బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- రాజస్థాన్ యాత్ర -4

మర్నాడు పొద్దుటే  హరీష్, శిరీష ఆఖరిసారి మళ్ళీ వెళ్ళారు అడవిలోకి, ఆ పులేమైనా తిరిగి దర్శనం ఇస్తుందేమోనని. కానీ కనిపించలేదుట… మొత్తానికి రణథంబోర్ పూర్తిచేసుకుని, జైపూర్ కి బయలుదేరాము.. వెళ్ళేలోపల ఓ అద్భుత సంఘటన– నా ప్రాణానికైతే అది అద్భుతమే మరి… విమానం భయం కొంతవరకూ తీరిందా, అలాగే  సఫారి కూడా, ఎటువంటి అవాంతరాలూ జరక్కుండా లాగించేసినట్టేగా, ఇంక మిగిలినదల్లా, ఆ  Resort  లో పహరా కాసే ఆ శునకరాజములు… ఏదో వాటి బారినపడకుండా కానిచ్చేసేనన్నంత సేపు పట్టలేదు… సామాన్లన్నీ కారులో పెట్టి, ఇంక మెట్లు దిగుదామనుకున్నంతలో, ఓ శునకం, దానికి నామీద ఏం అభిమానం పుట్టుకొచ్చిందో, వచ్చేసి నన్నోసారి ముట్టుకునేసరికి,  నా ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయిందే అనుకున్నాను… ఓవైపున అది నన్నుముట్టుకుని కాళ్ళు  ఎత్తుతుంటే, ఒక్కడూ ఏమీమాట్టాడరే, అదేదో  routine check up  చేస్తున్నట్టు చేసి, ఏమనుకుందో ఏమో పక్కకు నుంచుంది. ఆ హొటల్ వాళ్ళందరూ– సాబ్జీ  ఓ కుఛ్ నహీ కర్తా అంటూనే ఉన్నారు, వాళ్ళదేం పోయిందీ, కానీ ఇంతదాకా వచ్చిన తరవాత అదేదో నేనే స్వయంగా తెలుసుకుందామని, ఏమైతే అయిందనుకుని, దానిమీద ఓ చెయ్యేసాను… ప్రాణాలుగ్గబెట్టుకుని,  కళ్ళుమూసేసుకుని చెయ్యేసేశాను..  ready with bated breath..  కళ్ళుమూసుకునే ముందర, మా ఇంటావిడనీ, అబ్బాయి కోడలూ, మనవరాలు, మనవడినీ  ఓ సారి తనివితీరా చూసేసుకుని, మళ్ళీ చూడగలనో లేదో, ఈ మాయదారి  test  నాకెందుకు చెప్పండీ…. అబ్బే ఏమీ అవలేదు–  surprise.. surprise..  వామ్మో అంత భయంకరమైన శునకాన్ని , నేను ముట్టుకున్నానా అనుకుని మాత్రం ఓసారి గుండె లయతప్పినట్టనిపించింది.. నిజంగా పాపం ఆ వెర్రి జీవి ఏమీ చేయలేదు..  ఈ మూడురోజులూ అనవసరంగా దాన్ని అనుమానించి భయపడ్డాను.. ఇదేదో తెలిసుంటే, దాన్ని ముద్దుపెట్టుకుంటానని కాదూ, నా పెద్దరికం నిలుపుకోగలిగే వాడినేమో… 

 ఈరోజుల్లో ఎవరైనా సెలెబ్రెటీ ని కలిస్తే ఓ ఫొటో తీయించుకోవడం  order of the day  కదా.. సరే అనుకుని, నేనూ ఫొటోకి దిగాను…

పులి తో ఎలాగూ దిగలేదు కదా అని పులి బొమ్మతో తీయించుకున్నాను ఫుటో..   మిమ్మల్ని మరీ బోరుకొట్టేసాను కదూ.. ఇంకొక్క భాగం రాసి , రాజస్థాన్ యాత్ర పూర్తిచేస్తాను… IMG-20171230-WA0012621.jpeg2d.jpgimg-20171230-wa0006-1.jpgimg-20171230-wa0007-1.jpg

Advertisements

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– రాజస్థాన్ యాత్ర -3

 రాత్రి డిన్నర్ అయిన తరువాత చల్లగా, చెప్పారు, మర్నాడు ఉదయం 630 కల్లా, మళ్ళీ ఆ ఆడవిలోకి వెళ్తున్నామని. ఈసారి ఇంకో  Zone,  మేముండే    DEV VILAS  కి దగ్గరలోనే..  నాకు అక్కడ నచ్చిన మరో విషయం ఏమిటంటే, రాత్రి పడుక్కోబోయే ముండు, రెండు  Hot water bags  తెచ్చి, మా కంబళి/ రగ్గు లకింద పెట్టడం. రూమ్మంతా వెచ్చవెచ్చగానే ఉందనుకోండి, కానీ ఈ  arrangement  ఇంకా బావుంది. అంత వెచ్చగా పడుక్కుని, మర్నాడు ఏదో చిన్నప్పుడు పరీక్షల్లో లేచినట్టు, మరీ తెల్లారకట్ల లేవమంటే కష్టమే కదూ..  మధ్యలో మా అగస్త్య  reminder  ఒకటీ.. సుభే సుభే తయ్యార్ హోకే రెహనా  అంటూ..ఎంతైనా మనవడిదగ్గర పరువుంచుకోవద్దూ? మొత్తానికి ఆ జిప్సీ ఏదో వచ్చేసరికి, ఒంటినిండా  all available  స్వెట్టర్లూ, జాకెట్టూ వేసేసికుని , నెత్తికో మఫ్లర్ కూడా చుట్టుకుని, గంగిరెద్దుకి అలంకరణ చేస్తారే, అలాగ నన్ను మా ఇంటావిడ నన్ను అలంకరించగా చాయ్ తాగేసి రెడీ అయ్యాను.

అన్నీ చెప్పి ముఖ్యమైన విషయం చెప్పడమే మర్చిపోయాను– జైపూర్ లో లాగ కాకుండా, ఇక్కడ ఈ Resort  లో రెండు భయంకరమైన  కుక్కలు,  పైగా నాకంటే పొడుగ్గా ఉన్నాయి, వాటిని  free  గా వదిలేసారు… అక్కడున్న 3 రోజులూ భయమే నాకు.. ఎలాగొలాగ వాటి బారిన పడకుండా లాగించేసాను మొత్తానికి… 630 కల్లా ఆ దగ్గరలోఉన్న Zone  కి చేరాము. మా గైడ్ అయితే చెప్పాడు, ఆ ముందురోజు ఓ పులి కనిపించిందని, మధ్యమధ్యలో కిందకి చూడ్డం, అవిగో పగ్ మార్కులు.. ఇవిగో పగ్ మార్కులూ.. పులి ఇక్కడే ఎక్కడో తిరుగుతోంది.. అంటూ, అడవంతా తిప్పాడు. అడవి జంతువులు తప్పించి, పులి మాత్రం కనిపించలేదు.

1t201u

చివరకి ఆ పులేదో కనిపించకపోయేసరికి, 12 గంటలకి తిరిగి వెళ్ళాము. లంచ్ అయిన తరువాత, మళ్ళీ మూడోసారి, చివరిప్రయ్త్నం చేయడానికి వెళ్ళాము… పొద్దుటికంటే కొంచం better..  పక్షులు, జంతువులా  warning signals  ధర్మమా అని మిగిలిన అన్ని వాహనాలూకూడా, ఓ చెరువు చుట్టూరా చేరిపోయాయి. ఇంతలో ఓ పెద్ద గాండ్రింపు వినబడింది, మరీ నిన్నటంత దూరంలోకాదూ, కానీ స్పష్టంగా వినడంమాత్రం విన్నాను.. ఆ పులి ఏదో జంతువునుచంపి, తన పిల్లలకి పెట్టడమో, లేక తనే విశ్రాంతి తీసికోడమో చేస్తూందన్నాడు మా గైడ్.. ఇవన్నీ ఎలా తెలుస్తాయో వీళ్ళకి, ఎంతైనా ఎన్నోసంవత్సరాల అనుభవం కదా…13 సాయంత్రం 630 కి  తిరిగి వెళ్ళి, డిన్నర్ తీసికుని బొజ్జున్నాం. మరికొన్ని విసేషాలు తరువాతి పోస్ట్ లో1x.jpg

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- రాజస్థాన్ యాత్ర -2

 

 

సాయంత్రం 7 కి జైపూర్ లో, మొత్తానికి, ఏ అవాంతరాలూ లేకుండా  land  అయ్యాము. మొదటి మజిలీలో, airbnb  ద్వారా వారెవరో  family  ఉండే ఇంట్లో, రెండు గదుల్లో  సెటిలయ్యాము. సాయంత్రం రెండు cab  లు చేసుకుని,  City Centre  లో ఉన్న  Albert Hall Museum   కి వెళ్ళి ఓ రెండు గంటలు గడిపాము . దారిలో బిర్లా మందిరం కూడా దూరం నుంచి, దర్శించుకుని, హొటల్లో డిన్నర్ తీసికుని,  తిరిగి వెళ్ళాము. గేటు  బయటుండే  Calling Bell  కొట్టడమేమిటీ, ఆ ఇంట్లో ఉండే కుక్క, భయంకరంగా అరవడం మొదలెట్టింది… వాళ్ళు దాన్ని కట్టేయగా, మెము నిర్భయంగా రూమ్ములో సెటిలయ్యాము… రూమ్ము బయటకి అడుగెడితో ఒట్టు.


మర్నాడు, నవ్య కి కొద్దిగా అస్వస్థత కారణంగా, మేమిద్దరమూ, అగస్థ్యా, అబ్బాయితో కలిసి,    Amer Fort  కి బయలుదేరాం.. అక్కడ చాలా రష్ గా ఉండడంతో, మేము కారులోనే ఉండిపోయి, వాళ్ళిద్దరినీ వెళ్ళిరమ్మన్నాం…

43నలుగురూ కలిసి తిరిగి వెళ్ళి, అందరం కలిసి హొటల్లో లంచ్ తీసికుని, ఆరోజుకి సెటిలయ్యాము.. అసలు కథంతా ఆ మర్నాడుప్రారంభం అయింది . కారులో బయలుదేరి రణతంభోర్ చేరాము. అక్కడ  DEV VILAS   అనే Resort  లో  check in  అయ్యాము. అద్భుతంగా ఉంది. మధ్యాన్నం ఓ  Maruti Zypsy  వచ్చేసింది.  మేము ఆరుగురం, ఓ గైడూ , డ్రైవరూ…  4 గంటలకల్లా   Ranthambore  National Park  కి చేరి,  Security check  పూర్తిచేసుకుని, బయలుదేరాము. పెద్దపులి  movements  ని ఈ గైడ్లు,  ఉదయంపూట అయితే ఆ పులుల పాదముద్రల(  Paw marks )  ద్వారానూ, మిగతా సమయాలలో అయితే కొన్ని అడివి జంతువులూ, పక్షులూ చేసే  ఓ ప్రత్యేకమైన (  unique )  శబ్దాలతోనూ గుర్తు పడతారుట.. అలాటిదేదో ఉండాలిలెండి , అలాటి  warning system  లేకుండా, అకస్మాత్తుగా , ఓ పులిపిల్లైనా చాలు, మనమీదకి ఎగిరితే బతక్కలమంటారా? పైగా ప్రయాణం చేసేదేమో  Open Van… ఆ పులేదో కనిపించేదాకా, మిగతా అడివి జంతువులు చాలానే కనిపించాయి.. ఇంతలో ఆ గైడ్ ఏం చూసాడో ఏమో… అదిగో అల్లదిగో  శ్రీహరివాసమూ అన్నట్టు. అదుగో పులి అన్నాడు, నేనైతే చిన్నప్పుడు నేర్చుకున్నట్టు  .. అదిగో తోకా… అని మనసులోనే అనుకున్నాను.  నాకైతే ఏమీ కనిపించలేదు ఒట్టు. కానీ, ఆ గైడూ, మా అబ్బాయీ అయితే ఆ పులి లేచిందని ఒకరూ, ఒళ్ళువిరుచుకుంటోందని ఇంకోరూ మాట్టాడుతూ,  నాక్కూడా కనిపించిందా అని అడిగారు. సరేనని ఎక్కడో దూ… రం… గా ఉన్న వాళ్ళు చెప్పిన చోటులో దృష్టి కేంద్రీకరించాను.. అబ్బే…. ఎలా తిరిగి ఎలా  కళ్ళు చిట్లించి చూసినా కనిపించదే.. అబ్బాయైతే తన  Camera  ని Zoom  చెసి, దాని ఫొటో కెమేరాలో బంధించేసాడు. ఇంతలో  Driver ,  మా ఇంటావిడ  mobile  తీసికుని,  Zoom  చేసి చూపించాడు.. అప్పుడు తెలిసింది నెను అప్పటిదాకా చూసింది,  Wrong place   అని.. కనిపించమంటే ఎలా కనిపిస్తుందీ మరి ? 

 ఏదో మొత్తానికి వచ్చిన పనయింది. ఇంతలో చీకటి పడ్డంతో తిరుగు ప్రయాణం.. మధ్యలో కనిపించిన ప్రతీవాడూ అడగడమే.. పులి కనిపించిందా అంటూ..  Oh Yes  అని నేను తప్ప మిగిలినవారందరూ ముక్త కంఠంతో చెప్పేసారు. ఈ బుడ్డా ఆద్మీకి ఏం కనిపిస్తుందిలే అనుకుని నన్ను అడగడం మానేసారు– ఓ గొడవ వదిలింది. Resort  కి వెళ్ళేటప్పటికి అక్కడుండే  Attendants ,  వేణ్ణీళ్ళలో చిన్న చిన్న టవల్స్ ముంచి, ఒళ్ళు, మొహం తుడుచుకోడానికి ఇవ్వడమైతే  నాకు చాలా నచ్చేసింది.

నాకు కనిపించలేదని, అసలు పులే లేదూ ఆ జంగిల్ లో అంటే ఎవరూరుకుంటారూ?  అబ్బాయి తను  Zoom  చేసి తీసిన ఫొటోలు   Download  చెసి  సాక్ష్యాధారాలతో చూపించాడు…

1l2o2p1w

   అప్పుడే ఎక్కడయిందీ.. ఇంకా చాలా రాయాలి… ఇంకో టపాలో….

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– రాజస్థాన్ యాత్ర — 1

అదేమిటో కానీ , పుట్టిల్లు దర్శించుకోడానికే టైముండడంలేదాయె…. ఆ ఫేసుబుక్కూ, గోతెలుగూ , నాటైము పూర్తిగా కేటాయించాల్సొస్తోంది…  అలా కుదరదని మళ్ళీ వచ్చేసా.    కిందటి సంవత్సరాఖరిలో , అబ్బాయి, కోడలూ, ఫోను చేసి ” మేము జయపూర్ ( రాజస్థాన్) వెళ్తున్నామూ, మీరుకూడా వస్తే బావుంటుందీ అన్నారు… నిజం చెప్పాలంటే, నాకు వెళ్ళే ఉద్దేశ్యమైతే అస్సల్లేదు. ఒకటి విమానప్రయాణం, రెండోది ఆ టైములో రాజస్థాన్ లో ఎముకలు కొరికే చలోటీ… పైగా ఇంకోవిషయం కూడా చెప్పారు.. మూడు రోజులు జైపూర్ లోనూ, మూడురోజులు  రణతంభోర్  లోనూట.. ఎందుకూ అంటే , ఆ ప్రదేశం ఓ  Tiger Resort  ట, ఆ పెద్దపులుల్ని మనం దగ్గరనుంచి చూడ్డంట.. Zoo  ల్లోనూ,  Circus  లోనూ , బోనుల్లోఉండగా చూస్తేనే ఛచ్చే భయం, పైగా ఈ  Resort  లో  Maruthi Zypsy ( open )  లో , ఆ అడవంతా తిరగడంట.. అయ్యే పనేనా ఇదీ?. హాయిగా కొంపలో కూర్చోక ఎందుకొచ్చిన గొడవా? ఫోనులో పిల్లలతో మాట్టాడుతూంటే, పక్కనే , మా ఇంటావిడ, ” ఏమిటీ మాట్టాడుతున్నారూ.. ఎక్కడికైనా వెళ్తున్నారా పిల్లలూ.. ” అని అడగ్గా, ” అవునూ ఓ వారంరోజులూ, మనమూ వస్తామా ..అని అడుగుతున్నారూ..” అనడం ఏమిటి, ఇంక మరో ఆలోచన లేకుండా, ” వస్తున్నామని చెప్పేయండి.. ” అంది… వెళ్ళే ప్రదేశం మీద కాదు ఇంటరెస్టు– పిల్లలతో ఓ వారంరోజులు గడపడం ఓ అరుదైన అవకాశం, దాన్నా వదులుకునేదీ.. ? ” పిల్లలు కలుస్తారు, కానీ వారాంతంలో కొన్ని గంటలు మాత్రమే.. కలవకూడదని కాదు, టైముండాలిగా వాళ్ళకీ.. రోజూ స్కూలూ, డాన్సూ, టెన్నీసూ బిజీ బిజీ.. అయినా అంత హడావిడిలోనూ, నవ్య అగస్త్యలను తీసికుని మాదగ్గరకి రావడం మాత్రం మానరు. మహా అయితే ఓ రెండుమూడు గంటలు.అలాటిది ఓ వారంరోజులు, రోజుకి కనీసం పదిపదిహేను గంటలు , వాళ్ళతో గడిపే అవకాశాన్నా వదులుకునేదీ.. అబ్బాయితో చెప్పేసా–మేమూ వస్తామూ.. అని. చెప్పిన అరగంటలో మాకు  Return Tickets  మెయిల్ లో పంపేశాడు..  Air Asia Flight  ట.

ఇంక ప్రయాణం తయారీ ప్రారంభం.. వెళ్ళేదా చలి ప్రదేశం, స్నానపానాదులు ఆ వారంరోజుల్లోనూ, ఉంటాయో ఊడుతాయో తెలియదు.  మామూలుగా వేసికునే పాంట్లైతే,  మరీ ఎక్కువేసికోవాల్సొస్తుందని, మాపాగడానికి జీన్సూ (  jeans ) ,  ఓ స్వెట్టరూ, ఓ జాకెట్టూ.. ఇంకా ప్రయాణం ఓ రెండువారాలుండడంతో ,  Flight  లో ప్రయాణం చేయడానికి , మనసులో తయారవడం వగైరా ప్రారంభించాను. ఎప్పుడూ రైళ్ళలో ప్రయాణం చేసిన మొహమే నాది.. జీవితంలో రెండేరెండు సార్లు విమానప్రయాణం చేసాను.  రెండుసార్లూ, కళ్ళుమూసుకుని, ప్రాణాలుగ్గబట్టుకునీనే.. మొదటిసారి సునామీ టైములో మద్రాసునుండి ముంబైదాకా— వేరే మార్గంలేక చేయాల్సొచ్చింది. రెండో సారి అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చీనూ..  అవకాశం ఉండుంటే, చేసేవాడిని కాదు.. విధిలిఖితంకదా తప్పించుకోలేకపోయాను. అదేవిటో విమానం అంటే నాకన్నీ భయాలే. అందులోనూ ఆ  Take off time  లో అయితే మరీనూ…వాటన్నిటికీ కూడా  mentally prepare  అవడానికి ఇంకా రెండు వారాలు. ఈ లోపులో మా అగస్త్య అయితే నన్ను కలిసినప్పుడల్లా వేళాకోళమే.. వాడి పధ్ధతిలో వాడూ నాకు ధైర్యం చెప్పడమే… ” కుఛ్ నహీ హోతా తాతయ్యా..” అంటూ…

 నాకు అత్యంత భయం కలిపించేవి, విమాన ప్రయాణం, కుక్కలూ.. విమానం విషయమైతే మనసు గట్టి పరిచేసుకున్నాను.. కొడుకూ , కోడలూ, నవ్య అగస్త్య, మా ఇంటావిడా ఎలాగూ నాతోనే ఉంటారూ.. ఏమైపోయినా ఫరవాలేదూ.. అనుకుని.. కోడలు  చల్లగా ఓ వార్త చెవినేసింది– మేము ఆ వారంరోజులూ ఉండేది హొటల్ లో కాదుట, అవేవో  Resort / Family  తోటిట.. ముఖ్యమైన విషయం ఆ మూడు చోట్లా భయంకరమైన  శునకరాజాలు కూడా ఉన్నాయిట..  నాకు కుక్కలంటే ఉన్నభయం తెలిసుండడం వలన ఆ విషయం ముందర తెలుసుకున్నారు… వాటిని ఎటువంటి పరిస్థితులలోనూ , మేము ( కనీసం నేను ) ఉండే ప్రదేశానికి రానీయకూడదని…

 ఏమిటో ఇన్ని రకాల Tensions  పెట్టుకుని, వెళ్ళకపోతే ఏమిటిట? ఎవరిని ఉధ్ధరిద్దామని ఈ ప్రయాణం ? అలాగని ఏదో వంక పెట్టి రానంటే, అనవసరంగా వాళ్ళ ఉత్సహాన్ని పాడిచేసినవాడినవుతానేమో.. రాక రాక, పిల్లలతో వారం రోజులు  exclusive  గా గడిపే చాన్స్ మళ్ళీ వస్తుందో రాదో?

24 డిశంబర్ రోజున మధ్యాన్నం 3 15 కి  , పుణె  Airport  కి చేరాము…     Cab  దిగినప్పటినుండీ, అగస్థ నాతోనే.. నా  Guide  అన్నమాట. మొత్తానికి అవేవో చెక్కులూ, డ్రాఫ్టులూ చేసుకుని, విమానం సీట్లలో కూలబడ్డాను. నాకు ధైర్యం చెప్పడానికి మా ఇంటావిడ పక్క సీటులో ( ఎంతైనా వీటిల్లో తను  experienced  కదా). ఆ విమానమేదో త్వరగా బయలుదేరి,  తొందరగా ఆ గొడవేదో ఒదిలిపోతే బావుండునుగా, అబ్బే.. ఇదేమైనా రైలు ప్రయాణమా– గార్డ్ ఓ విజిలేస్తే బయలుదేరడానికీ,  ఈలోపులో ఓ పిల్ల మాట్టాడుతూండగా, ఇంకో పిల్ల అభినయం చేస్తూ, ఏదైనా ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన  precautions  వగైరా చెప్పింది. అసలు  ఈ జ్ఞానబోధంతా అవసరమంటారా? మా అమ్మమ్మగారనేవారు-  జరగబోయే అవాంతరం గురించి మాట్టాడితే, పైనున్న తధాస్థు దేవతలు వింటారూ అవటా అని…. ఎందుకొచ్చింది చెప్పండి ఈ గోలంతా?

 మొత్తానికి పేద్ద చప్పుడు చేసికుంటూ బయలుదేరింది. ఏవిటో విమానంలో వెడితే టైము కలిసొస్తుంది కానీ, ఇరుక్కుని కూర్చోడం కూడా కూర్చోడమేనా? ఎవడికి వాడు ఓ సెలెబ్రెటీ అనుకుంటాడు.. ఓ మాటుండదు మంతుండదు..కిటికీ లోంచి చూడ్డానికి భయం, ఏవేం చూడాలో అని. ఆ సీట్ బెల్టు ఎలా పెట్టుకోవాలో తెలిసేడవదు., ఆ మాయదారి బెల్ట్, అదేదో క్లిప్ లో పట్టి చావదూ,.. పోనీ ఓ చుట్టు చుట్టుకుని చేత్తో పట్టుకుందామా అనిపించింది… మా ఇంటావిడే మొత్తానికి తంటాలు పడి పెట్టింది.

 Morning Raga  సినిమాలో  Shabana Azmi  గుర్తుందా, ఆవిడకి బస్సెక్కడం భయం , అప్పుడెప్పుడో తన స్నేహితురాలికి accident  అవడం వలన. అలా అయింది నా పరిస్థితి !! మా ఇంటావిడకైతే నా భయం తెలుసు కాబట్టి, , ఏవో కబుర్లలో పెట్టేసింది, అదేదో చిన్నపిల్లలకి డాక్టరు దగ్గర చెప్పినట్టు.. ఇంతలో ఓ ట్రాలీలో ఏవేవో వచ్చాయి.. అబ్బాయి చెప్పగా, ఆ విమానం పిల్ల ఓ కాఫీ తెచ్చిచ్చింది…

విమానం దిగిన తరువాతి కార్యక్రమాలూ, సంబంధిత ఫోటోలూ… రెండో భాగం లో

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు

 

 

 

పెళ్ళైన మొదటి 10 సంవత్సరాలూ, ప్రతీ ఏడూ,  Marriage Anniversary  రోజు  February 28,   ఇక్కడ  పుణె లో ఉన్న పార్వతి కొండకి వెళ్ళి , అమ్మవారి దర్శనం చేసుకునేవారం.. 1983 లో వరంగాం బదిలీమీద వెళ్ళి తిరిగి పుణె, 1998 లో వచ్చాము… పెళ్ళిరోజులైతే అప్పటినుండీ, ప్రతీ ఏడూ , చేసుకునేవాళ్ళం, అయినా  ఏమిటో అమ్మవారి దర్శనానికి వెళ్ళడం మాత్రం కుదరలేదుఏమిటో ఆ లోటుమాత్రం కనిపించేది.  అలాగని దైవ దర్శనాలు మానేమా, అబ్బే ఆ తల్లిని మర్చిపోవడమే ?  No way..  గత అయిదారు సంవత్సరాలుగా, ప్రతీ ఏడూ, ఏదో ఒక పుణ్యక్షేత్రానికిమా ” దేవదూత ” ల ధర్మమా అని వెళ్ళగలిగేమనుకోండీ, కానీ , ఈ ఏడాది, బయటకెక్కడికీ కాకుండా, ఈసారి పార్వతి కొండకే వెళ్ళాలని నిశ్చయించుకున్నాము. మొత్తానికి దాదాపు 30-32 సంవత్సరాల తరువాత, వెళ్ళి దర్శనం చేసుకోగలిగాము.

అప్పటికీ ఇప్పటికీ తేడా అల్లా ఏమిటంటే, ఆరోజుల్లో బస్సులు పట్టుకుని వెళ్ళేవాళ్ళమూ, ఇప్పుడేమో  UBER  లోనూ..  ఈ పెరుగుదల అంతా ఆ అమ్మ దయేగా.. ఆరోజుల్లో తెలిసేది కాదుకానీ, ఇప్పుడు కొండ ఎక్కినప్పుడైతే , వయసురీత్యా అయితేనేమిటి శ్రమపడాల్సొచ్చింది…

మేము వెళ్ళేటప్పటికి అంటే ఎంతా ఉదయం 9.30 కి, గుడి తలుపులు మూసున్నాయి.. అక్కడ ఉన్న సెక్యూరిటీ అతన్ని అడగ్గా , పాపం అతను పూజారికి ఫోనుచేసి పిలిచాడు. ఈలోపులో మేమిద్దరమూ, ఆ ప్రాంగణంలోనే, లలితాసహస్రనామం పారాయణ చేసుకున్నాము. పూజారి గారొచ్చిన తరువాత, అమ్మవారికి , చీర, పసుపు,కుంకం ,  నాభార్య సమర్పించుకుంది… గుడి చుట్టూ ఉండే ప్రహారి ఎక్కితే, పుణె నగరం  ఎంతో సుందరంగా కనిపిస్తుంది.. నాకు ఓపిక లేక, వెళ్ళలేదు, తనే వెళ్ళింది.

ఆతరువాత విష్ణు మందిరం, గణపతి మందిరం, కార్తికేయమందిరం, విఠోబా మందిరం, బాజీరావు పీష్వా సమాధి, చివరగా పీష్వాల కాలంలో ఉపయోగించిన వస్తువులు, ఆయుధాలు, ఆనాటి చిత్రపటాలూ, వ్రాత ప్రతులూ… ఉంచిన  సంగ్రహాలయ్ (  Museum )  కి వెళ్ళి, ఓ అరగంట అక్కడ గడిపాము.

ఓ కాఫీ తాగి, మెల్లిగా 12 గంటలకి కిందికి దిగాము.  Overall it was a beautiful experience..

ఈసందర్భంలో శ్రీమతి  PSM   లక్ష్మి గారు సమర్పించిన ఒక విడియో లింక్ ఇస్తున్నాను.. ఆ గుడి వివరాలన్నీ, అద్భుతంగా వివరించారు.

 

 

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– where is the sense of humour gone ?

పూర్వపు రోజులతో పోలిస్తే   ఈ రోజుల్లో గమనించిందేమిటంటే, మనుషుల్లో చాలామందికి , Sense of humour  అనబడే “ హార్మోన్ “ తగ్గుముఖం పట్టినట్టనిపిస్తోంది. తగ్గుముఖమనే ఏమిటిలెండి,  almost dried up  అనుకోవచ్చు.ఇదివరకటి రోజుల్లో , వ్యంగ్య చిత్రాలు (  cartoon/ caricature ) వేసే ఘనా పాఠీలుండేవారు. వారి వ్యంగ్యం నుండి ఏ ప్రముఖ వ్యక్తీ కూడా తప్పించుకోలేదనడంలో ఆశ్చర్యం లేదు. ప్రముఖ కార్టూనిస్టులు   Messers . RKLaxman, Abu Abraham, Oomen, Mario Miranda,Shankar,  తెలుగుజాతికి స్వంతమైన శ్రీ బాపు గారూ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఎందరెందరో… ఓ గొప్ప రాజకీయనాయకుడి పైన ఓ కార్టూన్ వేస్తే నవ్వకుండా ఉండలేకపోయేవారు, ఎవరిమీదైతే వేశారో ఆ వ్యక్తి తో సహా…

కానీ ఈరోజుల్లోనో—వ్యంగ్యంగా ఏదైనా వ్యాసం రాసినా, ఓ బొమ్మవేసినా అసలు విషయాన్ని పక్కకుపెట్టి, వాటిమీద వివాదాస్పక చర్చలు మొదలెడతాయి. ఎవరిగురించైతే వేసారొ ఆ వ్యక్తి లోపల్లోపల నవ్వుకున్నా కుదరదు. వారి వందిమాగధులకి పొడుచుకొస్తుంది… “ కందకి లేని దురద… “ సామెతలా. పైగా ఆ కార్టూన్ కి ఓ “ కుల / జాతి “ జెండా తగిలిస్తారు. ఇంక ప్రభుత్వం మీదా, అధికార పక్ష నాయకులమీదా వేస్తే “ దేశద్రోహం “ కింద పరిగణించి జైల్లో వేసినా  ఆశ్చర్యపడక్కర్లేదు. అసలు గుమ్మిడికాయదొంగంటే భుజాలు తడుముకోవడం ఎందుకో ? “ఎంత నవ్వితే అంత ఆరోగ్యం “ అన్నది పోయి “ నవ్వు నాలుగువిధాల చేటు “ లోకి వచ్చేసింది.

 సామాజిక మాధ్యమం (  Social Media )  లోకూడా అదే పరిస్థితి… ఎవరో ఏదో రాస్తారు తమ టైమ్ లైన్ మీద—స్పందించకపోతే బావుండదని, ఏదో తెలిసినవారు కదా అని వ్యాఖ్య పెడితే దాన్ని లైట్ గా తీసుకోవచ్చుగా అని స్పందించిన వ్యక్తి అనుకున్నా, మిగిలినవారికి “ దురద “  ఎక్కుతుంది…అంతే వ్యాఖ్యలమీద వ్యాఖ్యలు… తారీక్ పే తారీక్.. తారిక్ పే తారీక్ .. “   Ghayal  సినిమాలో   Sunny Deol  లా వచ్చేస్తాయి… అసలు వ్యక్తికి పట్టింపులేకపోయినా,  Peer Pressure  ఎక్కువైపోతుంది… అసలు విషయం పక్కదారి పట్టి అటకెక్కేస్తుంది. కొంతమందుంటారు  ఎంతమంది వ్యాఖ్యలు పెట్టినా, స్పందించని ఘనులు. ఏదో ప్రభుత్వంవారి పత్రికా ప్రకటన ధోరణిలో , అందరికీ కలిపి ధన్యవాదాలు చెప్పేవారు…. అలాటప్పుడు వ్యాఖ్యలు పెట్టేవారుకూడా మానేసే ఆస్కారం ఉందని మర్చిపోతారు. చివరకి ఏమౌతోందంటే వ్యాఖ్యలు పెడితే ఓ గొడవా, అసలు పెట్టకపోతే ఇంకో గొడవా..

ఇవన్నీ  ఈరోజుల్లో  Public domain  లో ఈరోజుల్లో చూస్తూన్న మార్పులు… చివరకి ఈ  drying up  ప్రక్రియ నిజజీవితాల్లోకి కూడా వచ్చేస్తోంది.. మనం సరదాగా అనుకున్న మాట అవతలివారికి అభ్యంతకరంగా అనిపించొచ్చు.. అది స్నేహితుల మధ్య అవొచ్చు, తల్లితండ్రులు- పిల్లల మధ్య కూడా కనిపిస్తోంది… ఏదో చనువులాటిదుంటేనే కదా హాస్యంగా అప్పుడప్పుడు మాట్టాడేదీ?  కొత్తగా పరిచయమైన వారితో ఎలాగూ ముభావంగానే ఉంటాము… మరీ మొదటి పరిచయంలోనే  లొడలొడా వాగేయం కదా…  అవతలివారి మనస్థత్వం ఓసారి అంచనా వేసి , రంగంలోకి దిగడం. .. మన మాట పధ్ధతి నచ్చిందా ఇంకోసారి కలవ్వొచ్చు, నచ్చలేదా, ఓ గొడవొదిలిందని వదిలేయొచ్చు. అలాగని మన   Light hearted attitude  మార్చుకోనవసరం లేదని ఇన్నాళ్ళూ అనుకునేవాడిని…

కానీ కొన్నిఅనుభవాలు జరిగితేనేకానీ నేర్చుకోలేముగా…. నోరుమూసుక్కూర్చుంటే అసలు గొడవే ఉండదుగా.. కానీ కూర్చోలేమే…  కానీ ప్రయత్నించి చూడాలి.. బాగుపడొచ్చేమో…

 Learning is an everlasting exercise….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– taking it for granted….

        పూర్వపు రోజుల్లో మనుషులమధ్య సంబంధ భాందవ్యాలు ఎంతో చక్కగా ఉండేవనడంలో సందేహం లేదు. కారణం—వారి మనస్థత్వాలూ, అవతలి వారి క్షేమసమాచారాలు తెలుసుకోవలన్న కోరిక, ఏదైనా అవసరం పడితే సహాయం చేయాలనే తపనా, ఇలా ఎన్నో కారణాలుండేవి. అలాగని ఖాళీగా ఉండేవారా అంటే అదీ కాదూ… ఎవరి వ్యాపకం వారికుండేది. కాలమానపరిస్థితులతో వీటికీ మార్పు వచ్చింది. “ఎవరికి వారే యమునాతీరే “ సిండ్రోమ్ (  Syndrome )  అనే ఓ “ వ్యాధి “ శరీరంలోకి ప్రవేశించేసింది. అది తల్లితండ్రులకీ, పిల్లలకీ మధ్య సంబంధాలవనీయండి, స్నేహితుల మధ్య సంబంధాలవనీయండి. చివరకు ఎక్కడదాకా వచ్చిందంటే  “ ఏ సమాచారమూ లేదంటే అంతా సుఖంగా ఉన్నట్టే ..” అనేదాకా… అంతేకానీ, పోనీ ఓసారి మాట్టాడదామా, ఓసారి చూసొద్దామా అనే తపన ఇరుపక్షాలవారిలోనూ లోపించింది. పైగా ఇదివరకటి రోజులకంటే సమాచార వ్యవస్థలు కూడా సులభతరమయినాయి…  ఇదివరకటిలాగ మొబైళ్ళలో నిమిషానికింతా, సెకనుకింతా , రోమింగ్ కి ఇంతా అనికూడా కాకుండా, అన్ని సర్వీస్ ప్రొవైడర్లూ, (  Service Providers) ఒకరితో ఒకరు పోటీగా, “ ఉచితం “ చేసేశారు. అయినా దగ్గరవారికి ఓ ఫోనుచేసే సావకాశం గానీ, కోరికకానీ ఎవరికీ ఉండడం లేదు. అదీ ప్రస్థుత పరిస్థితి..

 కొంతమందుంటారు… తమ దగ్గర చుట్టాలందరూ ( అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళూ) ఒకే చోట ఉంటే బావుంటుందేమో అనే తపన ఉన్నవాళ్ళన్నమాట.. ఆలోచించుకుని ఒకే నగరానికి చేరుకుంటారు.  ఒకరితో ఒకరు కలవాలనే సదుద్దేశ్యం మొదట్లో ఉన్నంతగా , ఆ తరవాత ఉండదు. ఏదో శుభకార్యానికో, లేదా దురదృష్టవశాత్తూ ఎవరో స్వర్గస్థులయినప్పుడో తప్ప కలవరు. రైటే ఎవరి పనుల్లో వారు బిజీగానే ఉంటారు. ఊళ్ళోనే ఉన్నారుకదా అని ప్రతినిత్యం కలవాలనేమీలేదు. అందరూ నగరానికి తలోమూలా ఉంటారు. హైదరాబాద్, బెంగళూరు లాటి నగరాల్లో అయితే, ఒకచోటనుండి ఇంకో చోటికి ప్రయాణం చేయడంకంటే, సింగపూర్, దుబాయి కి వెళ్ళిరావడం సులభంలా కనిపిస్తుంది.  దూరాలూ, ట్రాఫిక్కు రద్దీలూ వీటికి కారణాలు. ఓ ఫోనుచేసి ఓ అరగంటసేపు కబుర్లు చెప్పుకున్నా పోయేదేమీలేదు. అయినా దానిక్కూడా ఖాళీ ఉండడంలేదు. అవును ఎలా ఉంటుందీ?  ఫేస్ బుక్ (  Facebook)  లో Posts  పెట్టాలి, వాటికి ఎన్ని   Like  లు వచ్చాయో చూసుకోవాలి..   Tweet  చేయాలి, వాటిని ఎంతమంది  Retweet  చేసారో చూడాలి…

 పైన చెప్పినవన్నీ ఉద్యోగంచేసి రిటైరయిన వారి అభిప్రాయాలు. ఇంకొంతమందుంటారు—పాపం వాళ్ళకి స్నేహితులని పాతపరిచయాలరీత్యా ఓసారి కలవాలనే సదుద్దేశ్యమైతే ఉంటుంది.  Intentions are very noble.. కానీ వాటి  implementation  లోనే వస్తుంది గొడవంతానూ..  ఏదో మూడ్ వచ్చిందికదా అని వాళ్ళింటికి వెళ్తే కుదిరే రోజులు కావివి. ఎంతెంతో దూరాలు, తీరా వెళ్తే వాళ్ళుండొచ్చు ఉండకపోవచ్చు. ప్రత్యామ్నాయంగా ఫలానా రోజు ఉంటారా అని ఫోనుచేసి అడగడం ఉత్తమం. కొంతమందైతే వారం రోజులముందే అడుగుతారు. ఇది ఇంకా ఉత్తమం—ఈ లోపులో వీరిద్దరికీ సంబంధించిన  common friends  కి కూడా చెప్పొచ్చు,  “ఫలానా మన స్నేహితుడు ఫలానా రోజు వస్తున్నారూ, వీలుంటే మీరూ రండి, కొంతసేపు కబుర్లు చెప్పుకోవచ్చూ…” అని. ఈ రాబోయే స్నేహితుడికీ, ఎవరింటికి రాబోతున్నారో వారికీ, రాకపోకలు ఎక్కువే.. కనీసం నెలలో ఒకసారైనా కలుస్తూ ఉంటారు, దూరాలెంతైనా. ఫలానా  common friend  ఈనెలలో వస్తున్నారుకదా, అప్పుడే వెళ్ళొచ్చూ అని వాయిదా వేస్తారు… చివరకేమవుతుందంటే వస్తానని ఫోను చేసిన పెద్దమనిషి పత్తా ఉండడు. ఆ వచ్చేఆయనకోసం , వీళ్ళిద్దరూ వాళ్ళ కార్యక్రమాలు  adjust  చేసికుని కూర్చున్నారు.. పోనీ రావడానికి వీలుకుదరడంలేదని పోనీ ఫోను చేసి చెప్పొచ్చుగా… అబ్బే అదీ లేదూ.. అడిగితే “ అదేమిటండీ.. వచ్చేముందర ఫోను చేసొస్తానని చెప్పేనుగా..” అనొచ్చు. నిజమే, కానీ ఓ సంగతి convenient  గా మర్చిపోతారు—ఫలానా వారంలో ఫలానా రోజున వస్తానని ఫోను చేసిందాయనే అని. దీనికి ముఖ్యకారణం —  taking for granted  అనే ఇంకో “  virus “ …   తనకే ఏదో పెద్ద పనున్నట్టూ, అవతలివాళ్ళందరూ రికామీగా ఉన్నట్టూ అనుకోవడం… దీంతో అయేదేమిటంటే, ఆ తరవాతెప్పుడో  గుర్తొచ్చి వస్తానని చెప్పినా వీళ్ళిద్దరూ పట్టించుకోపోవచ్చు.. పోనిద్దురూ ఆయనకలవాటే..  ఇలా ఫోన్లు చేయడం… అని … దీనివలన జరిగేదేమిటంటే  సంబంధబాంధవ్యాలలో కొంత  stress  ఏర్పడుతుంది.

కొంతమందుంటారు—ఫలానా టైముకొస్తామూ అంటే ఠంచనుగా వచ్చేస్తారు—ఎలాఉంటుందంటే వాళ్ళరాకతో  మన గడియారం  set  చేసికునేటంతగా..

చెప్పొచ్చేదేమిటంటే ఎవరినైనా కలుస్తామని ఫోను చేసినప్పుడు, వెళ్ళాలనే లేదు., కానీ కారణాంతరాలవలన వెళ్ళలేకపోతే కనీసం ఓ ఫోనైనా చేసి చెప్తే బావుంటుంది…. వాళ్ళుకూడా పనులు మానుకుని కూర్చోనక్కరలేదు… ఎవరిష్టం వారిదనుకోండి…

 

%d bloggers like this: