బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Identity crisis..

 ఓ ఇరవై సంవత్సరాల క్రితం వరకూ  గెడ్డానికి ఓ ప్రత్యేకత ఉండేది.. సాధారణంగా  సిక్కు మతస్థులు గెడ్డాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ విషయంలో విదేశాల్లో కూడా , ఎక్కడో ఈ గెడ్డాలకి  అక్కడివారు , అభ్యంతరం లేవదీస్తే, న్యాయస్థానాలకి కూడా వెళ్ళి , తమ వాదాన్ని నెగ్గించుకున్న ఉదంతాలున్నాయి.. ఆ గెడ్డమూ, తలపాగా వారికి ఓ  unique identity  ఇచ్చింది.. ఎక్కడున్నా వారిని గుర్తుపట్టొచ్చు.. అంతదాకా ఎందుకూ , మన సైనిక దళాలలో  “ సిఖ్ రెజిమెంట్ “ కి ఎంతో పేరుంది కూడా..

  కాలక్రమేణా, ఎవరైనా మారువేషాల్లో ఉండాలంటే ఓ గెడ్డం తగిలించేవారు.. చిన్నప్పుడు గుర్తుండే ఉంటుంది.. సావకాశంగా కూర్చుని ఆనాటి వారపత్రికల అట్టమీద బొమ్మలకి, పెన్నుతో మీసాలూ గెడ్డాలూ పెయింట్ చేయడం ఓ సరదాగా ఉండేది.

 ఆరోజుల్లో సినిమాల్లోకూడా, హీరోని విడిగా చూపించడానికి, మిగతా దుష్ట పాత్రధారులని గెడ్డాలతోనే చూపించేవారు.. మనకంత హిందీ వచ్చేది కాదుగా,  నున్నగా ఉండేవాడు హీరో, గెడ్డం తో ఉండేవాడు విలనూ అని డిసైడైపోయేవాళ్ళం. అంతదాకా ఎందుకూ,  కొత్తగా పెళ్ళై ఓ ఏణ్ణర్ధం తరవాత ఎవడైనా గెడ్డంతో కనిపిస్తే  “ ఏంరోయ్  పెళ్ళాన్ని పుట్టింటికి పంపావా ఏమిటీ…” అని పరామర్శించేవారు. ఏ మధ్యతరగతి గృహస్థునో కూడా, గెడ్డంతోనే చూపించేవారు అతని ఆర్ధికపరిస్థితికి అద్దం పడుతూ…ఆరోజుల్లో విదేశాలకి అదీ ఇంగ్లాండ్, అమెరికా లాటి దేశాలకి ఓ నెలా రెండు నెలల ట్రైనింగుకో వెళ్ళిన మనవాళ్ళు  తిరిగొచ్చేటప్పుడు , గెడ్డాలు, జులపాలతో తిరిగి వచ్చేవారు.. కారణం అక్కడ క్షువరకర్మకి డబ్బులెక్కువ తీసుకుంటారట.

 సరే మన పురాణాల్లో  ఋషుల ని వారి వారి గెడ్డాలతోనే గుర్తుపడేవారం.. ఈయన వశిష్టుడూ , ఈయన విశ్వామిత్రుడూ అనుకుంటూ.. సినిమాల్లో కూడా గుమ్మడి, ముక్కామల ఏ సినిమాలోనైనా ఋషి పాత్ర ధరిస్తే ఓ పేద్ద గెడ్డం ఉండేది.. క్లీన్ షేవెన్ ఋషిని మన తెలుగు సినిమాల్లో ఎప్పుడైనా చూసారా?.

 అలాగే ఆరోజుల్లో జైల్లో ఉండే దొంగలకి గెడ్డం ఉండేది.. “ దో ఆంఖే బారా హాత్  “ సినిమాలో జైలరు గారికి తప్పించి మిగిలిన ఆరు దొంగలూ గెడ్డాలతోనే..

 కాలక్రమేణా ,  ప్రపంచంలో ఉగ్రవాదులు ఎక్కువైపోయారు.. గుర్తుండే ఉంటుంది.. ఒసామా బిన్ లాడెన్ ఫొటోలు గెడ్డంతోనే కనిపించేవి… అప్పుడప్పుడు మన సైనిక దళాలు అరెస్ట్ చేసిన ఉగ్రవాదులు గెడ్డాలతోనే ఉండడం గమనించేఉంటారు టీవీ ల్లో…

 చెప్పొచ్చేదేమిటంటే ఈ గెడ్డాలకి అంత మహత్తర చరిత్ర ఉంది.. అసలు గెడ్డమే ఓ   Unique Identity…  అలాటిది దేశంలో  ఆధార్ కార్డ్   వచ్చిన తరువాత  పరిస్థితే మారిపోయింది.. ఈరోజుల్లో చాలామంది మొహాలే మారిపోతున్నాయి.. ఒకానొకప్పుడు   ID Proof  లో అసలు ఫొటో కనిపించడం అనివార్యం.. పరీక్షలనండి, పాస్ పోర్ట్ అనండి, సెక్యూరిటీ చెకింగ్ అనండి,, వాడి ఫొటో, ప్రస్తుత షేప్పూ ఒకేలా ఉండాలి.. ఏమాత్రం తేడావచ్చినా వెనక్కి పంపేసేవారు.

 అదేం చిత్రమో ఇప్పుడు టీవీల్లో కనిపించే ప్రతీ వాడికీ గెడ్డమే.. మొన్నమొన్నటిదాకా సినిమాల్లో లక్షణంగా కనిపించిన కుర్ర హీరోలు గెడ్డాలతోనే.. దుష్టుడూ, హీరో ఇద్దరూ గెడ్డాలతోనే.. ఛస్తున్నాం చూడలేక.. అసలు సినిమా చూడ్డానికే వెగటు పుడుతోంది.. ఏమైనా అంటే ..” ఈరోజుల్లో ఫాషను మాస్టారూ…” అంటారు..

 ఇంక మన క్రికెటర్లగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది..  అదేదో  IPL Circus  లో వేలాలు ( Auctions)  వీళ్ళ గెడ్డాలబట్టే అనిపిస్తుంది.. ఎలాగూ అవన్నీ  ఫిక్స్ అయిన మాచ్ లే  ఎవడెలాగ ఆడితే ఏమిటీ?

 దేశ ఆర్ధిక వ్యవస్థ  దిగజారిపోతోందని  పేపర్లలో చదువుతున్నాము.. అంటే గెడ్డం గీయించుకోడానికీ,  అంట కత్తెర వేయించుకోడానికీ కూడా డబ్బుల్లేవనీ, దానినే ఆర్ధిక మాంద్యత అంటారని తెలిసింది..

 దేశంలో ఇన్ని కొత్త చట్టాలు చేస్తున్నారు, ఉన్న చట్టాలకి సవరణలు చేస్తున్నారు… పోనీ ఈ గెడ్డాలక్కూడా ఏ సవరణో చేస్తారా అంటే, ఆ చట్టాలు చేసే  ఇద్దరికీ కూడా గెడ్డాలే… ఇంక ఆ భగవంతుడే రక్షించాలి.

 అస్సలు మీకెందుకూ గెడ్డాలసంగతీ.. మీ పనేదో మీరు చూసుకోకా అంటారని తెలుసు.. ఏం చేయనూ, ఉన్న ఒకేఒక్క   Entertainment — సినిమాల్లో ఈ గెడ్డాల హీరోలని భరించలేక. హీరో ఎవడో విలన్ ఎవడో తెలిసి చావడంలేదు.. ఈ మధ్యన ఎన్కౌంటర్ లో పోయిన వాళ్ళకి కూడా గెడ్డాలు లేవు.వాడెవడో అత్యాచార కేసులో శిక్ష పడ్డవాడిక్కూడా…

 హాయిగా ఉన్న మొహాన్ని స్పష్టంగా చూపించుకోక ఎందుకండీ ఈ గెడ్డాలూ , జులపాలూ…

 

 

%d bloggers like this: