బాతాఖాని-=లక్ష్మిఫణి కబుర్లు… Life goes on…


 ఇదివరకటి రోజుల్లోనే హాయిగా ఉండేది- ఏదైనా సందర్భంలో పిల్లలకో, పెద్దవారికో  ఓ బహుమతి ఇవ్వాలంటే, కొన్ని ప్రత్యేక వస్తువులతో పనైపోయేది. కానీ , ఈరోజుల్లో మనం ఇచ్చే బహుమతి కి విలువ అనేది ఉండటంలేదు. ఒక్కో సందర్భానికి  ఏదో కొంత డబ్బు కేటాయించి, ఆ బడ్జెట్ లో ఏదో ఒక వస్తువు తీసికెళ్తే  పనైపోయేది.

 ఏ పసిబిడ్డ బారసాలకో పిలిస్తే, ఓ బుల్లి గ్లాసో ( స్టెయినెస్ స్టీల్ ది), లేదా ఓ కప్పో, సాసరుతోనో లాగించేసేవాళ్ళం. మళ్ళీ ఇందులో ఓ తిరకాసుండేది- ఓకుటుంబంలోంచి పెద్దా, చిన్నా అందరినీ పిలిచామనుకోండి, ఏదో స్టీలు సామాన్ల కొట్టుకెళ్ళి, ఒకరు చెంచా, ఒకరు ప్లేటు, ఇంకోరు కప్పూ తీసికుని మొత్తానికి పని కానిచ్చేసేవారు. అందరూ ఏదో ఒకటి తెచ్చినట్టూ ఉండేదీ, మనకీ ఓ “ సెట్టు” తయారైపోయేది. ఒక్కోప్పుడు సెట్టులోకి ఏదో ఒకటి తక్కువయ్యేది. అందుకే ఇళ్ళల్లో ఇప్పటికీ చూస్తూంటాము, అందరి ఇళ్ళల్లోనూ కాదనుకోండి, ఇంకా చిన్నప్పటి ఆ అభిమానాలు గుర్తుంచుకుని, ఆనాటి వస్తువులు ఉన్న వారిళ్ళల్లో, ఒంటిపిల్లి రాకాసి లాగ, ఓ ప్లేటో, కప్పో, ఇదేమిటీ దీని “జోడీ” ఏదీ అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొస్తుంది—ఓహో ..మన పెద్దాడి బారసాలకి ఫలానా వారిని పిలిచాము కదూ, వాళ్ళిచ్చిందీ అని !. ఎందుకంటే ఆ రోజుల్లో ఓ వస్తువు ఇవ్వడమే కాదు, దానిమీద పేరు కూడా చెక్కించేవారు, “ప్రూఫ్” కోసం.  Ofcourse  ఈరోజుల్లో,ఫొటోలు తీయడంలేదూ మరి? ఆ వచ్చినవాడు ఏదైనా తెచ్చాడా లేదా, బఫేలో ఎంత తిన్నాడూ అన్నవన్నీ విడియోలో రికార్డు చేసేయడం. ఆ విడియోవాడు, ప్రత్యేకంగా వేదిక మీదా, భోజనం ప్లేటు తీసికుని తింటున్నప్పుడు, వాడి కెమేరా తీసికుని అందరినీ విడియో తీయడం ఎందుకనుకుంటున్నారు మరీ?

  ఈరోజుల్లో ఓ కొత్త సాంప్రదాయం ఒకటి మొదలెట్టారు, శుభలేఖల్లోనే    “బహుమతులూ, పుష్పగుఛ్ఛాలూ స్వీకరంచబడవూ” అని ఓ disclaimer  పెట్టేయడం.  కవర్లలో డబ్బుల మాట ఎవడూ ఎత్తడు, ఎందుకైనా మంచిదీ అని ! ఎలాగూ ఏదీ తీసికోరూ అన్నారు కదా అని, కొంతమందేమో చేతులూపుకుంటూ బయలుదేరతారు. తీరా అక్కడికెళ్ళేసరికి, ఎవరికివారు, ఓ కవరు వధువు చేతిలోనో, వరుడి చేతిలోనో పెట్టడం చూస్తాడు. అందుకోసం, to be on the safe side,  పేరు వ్రాసిన కవరూ, కొంత డబ్బూ విడిగా పెట్టుకోవడం. మళ్ళీ ఎంత డబ్బుపెట్టాలీ అనే ఆలోచనొస్తూంటుంది. గొడవలేకుండా, భోజనానికి ఎంతమంది వెళ్తే, అన్ని “ ప్లేటు” ల భోజనం  ఖరీదు పెట్టేసి, చేతులు దులిపేసికుంటున్నారు.. చెప్పొచ్చేదేమిటంటే, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకి వెళ్ళడమంటే, ఏదో హొటల్ కి వెళ్ళి భోజనం చేసినట్టుంటోంది.. ఎలాగూ, వెళ్ళినవాళ్ళని పట్టించుకునేవాడెవ్వడూ ఉండడు,  వచ్చేమో, రాలేదో చూసుకోడానికి తరువాత విడియోలు ఎలాగూ ఉన్నాయి. ఇదివరకటి రోజుల్లో, కుక్కర్లూ, ఇస్త్రీ పెట్టెలూ, డిన్నర్ సెట్లూ వచ్చేవి. కానీ , అవికూడా ఒక్కోప్పుడు ఎక్కువ నెంబర్లలో వచ్చేవి. కొత్తకాపరానికి ఒకటి తీసికుని, మిగిలినవి, అత్తారింట్లోనో, పుట్టింట్లోనో, వాటిని వదిలేసేవారు.

 ఇదివరకు ఆఫీసుల్లో ఈ పెళ్ళిళ్ళకి చందాలు వసూలు చేసేవారు, ఓ పాతికమంది, తలో వందా వేసికున్నా, ఓ పాతికవందలతో, ఓ వస్తువు కొనేసేవారు, ఆ వస్తువు కొన్నవాడు, వచ్చేదాకా బయట ఉండి, వాడొచ్చిన తరువాత అందరూ పొలోమంటూ, స్టేజి మీదకెళ్ళి, ఓ ఫొటో తీయించుకుంటే పనైపోయేది. పుణ్యం పురుషార్ధమూనూ.

  ఇంట్లో కొడుక్కో కూతురికో పుట్టినరోజుకో, వివాహ వార్షికోత్సవానికో ఇవ్వాలంటే, హాయిగా ఏ గిఫ్ట్ కూపనో ఇచ్చేస్తే, వాళ్ళకి కావాల్సినవేవో వాళ్ళే చూసుకుంటారు. అయినా మనం ఇచ్చేదానికోసం ఎదురుచూస్తారా ఏమిటీ, ఏదో మన తృప్తీ, సాంప్రదాయమూనూ. కానీ, వచ్చిన గొడవల్లా మనవళ్ళూ, మనవరాళ్ళ పుట్టిన రోజు సందర్భంలోనే. మనకున్న సంపాదనతో, వాళ్ళకి ఏదో ఓ వస్తువు కొనే ఓపికా లేదూ, అధవా ఏదో ఓ “ ఖరీదయిన” వస్తువేదో పోనీ కొని చేతిలో పెడదామా అంటే, ఈ రోజుల్లో వారి తల్లితండ్రులు కొనే వస్తువుల ముందు, మనం కొన్నవి  వెలవెల పోతూంటాయి. మరీ అలాగని డబ్బులు పెట్టలేమూ, అలాగని పెద్దవారికిచ్చినట్టుగా  గిఫ్ట్ కూపన్లూ పెట్టలేము. వాళ్ళ వయసులో ఆశించేది ఓ ఆటవస్తువు కదా. పోనీ ఆలోచించి ఏదో కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వస్తువేదో తీసికెళ్తే, “ అరే ..తాతయ్యా..మా డాడీ ఎప్పుడో కొనేశారూ..” అంటారు. ఈ తాతయ్యలేమో చిన్నబుచ్చుకుంటారు. ఇదివరకటి రోజుల్లోనే హాయిగా ఉండేది, ఈ బహుమతులూ లేవూ, సింగినాదమూ లేదూ, తలంటు పోసి, కొత్త బట్టలు వేసి, నాలుగక్షింతలేసేవారు. గొడవుండేది కాదు.

 కానీ ఈ రోజుల్లో, పెద్ద క్లాసులోకి వెళ్ళారంటే చాలు, ఏదో చోటకి వెళ్ళడం, డిన్నర్లూ, మూవీలూ, గిఫ్టులూ, రిటర్న్ గిఫ్టులూ లేకుండా ఉండడం లేదు. మనమా ఆ వాతావరణంలో ఇమడలేమూ… ఏమిటో అంతా గందరగోళం గా ఉంది. తమ పిల్లలకి ఈ రోజుల్లో, తల్లితండ్రులైతే, మార్కెట్ లోకి వచ్చిన లేటెస్టు gadget  ఇవ్వాల్సిందే. పోనీ ఇంట్లో లేదా అంటే, అదీకాదూ… అందరు స్నేహితుల దగ్గరా ఉందీ, నాదగ్గర అంతకంటే latest  ది ఉందీ అని చెప్పుకోడానికీ, చూపించుకోడానికీనూ…

మనవలకి, మనవరాళ్ళకి పోనీ ఏదైనా వస్తువు కొనిద్దామా అంటే, అప్పటికే మన బడ్జెట్ లో కొన్న వస్తువు అప్పటికే వాళ్ళ తల్లితంద్రులు కొనేయడమూ, వీళ్ళు వాటిని వాడి వాడి, చెత్తలోకి వేసేయడమూ అయిపోయుంటుంది..

అందుకని వయా మీడియా పధ్ధతిలో  మనకుండే ఓపికతో  ఓ  Amazon Gift Voucher  కొనేసి వాళ్ళకి పంపితే, ఏం కావాల్సొస్తే అదే కొనుక్కుంటారు.. కానీ దీనివలన జరుగుతున్నదేమిటంటే, ఏదో ఒక గిఫ్ట్ కొని, వాళ్ళ చేతుల్లో పెట్టడమనే సంతోషాన్ని కోల్పోతున్నాము కదూ…

 ఏదో మొత్తానికి ఎలాగోలాగ కాలక్షేపం చేసేస్తున్నాము..

2 Responses

 1. ఫంక్షన్ అయినతర్వాత గిఫ్ట్‌ unwrapping ఒక‌ మరపురాని కార్యక్రమం. ముఖ్యులందరినీ జ్ఞాపకం పెట్టుకుని మరీ పిలవాలి
  లేకపోతే‌ అలకలూ,సణుక్కోడాలూ.ఒకసారి రేపర్లన్నీ ఒకేసారి విప్పి పడేశాం.ఎవరెవరు ఏమేం ఇచ్చారో అంతా గందరగోళం.

  Liked by 1 person

 2. మాస్టారూ,
  అసలు ఎవరెవరేమిచ్చారో చూసేదాకా నిద్రే పట్టేది కాదు.. మరీ వాళ్ళెదురుగా రాపర్లు తీసేస్తే చివాట్లూ.. ఒక్కసారి వాళ్ళు వెళ్ళగానే ఓ చాప వేసి, దానిమీద పాకెట్లన్నీ విప్పడం…
  ఆ అనుభవాలన్నీ అటకెక్కేసాయి కదా…

  Liked by 1 person

Leave a Reply to భమిడిపాటి ఫణిబాబు Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: