బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్…

   మనదేశంలో ప్రతిపక్షాలు ఏమిటో అంటున్నాయనో, లేక ఎవరెవరో ఏమిటేమిటో ఆరోపణలు చేస్తున్నారనో, అధికారపార్టీ వారికి పేద్ద పట్టింపేమీ ఉండదు..పోనిద్దూ వాళ్ళకీ కాలక్షేపం.. ఏదో అరుచుకోనిద్దూ.. అనేసికుని, వాళ్ళు చేసేదేదో చేసేస్తూంటారు..అదే క్రమంలో నిన్న జరిగిన మంత్రివర్గ మార్పులూనూ..ఇందులో బాగుపడ్డవాళ్ళెవరయ్యా అంటే, మన రాష్ట్రానికి చెందిన ఎం.పీలు.అక్కడికెదో వాళ్ళు మన నెత్తిమీద రాయెడతారని కాదూ, ఇన్నాళ్ళూ ఉన్నవాళ్ళెవరు పెట్టారు కనక? మనమూ అందరితోనూ చెప్పుకోవచ్చు… చూడండి, మన తెలుగువారికి ఎన్ని మంత్రిపదవులొచ్చాయో అని.మళ్ళీ ఇందులో, ఆయనకెవరికో ఇవ్వలేదూ, ఈయనకెవరికో ఇవ్వలేదూ అంటూ మళ్ళీ ఏడుపులూ, అలకలూ.. ఇలాటివి మామూలే ఎప్పుడూ.

   అవేవో Football లాటి ఆటల్లో మొదటి హాఫ్ లో కొందరూ, రెండో హాఫ్ లో కొందరూ ఆడుతూంటారు. అలాగే మన “గౌరవనీయ” ప్రజా ప్రతినిధులూనూ. కొంతకాలం, వాడెవడో చేశాడు, ఇప్పుడు నా వంతూ అనుకోడం, కాలక్షేపం చేసేయడం.లేకపోతే ఆ శసీ తరూర్ విషయంలో, అసలు logic ఏమైనా ఉందా? అప్పుడెప్పుడో, IPL గొడవలో ఆ “పెద్దమనిషి” రాజీనామా చేశాడో, చేయించారో.. మొత్తానికి రెస్టు ఇచ్చారు.ఇప్పుడు మళ్ళీ ఎందుకుట తీసికోడం? ఉన్న పార్టీ ప్రతినిధుల్లో అంత “తెలివైన” వారే లేరా?

   ఒకవైపున ఆ కుర్షిద్ ఏమిటో గొటాలాలు చేశాడని ఆరోపణలొచ్చాయి. ” పోనిద్దూ వాటిని పట్టించుకోవాలా ఏమిటీ..” అనుకుని, ఆయనకి ప్రమోషను కూడా ఇచ్చారు.ఎన్ని చెప్పండి, మన “మెగాస్టార్”గారి పని మాత్రం హాయిగా ఉంది. ఏదో “సామాజికన్యాయం” అంటూ ఓ కొత్త పార్టీ పెట్టారు మొదట్లో, కాలక్రమంలో కాంగ్రెసు తో విలీనం చేసేసి, రాజ్యసభ మెంబరైపోయి, హాయిగా ఇప్పుడు మంత్రిపదవి కూడా కొట్టేశారు. అద్గదీ యోగం అంటే అలాగుండాలి. పైగా ఆ శాఖలో ఏదైనా చేయకలిగాడా అని అడిగేవాళ్ళూ లేరు–పర్యాటక శాఖట!

    ఆ కేజ్రీవాలేమో ఆమధ్య రోజుకోడిని expose చేయడం మొదలెట్టారు. ఏమయిందీ చివరకీ? అక్కడ గడ్కరీ బాగానే ఉన్నాడు, వాధ్రాకూడా బాగానే ఉన్నాడు, ఇప్పుడు కుర్షీదు ఒకరు చేరారు ఆ లిస్టులోకి. మన సినిమావాళ్ళు చూడండి, publicity కోసం, ఏదో ఒక controversy తెస్తూంటారు, అదేదో వికటించడం మాటటుంచి, వాళ్ళ మంచికే జరుగుతూంటుంది. ఇందులో “నీతి” ఏమిటయ్యా అంటే– ఎపుడైనా ఎవడైనా “బాగుపడాలీ” అనుకుంటే, ఆ కేజ్రీవాల్ కి ఓ ఫోను కొట్టడం !

    అసలు అల్లుళ్ళు ఎలా ఉంటారో ఈ కాలపు వాళ్ళకి ఏం తెలుసూ? నెహ్రూ గారి అల్లుడు శ్రీ ఫిరోజ్ గాంధీ గారి గురించి చదవండి.ఒక్కరోజుకూడా నెహ్రూ గారిని ప్రశాంతంగా నిద్రపోనీయలేదు! తెల్లారితే ఏం కొంపముంచుతాడో అనే భయం. అలాగని, ఆయన బయటపెట్టిన స్కామ్ములు అలాటివీ ఇలాటివా..

    ఈమధ్య భారతీయ సంతతికి చెందిన రజత్ గుప్తా కి రెండేళ్లు జైలు శిక్ష వేశారు. అలాటిది మన ” పవిత్ర” భారతదేశంలో ఎరుగుదుమా ఏమిటీ? ఎవణ్ణో పట్టుకుంటారు, వాడు ముందుగా కడుపునొప్పో, కాలునొప్పో, నడుంనొప్పో, గుండె నొప్పో అంటూ ముందర హాస్పిటల్ లో చేరిపోతాడు. ఆ నొప్పులన్నిటినీ దాటి, మొత్తానికి వాడిని కోర్టులో పెడతారు.వాడు ఆ కబురూ, ఈ కబురూ చెప్పడం వాడి హక్కూ.ఏదో ఖాళీలుంటేఓ జైల్లో కూర్చోబెడతారు. మీడియా వాళ్ళకీ, రాజకీయనాయకులకీ కావలిసినంత కాలక్షేపం. వాడిని , వాడి వారఫలాన్ని బట్టి బైలు మీద వదిలిపెడతారు. మళ్ళీ ఈ బెయిలుమీద హైకోర్టులూ, సుప్రీం కోర్టులూనూ వాయిదాలూ… ఎప్పుడో ఒకప్పుడు బయటకొచ్చేస్తాడులెండి… ఆ కేసు దారి కేసుదే. ఈ మధ్యలో ఆ ప్రబుధ్ధులు పార్లమెంటుకీ వెళ్తారూ, మధ్యమధ్యల్లో సన్మానాలూ వగైరాలూ జరుగుతూంటాయి.వెధవ కేసుకేముందీ..దాని దారి దానిదీ..

    మన అదృష్టం బాగోపోతే, ప్రధానమంత్రో, రాష్ట్రపతో కూడా కావొచ్చు..చివరకి కంఠశోష మిగిలేదెవరికీ, మీకూ, నాకూనూ..
ఈమధ్యలో పాదయాత్రలూ, అవేవో యాత్రలూనూ.. వాళ్ళ ఓపిక్కి మాత్రం మెచ్చుకోవాలి.అప్పుడెప్పుడో ఆయనెవరో పాదయాత్రచేస్తే టక్కున ముఖ్యమంత్రి అయ్యారుట. ఇంక ప్రతీవాడికీ ఇదే వేలంవెర్రయిపోయింది. ప్రజలమీద ఈమాత్రం శ్రధ్ధ ఇదివరకే ఉంటే గొడవే ఉండేదికాదుగా! ఏమిటో…

    ఇంక ఈమధ్యన entertainment పేరుతో, సినిమాలు తీసేవాళ్ళు కొత్తకొత్త పోకడల్లోకి దిగారు. వాళ్ళూ జాగ్రత్తలు తీసికుంటారులెండి. సినిమాలు మొదలెట్టేటప్పుడు పూజలకీ, పునస్కారాలకీ, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయించడానికీ ఈ పురోహితులు కావాలి, కానీ వాళ్ళమీదే జోక్కులేయడం.ఏమైనా అడిగితే, అదేదో freedom of expression అంటూ ఓ పేరెట్టడం.సరదాగా ఇంకో మతం వారిమీద జోక్కులేసి చూడమంటే సరీ కుదురుతుంది రోగం! ఇంకో కులం మీద కోపం ఉండొచ్చు, కానీ అంత దిగజారవలిసిన అవసరం లేదు.పైగా ఇప్పుడే ఓ స్టేట్మెంటోటీ.. ఎవరినీ కించపరచలేదూ, ధర్నాలు చేసేవాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారూ అంటూ..అసలు సినిమాల్లో కామెడీ అని పేరుచెప్పి చూపిస్తున్నదే చాలా చీప్.పైగా వాటికి హాస్యం అని ఓ పేరుపెట్టడమోటీ.. చెప్పేనుగా it can happen in India only..

    విజయ మాల్లయ్య గారు దీపావళికి ఓ వాయిదా జీతాలిస్తాడుట… అబ్బ ఎంత దయామయుడో కదా! ఇంకో విషయం మర్చేపోయాను… రాజమండ్రీ ఎంపీ ఉండవిల్లాయన కళ్ళు ఆ సెంట్రల్ జైలు మీద పడ్డాయి. ఎలాగోలాగ ఆ జైలుని అక్కడనుంచి మార్పించేసి, ఆ స్థలమేదో real estate వాళ్ళకి కట్టబెట్టేద్దామని ప్లానులేస్తున్నాడు.ఎంతదాకా సాధిస్తాడో చూడాలి !