బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- మేరా భారత్ మహాన్..

  మన పాలకులకి అకస్మాత్తుగా ఐడియాలొచ్చేస్తూంటాయి…అదేదో చాణక్య నీతి అని ఓ పేద్ద పేరు పెట్టుకుంటారు. అది  జాతీయ స్థాయి అయినా, రాష్ట్ర స్థాయి అయినా ఫలితం ఒక్కటే.. “ రాజు గారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా ? ..” అన్నట్టుంటాయి కొన్ని కొన్ని నిర్ణయాలు.వీటికి కారణాలు ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి. సాధారణంగా ఏలినవారి “ మూడ్ “ ని బట్టుంటాయి.   ఉదాహరణకి తరతరాలనుండీ జరుగుతూన్న సాంప్రదాయలని, అకస్మాత్తుగా మార్చేయడం. దానికో పెద్ద కారణం కూడా అక్కర్లేదు.. జస్ట్ అధికారంలో ఉన్నవారికి అలా అనిపించిందీ.. చేసేసారు.. ప్రజలు ఏ గంగలో దిగితే ఎవడికీ ? –

 మన దేశంలో భక్తికి పెద్ద పీట కదా..  భక్తికి ముఖ్యకారణం నమ్మకం.. ఈ రోజుల్లో ఆధ్యాత్మికత కూడా, వ్యాపారమయిపోయింది.. అది వేరే విషయం. వ్యాపారాత్మకం కాకపోతే , ఎక్కడైనా మతసంబంధిత  సప్తాహాలో, మరోటో, నిర్వహించినప్పుడు, భక్తులందరూ ఫలానా రంగు బట్టలే  ధరించాలని రూలు పెట్టడమెందుకో? ఆగమన శాస్త్రాల్లోనో, వేదాల్లోనో ఈ ప్రస్తావన ఉందా? మా చిన్నప్పుడు, మేమూ దేవాలయాలకి వెళ్ళేవాళ్ళం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకీ వెళ్ళేవాళ్ళం.. ఆరోజుల్లో   Dress Code,  సింగినాదం లాటివి ఎప్పుడూ వినలేదు. సాంప్రదాయ దుస్తుల్లో వెళ్తే సరిపోయేది.. అదేకాకుండా, అవేవో  VIP  దర్శనాలూ,  Special  దర్శనాలూ వాటికి వందల్లో టిక్కెట్లూ ఉండేవి కాదు.. అలా అంటే, “ జనాభా ఎక్కువైపోయింది కదండీ..” అంటారు.వెళ్ళేవారికి క్షణాల్లో దైవ దర్శనం అయిపోవాలే.. ఈ పరిస్థితి నే  Cash  చేసుకుంటున్నారు  దేవాలయ నిర్వాహకులు.. “ ఇంత సొమ్ము కడితే స్పెషల్ దర్శనం.. “ అని ఓ ధర పెట్టేసారు. “ రోగికి కావాల్సిందీ అదే.. వైద్యుడు చెప్పేదీ అదే ..”..  ఈరోజుల్లో డబ్బులకేమీ లోటు లేదాయె.మనం ఎంత మొత్తుకున్నా జరిగేవి మానవని వదిలేయడం  ఆరోగ్య కరం..

 మరో రకం దోపిడీ , ఏమిటంటే  .. లక్షణంగా ఉన్నవాటిని కెలకడం.. తెలుగు రాష్ట్రాలు విడిపోగానే, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ పెడదామా అన్న దానిమీద, ఎన్నో ఎన్నెన్నో ఊహాగానాలు చేసారు..  సామాన్య ప్రజలు చేసుకున్నా నష్టం లేదు, కానీ అధికార పార్టీలో వారే రూమర్లు వ్యాపింపచేయడం ఎంతవరకూ సమర్ధనీయం? ఎవడో ఎక్కడో మొదలెడతాడు.. ఫలానా చోటు లో రాజధాని పెడదాం.. అని ముఖ్య మంత్రిగారే మాటల్లో అన్నారు..అంటూ.. బస్ మన  మీడియాకి పనేమీ ఉండదూ, ఎక్కడెక్కడ  sensational news  వస్తుందా అని చూస్తూ ఉంటారు.. రాజధానికంటే ముఖ్యమైన వార్తుంటుందా.. అంతే మర్నాడు, పేపర్లలో పతాకశీర్షికలు.. ఫలానా చోట కొత్త రాజధానీ.. అంటూ, పైగా వీటిమీద టీవీ ల్లో చర్చాకార్యక్రమాలోటీ?రోజంతా టీవీ లో  Scrolling News.. ఎవడైనా చూడడేమో ఇంత ముఖ్యమైన వార్తా..అనుకుని. రాత్రికి రాత్రి ఆ ప్రదేశ చుట్టుపక్కల  భూములన్నిటికీ రెక్కలొచ్చేస్తాయి. రాజకీయ నాయకులైతే, ఎందుకైనా మంచిదని స్థలాలు కొనేసి, ధరలని  inflate  చేసేస్తారు. మొత్తానికి కొట్టుకుని ఓ రాజధానిని ఏర్పాటు చేసారు..ప్రతిపక్షాలకి ఈ వ్యవహారం లో కిట్టుబాటవలేదుట.. తరవాతి ఎన్నికల్లో  అప్పటివరకూ అధికారం లో ఉన్న పార్టీ కాస్తా, కనుమరగైపోయింది..కొత్త పార్టీ వాళ్ళొచ్చి, ఒకటి కాదూ, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ తలో రాజధానీ పెడదామూ.. అని కొట్టుకుంటున్నారు..కానీ మధ్యలో జరుగుతూన్నదేమిటంటే ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ ప్రారంభమయింది..రాజధాని గొడవెవడిక్కావాలీ? మన బిజినెస్ మూడు పువ్వులూ ఆరు కాయలూ గా ఉండాలి కానీ..

 అంతా సుఖంగా ఉండడం, అదేమిటో పాలకులకి నచ్చదనుకుంటా.. ఏదో ఓ దుమారం లేపితే కావాల్సినంత కాలక్షేపం.. మీడియా వాళ్ళందరికీ  TRP  లు పెరిగిపోతాయీ..  రాజకీయనాయకులకి అడ్డూ అదుపూ ఉండదు.. దేశోధ్ధారకుల్లాగ ప్రకటనలు చేస్తూండొచ్చు. ట్వీట్ లు చేయొచ్చు..

 100 సంవత్సరాలనుండీ  శ్రీ సాయిబాబా క్షేత్రానికి ఓ నమ్మకంతో వెళ్తున్నారు భక్తులు.. ఇన్నాళ్ళూ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.. ఆయన జన్మస్థలం గురించి.. సడెన్ గా ముఖ్యమంత్రి గారికి ఓ అవిడియా వచ్చేసింది.. మేము 1983 లో  మొట్టమొదటిసారిరిడీ బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, ఎంతో ప్రశాంతంగా ఉండేది. బాబా విగ్రహానికి స్వయంగా దండ కూడా వేసుకోగలిగాము.  ఏవో కొద్ది దుకాణాలు తప్ప మరేమీ ఉండేవి కావు. తిరిగి మరోసారి 2007 లో వెళ్ళినప్పుడైతే పూర్తి వాతావరణమే మారిపోయింది.. క్యూలైన్లూ, ఎక్కడ చూసినా తెలుగు వాతావరణం, పెద్ద పెద్ద హొటళ్ళూ.. వగైరా.. భక్తి కంటే వ్యాపారానికే పెద్ద పీట. రద్దీతో పాటు సౌకర్యాలూ పెరిగాయి.. కాదనడం లేదు..స్పెషల్ దర్శనాలూ, ఎక్కడో దూరంనుండే బాబా దర్శనం.. మరీ తిరుపతి లో అంత కాదనుకోండి..  ఏమైతేనేం బాబా ని కూడా  commercialise  చేసేసారు..దేశ విదేశాలనుండి భక్తులూ .. ఓహ్ ..అంతా ఫైవ్ స్టార్ కల్చర్ వచ్చెసింది.డబ్బు సంపాదించాలంటే షిరిడీ లో ఇన్వెస్ట్ చేస్తే చాలన్నంతగా..

 ఇప్పుడు సడెన్ గా  కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రిగారు, బాబా పుట్టిన స్థలం పర్భణి దగ్గరలోని పార్థీ, అక్కడ కూడా అభివృధ్ధి కొసం ప్రభుత్వం 100 కోట్లు గ్రాంట్ చేస్తున్నామూ అనడంతో బాంబు పేలింది.. పార్తీ గ్రామాన్ని కూడా అభివృధ్ధి చేసేస్తే, మనం  షిరిడీ లో పెట్టిన డబ్బంతా ఎలా పెరుగుతుందీ అని ఈ రాజకీయ వ్యాపారస్థులకి గుండెల్లో గుబులు ప్రారంభమయింది.ప్రజల సెంటిమెంటు మీద ఆడుకోవడం, మన నాయకులకి వెన్నతో పెట్టిన విద్యా. అక్కడికేదో  blasphemy  చేసేస్తున్నంత హడావిడి చేస్తున్నారు. నిజమైన భక్తులైతే రెండు పుణ్యక్షేత్రాలకీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటారు.. కానీ , సంపాదించవలసిన ఆస్థిపాస్తులు  divide  అయిపోతాయనే ఈ వ్యాపారస్థుల దుగ్ధ. అలాగని మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక కూడా . ఏదో ఒక ఉద్దేశ్యం లేకపోలేదు.. ఇలాటి ప్రకటనలు చేయడం వెనుక  భూదందా  చేసుకోవడమే.. పూణె లో అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో కూడా ఇదే తంతు…

ఇన్నిటిలోనూ ఆంఆద్మీ కే కష్టాలన్నీ.. పాలకులకి ఏమీ పట్టదు..

%d bloggers like this: