బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Identity crisis..


 ఓ ఇరవై సంవత్సరాల క్రితం వరకూ  గెడ్డానికి ఓ ప్రత్యేకత ఉండేది.. సాధారణంగా  సిక్కు మతస్థులు గెడ్డాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ విషయంలో విదేశాల్లో కూడా , ఎక్కడో ఈ గెడ్డాలకి  అక్కడివారు , అభ్యంతరం లేవదీస్తే, న్యాయస్థానాలకి కూడా వెళ్ళి , తమ వాదాన్ని నెగ్గించుకున్న ఉదంతాలున్నాయి.. ఆ గెడ్డమూ, తలపాగా వారికి ఓ  unique identity  ఇచ్చింది.. ఎక్కడున్నా వారిని గుర్తుపట్టొచ్చు.. అంతదాకా ఎందుకూ , మన సైనిక దళాలలో  “ సిఖ్ రెజిమెంట్ “ కి ఎంతో పేరుంది కూడా..

  కాలక్రమేణా, ఎవరైనా మారువేషాల్లో ఉండాలంటే ఓ గెడ్డం తగిలించేవారు.. చిన్నప్పుడు గుర్తుండే ఉంటుంది.. సావకాశంగా కూర్చుని ఆనాటి వారపత్రికల అట్టమీద బొమ్మలకి, పెన్నుతో మీసాలూ గెడ్డాలూ పెయింట్ చేయడం ఓ సరదాగా ఉండేది.

 ఆరోజుల్లో సినిమాల్లోకూడా, హీరోని విడిగా చూపించడానికి, మిగతా దుష్ట పాత్రధారులని గెడ్డాలతోనే చూపించేవారు.. మనకంత హిందీ వచ్చేది కాదుగా,  నున్నగా ఉండేవాడు హీరో, గెడ్డం తో ఉండేవాడు విలనూ అని డిసైడైపోయేవాళ్ళం. అంతదాకా ఎందుకూ,  కొత్తగా పెళ్ళై ఓ ఏణ్ణర్ధం తరవాత ఎవడైనా గెడ్డంతో కనిపిస్తే  “ ఏంరోయ్  పెళ్ళాన్ని పుట్టింటికి పంపావా ఏమిటీ…” అని పరామర్శించేవారు. ఏ మధ్యతరగతి గృహస్థునో కూడా, గెడ్డంతోనే చూపించేవారు అతని ఆర్ధికపరిస్థితికి అద్దం పడుతూ…ఆరోజుల్లో విదేశాలకి అదీ ఇంగ్లాండ్, అమెరికా లాటి దేశాలకి ఓ నెలా రెండు నెలల ట్రైనింగుకో వెళ్ళిన మనవాళ్ళు  తిరిగొచ్చేటప్పుడు , గెడ్డాలు, జులపాలతో తిరిగి వచ్చేవారు.. కారణం అక్కడ క్షువరకర్మకి డబ్బులెక్కువ తీసుకుంటారట.

 సరే మన పురాణాల్లో  ఋషుల ని వారి వారి గెడ్డాలతోనే గుర్తుపడేవారం.. ఈయన వశిష్టుడూ , ఈయన విశ్వామిత్రుడూ అనుకుంటూ.. సినిమాల్లో కూడా గుమ్మడి, ముక్కామల ఏ సినిమాలోనైనా ఋషి పాత్ర ధరిస్తే ఓ పేద్ద గెడ్డం ఉండేది.. క్లీన్ షేవెన్ ఋషిని మన తెలుగు సినిమాల్లో ఎప్పుడైనా చూసారా?.

 అలాగే ఆరోజుల్లో జైల్లో ఉండే దొంగలకి గెడ్డం ఉండేది.. “ దో ఆంఖే బారా హాత్  “ సినిమాలో జైలరు గారికి తప్పించి మిగిలిన ఆరు దొంగలూ గెడ్డాలతోనే..

 కాలక్రమేణా ,  ప్రపంచంలో ఉగ్రవాదులు ఎక్కువైపోయారు.. గుర్తుండే ఉంటుంది.. ఒసామా బిన్ లాడెన్ ఫొటోలు గెడ్డంతోనే కనిపించేవి… అప్పుడప్పుడు మన సైనిక దళాలు అరెస్ట్ చేసిన ఉగ్రవాదులు గెడ్డాలతోనే ఉండడం గమనించేఉంటారు టీవీ ల్లో…

 చెప్పొచ్చేదేమిటంటే ఈ గెడ్డాలకి అంత మహత్తర చరిత్ర ఉంది.. అసలు గెడ్డమే ఓ   Unique Identity…  అలాటిది దేశంలో  ఆధార్ కార్డ్   వచ్చిన తరువాత  పరిస్థితే మారిపోయింది.. ఈరోజుల్లో చాలామంది మొహాలే మారిపోతున్నాయి.. ఒకానొకప్పుడు   ID Proof  లో అసలు ఫొటో కనిపించడం అనివార్యం.. పరీక్షలనండి, పాస్ పోర్ట్ అనండి, సెక్యూరిటీ చెకింగ్ అనండి,, వాడి ఫొటో, ప్రస్తుత షేప్పూ ఒకేలా ఉండాలి.. ఏమాత్రం తేడావచ్చినా వెనక్కి పంపేసేవారు.

 అదేం చిత్రమో ఇప్పుడు టీవీల్లో కనిపించే ప్రతీ వాడికీ గెడ్డమే.. మొన్నమొన్నటిదాకా సినిమాల్లో లక్షణంగా కనిపించిన కుర్ర హీరోలు గెడ్డాలతోనే.. దుష్టుడూ, హీరో ఇద్దరూ గెడ్డాలతోనే.. ఛస్తున్నాం చూడలేక.. అసలు సినిమా చూడ్డానికే వెగటు పుడుతోంది.. ఏమైనా అంటే ..” ఈరోజుల్లో ఫాషను మాస్టారూ…” అంటారు..

 ఇంక మన క్రికెటర్లగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది..  అదేదో  IPL Circus  లో వేలాలు ( Auctions)  వీళ్ళ గెడ్డాలబట్టే అనిపిస్తుంది.. ఎలాగూ అవన్నీ  ఫిక్స్ అయిన మాచ్ లే  ఎవడెలాగ ఆడితే ఏమిటీ?

 దేశ ఆర్ధిక వ్యవస్థ  దిగజారిపోతోందని  పేపర్లలో చదువుతున్నాము.. అంటే గెడ్డం గీయించుకోడానికీ,  అంట కత్తెర వేయించుకోడానికీ కూడా డబ్బుల్లేవనీ, దానినే ఆర్ధిక మాంద్యత అంటారని తెలిసింది..

 దేశంలో ఇన్ని కొత్త చట్టాలు చేస్తున్నారు, ఉన్న చట్టాలకి సవరణలు చేస్తున్నారు… పోనీ ఈ గెడ్డాలక్కూడా ఏ సవరణో చేస్తారా అంటే, ఆ చట్టాలు చేసే  ఇద్దరికీ కూడా గెడ్డాలే… ఇంక ఆ భగవంతుడే రక్షించాలి.

 అస్సలు మీకెందుకూ గెడ్డాలసంగతీ.. మీ పనేదో మీరు చూసుకోకా అంటారని తెలుసు.. ఏం చేయనూ, ఉన్న ఒకేఒక్క   Entertainment — సినిమాల్లో ఈ గెడ్డాల హీరోలని భరించలేక. హీరో ఎవడో విలన్ ఎవడో తెలిసి చావడంలేదు.. ఈ మధ్యన ఎన్కౌంటర్ లో పోయిన వాళ్ళకి కూడా గెడ్డాలు లేవు.వాడెవడో అత్యాచార కేసులో శిక్ష పడ్డవాడిక్కూడా…

 హాయిగా ఉన్న మొహాన్ని స్పష్టంగా చూపించుకోక ఎందుకండీ ఈ గెడ్డాలూ , జులపాలూ…

 

 

20 Responses

 1. — దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోతోందని పేపర్లలో చదువుతున్నాము.. అంటే గెడ్డం గీయించుకోడానికీ, అంట కత్తెర వేయించుకోడానికీ కూడా డబ్బుల్లేవనీ, దానినే ఆర్ధిక మాంద్యత అంటారని తెలిసింది..

  అదురహో!

  మీరూ పెంచేయండి తంఠా వదిలి పోతుంది 🙂

  ( ఆ తరువాయి భమిడిపాటి మామి యేమంటారో నాకు తెలియదు ) 🙂

  జెకె

  టపా అదురహో రెండు గెడ్డపాళ్ళ వాక్యం మరో అదుర్స్ 🙂

  జిలేబి

  Like

  • జిలేబీ.
   నన్నూ గెడ్డం పెంచేయమని సలహా ఎలా ఉన్నా, గెడ్డం పెరగొద్దూ? నెత్తిమీద ఓ పరక వెంట్రుకలు మిగిలాయి.. ఇంక గెడ్డం విషయానికొస్తే, ఓ వారంరోజులు షేవింగ్ చేసుకోకుండా ఉంటే ఏదో మొలకల్లాగ వచ్చాయంతే… సుఖపడ్డాను కదూ…

   Like

 2. “జిలేబి” గారి ఉవాచ :- // “( ఆ తరువాయి భమిడిపాటి మామి యేమంటారో నాకు తెలియదు ) 🙂”//
  —————-

  ఏమంటారో తెలియనిదేముంది? ఇటువంటి “తలమాసిన” (jk) వ్యవహారాల గురించి “కులకాంతలే”మంటారో గతంలోనే సుమతీ శతకంలో బద్దెన గారు చెప్పేశారుగా. (సుమతీ శతకంలో 56వ పద్యం)

  క.
  తలమాసిన నొలుమాసిన
  వలువలు మాసినను బ్రాణ * వల్లభు నైనం
  కులకాంతలైనరోతురు
  తిలకింపగ భూమిలోనఁ * దిరముగఁ సుమతీ

  సరదాగా … ఈ వ్యాఖ్య ఫణిబాబు గారు 👆 🙏.
  —————-

  మేం కుఱ్రాళ్ళుగా ఉన్నప్పుడు ఎంత చెప్పినా సకాలంలో హెయిర్ కట్ చేయించుకోకుండా ఠలాయించి తిరుగుతుంటే మా తండ్రిగారు ఈ పద్యం చెప్పేవారు మాకు (**వలువలు మాసిన** వరకూ లెండి 😊) . ఈ కాలంలో పిల్లలకు చెప్పడం మానేశాం లెండి … మనం గట్టిగా పట్టు బడితే వెళ్ళి ఏ పరమ వికారమయిన హెయిర్ కట్ చేయించుకొస్తారో చెప్పలేం కదా. ఇన్నాళ్ళకు ఫణిబాబు గారి ఈ టపా చూసి ఆ పద్యం మళ్ళీ గుర్తొచ్చింది 😁..

  Liked by 1 person

  • నరసింహారావు గారూ,

   ” సూపర్ ” స్పందన… మీరన్నట్టు ఈ రోజుల్లో Hair Styles చూస్తూంటే,” ఓ సారి క్షవరం చేయించుకొస్తావా పోనీ.. ” అని అడగడానికి ధైర్యం చేయలేకపోతున్నాము…

   థాంక్యూ…

   Liked by 1 person

   • అంతా ” ఓల్డు ” మేళము 🙂

    కుర్రకారు గెడ్డపు సొబగు లెటుల తెలియును
    పాత చింత కాయ పచ్చడాయె 🙂

    నారదా!
    జిలేబి

    Like

 3. గెడ్డ మందు గలదు కెంపుకంటి! పడచు
  దనము; ముదిమి నాటి తరపు జనులు!
  కుర్రకారుల సొబగులెటుల తెలియును
  పాత చింతకాయ పచ్చడాయె!

  జేవి

  Like

 4. జిలేబీ

  వావ్… మీ ఇద్దరి కవితా హృదయాలూ వరదలై పొంగుతున్నాయి గెడ్డాలమీద …..

  Like

 5. ఫణిబాబు గారు, గుడ్ మోర్నింగ్.
  “జిలేబి” గారి పద్యవ్యాఖ్య మీద నేనొక కానెంట్ వ్రాసాను నిన్ననే. ఎన్ని సార్లు పెట్టినా మీ బ్లాగ్ లో కనబడడం లేదు. నిన్న రాత్రి పడుకోబోయే ముందు మరోసారి పెడితే ఆల్రెడీ చెప్పావుగా అని విసుక్కుంది వర్డ్-ప్రెస్. అంతే గానీ వ్యాఖ్యను చూపించడం లేదు. స్పామ్ లో గానీ ఇరుక్కుందేమో ఓసారి చూడగలరా ప్లీజ్?

  Like

 6. నరసింహరావుగారూ,

  చెక్ చేసాను.. కనిపించలేదు…. నా mail bphanibabu@gmail.com కి పంపండి..

  Like

  • ఫణిబాబు గారు, పైన మీ profile లో (“నా గురించి చెప్పాలంటే” column లో) 2010లో మీరిచ్చిన మీ సెల్ నెంబర్ అదేనా, మారిందా?

   Like

 7. ఏమిటి “జిలేబి”గారూ, మేమంతా “ఓల్డ్” మేళమా? పోనీలెండి, తెలుగు బ్లాగ్ లోకపు నవ యవ్వనులు మీరున్నారుగా.

  ఏమాత్రం ఆలోచనా, విచక్షణా లేని అవతారాలు నేటి తరం వారు. ఫణిబాబు గారన్నట్లు నిన్నటి వరకూ చూడ చక్కటి ముఖారవిందంతో కనిపించిన హీరోలు సడెన్ గా బూచాడి గడ్డాలతో తెర మీద దర్శనమిస్తున్నారు. హీరోని చూసి అతని వెంట ఉండే తొట్టి గ్యాంగ్, వీళ్ళు చాలక దర్శకులు, టీవీ జనాలు, ఆటల్లో కెప్టెన్ ని కాకా పట్టడానికి టీం మెంబర్లు …. ఛీ ఛీ ఛీ. సరే ఫ్యాషన్ రంగం వాళ్ళు, మగ మోడల్స్ …. అబ్బబ్బా, యువతని నాశనం చేసేశారు. ఒకప్పుడు వ్యాపార ప్లకటనల్లో గడ్డం ఉన్న మగ మోడల్స్ చాలా చాలా చాలా అరుదు … Zodiac ties Dhanji Rana ఒకడుండేవాడు, కింగ్ సైజ్ సిగరెట్లకు కబీర్ బేడీ ఉండేవాడు. చూడ్డానికి నీట్ గా అనిపించేది.

  ఇప్పుడేమిటండీ ఈ బవిరి గడ్డాలు. పిల్లలు చూస్తే దడుచుకునే లాగాను, వీళ్ళేమన్నా రేపిస్టులా అనిపించేలాగానూ. ఫణిబాబు గారన్నట్టు చూడలేక ఛస్తున్నాం. మరొక పాయింటండోయ్ (నా బాధ) – డబ్బుల మోజులో పడిపోయి, మీడియా విలువలకు తిలోదకాలిచ్చిన వార్తాపత్రికలు మొదటి రెండు మూడు పేజీలను ప్రకటనలతో నింపేస్తున్నాయి.. పొద్దున్నే వాకిలి తలుపు తీసి ఆ రోజు పేపర్ని చేతులోకి తీసుకుంటే ఈ మొహాల బలవంతపు దర్శనంతో మనకు సుప్రభాత సేవ …. ఖర్మ ఖర్మ (వారపత్రిక ఏదన్నా వరండాలో టేబుల్ మీద కనబడితే దాని మీద ఎవరైనా అభినేత్రి ముఖచిత్రం గానీ ఉంటే “ఎందుకర్రా, పొద్దునే ఈవిడ గారి దర్శనం” అనేవారు మా తండ్రిగారు. ఏమిటో ఆ రోజులే వేరు).

  ఇటువంటి బవిరి స్వాముల్నా మీరు వెనకేసుకొస్తున్నది? సభ్యసమాజం లో చెత్త ధోరణులను పెంచి ఎగదోస్తున్న వాళ్ళను, వెర్రిమొహాలేసుకుని వాళ్ళని అనుకరిస్తున్న వాళ్ళను …… నేనయితే చమించను, చమించను, చమించను, అంతే, ఎవరిష్టం వారిది అని వాదించినా సరే 😠.

  మంచి టపా వ్రాసిన ఫణిబాబు గారిని మెచ్చుకుంటూ ఓ పద్యం కట్టరాదూ, ఓ పద్ధతిగా ఉంటుంది?

  Like

 8. //”ఎందుకండీ వినరా వారు ……”//
  అంతేగా, అంతేగా “జిలేబి” గారు. ఎలాగూ ఎవరూ “వినరు”.

  Liked by 1 person

  • వామ్మో ! మీరు కూడా బోల్డన్ని కబుర్ల లలిత గారిలా పదాలతో ఆడేసు కుంటున్నారు 🙂 అదురహో !

   జిలేబి

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: