ఉత్తుత్తిదే…

ప్రపంచంలో మొత్తానికి  largest Democracy  మనదేనట.ఒకవైపు చూస్తే, కేంద్రం లోనూ, రెండు తెలుగురాష్ట్రాల్లోనూ కూడా ఒకే పార్టీకి ఊహించని మెజారిటీ లభించింది… ప్రతిపక్షం అన్నది నామ మాత్రమే.. ఇదిమాత్రం అంత ఆరోగ్యకరంకాదు..  ఇలాటిది ఒక నిరంకుశపాలనకి దారితీయొచ్చు. రెండు పక్షాల బలాబలాలూ  మరీ సగంసగం కాకపోయినా, 60-40 అయినా ఉండుంటే బాగుండేది. మరీ 50-50 అయితే వచ్చేప్రాణం పోయేప్రాణంగా ఉంటుంది. అయినా ప్రతిపక్షాలకి( ఏ పార్టీ అయినా సరే ). 2004- 2014 వీళ్ళుచేసారూ, 2014-24 వాళ్ళు చేస్తారూ   అలవాటే కదా.. సెషన్ సజావుగా సాగనిస్తారా ఏమిటీ ? 

   ఇటుపైనుండి , తిరిగి రెగ్యులర్ గా పోస్టులు పెట్టడం ప్రారంభిస్తానని మనవి… కంగారు పడకండి, మరీ బోరుకొట్టేయను…

%d bloggers like this: