బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– లౌడ్ థింకింగ్..

సాధారణంగా కొందరిని చూస్తూంటాము, జంతువులనో పక్షులనో పెంచుకోవడం, విదేశాల్లో అయితే పులిపిల్లలని కూడా పెంచుకుంటారుట. ఎవరిష్టం వారిదీ.. ఒకలా తీసుకుంటే మనకి పాలిచ్చే ఆవు, గేదె కూడా పెంపుడు జంతువుల కోవలోకే  వస్తాయి కదా.. అదృష్టమేమిటంటే, మరీ ఏనుగు ని పెంచుకునేవారిని గూర్చి వినలేదింకా. ఎంతైనా దాన్ని పోషించడానికి కొంచం ఖర్చెక్కువనేమో.. ఈ పెంపుడు జంతువులని తమ స్వంత పిల్లల్లా చూసుకుంటారు..ఒక్కోప్పుడు పిల్లలకంటే ఎక్కువగా, బహుశా నోరులేని జీవాలనేమో.. అందులో తప్పేమీ లేదు.
  సాధారణంగా తమ పిల్లలకి క్రమశిక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.. వాళ్ళుకూడా తల్లితండ్రులు చెప్పిన మాట వినేరకమే.. ఇదివరకటి రోజుల్లో ఎప్పుడైనా చిన్న పిల్లలు మితిమీరి అల్లరి చేస్తే, తల్లో తండ్రో ఒక్కసారి గుడ్లెర్రచేసో, చేత్తో చూపిస్తేనో, అల్లరి ఆపేసేవారు. కానీ ఈరోజుల్లో పరిస్థితులు మారిపోయాయి.

గారం అనండి, తల్లితండ్రుల్లో మొలకెత్తిన అబధ్రతా భావం అనండి, చిన్న పిల్లల  I Q  కూడా మోతాదెక్కువే…  ఆరోజుల్లో, చిన్నపిల్లలు ఏడిస్తే, ఏ ఆటబొమ్మో ఇస్తే ఊరుకునేవారు, ఆరోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడంతా మొబైల్, రిమోట్ల యుగమాయె. ఏదో ఒకటిస్తేనే కానీ పేచీ ఆగదు. తల్లితండ్రులుకూడా దానికి అలవాటైపోయారు.. పోనిద్దురూ ఎవరి సావకాశం వారిదీ. కానీ వీళ్ళెవరింటికైనా వెళ్ళినప్పుడు, కొంతమంది పిల్లలకి, ఆ ఇంట్లో ఉండే, మొబైల్, రిమోట్లమీదే కళ్ళుపడతాయి.. ఇంక ఊరుకోవడమంటూ ఉండదు, వెంటనే అదేదో చేతిలోకి తీసుకుని కెలికేదాకా ఊరుకోడు. ఇదిమాత్రం, కొందరికి ఇబ్బందిగా ఉంటుంది, పోనీ ఆ పిల్లాడి పేరెంట్స్ ఏమైనా కలగచేసుకుని, కంట్రోల్ చేస్తారేమో అని చూద్దామా అంటే, అబ్బే వాళ్ళు తమ “ ఆంఖోకా తారా “ తెలివితేటలు చూసి మురిసిపోతారు తప్ప, “ కాదమ్మా అలా ప్రతీదీ తీసేయకూడదు “ అని మాత్రం ఛస్తే చెప్పరు.. ఇక్కడ ఈ గృహస్థు మాత్రం కంగారుపడిపోతూంటాడు, అసలే ఈ వచ్చినవాళ్ళు , తమని చూడ్డానికి వచ్చినవాళ్ళాయె, ఏ మొబైల్లో తగలేస్తే, కొడుకూ కోడలూ ఏమంటారో ఏమో. ఎరక్కపోయి పిలిచానురా బాబూ అనుకోవడం తప్ప చేసేదీ లేదు. పోనీ తనే చొరవ చేసి, ఆ మొబైలేదో ఆ పిల్లాడి చేతులోంచి తీసేసుకుందామా అంటే, ఆ వచ్చిన వాళ్ళ  so called  మనోభావాలు ఏమైనా  hurt  అవుతాయేమో అని భయం.. ఆ దేవుడిమీద భారం వేయడమే. ఇవి పిల్లల సంబంధిత సమస్యలు. ప్రాణాంతకం  కాకపోయినా, ఎవరింటికైతే వెళ్ళేరో వాళ్ళకి సమస్యలు తెస్తూంటాయి.

గదిలోకి వెళ్ళి తలుపు భళ్ళున వేసేసికోవడం ఓ పిల్లాడికి ఆటగా ఉంటుంది. వాళ్ళింట్లో అయితే, తాళాలు బయటే ఉంటాయికాబట్టి ఫరవాలేదు… కానీ అదే ఇంకోరి ఇంటికి వెళ్ళి చేస్తే,  తలుపులు బద్దలుకొట్టాల్సొస్తుంది. కొంతమంది తల్లితండ్రులు, ఎవరైనా వారింటికి వచ్చినప్పుడు, ఆటవస్తువులు దాచేస్తూంటారు… అదే తల్లితండ్రులు ఎవరింటికైనా వెళ్ళి, అక్కడి ఆటవస్తువులు తగలెట్టినా, పిల్లల్ని కంట్రొల్ చేయరు.

పిల్లల్లాగే కొంతమంది కుక్కలూ, పిల్లులూ కూడా పెంచుతూంటారు. వాళ్ళింట్లో వాళ్ళిష్టమే.. కానీ ఆ కుక్కని, కాలకృత్యాలు చేయించడానికి వీధిలోకి తీసికెళ్ళినప్పుడు, దాని మెడకు ఓ గొలుసు వేయాలని ఎందుకు గుర్తుండదో?  చాలామంది వేస్తూంటారు, కానీ వందలో పదిమందికి, వాళ్ళ కుక్కని వదిలేయడం ఓ దౌర్భాగ్యపు అలవాటు..కొత్తగా ఎవరినైనా చూస్తే,  అరవడం, వాళ్ళమీదకి ఎగరడం చూస్తూనే ఉంటారు పక్కనుంచి.. అయినా సరే “ ఏమీ చేయదండీ..” అంటారే కానీ దాన్ని కంట్రొల్ మాత్రం చేయరు… కొంతమందికి కుక్కలంటే భయం, అలాటివారు కుక్కలున్న ఇంటికి వెళ్తే నరకమే.. దాన్ని కట్టేస్తే దాని మనోభావాలు దెబ్బతింటాయట.. అందుకోసం, మనతోనే ఉంటుందిట. ఇవేం ప్రేమాభిమానాలో? పైగా ఆ కుక్కకి “ అంకుల్ వచ్చారు హలో చెప్పమ్మా.. “ అంటూ కబుర్లోటీ.. ఇక్కడ ఆ వెళ్ళినతనికి  B P  పెరిగిపోతూంటుంది. అలాగే  ఎపార్ట్మెంట్లలో పెంపుడు పిల్లుల్ని వదిలేస్తూంటారు.. రాత్రిళ్ళు బయట  పెట్టిన చెత్త బుట్టలన్నిటినీ బలవంతంగా పీకి పరిసరాలు ఖరాబు చేస్తూంటాయి. అయినా సరే, ఈ పెంపుడుపిల్లి యజమాన్లకి ఏమీ పట్టదు.

కుక్కల్నీ, పిల్లుల్నీ పెంచుకోవడం వద్దనడం లేదు, కానీ వాటిని బయట వదిలినప్పుడే అసలు గొడవంతానూ.. కొద్దిగా బయటివారి గురించికూడా ఆలోచించే సంస్కారం కూడా ఉంటే, అందరికీ బావుంటుంది…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– utter confusion

 సాధారణంగా చూస్తూంటాం..  పట్టణాలు, నగరాల్లో , ప్రతీ దానికీ , ఓ ప్రత్యేకమైన జాగా ఉంటుంది… ఒకే రకమైన వ్యాపారాలు అక్కడే కానిస్తూంటారు..  ఉదహారణకి  ఇనుప సామాన్లన్నీ ఓ చోటా, బంగారం కొట్లన్నీ ఓ చోట, అలాగే బట్టల దుకాణాలన్నీ ఓ చోటా.. అలాగే సబ్జీ మార్కెట్ కూడా .. ఫుట్ పాత్ ల మీద పెట్టే కూరలకొట్లు కూడా ఒకే వరసలో ఉంటాయి.. పూర్వపు రోజుల్లో వారాంతపు “ సంత “ లాగ.. ఒకవిధంగా జనాలకి సౌకర్యం కూడానూ.. ఓ కొట్లో వస్తువు నచ్చకపోయినా, లేకపోయినా, అదే వీధిలో ఉండే మరో కొట్టుకు వెళ్ళొచ్చు.. దీపావళి సామాన్లకి కూడా ఓ ప్రత్యేక స్థలం ఉంటుంది. అంతదాకా ఎందుకూ, ఈ రోజుల్లో చూస్తూంటాం.. ఊళ్ళో పురోహితులందరూ పొద్దుటే ఓ చోట సమావేశం అవుతూంటారు.. అలాగే రోజువారీ పనులు చేసే వడ్రంగి, ప్లంబర్, తాపీమేస్త్రీ, వగైరా … ఒకేచోటుంటారు. అలాగే మా చిన్నతనం లో కాకినాడ లో “ సినిమా స్ట్రీట్ “ అని ఉండేది..  సినిమా హాళ్ళన్నీ ఆవీధిలో ఉండేవి.. ఒకదానికి టికెట్ దొరక్కపోతే మరో సినిమా..  ఆరోజుల్లో అన్ని సినిమాలూ బావుండేవి.. ఇప్పటిలాగ కాదు… 

 కాలక్రమేణా, వివిధ రకాల వ్యాపారాలూ “ ఒకే గొడుగు” కిందవచ్చే  మాల్స్ తయారయాయి..అన్ని రకాల పనులూ పొద్దుటినుండి సాయంత్రం దాకా పూర్తిచేసేసుకోవచ్చు.కొనేవేవో కొనుక్కుని, అక్కడే ఉండే ఫుడ్ సెంటర్ లో తినేసి, అందులోనే ఉండే మల్టీ ప్లెక్స్ లో ఓ సినిమా కూడా చూసేసి రాత్రికి ఇంటికి వచ్చేయొచ్చు.

 వీటన్నిటిలోనూ ఓ విషయం గమనించొచ్చు.. ఖరీదుల విషయానికొస్తే, ఆ మాల్ లో ఉండే ప్రతీ కొట్టులోనూ, ఏదో డిస్కౌంట్ల తేడా తప్ప,  almost  ఒకేలా ఉంటుంది (  ofcourse on the higher side only)..  ఓపికుంటుంది కాబట్టి వెళ్తున్నారూ.. No issue..  అలాగే నగరాల్లో తిరిగే ఆటోలు, ఒక్కో వీధిలో ఒక్కో స్టాండ్ లో పెట్టుకుంటారు.. వాళ్ళనడిగినా అందరూ ఒకే రేటు.. మీటర్ పనిచేయడం లేదు.. ఎంత  ఐకమత్యతో కదా…కొంతకాలంగా అవేవో ఊబర్లూ, ఓలాలూ వచ్చాక , వాటిని వాడుకుంటున్నారు..కనీసం రోడ్డుచివరదాకా నడిచి ఆటోవాళ్ళతో బేరాలాడక్కర్లేదని..

 ఇంక ఆన్లైన్లో అయితే ఏదైనా తెప్పించుకోవచ్చు, మనిష్టం.. ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, ఏదో ధరల్లో కొద్ది తేడాతో కావాల్సినవి కొనేసుకోవచ్చు.

 కానీ ఈ “ ఐకమత్యత” లేని  “ వ్యాపారస్థులు” ఎవరో తెలుసా?  ఏదైనా రోగం వస్తే, మనం సంప్రదించే డాక్టర్లూ, మానవ బలహీనతల్ని సొమ్ముచేసుకునే, టీవీ ల్లో వచ్చే జ్యోతిష్కులూ,  Youtube  లో 24 గంటలూ హోరెత్తేంచేస్తున్న , రకరకాల మూలికా వైద్యులూనూ…

 ఓ డాక్టరు దగ్గరకి వెళ్ళి రకరకాల టెస్టులూ, ఎక్స్ రేలూ తీయించుకుని, అదేదో second opinion  కోసం, ఈ ఫైలంతా మోసుకుని వెళ్ళండి—ఆఫైలువేపు కనీసం చూడకుండా, పక్కని పడేసి, ఇదివరకు తీసుకున్న టెస్టులే, ఇదివరకు తీసుకున్న ఎక్స్ రేలూ, మళ్ళీ చేయించుకుని రిపోర్ట్స్ తెమ్మంటాడు. అదేమిటండీ రిపోర్టులు తీసుకొచ్చానుగా మొన్ననే వేలకు వేలు పోసి తీసుకున్నానూ, అన్నా సరే.. అదేదో  parameter  రిపోర్ట్, ఫలానా  angle  లో X Ray..  కావాలంటాడు.. ఛస్తే పాత రిపోర్టులని మాత్రం నమ్మడు.. మందులు కూడా, తన క్లినిక్ బయటుండే  medical Shop  లోనే దొరుకుతాయి అదేం చిత్రమో.. వాళ్ళూ, వాళ్ళ స్నేహితుల లాబ్బులూ కూడా బతకాలిగా…

 అలాగే వారం వారం టివీ ల్లో వచ్చే “ వార ఫలాలు”.. ఒకే రాశికి, ఒకాయన ఒకటి చెప్తారు, మరో చానెల్ లో మరొకాయన, దీనికి పూర్తి విరుధ్ధంగా చెప్పి, ఏవేవో శాంతులూ, పూజలూ చేయించాలంటారు.. ఎవర్ని నమ్మాలో తెలియదు.. వీటికి సాయం, యూట్యూబ్ లో అయితే, మీకు ఓపికుండాలి కానీ, వందలాది జ్యోతిష్కులు రాశి కి ఓ క్లిప్పూ, నక్షత్రానికి ఓ క్లిప్పూ దాంట్లో ఆవారం భవిష్యత్తూ…అవి కూడా అంతే ఒకరొకరికి పొంతనుండదు.. ఏ సోషల్ మీడియాలోనో ఈ విషయం ప్రస్తావించినా,  వ్యక్తిగత జాతకాన్ని బట్టి అన్వయించుకోవాలీ అంటారు..

 ఈ మధ్యన యూట్యూబ్ లో మరో రంధి ప్రారంభమయింది.. దేశంలో ఉండే ప్రతీ రోగానికీ, తలో వైద్యమూ.. ఒకాయన నిషిధ్ధమని చెప్పిన తిండి, మరొకాయన  అదే తిండి, “ ఏం పరవాలేదూ.. హాయిగా తినొచ్చూ.. నేను గారెంటీ..” అంటారు.

 ఏమిటో అంతా గందరగోళం..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు.. moral policing..

మన దేశంలో  జనాలకి వినోదం కలిగించడానికి, ఒకానొకప్పుడు వీధినాటకాలు, ఆతరవాత  బహిరంగప్రదేశాల్లో, స్టేజి మీద నాటకాలు, ఆ తరవాత సినిమాలు.. మొదట్లో మూకీలూ, తరవాతరవాత టాకీలూ వచ్చాయి..  సినిమాలకి ఓ సెన్సార్ బోర్డు కూడా పెట్టారు.. ఏమైనా అభ్యంతరకర దృశ్యాలో, డయలాగ్గులో ఉంటే, వాటిని నియంత్రించడానికి.. వాటికి అవేవో.. U and A   సర్టిఫికేషన్ ఇచ్చిన తరవాత మాత్రమే, సినిమా విడుదలయేదీ, అవుతోంది కూడా..

ఆ సెన్సారింగ్ కూడా ఒక్కోప్పుడు మరీ చిత్రంగా ఉండేది. డయలాగ్గుల్లో ద్వందార్ధాలు ఉండకూడదూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంభాషణలుండకూడదూ.. పాటల్లో కూడా ఏవేవో నియంత్రణలుండేవి.. ఇంక దృశ్యాలైతే..  హీరోయిన్ చీర పాదాలపైకి కనిపించిందా.. కట్.. ముద్దులమాటే ఎత్తకూడదూ.. భార్యాభర్తల మొదటి రాత్రైతే .. ఓ పువ్వుమీద తుమ్మెద వాలినట్టు చూపించి, తరవాతి సీన్  లో ఓ పిల్లో పిల్లాడినో చూపించేస్తే సరిపోయేది..ఏమిటో ఆరోజుల్లో  ప్రేక్షకులు కూడా అల్ప సంతోషులు.. ఏ క్లబ్ డాన్సో వచ్చినప్పుడు ఈలలు వేసి, తమ ఆనందం వ్యక్తపరిచేవారు… కాలక్రమేణా, సెన్సారింగ్ లేకుండా, కొన్ని సినిమాలు విడియో టేప్ రూపంలో, రహస్యం గా, చూసేవారు..అప్పుడప్పుడు పోలీసులకి పట్టుబడేవారు..

 టీవీ ల్లో వచ్చినా, మరి కొన్ని కట్ లు  ఇప్పటికీ దూర్ దర్శన్ లో వేసే సినిమాల్లో చూస్తూంటాము.. టీవీల్లో  DTH  లు వచ్చాక, వేలాది చానెల్స ధర్మమా అని, విడేశీ చిత్రాలు కూడా చూస్తున్నారు.. ప్రస్తుతం అంతర్జాలం ధర్మమా అని, మరో మెట్టు ఎక్కారు.. అవేవో  Amazon Prime, Netflix, Hotstar, etc..  లలో అన్నిరకాలూ చూడగలుగుతున్నారు..  మన దేశంలో కాబట్టి, సెన్సారింగైతే ఉంటుందే.. అయినా అదో కాలక్షేపం.. కానీ వీళ్ళందరూ అవేవో  Webseries  అని మొదలెట్టారు అన్ని భాషల్లోనూ.. ఇవైతే  height of it.. ఎటువంటి restrictions  ఉండవు..వాళ్ళదే రాజ్యం.. పైగా వీటికి Seasons  ఓటీ 1…2..3.. అంటూ..కథేమీ ఉండదు పెద్దగా.. కానీ సినిమాల్లో ఛాన్స్ రానివాళ్ళూ, బుకింగులు తక్కువైన అలనాటి నటులూ, నటీమణులూ..వీటిల్లో హాయిగా ఛాన్సులు కొట్టేస్తున్నారు.. వీళ్ళకి ఉండాల్సిన  main qualification  ఒళ్ళంతా చూపించగలగాలంతే.. ఇంక డయలాగ్గులంటారా. వీళ్ళదే రాజ్యం..  Four letter words  ధారాళంగా ఉపయోగించొచ్చు.. సంభాషణలు రాసేవారిక్కూడా పండగే..ఒకానొకప్పుడు ప్రేక్షకుల ఊహాశక్తికి వదిలేసే శృంగార దృశ్యాలు  విచ్చలవిడిగా చూపిస్తారు.. కారణం వీటికి సెన్సారింగనేది లేదు కనుక.. పైగా మొదట్లో ఓ  disclaimer  పెట్టేసి చేతులు దులిపేసికుంటారు ఆ  Webseries  నిర్మాతలు.

  పైన రాసినది ఏదో చాదస్థంగా కనిపించొచ్చు.. కానీ ఒక్క విషయం చెప్పండి.. ఈ రోజుల్లో పైన చెప్పిన  Apps  అన్నీ కూడా, మొబైల్స్ లో కూడా చూడొచ్చుకదా..ఇలాటివన్నీ ధారాళంగా చూపిస్తూ.. దేశంలో అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయో అని ఏడవడం దేనికీ? ఈరోజుల్లో చేతిలో  smart phone  లేని, ఓ కుర్రాడూ కుర్రదీ ఉన్నారంటారా?  వాళ్ళని నియంత్రించగలరా?

 మాట్టాడితే  moral policing  అంటూ, నైట్ క్లబ్బులూ,  Porn sites అవీ నియంత్రిస్తారే మన ప్రభుత్వాలూ, ఈ  webseries  వాళ్ళ దృష్టిలోకి రాలేదంటారా లేక వచ్చినా ,  ఇలాటివి ఆ కోవలోకి చెందినవి కావని అభిప్రాయమా? కాదూ కూడదంటే తిరిగి అధికారంలోకి రాలేమేమో అని భయమా?

అసలు కారణం… వీళ్ళు ఎంత నియంత్రించాలని ప్రయత్నించినా వాటి దారి వాటిదే అని వీళ్ళకీ తెలుసు. మన దేశంలో ఎన్నో రకాల చట్టాలైతే ఉన్నాయి ప్రతీ దానికీ.. ఏదో సందర్భం వచ్చినప్పుడు, selective  గా ఉపయోగిస్తారు తప్ప అవేవో ఆచరించాలని చేసినవేవీ కావని అందరికీ తెలుసు…. ఇదంతా కంఠశోష అని తెలిసినా… ఏదో….

సర్వేజనాసుఖినోభవంతూ…

బాతాఖాని- లక్ష్మి ఫణి కబుర్లు– రైల్వేల నిర్వాకం..

 అప్పుడెప్పుడో దురాంతో లో పూణె నుండి, హజ్రత్ నిజాముద్దీన్ దాకా వెళ్ళాం.. ప్రయాణం గురించి ఓ ఐడియా ఉంది.. భోజనం, చాయ్, స్నాక్స్ లాటివి ఇస్తాడని.. మేము సాధారణంగా పూణె నుంచి సికిందరాబాద్ దాకా శతాబ్ది లోనే వెళ్ళి , మర్నాడో మూడోనాడో శతాబ్దిలోనే తిరిగిరావడం.. మొదట్లో చైర్ కార్ లోనే వెళ్ళినా, ఈమధ్య కన్సెషన్ ఎలాగూ ఉంది కదా అని,  Executive Class  లో మొదలెట్టాము.. ఇక్కడైతే కాళ్ళు జాపుకోడానికి తగినంత జాగా ఒకటీ, తిండిలో కూడా తేడా గమనించాము.. భోజనం ఒక్కటే అయినా, మిగతా గంట గంటకీ ఇచ్చేవాటిలో చాలా తేడా ఉంది..

 మరీ శతాబ్ది లో 7-8 గంటలు కూర్చోడం కష్టంగా అనిపించి, మొన్న వెళ్ళినప్పుడు, తిరుగుప్రయాణానికి శుక్రవారం,  Sec’bad- LTT  దురాంతో ఉంది కదా అని అందులో బుక్ చేసుకున్నాను…

గమనించే ఉంటారు.. IRCTC  లో బుక్ చేసేటప్పుడు, వాడిచ్చిన ఆప్షన్స్ లో ఏ ఒక్కటి టిక్ చేయకపోయినా , అంటే..  Age, Gendre,  Berth preference,   Concession, Meal  వీటిలో  ఏదైనా మర్చిపోతే ఓ  alert  వస్తుంది కదా.. మొత్తానికి అవన్నీ ఫిల్ అప్ చేసి బుక్ చేసాను.. పోనీ పడుక్కుని వెళ్ళొచ్చు కదా అని…

శుక్రవారం రాత్రి 11 గంటలకి ట్రైనూ.. పదింటికల్లా చేరి, మొత్తానికి అదేదో  PF 9  మీద ఉంటే, అవేవో ఎస్కలేటర్లూ అవీ ఎక్కి, ఓ అరఫర్లాంగ్ నడిచి, మొత్తానికి ట్రైన్ ఎక్కాను..

 IRCTC  వాడు వయసూ, బెర్త్ ప్రిఫరెన్సూ అడగడమైతే అడిగాడు కానీ, 75 ఏళ్ళవాడికి  Upper Berth  ఇవ్వడమేమిటీ? అసలు అడగడం ఎందుకో? ఆ అప్పర్ బెర్త్ ఎక్కుతూ, ఏ కాలో చెయ్యో విరిగితే వాడు ఏమైనా కాంపెన్సేట్ చేస్తాడా పెడతాడా? మొత్తానికి, ఓ పెద్ద మనిషిని రిక్వెస్ట్ చేస్తే, పాపం ఒప్పుకున్నాడు, తన మిడిల్ బెర్త్ ఇవ్వడానికి…

ఈ రిక్వెస్ట్ ల సందర్భంలో ఓ చిన్న అనుభవం … అదేం కర్మమో నాకు కన్సెషన్ ప్రారంభం అయినప్పటినుండీ ఇదే తంతు.. వాడు అప్పర్ బెర్త్ ఇవ్వడం, నేనేమో ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకోవడం..ఓసారి చిర్రెత్తుకొచ్చి  IRCTC  వాళ్ళకి ఓ  mail  పంపి అడిగితే, వాడిచ్చిన సమాధానం.. ఈ బెర్త్ వ్యవహారాలు అవేవో కంప్యూటర్ లో random  గా జరుగుతాయీ, మేమేమీ చేయలేమూ.. మహా అయితే తోటి పాసెంజర్లని రిక్వెస్టు చేయడమే.. అని జ్ఞానబోధ చేసాడు.. నాయనా బభ్రాజిమానమూ, నేను  చేస్తున్నదదే.. ఏదైనా విమోచనామార్గం తెలపరా అంటే, మళ్ళీ జవాబు లేదు.అదేమిటో రైల్వే వాళ్ళకి అంతులేని ప్రేమ నేనంటే.. చివరకి  AC I, AC2  ల్లోకి మారాము కన్సెషన్ ధర్మమా అని..ఏమైనా నా జాతకం మారిందేమో అని చూస్తే  AC3  లో మళ్ళీ సీన్ రిపీట్..

 ఓ  good Samaritan  నన్ను  oblige  చేసారని చెప్పానుగా, కానీ అప్పటికే మరొకరిని కూడా  oblige  చేసినట్టు,  T C  వచ్చినప్పుడు తెలిసింది. నాకంటే ముందే, ఒ దంపతులకి విడి విడి బోగీల్లో ఇవ్వడంతో, పాపం ఇతను బెర్త్ మారాడు. చెకింగ్ కి వచ్చినప్పుడు టిసీ ఒప్పుకోడే.. అదేదో మరో బోగీ, నాకు తెలియదూ అంటాడు. అప్పటికీ ఈ పెద్దమనిషి, తను ఎవరికోసం మార్చాడో, ఆ  PNR No  స్కాన్ చేసింది చూపించినా కూడా…రాత్రి ఒంటిగంట దాకా ఇదో భాగవతం.

ఇంక మిడిల్ బెర్త్ లోకి ఎక్కడానికీ నానా యోగాసనాలూ  చేస్తే కానీ పట్టం. మిడిల్ బెర్త్ లోకి ఎక్కడమంత మహా యజ్ఞం మరోటి లేదు…

 ఇంక చివరగా, ఆప్షన్స్ లో వెజ్జా  నాన్ వెజ్జా అని అడిగాడూ, రాత్రిపూట ఏమిస్తావని ఎటెండెంట్ ని అడిగితే, 8 దాటిన తరవాత బ్రేక్ ఫాస్టూ అన్నాడు.. మేమేమో పూణె లో , 750 కి దిగిపోతాము కదా, మరి మాకో అని అడిగితే, లేదూ అన్నాడు. అలాటప్పుడు ఆ ఆప్షన్స్ అడగడం ఎందుకూ, టిక్కెట్టులో తీసుకోవడమెందుకూ?

దీక్షా వస్త్రాలు మాత్రం ఇచ్చాడు…

అదండీ రైల్వేల వారి నిర్వాకం.. హాయిగా శతాబ్ది లోనే హాయి..

అఛ్ఛే దిన్ అంటే ఇవేనేమో…

 మేరా భారత్ మహాన్…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- మేరా భారత్ మహాన్..

  మన పాలకులకి అకస్మాత్తుగా ఐడియాలొచ్చేస్తూంటాయి…అదేదో చాణక్య నీతి అని ఓ పేద్ద పేరు పెట్టుకుంటారు. అది  జాతీయ స్థాయి అయినా, రాష్ట్ర స్థాయి అయినా ఫలితం ఒక్కటే.. “ రాజు గారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా ? ..” అన్నట్టుంటాయి కొన్ని కొన్ని నిర్ణయాలు.వీటికి కారణాలు ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి. సాధారణంగా ఏలినవారి “ మూడ్ “ ని బట్టుంటాయి.   ఉదాహరణకి తరతరాలనుండీ జరుగుతూన్న సాంప్రదాయలని, అకస్మాత్తుగా మార్చేయడం. దానికో పెద్ద కారణం కూడా అక్కర్లేదు.. జస్ట్ అధికారంలో ఉన్నవారికి అలా అనిపించిందీ.. చేసేసారు.. ప్రజలు ఏ గంగలో దిగితే ఎవడికీ ? –

 మన దేశంలో భక్తికి పెద్ద పీట కదా..  భక్తికి ముఖ్యకారణం నమ్మకం.. ఈ రోజుల్లో ఆధ్యాత్మికత కూడా, వ్యాపారమయిపోయింది.. అది వేరే విషయం. వ్యాపారాత్మకం కాకపోతే , ఎక్కడైనా మతసంబంధిత  సప్తాహాలో, మరోటో, నిర్వహించినప్పుడు, భక్తులందరూ ఫలానా రంగు బట్టలే  ధరించాలని రూలు పెట్టడమెందుకో? ఆగమన శాస్త్రాల్లోనో, వేదాల్లోనో ఈ ప్రస్తావన ఉందా? మా చిన్నప్పుడు, మేమూ దేవాలయాలకి వెళ్ళేవాళ్ళం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకీ వెళ్ళేవాళ్ళం.. ఆరోజుల్లో   Dress Code,  సింగినాదం లాటివి ఎప్పుడూ వినలేదు. సాంప్రదాయ దుస్తుల్లో వెళ్తే సరిపోయేది.. అదేకాకుండా, అవేవో  VIP  దర్శనాలూ,  Special  దర్శనాలూ వాటికి వందల్లో టిక్కెట్లూ ఉండేవి కాదు.. అలా అంటే, “ జనాభా ఎక్కువైపోయింది కదండీ..” అంటారు.వెళ్ళేవారికి క్షణాల్లో దైవ దర్శనం అయిపోవాలే.. ఈ పరిస్థితి నే  Cash  చేసుకుంటున్నారు  దేవాలయ నిర్వాహకులు.. “ ఇంత సొమ్ము కడితే స్పెషల్ దర్శనం.. “ అని ఓ ధర పెట్టేసారు. “ రోగికి కావాల్సిందీ అదే.. వైద్యుడు చెప్పేదీ అదే ..”..  ఈరోజుల్లో డబ్బులకేమీ లోటు లేదాయె.మనం ఎంత మొత్తుకున్నా జరిగేవి మానవని వదిలేయడం  ఆరోగ్య కరం..

 మరో రకం దోపిడీ , ఏమిటంటే  .. లక్షణంగా ఉన్నవాటిని కెలకడం.. తెలుగు రాష్ట్రాలు విడిపోగానే, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ పెడదామా అన్న దానిమీద, ఎన్నో ఎన్నెన్నో ఊహాగానాలు చేసారు..  సామాన్య ప్రజలు చేసుకున్నా నష్టం లేదు, కానీ అధికార పార్టీలో వారే రూమర్లు వ్యాపింపచేయడం ఎంతవరకూ సమర్ధనీయం? ఎవడో ఎక్కడో మొదలెడతాడు.. ఫలానా చోటు లో రాజధాని పెడదాం.. అని ముఖ్య మంత్రిగారే మాటల్లో అన్నారు..అంటూ.. బస్ మన  మీడియాకి పనేమీ ఉండదూ, ఎక్కడెక్కడ  sensational news  వస్తుందా అని చూస్తూ ఉంటారు.. రాజధానికంటే ముఖ్యమైన వార్తుంటుందా.. అంతే మర్నాడు, పేపర్లలో పతాకశీర్షికలు.. ఫలానా చోట కొత్త రాజధానీ.. అంటూ, పైగా వీటిమీద టీవీ ల్లో చర్చాకార్యక్రమాలోటీ?రోజంతా టీవీ లో  Scrolling News.. ఎవడైనా చూడడేమో ఇంత ముఖ్యమైన వార్తా..అనుకుని. రాత్రికి రాత్రి ఆ ప్రదేశ చుట్టుపక్కల  భూములన్నిటికీ రెక్కలొచ్చేస్తాయి. రాజకీయ నాయకులైతే, ఎందుకైనా మంచిదని స్థలాలు కొనేసి, ధరలని  inflate  చేసేస్తారు. మొత్తానికి కొట్టుకుని ఓ రాజధానిని ఏర్పాటు చేసారు..ప్రతిపక్షాలకి ఈ వ్యవహారం లో కిట్టుబాటవలేదుట.. తరవాతి ఎన్నికల్లో  అప్పటివరకూ అధికారం లో ఉన్న పార్టీ కాస్తా, కనుమరగైపోయింది..కొత్త పార్టీ వాళ్ళొచ్చి, ఒకటి కాదూ, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ తలో రాజధానీ పెడదామూ.. అని కొట్టుకుంటున్నారు..కానీ మధ్యలో జరుగుతూన్నదేమిటంటే ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ ప్రారంభమయింది..రాజధాని గొడవెవడిక్కావాలీ? మన బిజినెస్ మూడు పువ్వులూ ఆరు కాయలూ గా ఉండాలి కానీ..

 అంతా సుఖంగా ఉండడం, అదేమిటో పాలకులకి నచ్చదనుకుంటా.. ఏదో ఓ దుమారం లేపితే కావాల్సినంత కాలక్షేపం.. మీడియా వాళ్ళందరికీ  TRP  లు పెరిగిపోతాయీ..  రాజకీయనాయకులకి అడ్డూ అదుపూ ఉండదు.. దేశోధ్ధారకుల్లాగ ప్రకటనలు చేస్తూండొచ్చు. ట్వీట్ లు చేయొచ్చు..

 100 సంవత్సరాలనుండీ  శ్రీ సాయిబాబా క్షేత్రానికి ఓ నమ్మకంతో వెళ్తున్నారు భక్తులు.. ఇన్నాళ్ళూ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.. ఆయన జన్మస్థలం గురించి.. సడెన్ గా ముఖ్యమంత్రి గారికి ఓ అవిడియా వచ్చేసింది.. మేము 1983 లో  మొట్టమొదటిసారిరిడీ బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, ఎంతో ప్రశాంతంగా ఉండేది. బాబా విగ్రహానికి స్వయంగా దండ కూడా వేసుకోగలిగాము.  ఏవో కొద్ది దుకాణాలు తప్ప మరేమీ ఉండేవి కావు. తిరిగి మరోసారి 2007 లో వెళ్ళినప్పుడైతే పూర్తి వాతావరణమే మారిపోయింది.. క్యూలైన్లూ, ఎక్కడ చూసినా తెలుగు వాతావరణం, పెద్ద పెద్ద హొటళ్ళూ.. వగైరా.. భక్తి కంటే వ్యాపారానికే పెద్ద పీట. రద్దీతో పాటు సౌకర్యాలూ పెరిగాయి.. కాదనడం లేదు..స్పెషల్ దర్శనాలూ, ఎక్కడో దూరంనుండే బాబా దర్శనం.. మరీ తిరుపతి లో అంత కాదనుకోండి..  ఏమైతేనేం బాబా ని కూడా  commercialise  చేసేసారు..దేశ విదేశాలనుండి భక్తులూ .. ఓహ్ ..అంతా ఫైవ్ స్టార్ కల్చర్ వచ్చెసింది.డబ్బు సంపాదించాలంటే షిరిడీ లో ఇన్వెస్ట్ చేస్తే చాలన్నంతగా..

 ఇప్పుడు సడెన్ గా  కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రిగారు, బాబా పుట్టిన స్థలం పర్భణి దగ్గరలోని పార్థీ, అక్కడ కూడా అభివృధ్ధి కొసం ప్రభుత్వం 100 కోట్లు గ్రాంట్ చేస్తున్నామూ అనడంతో బాంబు పేలింది.. పార్తీ గ్రామాన్ని కూడా అభివృధ్ధి చేసేస్తే, మనం  షిరిడీ లో పెట్టిన డబ్బంతా ఎలా పెరుగుతుందీ అని ఈ రాజకీయ వ్యాపారస్థులకి గుండెల్లో గుబులు ప్రారంభమయింది.ప్రజల సెంటిమెంటు మీద ఆడుకోవడం, మన నాయకులకి వెన్నతో పెట్టిన విద్యా. అక్కడికేదో  blasphemy  చేసేస్తున్నంత హడావిడి చేస్తున్నారు. నిజమైన భక్తులైతే రెండు పుణ్యక్షేత్రాలకీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటారు.. కానీ , సంపాదించవలసిన ఆస్థిపాస్తులు  divide  అయిపోతాయనే ఈ వ్యాపారస్థుల దుగ్ధ. అలాగని మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక కూడా . ఏదో ఒక ఉద్దేశ్యం లేకపోలేదు.. ఇలాటి ప్రకటనలు చేయడం వెనుక  భూదందా  చేసుకోవడమే.. పూణె లో అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో కూడా ఇదే తంతు…

ఇన్నిటిలోనూ ఆంఆద్మీ కే కష్టాలన్నీ.. పాలకులకి ఏమీ పట్టదు..

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Loud thinking.

నిన్న సంక్రాంతి పూటా , అబ్బాయి , ఊళ్ళో ఉన్న తెలుగు సినిమాలు చూద్దామూ, అని రమ్మంటే , వెళ్ళాము. మొదటిది “ అలవైకుంఠ పురం “.. పొద్దుటే 8 గంటలకల్లా, వచ్చేయమన్నాడు.  హైదరాబాదు వెళ్ళడానికి “ శతాబ్ది “ ఎక్కాల్సినప్పుడు లేచినట్టుగా, తెల్లవారుఝామునే 4 15 కి  లేచి ఊబర్ కాబ్ లో వెళ్ళాము..

 ఈరోజుల్లో తెలుగు సినిమాలు , ఎటువంటి  expectations  పెట్టుకోకుండా వెళ్తేనే ఆరోగ్యకరం.. సినిమా  ఏక్ దం  entertainer..  కథా కమామీషూ ఏమీ లేదు.. కానీ ప్రతీ డయలాగ్గూ  విని హాయిగా నవ్వుకోవచ్చు.. ఎటువంటి వెర్రి మొర్రి వేషాలూ లేకుండా, ఎవరి పరిధిలో వారు నటించారు. మొత్తం రెండుముప్పావు గంటలూ , ఎక్కడా బోరుకొట్టకుండా నవ్వుకోవచ్చు.పాటల  “ బీట్ “ బావున్నట్టే..ఉన్న రెండుమూడు ఫైట్ సీన్లూ పరవాలేదు.   ఎక్కడా విసుగనిపించలేదు.

 ఇంటికి వెళ్ళి,  పిల్లలతో భోజనం కానిచ్చి, ఓ రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకుని, ఇంటికి తిరిగొచ్చేసినా బావుండేది.. కానీ, తలరాతను మార్చుకోలేము కదా.. 4 గంటలకి, రెండో సినిమా కూడా చూసేయాలని “ ఆబ “ ఉందే, అది మహా డేంజరస్. మా చిన్నప్పుడు అమలాపురం చుట్టుపక్కలి గ్రామాల వారు, ఓ రెండెడ్ల బండిలో, అమలాపురం వచ్చేసి, ఓ రెండు మూడు సినిమాలు చూసి తిరిగి ఇళ్ళకు వెళ్ళిపోయేవారు. మేము కూడా అదే పధ్ధతిలో ఒకేరోజున రెండు సినిమాలు చూడాలని అంత యావ ఎందుకు చెప్పండీ?

 ఏదో ఆమధ్య చూసిన “ భరత్ అనే నేను “, “ మహర్షి “ బాగానే ఉన్నట్టు కనిపించాయీ,   “ సరిలేరు నీకెవ్వరు” బాగానే ఉంటుందేమో అనే అపోహతో వెళ్ళాము. అసలు ఆ సినిమా లో ఏం చెప్పాలనుకున్నారో, హాస్యం పేరుతో ఆ స్త్రీపాత్రధారుల వెకిలి వేషాలేమిటో అర్ధమవలేదు. పైగా ఆ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ ఒకటీ.. ఇదివరకొచ్చిన “ ఖలేజా”, “ సైనికుడు “ కమ్మర్షియల్ గా  flop  అయినా, ఆ తరువాత చూసినప్పుడు, ఫరవాలేదనిపించాయి.  ఈ “ సరిలేరు నీకెవ్వరు “ కి అలాటి లక్షణాలేవీ లేవు.  జస్ట్ డిస్గస్టింగ్ అంతే… మరీ మధ్యలో లేచి వెళ్ళిపోతే, రెండేసి వందలు పెట్టి, ఆరు టిక్కెట్లు తిసిన, పిల్లలు బాధపడతారేమోనని, కూర్చుని భరించాల్సొచ్చింది.ప్రతీ అయిదు నిముషాలకీ ఓ ఫైట్ సీనూ..  అర్ధం పర్ధం లేని పాటలూ..

పొద్దుట చూసిన సినిమా  enjoyment  అంతా పటాపంచలయిపోయింది.. Most disappointing…

 

 ఎలాగూ ఈ సినిమాలు  Amazon  లోనో  Netflix  లోనో రెండు మూడు వారాల్లో వచ్చేస్తాయిగా, ఎందుకు చెప్పండి వందలూ, వేలూ తగలేసి , థియేటర్ లో చూడ్డం? 

పత్రికల్లోనూ, సోషల్ మీడియాలోనూ  రివ్యూలు రాస్తూంటారు కొందరు.. వాళ్ళదేం పోయిందీ? మన లాగ వందలేసి రూపాయలు పెట్టి టిక్కెట్లేమైనా కొనాలా పెట్టాలా?  ఫుకట్ గా నే చూసి, “ విశ్వాస పాత్రం” గా , చూసిన సినిమాని పొగిడేస్తారు.. లేకపోతే, భవిష్యత్తులో వచ్చే సినిమాలకి కాంప్లిమెంటరీ టిక్కెట్ట్లు దొరకవు.

అలాగే మిగిలిన వ్యాపార ప్రకటనలు కూడానూ.. ఏ సెలెబ్రెటీ కో లక్షలూ, కోట్లూ పోసి  ప్రకటనలు తయారు చేస్తారు.. వాళ్ళేమైనా వాడారా పెట్టారా? మనకి అంటగట్టడమే కదా.. పైగా ఆ   Ad Campaign  డబ్బులన్నీ మన దగ్గర వసూలు చేస్తారు…

 Moral of the Story  :  ఎప్పుడూ సినిమాల రివ్యూలు చదివీ, వ్యాపార ప్రకటనలు చూసీ..తద్దినం కొని తెచ్చుకోనక్కర్లేదు…

బాతాఖాని-=లక్ష్మిఫణి కబుర్లు… Life goes on…

 ఇదివరకటి రోజుల్లోనే హాయిగా ఉండేది- ఏదైనా సందర్భంలో పిల్లలకో, పెద్దవారికో  ఓ బహుమతి ఇవ్వాలంటే, కొన్ని ప్రత్యేక వస్తువులతో పనైపోయేది. కానీ , ఈరోజుల్లో మనం ఇచ్చే బహుమతి కి విలువ అనేది ఉండటంలేదు. ఒక్కో సందర్భానికి  ఏదో కొంత డబ్బు కేటాయించి, ఆ బడ్జెట్ లో ఏదో ఒక వస్తువు తీసికెళ్తే  పనైపోయేది.

 ఏ పసిబిడ్డ బారసాలకో పిలిస్తే, ఓ బుల్లి గ్లాసో ( స్టెయినెస్ స్టీల్ ది), లేదా ఓ కప్పో, సాసరుతోనో లాగించేసేవాళ్ళం. మళ్ళీ ఇందులో ఓ తిరకాసుండేది- ఓకుటుంబంలోంచి పెద్దా, చిన్నా అందరినీ పిలిచామనుకోండి, ఏదో స్టీలు సామాన్ల కొట్టుకెళ్ళి, ఒకరు చెంచా, ఒకరు ప్లేటు, ఇంకోరు కప్పూ తీసికుని మొత్తానికి పని కానిచ్చేసేవారు. అందరూ ఏదో ఒకటి తెచ్చినట్టూ ఉండేదీ, మనకీ ఓ “ సెట్టు” తయారైపోయేది. ఒక్కోప్పుడు సెట్టులోకి ఏదో ఒకటి తక్కువయ్యేది. అందుకే ఇళ్ళల్లో ఇప్పటికీ చూస్తూంటాము, అందరి ఇళ్ళల్లోనూ కాదనుకోండి, ఇంకా చిన్నప్పటి ఆ అభిమానాలు గుర్తుంచుకుని, ఆనాటి వస్తువులు ఉన్న వారిళ్ళల్లో, ఒంటిపిల్లి రాకాసి లాగ, ఓ ప్లేటో, కప్పో, ఇదేమిటీ దీని “జోడీ” ఏదీ అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొస్తుంది—ఓహో ..మన పెద్దాడి బారసాలకి ఫలానా వారిని పిలిచాము కదూ, వాళ్ళిచ్చిందీ అని !. ఎందుకంటే ఆ రోజుల్లో ఓ వస్తువు ఇవ్వడమే కాదు, దానిమీద పేరు కూడా చెక్కించేవారు, “ప్రూఫ్” కోసం.  Ofcourse  ఈరోజుల్లో,ఫొటోలు తీయడంలేదూ మరి? ఆ వచ్చినవాడు ఏదైనా తెచ్చాడా లేదా, బఫేలో ఎంత తిన్నాడూ అన్నవన్నీ విడియోలో రికార్డు చేసేయడం. ఆ విడియోవాడు, ప్రత్యేకంగా వేదిక మీదా, భోజనం ప్లేటు తీసికుని తింటున్నప్పుడు, వాడి కెమేరా తీసికుని అందరినీ విడియో తీయడం ఎందుకనుకుంటున్నారు మరీ?

  ఈరోజుల్లో ఓ కొత్త సాంప్రదాయం ఒకటి మొదలెట్టారు, శుభలేఖల్లోనే    “బహుమతులూ, పుష్పగుఛ్ఛాలూ స్వీకరంచబడవూ” అని ఓ disclaimer  పెట్టేయడం.  కవర్లలో డబ్బుల మాట ఎవడూ ఎత్తడు, ఎందుకైనా మంచిదీ అని ! ఎలాగూ ఏదీ తీసికోరూ అన్నారు కదా అని, కొంతమందేమో చేతులూపుకుంటూ బయలుదేరతారు. తీరా అక్కడికెళ్ళేసరికి, ఎవరికివారు, ఓ కవరు వధువు చేతిలోనో, వరుడి చేతిలోనో పెట్టడం చూస్తాడు. అందుకోసం, to be on the safe side,  పేరు వ్రాసిన కవరూ, కొంత డబ్బూ విడిగా పెట్టుకోవడం. మళ్ళీ ఎంత డబ్బుపెట్టాలీ అనే ఆలోచనొస్తూంటుంది. గొడవలేకుండా, భోజనానికి ఎంతమంది వెళ్తే, అన్ని “ ప్లేటు” ల భోజనం  ఖరీదు పెట్టేసి, చేతులు దులిపేసికుంటున్నారు.. చెప్పొచ్చేదేమిటంటే, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకి వెళ్ళడమంటే, ఏదో హొటల్ కి వెళ్ళి భోజనం చేసినట్టుంటోంది.. ఎలాగూ, వెళ్ళినవాళ్ళని పట్టించుకునేవాడెవ్వడూ ఉండడు,  వచ్చేమో, రాలేదో చూసుకోడానికి తరువాత విడియోలు ఎలాగూ ఉన్నాయి. ఇదివరకటి రోజుల్లో, కుక్కర్లూ, ఇస్త్రీ పెట్టెలూ, డిన్నర్ సెట్లూ వచ్చేవి. కానీ , అవికూడా ఒక్కోప్పుడు ఎక్కువ నెంబర్లలో వచ్చేవి. కొత్తకాపరానికి ఒకటి తీసికుని, మిగిలినవి, అత్తారింట్లోనో, పుట్టింట్లోనో, వాటిని వదిలేసేవారు.

 ఇదివరకు ఆఫీసుల్లో ఈ పెళ్ళిళ్ళకి చందాలు వసూలు చేసేవారు, ఓ పాతికమంది, తలో వందా వేసికున్నా, ఓ పాతికవందలతో, ఓ వస్తువు కొనేసేవారు, ఆ వస్తువు కొన్నవాడు, వచ్చేదాకా బయట ఉండి, వాడొచ్చిన తరువాత అందరూ పొలోమంటూ, స్టేజి మీదకెళ్ళి, ఓ ఫొటో తీయించుకుంటే పనైపోయేది. పుణ్యం పురుషార్ధమూనూ.

  ఇంట్లో కొడుక్కో కూతురికో పుట్టినరోజుకో, వివాహ వార్షికోత్సవానికో ఇవ్వాలంటే, హాయిగా ఏ గిఫ్ట్ కూపనో ఇచ్చేస్తే, వాళ్ళకి కావాల్సినవేవో వాళ్ళే చూసుకుంటారు. అయినా మనం ఇచ్చేదానికోసం ఎదురుచూస్తారా ఏమిటీ, ఏదో మన తృప్తీ, సాంప్రదాయమూనూ. కానీ, వచ్చిన గొడవల్లా మనవళ్ళూ, మనవరాళ్ళ పుట్టిన రోజు సందర్భంలోనే. మనకున్న సంపాదనతో, వాళ్ళకి ఏదో ఓ వస్తువు కొనే ఓపికా లేదూ, అధవా ఏదో ఓ “ ఖరీదయిన” వస్తువేదో పోనీ కొని చేతిలో పెడదామా అంటే, ఈ రోజుల్లో వారి తల్లితండ్రులు కొనే వస్తువుల ముందు, మనం కొన్నవి  వెలవెల పోతూంటాయి. మరీ అలాగని డబ్బులు పెట్టలేమూ, అలాగని పెద్దవారికిచ్చినట్టుగా  గిఫ్ట్ కూపన్లూ పెట్టలేము. వాళ్ళ వయసులో ఆశించేది ఓ ఆటవస్తువు కదా. పోనీ ఆలోచించి ఏదో కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వస్తువేదో తీసికెళ్తే, “ అరే ..తాతయ్యా..మా డాడీ ఎప్పుడో కొనేశారూ..” అంటారు. ఈ తాతయ్యలేమో చిన్నబుచ్చుకుంటారు. ఇదివరకటి రోజుల్లోనే హాయిగా ఉండేది, ఈ బహుమతులూ లేవూ, సింగినాదమూ లేదూ, తలంటు పోసి, కొత్త బట్టలు వేసి, నాలుగక్షింతలేసేవారు. గొడవుండేది కాదు.

 కానీ ఈ రోజుల్లో, పెద్ద క్లాసులోకి వెళ్ళారంటే చాలు, ఏదో చోటకి వెళ్ళడం, డిన్నర్లూ, మూవీలూ, గిఫ్టులూ, రిటర్న్ గిఫ్టులూ లేకుండా ఉండడం లేదు. మనమా ఆ వాతావరణంలో ఇమడలేమూ… ఏమిటో అంతా గందరగోళం గా ఉంది. తమ పిల్లలకి ఈ రోజుల్లో, తల్లితండ్రులైతే, మార్కెట్ లోకి వచ్చిన లేటెస్టు gadget  ఇవ్వాల్సిందే. పోనీ ఇంట్లో లేదా అంటే, అదీకాదూ… అందరు స్నేహితుల దగ్గరా ఉందీ, నాదగ్గర అంతకంటే latest  ది ఉందీ అని చెప్పుకోడానికీ, చూపించుకోడానికీనూ…

మనవలకి, మనవరాళ్ళకి పోనీ ఏదైనా వస్తువు కొనిద్దామా అంటే, అప్పటికే మన బడ్జెట్ లో కొన్న వస్తువు అప్పటికే వాళ్ళ తల్లితంద్రులు కొనేయడమూ, వీళ్ళు వాటిని వాడి వాడి, చెత్తలోకి వేసేయడమూ అయిపోయుంటుంది..

అందుకని వయా మీడియా పధ్ధతిలో  మనకుండే ఓపికతో  ఓ  Amazon Gift Voucher  కొనేసి వాళ్ళకి పంపితే, ఏం కావాల్సొస్తే అదే కొనుక్కుంటారు.. కానీ దీనివలన జరుగుతున్నదేమిటంటే, ఏదో ఒక గిఫ్ట్ కొని, వాళ్ళ చేతుల్లో పెట్టడమనే సంతోషాన్ని కోల్పోతున్నాము కదూ…

 ఏదో మొత్తానికి ఎలాగోలాగ కాలక్షేపం చేసేస్తున్నాము..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– manpower utilisation…

 ఒకానొకప్పుడు, అంటే మా రోజుల్లో, ఫాక్టరీకి సంబంధించిన పనులు  అన్నిటికీ, ఫాక్టరీలోని పనివారినే నియోగించెవారు.. కానీ ఇప్పుడో అన్నిటినీ  Outsource  చేసేసారు. ప్రభుత్వం ఇలా చేయడం మూలాన ప్రభుత్వోద్యాగాలు తక్కువైపోతున్నాయి.. ఇప్పుడు ముఖ్యమైన పనులు తప్పించి, ప్రతీదీ—ఆర్డర్లీలు. ట్రాన్స్పోర్ట్, హౌస్ కీపింగ్ లాటివన్నిటినీ ఔట్ సోర్స్ చేసేసి ప్రభుత్వాలు సుఖపడ్డాయి.. ఈమధ్యనే వింటున్నాము, రైల్వేలలో కూడా చాలా పనులు  కాంట్రాక్ట్ పధ్ధతినే చేయబోతున్నారని.

      కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ఏ వస్తువైనా తయారు చేయడానికి కావాల్సిన చిన్నచిన్న భాగాలతో పాటు, పెద్దవికూడా ఒకే చోట తయారయేవి.. కాలక్రమేణా, స్వంతంగా తయారుచేసేబదులు, బయటనుండి తెచ్చుకోవడం ప్రారంభం అయింది. అన్నీ సేకరించి , జోడించి, దానికో కంపేనీ లేబులోటి తగిలించడం. ఈ పధ్ధతి చవగ్గా ఉన్నట్టు కనిపెట్టారు. మార్కెట్ లో దొరికే బనీన్లూ, లోదుస్తులూ  విషయమే తీసికోండి, టోకున  దక్షిణాదిన  ఈరోడ్/ కోయంబత్తూరు లలో తయారవుతాయిట. పెద్ద పెద్ద  Brands అక్కడినుంచే కొనేసి, వాళ్ళ లేబుల్ అంటించేసి అమ్ముకుంటారు. మార్కెట్ లో దొరికే ప్రతీ వస్తువుకీ ఇదే తంతు.  ఈ పధ్ధతి వలన కుటీరపరిశ్రమలకి కూడా బాగానే ఉంది..

అంతదాకా ఎందుకూ, అమెరికాలాటి దేశాల్లో  ఉన్న పెద్ద పెద్ద కంపెనీలుకూడా, తమక్కావాల్సినవన్నీ, మనదేశ కంపెనీలకే అప్పచెపుతారు. దీన్నేదో  Outsourcing  అంటారుట. ప్రతీదానికీ ఓ ముద్దుపేరు పెట్టడం , అక్కడికేదో ఇదేదో ఆధునిక పధ్ధతనుకోవడం మనందరికీ ఓ అలవాటు. ఇదివరకటి రోజుల్లో ఇంట్లో పెళ్ళిళ్ళకీ, వేసంకాలంలో ఊరగాయలు పెట్టడానికీ, దీపావళి సామాన్లు తయారుచేయడానికీ, అందరూ అంటే పక్కనుండేవాళ్ళూ అందరూ ఓ చెయ్యేసేవారు కాదూ ? అవన్నీ  outsourcing  కాదూ? ఈ రోజుల్లో ఏ టైలరు దగ్గరైనా కుట్టడానికి బట్టలిస్తే, చొక్కాలకీ, ఆడవారి బ్లౌజులకీ, బొత్తాలూ, “ కాజాలూ “ కుట్టడానికి వేరే ఎవరికో ఇస్తాడు.

ఈ  so called outsourcing  అన్నది, మన ఇల్లాళ్ళు ఎప్పణ్ణుంచో చేస్తున్నారన్నది, చెప్పుకోడానికి మొహమ్మాటపడతారు కానీ, అందరికీ అనుభవమే. “ చాప కింద నీరు “ లాగనండి, పోలీసాడి లాఠీదెబ్బనండి, బయటవాళ్ళకి కనిపించవు. అంతా  subtle… ఉన్నాయా అంటే ఉన్నాయీ, లేవూ అంటే లేవూ. కాలమాన పరిస్థితులనిబట్టుంటుంది ఏదైనా.

ఇది వరకటి రోజుల్లో భర్త ఒక్కరే పనిచేసేవాడు కాబట్టి, ఉద్యోగంలో ఉన్నంతకాలం గొడవుండేది కాదు.  రోజులన్నీ ఒకేలా ఉండవుగా, ఎప్పుడో అప్పుడు రిటైరవుతాడే. అప్పుడు మొదలవుతాయి కొత్త విధులు…మరీ రాత్రికి రాత్రే అవుతాయని కాదూ, మెల్లిగా అలవాటు చేస్తుంది ఆ ఇంటి ఇల్లాలు. ఆ కబురూ, ఈ కబురూ చెప్పి, “ ఏమిటోనండీ ఈ మధ్యన  మోకాళ్ళ నొప్పీ, నడుం నొప్పీ వస్తోందీ… “ .. అప్పుడు   తెలుస్తుంది మాస్టారికి, మనంకూడా కొన్ని పనులు చేయకపోతే , పరిస్థితి చెయ్యి దాటిపోవచ్చూ అని. కానీ అలవాటులేదే ఎలాగా? పైగా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో, అయినా రోగమా ఏమిటీ, మన ఇంట్లో మన పనులు చేసుకోడానికీ? 

ఉదాహరణకి…

పొద్దుటే లేవగానే దుప్పటీలు మడతపెట్టడం. ఎండేసిన బట్టలు మడతపెట్టడం. భోజనానికి ముందు, కంచం, మంచినీళ్ళూ పెట్టడం లాటివీ, ఫ్రిజ్ లో పెట్టిన  పప్పూ, కూరా లాటివి ఏ మెక్రోఓవెన్ లోనో వేడి చేయడం.  ఎంగిలి పళ్ళాలు, గిన్నెలూ , ఇల్లాలు తోమిన తరువాత  తుడిచి , సద్దడం .

ఈ రోజుల్లో పురుళ్ళకీ, పుణ్యాలకీ విదేశాలకి వెళ్ళడం చాలా చూస్తున్నాం.. కూతురవొచ్చు, కోడలవొచ్చు.. ఓపికున్నంతకాలమూ వెళ్ళి సహాయపడడం ఓ బాధ్యతే కదా. వాళ్ళకి కావాల్సింది , అత్తగారో, అమ్మో. కానీ రిటైరయి ఇంట్లో కూర్చున్న పెద్దాయన్ని కూడా,  buy one get one scheme  లోలాగ తీసికెళ్ళాలే. పెద్దావిడక్కూడా చెయ్యందిచ్చొద్దూ? ఆ పసిపిల్లల డయపర్లు మార్చడానికీ, ఫీడింగ్ బాటిల్స్ కడగడానికీ? మరి ఇవన్నీ  outsourcing  అనక ఇంకేమంటారూ? దీనికి దేశంతో పనిలేదు… స్వదేశంలోఅయినా చేయాల్సిందే.  జిహ్వచాపల్యం ధర్మమా అని, నోటికి హితవుగా ఉంటుందని, ఏ గోంగూరో, మెంతికూరో తెచ్చాడా, వాటిని బాగుచేయడం మాస్టారి విధుల్లోకే వస్తుంది.

40 ఏళ్ళపాటు , మాస్టారిని ఉద్యోగానికి పంపడానికీ, పిల్లల్ని తయారుచేసి స్కూళ్ళకి పంపడానికీ, పాపం ఏ తెల్లారకట్లో లేవాల్సొచ్చేది. ఇంకా ఎన్నాళ్ళూ?   ఇంట్లో ఉండేదా… ఇద్దరూ.. ఈమాత్రం దానికి మరీ బ్రహ్మముహూర్తంలో  లేవడం ఎందుకూ? కానీ మాస్టారికి తెల్లవారుఝామునే లేవడం అలవాటాయె. లేవగానే ఓ గుక్కెడు కాఫీ తాగితేనేకానీ, పని జరగదూ, ఇదివరకటిలాగ కుదరదుగా, మొత్తానికి తనే కాఫీ పెట్టుకుని, ఆ చేత్తోటే పెళ్ళానిక్కూడా రెడీ చేస్తాడు. ఏదో మొహమ్మాట్టానికి, “ అదేమిటండీ నన్ను లేపకపోయారా… “ అని  ఒసారి అనేస్తే పోతుంది. మర్నాటినుండీ, కాఫీ అయినా, సాయంత్రం నిద్ర లేచేటప్పటికి చాయీ, మాస్టారి “ పనికి తిండి “ పథకంలోకి వచ్చేస్తాయి.. లేచినవేళ బాగోక, అన్నంలోకి కలుపుకునే పెరుగు సరీగ్గా తోడుకోలేదని అనడం తరవాయి, ఆరోజునుండీ పడుక్కునే ముందర, తోడు పెట్టడంకూడా మాస్టారే. పాల సంబంధిత కార్యక్రమాలు—పాలు కాచడం, తోడు పెట్టడాల్లాటివన్నీ మాస్టారి ఖాతాలోకి వచ్చేస్తాయి.

అన్నిటిలోకీ ముఖ్యమైనది, భోజనాలయిన తరువాత, మిగిలిపోయినవి ఫ్రిజ్ లో పెట్టడం. సరీగ్గా సద్దకపోతే గిన్నెలు ఆ ఫ్రిజ్ లో సరీగ్గా పట్టకపోతే, “ పెద్ద ఫ్రిజ్ కొనుక్కుందామండీ.. “ కంటే, ఏదో మనమే చిన్న గిన్నెల్లో సద్దేయడం ఉత్తమం కదూ…
ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా పనులు ఎప్పుడో  outsource  చేసేసినట్టే…

 దీన్నే  ఆధునిక పదజాలంలో   optimum utilization of available human resources  అని కూడా అంటారుట…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Identity crisis..

 ఓ ఇరవై సంవత్సరాల క్రితం వరకూ  గెడ్డానికి ఓ ప్రత్యేకత ఉండేది.. సాధారణంగా  సిక్కు మతస్థులు గెడ్డాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ విషయంలో విదేశాల్లో కూడా , ఎక్కడో ఈ గెడ్డాలకి  అక్కడివారు , అభ్యంతరం లేవదీస్తే, న్యాయస్థానాలకి కూడా వెళ్ళి , తమ వాదాన్ని నెగ్గించుకున్న ఉదంతాలున్నాయి.. ఆ గెడ్డమూ, తలపాగా వారికి ఓ  unique identity  ఇచ్చింది.. ఎక్కడున్నా వారిని గుర్తుపట్టొచ్చు.. అంతదాకా ఎందుకూ , మన సైనిక దళాలలో  “ సిఖ్ రెజిమెంట్ “ కి ఎంతో పేరుంది కూడా..

  కాలక్రమేణా, ఎవరైనా మారువేషాల్లో ఉండాలంటే ఓ గెడ్డం తగిలించేవారు.. చిన్నప్పుడు గుర్తుండే ఉంటుంది.. సావకాశంగా కూర్చుని ఆనాటి వారపత్రికల అట్టమీద బొమ్మలకి, పెన్నుతో మీసాలూ గెడ్డాలూ పెయింట్ చేయడం ఓ సరదాగా ఉండేది.

 ఆరోజుల్లో సినిమాల్లోకూడా, హీరోని విడిగా చూపించడానికి, మిగతా దుష్ట పాత్రధారులని గెడ్డాలతోనే చూపించేవారు.. మనకంత హిందీ వచ్చేది కాదుగా,  నున్నగా ఉండేవాడు హీరో, గెడ్డం తో ఉండేవాడు విలనూ అని డిసైడైపోయేవాళ్ళం. అంతదాకా ఎందుకూ,  కొత్తగా పెళ్ళై ఓ ఏణ్ణర్ధం తరవాత ఎవడైనా గెడ్డంతో కనిపిస్తే  “ ఏంరోయ్  పెళ్ళాన్ని పుట్టింటికి పంపావా ఏమిటీ…” అని పరామర్శించేవారు. ఏ మధ్యతరగతి గృహస్థునో కూడా, గెడ్డంతోనే చూపించేవారు అతని ఆర్ధికపరిస్థితికి అద్దం పడుతూ…ఆరోజుల్లో విదేశాలకి అదీ ఇంగ్లాండ్, అమెరికా లాటి దేశాలకి ఓ నెలా రెండు నెలల ట్రైనింగుకో వెళ్ళిన మనవాళ్ళు  తిరిగొచ్చేటప్పుడు , గెడ్డాలు, జులపాలతో తిరిగి వచ్చేవారు.. కారణం అక్కడ క్షువరకర్మకి డబ్బులెక్కువ తీసుకుంటారట.

 సరే మన పురాణాల్లో  ఋషుల ని వారి వారి గెడ్డాలతోనే గుర్తుపడేవారం.. ఈయన వశిష్టుడూ , ఈయన విశ్వామిత్రుడూ అనుకుంటూ.. సినిమాల్లో కూడా గుమ్మడి, ముక్కామల ఏ సినిమాలోనైనా ఋషి పాత్ర ధరిస్తే ఓ పేద్ద గెడ్డం ఉండేది.. క్లీన్ షేవెన్ ఋషిని మన తెలుగు సినిమాల్లో ఎప్పుడైనా చూసారా?.

 అలాగే ఆరోజుల్లో జైల్లో ఉండే దొంగలకి గెడ్డం ఉండేది.. “ దో ఆంఖే బారా హాత్  “ సినిమాలో జైలరు గారికి తప్పించి మిగిలిన ఆరు దొంగలూ గెడ్డాలతోనే..

 కాలక్రమేణా ,  ప్రపంచంలో ఉగ్రవాదులు ఎక్కువైపోయారు.. గుర్తుండే ఉంటుంది.. ఒసామా బిన్ లాడెన్ ఫొటోలు గెడ్డంతోనే కనిపించేవి… అప్పుడప్పుడు మన సైనిక దళాలు అరెస్ట్ చేసిన ఉగ్రవాదులు గెడ్డాలతోనే ఉండడం గమనించేఉంటారు టీవీ ల్లో…

 చెప్పొచ్చేదేమిటంటే ఈ గెడ్డాలకి అంత మహత్తర చరిత్ర ఉంది.. అసలు గెడ్డమే ఓ   Unique Identity…  అలాటిది దేశంలో  ఆధార్ కార్డ్   వచ్చిన తరువాత  పరిస్థితే మారిపోయింది.. ఈరోజుల్లో చాలామంది మొహాలే మారిపోతున్నాయి.. ఒకానొకప్పుడు   ID Proof  లో అసలు ఫొటో కనిపించడం అనివార్యం.. పరీక్షలనండి, పాస్ పోర్ట్ అనండి, సెక్యూరిటీ చెకింగ్ అనండి,, వాడి ఫొటో, ప్రస్తుత షేప్పూ ఒకేలా ఉండాలి.. ఏమాత్రం తేడావచ్చినా వెనక్కి పంపేసేవారు.

 అదేం చిత్రమో ఇప్పుడు టీవీల్లో కనిపించే ప్రతీ వాడికీ గెడ్డమే.. మొన్నమొన్నటిదాకా సినిమాల్లో లక్షణంగా కనిపించిన కుర్ర హీరోలు గెడ్డాలతోనే.. దుష్టుడూ, హీరో ఇద్దరూ గెడ్డాలతోనే.. ఛస్తున్నాం చూడలేక.. అసలు సినిమా చూడ్డానికే వెగటు పుడుతోంది.. ఏమైనా అంటే ..” ఈరోజుల్లో ఫాషను మాస్టారూ…” అంటారు..

 ఇంక మన క్రికెటర్లగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది..  అదేదో  IPL Circus  లో వేలాలు ( Auctions)  వీళ్ళ గెడ్డాలబట్టే అనిపిస్తుంది.. ఎలాగూ అవన్నీ  ఫిక్స్ అయిన మాచ్ లే  ఎవడెలాగ ఆడితే ఏమిటీ?

 దేశ ఆర్ధిక వ్యవస్థ  దిగజారిపోతోందని  పేపర్లలో చదువుతున్నాము.. అంటే గెడ్డం గీయించుకోడానికీ,  అంట కత్తెర వేయించుకోడానికీ కూడా డబ్బుల్లేవనీ, దానినే ఆర్ధిక మాంద్యత అంటారని తెలిసింది..

 దేశంలో ఇన్ని కొత్త చట్టాలు చేస్తున్నారు, ఉన్న చట్టాలకి సవరణలు చేస్తున్నారు… పోనీ ఈ గెడ్డాలక్కూడా ఏ సవరణో చేస్తారా అంటే, ఆ చట్టాలు చేసే  ఇద్దరికీ కూడా గెడ్డాలే… ఇంక ఆ భగవంతుడే రక్షించాలి.

 అస్సలు మీకెందుకూ గెడ్డాలసంగతీ.. మీ పనేదో మీరు చూసుకోకా అంటారని తెలుసు.. ఏం చేయనూ, ఉన్న ఒకేఒక్క   Entertainment — సినిమాల్లో ఈ గెడ్డాల హీరోలని భరించలేక. హీరో ఎవడో విలన్ ఎవడో తెలిసి చావడంలేదు.. ఈ మధ్యన ఎన్కౌంటర్ లో పోయిన వాళ్ళకి కూడా గెడ్డాలు లేవు.వాడెవడో అత్యాచార కేసులో శిక్ష పడ్డవాడిక్కూడా…

 హాయిగా ఉన్న మొహాన్ని స్పష్టంగా చూపించుకోక ఎందుకండీ ఈ గెడ్డాలూ , జులపాలూ…

 

 

బాతాఖాని – లక్ష్మి ఫణి కబుర్లు — మేరా భారత్ మహాన్…

 మన దేశంలో ఉన్న సౌలభ్యం  ఏమిటంటే,  ఎప్పుడు కావాల్సొస్తే అప్పుడు చట్టాలు చేసేయడం, దానికో పేరు కూడా పెట్టడం.. ఏదో చట్టాలు చేసేసారుకదా అని నేరాలు జరగడం మానుతాయా? ఎవరి దారి వారిదే.. ఈ మధ్యన మరో కొత్త ఒరవడి ప్రారంభం అయింది.. రాజ్యాంగంలోని చట్టాలకి సవరణలు చేయడం.. సాధారణంగా ఇలాటివన్నీ అధికారంలో ఉండే  ఏలినవారి “ మూడ్ “ మీద ఆధారపడుంటుంది..  నగరాల్లో చూస్తూంటాం—సడెన్ గా రాత్రికి రాత్రి ఓ రోడ్ ని  One way  చేసేస్తారు.. ఈ విషయం తెలియక ఆ రోడ్డుమీదనుండి వచ్చిన వాడు బుక్కైపోతాడు.. వాడు కొన్ని సంవత్సరాలనుండీ అదే రోడ్డు మీదే వస్తూంటాడు.. పాపం వాడికేంతెలుసూ, అంతకు ముందురోజు, ఏ పోలీసు కమీషనర్ గారో, ఫామిలీతో ఏదో పార్టీకి వెళ్తూ, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాడూ.. దాని ఫలితమే . మర్నాడు ఆఫీసుకి వెళ్ళి ఓ ఆర్డర్ పాస్ చేసేసాడని. మామూలు ప్రజానీకం ఏమైతేనేమిటీ? పాపం ఈ పోలీసు అధికార్లకి , రాజకీయనాయకులకుండే సదుపాయాలు—వాళ్ళ కార్లు వెళ్తూంటే ట్రాఫిక్కు ఆపుచేయడాలూ అవీ—ఉండవుగా.. వాళ్ళ చేతుల్లో ఉండేదేదో చేసేయడం. హెల్మెట్లు పెట్టుకోవాలని ఓ ఆర్డర్ పాస్ చేసేస్తారు..  ఎక్కడో నూటికీ కోటికీ ఓ పోలీసోడు పెట్టుకుంటాడంతే..కానీ ట్రాఫిక్ సిగ్నల్ పక్కన నుంచుని హెల్మెట్ లేనివాళ్ళకి చలాన్లు మాత్రం రాస్తారు..

 దేశంలో జరిగే అత్యాచారాలూ, నేరాలూ సినిమాలవల్లే అని కొందరంటారు.. కానీ సినిమావాళ్ళు మాత్రం దేశంలో జరిగే నేరాలనే చిత్రిస్తున్నామంటారు..మరి ఇద్దరూ కరెక్టే కదా.. పేద్దపెద్ద నేరాలు జరగ్గానే మన ప్రభుత్వాలు అవేవో  fast track courts  పెట్టామంటారు..  కేంద్రప్రభుత్వమైతే  Cr.P.C  లో మార్పులు తెస్తామంటారు…  ఉత్తిత్తి మాటలంతే…

 మరో అద్భుతమైన చిత్రం ఏమిటంటే, దేశంలో ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు ప్రతీవాడూ స్పందించేయడమే.. వాడికున్న పరపతిని బట్టి ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది.. స్పందించినవాడు కూడా ఇదివరకు ఏదో దౌర్భాగ్యపు పని చేసి పట్టుబడ్డవాడైనా సరే..  టీవి ల్ళో చర్చలూ గట్రా మరో పేద్ద జోక్..చట్టసభలలో చర్చలు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… నిజం చెప్పాలంటే, ఆ చట్టసభల ప్రత్యక్ష ప్రసారాలు  మాత్రమే మనకి  Entertainment Channels..  అర్ధరాత్రులదాకా కూర్చుని మరీ కొట్టుకుంటారు..అదో కాలక్షేపం..

 అదేమిటో ఎక్కడ చూసినా, ఆర్ధిక మేధావులు ( నోబెల్ ప్రైజ్ వచ్చినాయనతో సహా) మన ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోతోందనేవారే.. ఆమధ్యన జైలుకెళ్ళి బెయిల్ మీద వచ్చినాయన కూడా..కానీ మన ప్రభుత్వం మాత్రం, దేశమంటే భక్తిలేనివాళ్ళనే మాటలే అని కొట్టిపారేస్తూంటారు.  అయినా మన వెర్రికానీ, దేశమంటే ఎవరూ ..పెద్ద పెద్ద రాజకీయనాయకులే కదా.. వాళ్ళ సంగతికేం శుభ్రంగా ఉన్నారు.. ఉల్లిపాయలు 200/- రూపాయలైతేనేమిటి, గాస్ సిలిండర్ 600/- పైనేతేనేమిటి, వాళ్ళేమైనా కొనాలా పెట్టాలా? ఫైగా “ మా ఇంట్లో అస్సలు ఉల్లిపాయలే ముట్టని ఛాందసకుటుంబం ..”     అంటుంది   ఒకావిడ.. మరో సాధుపుంగవుడైతే  “ ఉల్లిపాయలా.. అంటే ఎలా ఉంటాయీ..” అంటాడొకాయన. కానీ సామాన్య ప్రజానీకం మాత్రం అంతంత ఖరీదులు పెట్టి కొనుక్కుని,  వచ్చిన ఉల్లిపాయల్ని ఏ వంటమనిషీ ఎత్తుకుపోకుండా, బిరువాల్లో జాగ్రత్త చేసుకుంటున్నారు.

 ఒకానొకప్పుడు  పత్రికా విలేఖర్ల సమావేసాలని ఉండేవి.. ఈ అంతర్జాలం వచ్చిన తరువాత ప్రతీవాడూ  Net savvy  అయిపోయారు..ప్రతీదానికీ Twitter  వాడుతున్నారు. ఏదో పోస్ట్ చేసిన తరువాత ఏదైనా తేడా వస్తే.. వెంటనే delete  చేసేయొచ్చు.. రాత్ గయీ బాత్ గయీ.. -=

 మేరా భారత్ మహాన్…

%d bloggers like this: