బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు…’ feel good’ అనుభవం..


సాధారణంగా  ఈ రోజుల్లో ఎప్పుడో గానీ ‘feel good’  అనుభవాలు రావు.. అలాగని ఏదో లాటరీలో ప్రైజే రావాలనే లేదు.. ప్రతీరోజూ జరిగే ఏ ఒక సంఘటన కూడా, మనకి ఆ సంతోషం కలిగించొచ్చు. మన దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.. కొంతమంది ఇలాటివారిని ‘ అల్ప సంతోషులు’ అని కూడా హేళన చేయొచ్చు.. so..what.. మన మనసుకి నచ్చింది…. మిగిలినవాళ్ళేమనుకుంటే మనకేమిటీ?

నామట్టుకు నాకు సోషల్ మీడియా  Facebook  ధర్మమా అని, వందలాది స్నేహితులు లభించారు. మహా అయితే ఓ వందమందితో , personal contact  లు ఉన్నాయి. దానికి కారణం, నాతో ఎవరైనా స్నేహం చేస్తే, నేను వారిని, మరీ మొదటి పరిచయం లోనే కాకుండా, వారు నేను ప్రతీరోజూ పెట్టే పోస్టులను చూసనండి, లేక అవతలివారి పోస్టులు చదివనండి, ఉజ్జాయింపుగా మన వ్యక్తిత్వం వారికి తెలిసిందని నమ్మకం కలిగాకనే, నేను వారి ఫోన్ నెంబరు అడుగుతూ, నా నెంబర్ కూడా ఇస్తూంటాను. నూటికి తొంభైతొమ్మిది మంది దాకా  oblige చేస్తూంటారు.. ఎక్కడో ఉంటూంటారు.. అడగ్గానే ఇచ్చేస్తే వారి విలువ తగ్గిపోతుందేమోనని కొందరు, అస్తమానూ ఫోన్ చేసి ఇబ్బంది పెడతానేమోనని కొందరు,వారి  so called privacy  violate  చేస్తానేమోనని కొందరూ  ఇవ్వడానికిబ్బంది పడుతూంటారు.. ఎవరిష్టం వారిదీ.. ఇచ్చేరని వెంటనే ఫోను చేసేయను.. వారికి ఇబ్బందిలేకపోతే, వారి అనుమతి తోనే నేనే ఫోను చేసి మాట్టాడ్డం అలవాటు.. దేశ విదేశాల్లోని ఎంతో మందితో మాట్టాడుతూంటాను ( వారి అనుమతి తోనే).. ఏం చేయనూ ఒకసారి పరిచయం అయితే  కానీసం ఓ పావుగంట కబుర్లు చెప్పడం ఖాయం.. ఏం చేయనూ, ‘స్నేహం ‘ చేయడం నా బలహీనత.

ప్రస్తుతం ఉన్న ఈ  Virtual world  లో ఎవరెవరో తెలిసికోవడం కూడా చాలా కష్టం.. నలుగురితో మాట్టాడితేనే కదా తెలిసేదీ..మన మాట పధ్ధతి, ప్రవర్తనా నచ్చిందా, మళ్ళీ మాట్టాడ్డానికి ప్రయత్నం చేస్తారు.. లేదా ఎవరికి వారే యమునా తీరే.. ఈ ఫోన్ నెంబర్ల పంచుకోవడం ప్రక్రియ వలన, నేను ఎప్పుడైనా , ప్రయాణాలంటూ చేస్తే, వారుండే ఊరుకి వెళ్ళడమంటూ తటస్థిస్తే, వారిని వ్యక్తిగతంగా కూడా కలవచ్చని ఓ ఆశ, ఇప్పటికి రెండు మూడుసార్లు హైదరాబాదులోనూ, రాజమండ్రీ లోనూ, తణుకులోనూ, భద్రాచలం లోనూ  కూడా జరిగాయి. వారు ఫోను చేసి కలవాలనుందని చెప్పినప్పుడు ఎంత సంతోషమనిపించిందో మాటల్లో చెప్పలేను.. ఇవన్నీ గత పుష్కరంలోనూ జరిగినవి.. ఇప్పటికీ ఆ స్నేహం అలాగే కొనసాగడం నా అదృష్టం. అప్పుడు మా మధ్య జరిగిన సంభాషణల ధర్మమా అని, వారికి “ పూణె’ అనగానే నేనే గుర్తొస్తానని చెప్పడం, ఎంతో సంతోషం కలిగిస్తుంది.అంతే కాకుండా,  అలాటి స్నేహితులు, ఏ కారణం చేతైనా పూణె అంటూ వస్తే, తప్పకుండా, మా ఇంటికి వచ్చి మమ్మల్ని కలిసి వెళ్తూంటారు. అది మా అదృష్టం. ఇలాటివాటినే “  Feel Good “  అనేది.

 ఇప్పటికే 80 కి దగ్గరలో ఉన్నాను… ఇంక బతికేదెంత కాలం?  నలుగురితో కలిసి, వారి వారి అనుభవాల ద్వారా, కొత్త విషయాలు తెలుసుకోవడం లో నష్టమేమీ లేదని నా అభిప్రాయం.

ఇప్పుడంటే, ప్రసారమాధ్యమాలద్వారానూ,  సోషల్ మీడియా ద్వారానూ, “ సెలెబ్రెటీ’ లుగా మారిపోతున్నారు.   సమాజంలో పేరు తెచ్చుకోడానికి, నలుగురికీ నచ్చే పనేదో చేయాలనేది ‘ ఇదివరకటి’ మాట.. ఇప్పుడు  to hell with that concept.. ఓ దరిద్రపు పని చేసినా , మీడియా ద్వారా కావాల్సినంత పబ్లిసిటీ లభిస్తోంది.. ఒకానొకప్పుడు, పోలీసుల దృష్టిలో పడ్డమన్నా, అరెస్టవడమన్నా  జరిగితే , ‘ఆత్మహత్యలు’ చేసుకున్న ఉదంతాలు విన్నాము/ చదివాము.. ఇప్పుడో అలాటివన్నీ ఓ  STATUS SYMBOL  గా భావిస్తున్నారు. ఓ  ED Ride, IT Raid  లాటివన్నీ  సర్వసాధారణం అయిపోయాయి.. మన దేశంలో శాసన సభ్యుల పార్టీ మార్పిడి అనేది ఓ రొటీన్ అయిపోయింది. వారిగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

  నా చిన్నప్పుడు ఇలాటి ‘ ప్రచారసాధనాలు’ లేనిరోజుల్లో కూడా, చాలామంది వ్యక్తులు , తమ “ చేత”ల ద్వారానూ “రాత” ల ద్వారానూ గొప్పవారయారు. వారివారి రచనలంటే, ప్రాణం ఇచ్చేవారం.. ఏ లైబ్రరీకో వెళ్ళో, చివరాఖరికి కొన్ని చోట్ల అద్దెకు కూడా తెచ్చుకుని , పుస్తకాలు చదివిన రోజులున్నాయి. వారిలో మరో ‘ప్రత్యేకత’ ఏమిటంటే, వారి రచనలు, ఇప్పటిరోజుల్లోలాగ ‘Book promotion’  సభల ద్వారా ప్రసిధ్ధి చెందినవి కావు… జస్ట్ ‘ నోటిమాట’ ద్వారా ప్రచారమయేవి.. ఒక్కో పుస్తకం రెండో మూడో పునర్ముద్రణాలు కూడా వెళ్ళేవి.. కారణం వాటిలోని “ విషయం’ (content).  తెలుగురచయితల్లో చాలామంది గొప్పవారున్నారు.. ఇప్పటి రోజుల్లోలాగ  Virtual world  లో కాకుండా ‘నిజజీవితంలో పేరు సంపాదించిన వారు..   వారిపేర్లే వారి “ Brand name”  గా మారినవారు. అలాటివారిలో కొంతమందితో నాకు పరిచయం ఉండడం , నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తాను.  Facebook  ధర్మమా అని చాలామంది స్నేహితులని సంపాదించుకోవడం కూడా నా అదృష్టం.

అలా సంపాదించుకున్న ఒక ‘ స్నేహితుడు’  శ్రీ యండమూరి వీరేంద్రనాధ్  గారు.  అలాటి ప్రముఖ వ్యక్తి మనకు స్నేహితుడని చెప్పుకుంటే, మన ‘ స్టేటస్’ కూడా పెరిగిపోతుంది.  ఈ మధ్యన , నేను ప్రతీ రోజూ  Facebook  లో పెట్టే కొన్ని పోస్టులకి , ఆయన స్పందించడం నా అదృష్టం.. అంత గొప్పాయన కి నేను పెట్టిన పోస్ట్  నచ్చడం, దానికి ఆయన వ్యాఖ్య రూపంలో స్పందించడం ఓ  Feel good కదా మరి.. ఎలాగోలాగ ఒక్కసారి ఆయనతో మాట్టాడితే బావుండునూ అనిపించి, మొన్న, వారికి ఓ message  పెట్టాను.. ‘అభ్యంతరం లేకపోతే మీ నెంబరు ఇవ్వగలరా, నాది ఫలానా..’ అని.  స్పందన లేదు.. ఆయన్ని అలాగ అడిగే వారెంతమందో ఉండుంటారు.. పెట్టేదేమిటిలే అని వదిలేసుంటారనుకున్నాను.. ఇవేళ పొద్దుటే చూద్దునుకదా, వారి నెంబరు ఇచ్చారు..ఇంకా  online  లోనే ఉండడం గమనించి.. ముందుగా ధన్యవాదాలు చెప్పి, ‘ 9 గంటలకి  call  చేయొచ్చునా …అని అడిగితే.. ‘ sure’  అని జవాబిచ్చారు. ఇంకేముందీ తొమ్మిదెప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ… పూజ, బ్రేక్ ఫాస్టూ పూర్తిచేసుకుని కూర్చున్నాను. ఠంచనుగా 9 కి ఫోన్ చేస్తే , జవాబు లేదు.. పట్టివిడవని విక్రమార్కుడి లాగ మరోసారి చేసినా ఫలితం లేకపోయింది.

అప్పుడనుకున్నాను , ఏదో నెంబరంటూ ఇచ్చి, తన గొప్ప మనసు చాటుకున్నారే కానీ, మనం చేసే ఫోన్లతో వారి టైమెందుకు వేస్ట్ చేసుకుంటారూ..అని..  ఫోను రింగయి, పేరు చూస్తే యండమూరి వారిదే..మొట్టమొదటగా ఆయన, నేను ఫోన్ చేసినప్పుడు , ఎత్తలేకపోవడానికి ‘సంఝాయిషీ’..  చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? నేనేమైనా అడిగే ధైర్యం చేస్తాననే? కానీ ఇలాటి చిన్న చిన్న విషయాలకి ప్రాధాన్యం ఇవ్వడంలోనే ఉంటుంది గొప్పతనం. ఆయన రాసిన  Personality development పుస్తకాల్లో  ఊరికే రాసినట్టుగాకాకుండా, నిజజీవితంలో కూడా ఆచరించడం “ నిండుకుండల” ప్రత్యేకత.  ఏదో  Formal  గా పరిచయాలు, క్షేమసమాచారాలూ మాట్టాడుకుని, చివరగా ఆయన అనుమతి తోనే ఈ పోస్ట్.

 He made my day..thank you  యండమూరి వీరేంద్రనాథ్  గారూ..

15 Responses

 1. మనకి చాలా ఇష్టమైన వాళ్లు మనని పట్టించుకున్నారనే ఆనందం నిజమైన ఫీల్ గుడ్.నాకలాంటి అనుభవం మీతో మాట్లాడడమే. నేను రాజమండ్రి లో ఉన్నప్పుడు మీరు నా ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించాక మీతో మాట్లాడాలనిపించింది. మళ్లా సందేహం. ఏమనుకుంటారో అని.ధైర్యం చేసి మీ ఫోన్ నెంబర్ అడిగా.మీరు ఇచ్చారు.చాలా ఆప్యాయంగా మాట్లాడారు.నాకెంతో ఇష్టమైన హాస్యరసాన్ని అంత బాగా ఎలా రాయగలరు అనిపిస్తుంది ఇప్పటికీ.

  Like

 2. మాస్టారూ,

  మీరెంతో అభిమానంతో పెట్టిన వ్యాఖ్యకి శతకోటి కృతజ్ఞతలు.
  మరీ మునగ చెట్టెక్కించేసారు..

  Like

 3. ఏమి మాట్లాడారా అని సందేహం 🤔

  Like

 4. ఫోన్ లో వాళ్ళేం మాట్లాడుకుంటే మనకెందుకండీ, అహఁ మనకెందుకూ అని. ఏమైనా *పబ్లీకున* మాట్లాడుకుంటే మనం కూడా ఓ చెవి అటు పడేసి వినచ్చు.
  (just for fun, నా మీద దండెత్తకండి 🙂🙂) 😁😁😁😁

  Like

 5. అది కాదండీ…పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి మాలాంటి వాళ్ళం ఉన్నాం కదా ? ఈసారి మీరు మాట్లాడితే ఈ క్రింది ప్రశ్న అడగండి.

  “ఈ ప్రపంచంలో కొంతమంది మంచివాళ్ళు ఉండటానికి కారణం వాళ్ళకి చెడిపోవడం చేతకాక పోవడమే.” అని రాశారు.

  “ఈ ప్రపంచంలో కొంతమంది మంచివాళ్ళు ఉండటానికి కారణం వాళ్ళకి చెడులో వున్న చెడు తెలియడం” అని ఎందుకు వ్రాయలేదు ?

  Liked by 1 person

  • నీహారికా,
   మరీ మొదటిసారేగా, అందుకని మరీ ఇంటర్వ్యూలలోగ మాట్లాడ్డానికి కుదరలేదు. మరోసారి అవకాశం దొరికితే తప్పకుండా ఆడుగుతాను.

   Like

 6. నీహారిక గారూ , చెడులో ఉన్న చెడు గురించి తెలియటమే కాదు సాధికారికంగా మాట్లాడగల వారిలో కూడా చెడ్డవాళ్ళుండవచ్చును కదండీ. మాటవరసకో ఉదాహరణ. హిరణ్యకశిపుడు కూడా ఎంతో తెలిసిన వాడు. మంచీచెడుల గురించి బ్రహ్మాండంగా చెప్పగలవాడు. ఇతరులకు వేదాంతం ఉపదేశించగలవాడు. ఐనా ఎంతో చెడ్డవాడైనాడు అహంకారమూ దుర్మదమూ కారణంగా. అందుచేత తెలియటం అనే కొలబద్ద చాలదని అనుకుంటాను.

  Like

 7. శ్యామలీయం గారు,
  అందరికీ మంచి చెడు ల గురించి తెలుసు కానీ ఈ ప్రపంచము లో కొంత మంది మంచి వాళ్ళు ఉండడానికి కారణం తెలియచేయండి.

  Like

  • మంచి ప్రశ్నవేసారు. స్వభావమే కారణం అని నా ఉద్దేశం. మంచివాళ్ళవటానికీ తదన్యంగా ఉండటానికీ కూడా. శ్రీమద్రామాయణంలో,కైకకు చెడ్డమాటలు నూరిపోసి, రాముడి పట్టాభిషేకాన్ని అడ్డుకుంటుంది మంధర. అక్కడ ఆల్మీకి మహర్షికి ఇటువంటి ప్రశ్నయే వచ్చింది. ఎందుకని రాముడి పట్టాభిషేకాన్ని మంధర అడ్డుకోవాలని చూచిందీ? పాఠకులకు ఏమని వివరించాలీ కారణం అని. అయన క్లుప్తంగా ఇలా అన్నారు “మంధరా పాపదర్శినీ” అని. ఆమె బుధ్ధి పాపాన్నే చూస్తుంది అఒని. కాబట్టి ఆమె పాపకార్యాలే చేస్తుంది అని మనకు అర్ధం అవుతున్నది కదా. ఎందుకని మంధర పాపదర్శిని అని అడగలేము. అడిగితే జవాబు ఏమిటీ? అమె స్వభావం అది అని చెప్పాలంతే. ఎందుకంటే స్వభావో దురతిక్రమణీయః అని మనకు తెలుసు. పుట్టుకతో వచ్చిన స్వభావం మారదు. మానవులు అభ్యాసం చేసి సంస్కారాన్ని అలవరచుకొని మార్చుకోవాలి దాన్ని – కొన్ని జన్మలు పట్టవచ్చును. మంచి వాళ్ళైనా చెడ్దవాళ్ళైనా సరే వారి స్వభావం కారణంగానే మంచి చెడు ప్రవర్తనలు చూపుతారు. చిన్నతనంలో చెడు ప్రవర్తన ఎలా చూపుతారూ అంటే మనవాళ్ళు పూర్వజన్మ సంస్కారం అంటారు. రెండుమూడేళ్ళకే‌ సంగీతప్రతిభ చూపి రాగాలనే గుర్తుపట్టే పిల్లలుంటారు. అన్నప్రాశన నాడే ఏదో ఆంటీ‌ ఉంగరం కొట్టేసే పిల్లలూ ఉంటారు. అదంతే నన్నమాట. దుర్యోధనుడు కృష్ణూదితో అన్నాడట. జానాని ధర్మం న చ మే ప్ర్రవృత్తి, జానామ్యధర్మం న చ మే నివృత్తి అని. ఒకరికి తెలియటంతో‌ సరిపోదండి. స్వభావం వారిని సరిగా ప్రవర్తించనీయాలి కదా. అందుచేత స్వభావం కారణంగ కొందరు లోకంలో మంచివారుగా ఉంటున్నారు. స్వభవం కారణంగా కొందరు లోకంలో చెడ్డవారుగా ఉంటున్నారు. అందరూ ఉత్తమసంస్కారం దిశగానే‌ ప్రయాణం చేస్తున్నారు. కాని అందరూ వివిధదశల్లో ఉండటం చేత మంచివారూ చెడ్డవారూ ఎప్పుడూ లోకంలో ఉంటున్నారు.

   Liked by 2 people

 8. 🙏🙏🙏

  Liked by 2 people

 9. శ్యామలీయం గారూ,

  మీరిచ్చిన వివరణ అద్బుతంగా ఉందనడం లో సందేహం లేదు. ధన్యవాదాలు మాస్టారూ..

  ఎక్కడొ చదివాను.. ” అవకాశం రానంతవరకూ అందరూ మంచివాళ్ళలాగే కనిపిస్తారూ..” అని.. ఇది సరైనదేనా? మీ వివరణ ?

  Like

  • అవకాశం రానంతవరకూ అందరూ మంచివాళ్ళలాగే కనిపిస్తారన్న నానుడి ఉన్నమాట నిజమే. ఒక వ్యక్తి చెడ్డవాడిగా తేలాలి అంటే, మొదట అతనికి ఇతరులకు చెడు చేసేందుకు అవకాశం రావాలి, రెండవది ఆవిధంగా మీదకు వస్తున్న చెడును ఆవలి వారు గుర్తించ గలగాలి. అవకాశం కోసం ఎదురుచూస్తున్న వాడి సంగతి ఇతరులకు తెలిసే అవకాశం తక్కువగానే ఉంటుంది. కాబట్టి చెడుని చెడ్డవాడు క్రియారూపంలోనికి తెచ్చేందుకు యత్నించి దొరికిపోయే వరకు సమాజందృష్టిలో మంచివాడే కద. సమర్ధుడైన చెడ్డవాడు దొరికిపోకుండా చెడుచేస్తూ మంచివాడిగానే చెలామణీ అవుతూ ఉంటాడు. అందుకే దొరికేతేనే దొంగ అన్న నానుడీ వచ్చింది. మంచివాడు మంచివాడిలాగా ఉండటానికి ఇబ్బంది పడడు. కాని చెడ్డవాడు మంచివాడిలా నటించటానికి నానాతంటాలూ‌ పడుతూ ఉండాలి. మంచివారిలో సహజంగా ఉండే‌ బలహీనత చుట్టూ ఉన్నవాళ్ళంతా మంచివాళ్ళే అనుకోవటం – తద్వారా చెడ్దవాళ్ళకి ద్వారాలు తెరవటం. చెడ్డవాడి బలం చుట్టూ ఉన్నవాళ్ళల్లో ఎందరో చెడ్డవాళ్ళు ఉన్నారని నమ్మటం – తద్వారా దొరక్కుండా జాగ్రత వహించటం. ఈ జాగ్రత కారణంగా చెడ్డవాళ్ళు దొరక్కుండా ఎక్కువకాలం‌ నెట్టుకొని రాగలుగుతారు. కాని నటన ఎన్నడూ సహజం‌ కాదు కాబట్టి జాగ్రతగా గమనించగలిగితే చెడ్డవాళ్ళు తప్పక తమ నటనలో దొరికితీరుతారు. కేవలం మేథావులు మాత్రం చెడ్డవాళ్ళ నటనలో చిన్నచిన్న తప్పులనూ గమనించటం ద్వారా వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవటమూ వాళ్ళని పట్టుకోవటమే చేయగలరు. అందుకే సరైన అవకాశమూ, సరైన సమయ సందర్భాలూ కుదిరితే కాని చెడ్డవాడు చెడు అమలు చేయక, చేయలేక మంచి నటిస్తూ నెట్టుకొస్తూనే ఉంటాడు.

   Like

 10. శ్యామలీయం గారూ,

  మీరిచ్చిన వివరణ కి ధన్యవాదాలు మాస్టారూ..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: