బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Loud thinking.

నిన్న సంక్రాంతి పూటా , అబ్బాయి , ఊళ్ళో ఉన్న తెలుగు సినిమాలు చూద్దామూ, అని రమ్మంటే , వెళ్ళాము. మొదటిది “ అలవైకుంఠ పురం “.. పొద్దుటే 8 గంటలకల్లా, వచ్చేయమన్నాడు.  హైదరాబాదు వెళ్ళడానికి “ శతాబ్ది “ ఎక్కాల్సినప్పుడు లేచినట్టుగా, తెల్లవారుఝామునే 4 15 కి  లేచి ఊబర్ కాబ్ లో వెళ్ళాము..

 ఈరోజుల్లో తెలుగు సినిమాలు , ఎటువంటి  expectations  పెట్టుకోకుండా వెళ్తేనే ఆరోగ్యకరం.. సినిమా  ఏక్ దం  entertainer..  కథా కమామీషూ ఏమీ లేదు.. కానీ ప్రతీ డయలాగ్గూ  విని హాయిగా నవ్వుకోవచ్చు.. ఎటువంటి వెర్రి మొర్రి వేషాలూ లేకుండా, ఎవరి పరిధిలో వారు నటించారు. మొత్తం రెండుముప్పావు గంటలూ , ఎక్కడా బోరుకొట్టకుండా నవ్వుకోవచ్చు.పాటల  “ బీట్ “ బావున్నట్టే..ఉన్న రెండుమూడు ఫైట్ సీన్లూ పరవాలేదు.   ఎక్కడా విసుగనిపించలేదు.

 ఇంటికి వెళ్ళి,  పిల్లలతో భోజనం కానిచ్చి, ఓ రెండు మూడు గంటలు రెస్ట్ తీసుకుని, ఇంటికి తిరిగొచ్చేసినా బావుండేది.. కానీ, తలరాతను మార్చుకోలేము కదా.. 4 గంటలకి, రెండో సినిమా కూడా చూసేయాలని “ ఆబ “ ఉందే, అది మహా డేంజరస్. మా చిన్నప్పుడు అమలాపురం చుట్టుపక్కలి గ్రామాల వారు, ఓ రెండెడ్ల బండిలో, అమలాపురం వచ్చేసి, ఓ రెండు మూడు సినిమాలు చూసి తిరిగి ఇళ్ళకు వెళ్ళిపోయేవారు. మేము కూడా అదే పధ్ధతిలో ఒకేరోజున రెండు సినిమాలు చూడాలని అంత యావ ఎందుకు చెప్పండీ?

 ఏదో ఆమధ్య చూసిన “ భరత్ అనే నేను “, “ మహర్షి “ బాగానే ఉన్నట్టు కనిపించాయీ,   “ సరిలేరు నీకెవ్వరు” బాగానే ఉంటుందేమో అనే అపోహతో వెళ్ళాము. అసలు ఆ సినిమా లో ఏం చెప్పాలనుకున్నారో, హాస్యం పేరుతో ఆ స్త్రీపాత్రధారుల వెకిలి వేషాలేమిటో అర్ధమవలేదు. పైగా ఆ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ ఒకటీ.. ఇదివరకొచ్చిన “ ఖలేజా”, “ సైనికుడు “ కమ్మర్షియల్ గా  flop  అయినా, ఆ తరువాత చూసినప్పుడు, ఫరవాలేదనిపించాయి.  ఈ “ సరిలేరు నీకెవ్వరు “ కి అలాటి లక్షణాలేవీ లేవు.  జస్ట్ డిస్గస్టింగ్ అంతే… మరీ మధ్యలో లేచి వెళ్ళిపోతే, రెండేసి వందలు పెట్టి, ఆరు టిక్కెట్లు తిసిన, పిల్లలు బాధపడతారేమోనని, కూర్చుని భరించాల్సొచ్చింది.ప్రతీ అయిదు నిముషాలకీ ఓ ఫైట్ సీనూ..  అర్ధం పర్ధం లేని పాటలూ..

పొద్దుట చూసిన సినిమా  enjoyment  అంతా పటాపంచలయిపోయింది.. Most disappointing…

 

 ఎలాగూ ఈ సినిమాలు  Amazon  లోనో  Netflix  లోనో రెండు మూడు వారాల్లో వచ్చేస్తాయిగా, ఎందుకు చెప్పండి వందలూ, వేలూ తగలేసి , థియేటర్ లో చూడ్డం? 

పత్రికల్లోనూ, సోషల్ మీడియాలోనూ  రివ్యూలు రాస్తూంటారు కొందరు.. వాళ్ళదేం పోయిందీ? మన లాగ వందలేసి రూపాయలు పెట్టి టిక్కెట్లేమైనా కొనాలా పెట్టాలా?  ఫుకట్ గా నే చూసి, “ విశ్వాస పాత్రం” గా , చూసిన సినిమాని పొగిడేస్తారు.. లేకపోతే, భవిష్యత్తులో వచ్చే సినిమాలకి కాంప్లిమెంటరీ టిక్కెట్ట్లు దొరకవు.

అలాగే మిగిలిన వ్యాపార ప్రకటనలు కూడానూ.. ఏ సెలెబ్రెటీ కో లక్షలూ, కోట్లూ పోసి  ప్రకటనలు తయారు చేస్తారు.. వాళ్ళేమైనా వాడారా పెట్టారా? మనకి అంటగట్టడమే కదా.. పైగా ఆ   Ad Campaign  డబ్బులన్నీ మన దగ్గర వసూలు చేస్తారు…

 Moral of the Story  :  ఎప్పుడూ సినిమాల రివ్యూలు చదివీ, వ్యాపార ప్రకటనలు చూసీ..తద్దినం కొని తెచ్చుకోనక్కర్లేదు…

%d bloggers like this: