బాతాఖాని -లక్ష్మిఫణి కబుర్లు.. పరీక్షల హడావిడి..


   ఇదివకటి రోజుల్లో పరీక్షలైపోగానే శలవులిచ్చేసేవారు. ఆ శలవల్లోనే, పరిక్షపేపర్లు దిద్దడాలూ, ఫలితాలూ స్కూల్లో ఓ బోర్డుమీద పెట్టేవారు. ఓ విషయం చెప్పుకోవాలిలెండి, మరీ అధమాధముడయితే తప్ప, ప్రతీ వాడూ పై క్లాసులోకి వెళ్ళేవాడు. మరీ అత్తిసరు మార్కుల్లాంటివొస్తే, ఏదో మోడరేషన్ పేరుచెప్పి పై క్లాసులోకి తోసేసేవారు. ఉన్న నాలుగైదు సబ్జెక్టుల్లోనూ, దేనిలోనైనా కొద్దిగా తక్కువొచ్చినా, మిగిలిన మార్కుల  ప్రభావంతో గట్టెక్కేసేవారు. ఈ శలవల్లో, ఉపాధ్యాయులు పేపర్లు దిద్దే టైములో బలే తమాషాగా ఉండేది. కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలకి మార్కులు వేయించుకోడానికి, టీచర్ల ఇళ్ళచుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు. ఈ కరోనా మహమ్మారి ధర్మమా అని, దేశంలో చాలా రాష్ట్రాలలో ఈ ఏడాదికి మాత్రం 1st  నుంచి  9th   దాకా పరీక్షలు లేకుండా పాస్ చేసేస్తారుట.. సుఖపడ్డారు పిల్లలూ, వాళ్ళ తల్లితండ్రులూ…

 ఇవన్నీ ఓ ఎత్తూ, స్కూలుఫైనల్ పరీక్షలు మరో ఎత్తూనూ.  మారోజుల్లో SSLC  Board  కర్నూల్లో అనుకుంటా ఉండేది.. రాష్ట్రంలోని అన్ని పేపర్లూ, రాష్ట్రం మొత్తంమీది అన్ని స్కూళ్ళ ఉపాధ్యాయులకీ, దిద్దడానికి సద్దేవారు. అంటే, సాధారణంగా ఏ స్కూలు పేపరు ఏ చోటకెళ్ళిందో తెలిసేది కాదు.  ఆ పేపర్లు దిద్ది , ఓ  సైనుగుడ్డలో వాటిని పొందిగ్గా సద్ది, అటుపైన ఆ సైనుగుడ్డని సూదీదారంతో డబుల్ కుట్లు వేసి, రిజిస్ట్రీలో పంపేవారు. ఈ వివరాలన్నీ నాకెలా తెలుసా అంటే, మా ఇంటినిండా టీచర్లే.. మొత్తానికి ఏ శలవులాఖరికో ఫలితాలు వచ్చేవి. మళ్ళీ అదో పెద్ద సరదా. ఏ విశాలాంధ్ర పేపరులోనో రిజల్ట్స్ వచ్చేవి. మార్కులెలా వచ్చాయో తెలిసికోవాలంటే ఇంకో పదిరోజులో, పదిహేనురోజులో ఆగాల్సొచ్చేది.  SSLC  Book  అని ఒకటుండేది. దాంట్లో శ్రీ బి. వెంకటరమణప్పగారి  సంతకం స్టాంపుతో, మన మార్కులు వచ్చేవి. ఎంతచెప్పినా, ఓ 50 % వచ్చిందంటే గొప్పగా ఉండేది. ఆ  SSLC Book  అప్పటికీ, ఇప్పటికీ మన జన్మదిన దాఖలా. ఈరోజుల్లోలాగ  Birth Certificates  వగైరా ఉండేవి కావు. దాంట్లో వేసిన జన్మతిథే ఫైనల్.

మొత్తానికి SSLC  పాసయితే, ఊళ్ళోనే ఉండే కాలేజీ. ఎక్కడో తప్ప పైఊళ్ళకి పంపేవారుకాదు. పైగా ఆరోజుల్లో, ఇప్పటిలాగ కార్పొరేట్ స్కూళ్ళూ, కాలేజీలు ఉండేవి కావు. ఊళ్ళో ఉండే ఏ జమిందారుగారో, ఊరికి ఉపకారం చేద్దామని, సమృధ్ధిగా విరాళాలూ, భూదానం చేసి ఓ కాలేజీ మొదలెట్టేవారు. దాన్ని రాష్ట్రంలో ఉండే ఏ మూడు నాలుగు విశ్వవిద్యాలయాలకో అనుబంధం చేసేవారు. కాలేజీ పరీక్షలు ఆ విశ్వవిద్యాలయం వారు నిర్వహించి, డిగ్రీ ఇచ్చేవారు. కాలేజీ లెక్చెరర్స్ అయినా, స్కూలు ఉపాధ్యాయులైనా  ఓ బాధ్యతతో చెప్పేవారు. ఇప్పుడున్న కోచింగ్ క్లాసులూ, సింగినాదం ఉండేది కాదు.. సాధారణంగా క్లాసులో చెప్పేదే అర్ధమయేటట్టు చెప్పడం ఓ ప్రత్యేకత. అంతగా అర్ధం కాకపోయినా, మాస్టారింటికి  వెళ్ళి అడిగే చొరవా, చనువూ ఉండేది. మాతృభాష తెలుగుకి స్కూల్లోనూ, కాలేజీ మొదటి సంవత్సరంలోనూ కూడా పెద్దపీటే వేసేవారు.. కాలేజీకి వెళ్ళేదాకా సాధారణంగా నిక్కర్లే. కాలేజీకి వచ్చిన తరవాతే, చేతికో వాచీ, వేసికోడానికి ప్యాంటులూనూ. డిగ్రీ చేతికి వచ్చిన తరువాత, వారివారి ఆర్ధిక స్తోమతను బట్టి, ఏ పైచదువులు ఇంజనీరింగుకో, మెడిసిన్ కో ఏ విశాఖపట్నమో, కాకినాడో, గుంటూరో వెళ్ళేవారు. కారణం ఆ కాలేజీలు అక్కడే ఉండేవి కాబట్టి. మిగిలినవారు ఏ టీచర్ ట్రైనింగుకో వెళ్ళేవారు. మిగిలినవారంతా ఏ తాలూకాఫీసులోనో  ఉద్యోగాల్లో చేరేవారు. ఎక్కడో నూటికీ కోటికీ ఏ తెలివైనవారో విదేశాలకి వెళ్ళేవారు. ఆరోజుల్లో అలా వెళ్ళిన మన తెలుగువారే, అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు ఉన్నతస్థానాలు చేరుకుని, విదేశాల్లో వెలిగిపోతున్నారు. వాళ్ళూ పైచెప్పిన క్రమంలోనే చదువుకుని పైకొచ్చిన వారే. కానీ వారి పునాదులు గట్టివి.  చదువుని ఓ దేవతగా భావించి అభివృధ్ధిలోకి వచ్చారు. కాలేజీల్లోనూ అక్కడా, కొత్త విద్యార్దులని ragging  పేరుతో హింసించేవారు కాదు. అలాగని అసలు ఆ సరదాయే లేదనీ కాదు. సరదాగా వారిని ఆటపట్టించి కొత్త పోగొట్టేవారు. రాజకీయాలుండేవా అంటే ఉండేవే అని చెప్పుకోవాలి. కానీ అవన్నీ కులమతాలకి అతీతంగా ఉండేవి.  విద్యార్ధులకి ఓ హెడ్మాస్టారన్నా, ప్రిన్సిపాలుగారన్నా ఓ విధమైన భక్తీ గౌరవమూ ఉండేవి. కారణం వారి ప్రవర్తనే అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇప్పటివారికి ఆరోజుల్లో చదువులంటే , ఏదో వానాకాలం చదువుల్లెద్దూ అనే ఓ దురభిప్రాయం ఉంది.

7 Responses

 1. సెమిస్టర్ సిస్టమ్ వచ్చాక పిల్లలు ఎప్పుడు చదివినవి అప్పుడు వదిలేస్తున్నారు. మా డిగ్రీ లో ఇంగ్లీష్ లో prose poetry non detailed రెండేసి పుస్తకాలు అలాగే తెలుగు కూడా ఉండేవి. అదికాక general education arts subjects లో మూడు ఉండేవి. అన్నిటికీ second year చివర రెండేసి పేపర్ లు ఆన్సర్ చేయాలి.

  Liked by 1 person

 2. మాస్టారూ
  సెమిస్టర్ లో నేర్చుకున్నదేదో మర్చిపోవడం విధాయకంగా భావిస్తారు పిల్లలు ఈ రోజుల్లో…
  డాక్టర్ల విషయంలోనూ అంతేనంతారా? అలాగైతే పేషంట్ల గతి ?

  Like

  • ఏ సెమెస్టర్ లో చదివినది ఆ సెమెస్టర్ తరవాత మర్చిపోవటం ఒకటి. ఇంకా ఒళ్ళు జలదరించేది డాక్టరీ కోర్స్ పరీక్షాపత్రాల్లో ఛాయిస్ కూడా ఉంటుందా అనే సందేహం వచ్చినప్పుడు 😳. ఈ క్రింద (a) (b) (c) (d) గా ఇచ్చిన నాలుగు జబ్బులలో ఏదైనా రెండు జబ్బుల లక్షణములు, చికిత్సా విధానం గురించి సోదాహరణముగా వివరించుము ….. అనేటటువంటి సౌలభ్యం అన్నమాట ☹️.

   Liked by 1 person

 3. అయ్యబాబోయ్, మీరలా అంటారా ఫణిబాబు గారు?
  Well, come to think of it … why not అనుకోవచ్చు కూడా.

  నిజానికి నా భయం వేరే రకం మాస్టారూ. ఛాయిస్ లో వదిలేద్దామని నిశ్చయించుకుని, సిలబస్ లోని పాఠాలన్నీ చదవకుండానే పరీక్ష గట్టెక్కిన డాక్టర్ ఉన్నాడనుకోండి. అతను ఛాయిస్ లో వదిలేసిన జబ్బే ఏదన్నా తగులుకుంటే ఆ పేషెంట్ ఆ డాక్టర్ దగ్గరకే వెడితే ?😳 …. ఆ ఊహ భయాన్ని కలిగిస్తోంది. అందుమూలాన మెడిసిన్ పరీక్షాపత్రాలలో కూడా ఛాయిస్ ఇస్తారా లేక అన్ని ప్రశ్నలూ compulsory అంటారా అన్నది నన్ను తరచూ వేధించే అసలు సందేహం అన్నమాట. అసలే వ్యాపారంలా తయారైన వైద్యవిద్య ☹️.

  Liked by 1 person

 4. నరసింహ రావుగారూ,
  నేను అలా అనడానికి కారణం ఉంది …ఈమధ్యన ఓ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు గమనించాను..ఓ డాక్టర్ ఓ పేషెంటు బంధువులతో చెప్తూండగా…I can’t say much about the patient’s condition..we are waiting g
  for specialist .అంటే ఈ డాక్టర్ choice లో topic వదిలేసినట్టే కదా..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: