బాతాఖాని – లక్ష్మి ఫణి కబుర్లు — మేరా భారత్ మహాన్…

 మన దేశంలో ఉన్న సౌలభ్యం  ఏమిటంటే,  ఎప్పుడు కావాల్సొస్తే అప్పుడు చట్టాలు చేసేయడం, దానికో పేరు కూడా పెట్టడం.. ఏదో చట్టాలు చేసేసారుకదా అని నేరాలు జరగడం మానుతాయా? ఎవరి దారి వారిదే.. ఈ మధ్యన మరో కొత్త ఒరవడి ప్రారంభం అయింది.. రాజ్యాంగంలోని చట్టాలకి సవరణలు చేయడం.. సాధారణంగా ఇలాటివన్నీ అధికారంలో ఉండే  ఏలినవారి “ మూడ్ “ మీద ఆధారపడుంటుంది..  నగరాల్లో చూస్తూంటాం—సడెన్ గా రాత్రికి రాత్రి ఓ రోడ్ ని  One way  చేసేస్తారు.. ఈ విషయం తెలియక ఆ రోడ్డుమీదనుండి వచ్చిన వాడు బుక్కైపోతాడు.. వాడు కొన్ని సంవత్సరాలనుండీ అదే రోడ్డు మీదే వస్తూంటాడు.. పాపం వాడికేంతెలుసూ, అంతకు ముందురోజు, ఏ పోలీసు కమీషనర్ గారో, ఫామిలీతో ఏదో పార్టీకి వెళ్తూ, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాడూ.. దాని ఫలితమే . మర్నాడు ఆఫీసుకి వెళ్ళి ఓ ఆర్డర్ పాస్ చేసేసాడని. మామూలు ప్రజానీకం ఏమైతేనేమిటీ? పాపం ఈ పోలీసు అధికార్లకి , రాజకీయనాయకులకుండే సదుపాయాలు—వాళ్ళ కార్లు వెళ్తూంటే ట్రాఫిక్కు ఆపుచేయడాలూ అవీ—ఉండవుగా.. వాళ్ళ చేతుల్లో ఉండేదేదో చేసేయడం. హెల్మెట్లు పెట్టుకోవాలని ఓ ఆర్డర్ పాస్ చేసేస్తారు..  ఎక్కడో నూటికీ కోటికీ ఓ పోలీసోడు పెట్టుకుంటాడంతే..కానీ ట్రాఫిక్ సిగ్నల్ పక్కన నుంచుని హెల్మెట్ లేనివాళ్ళకి చలాన్లు మాత్రం రాస్తారు..

 దేశంలో జరిగే అత్యాచారాలూ, నేరాలూ సినిమాలవల్లే అని కొందరంటారు.. కానీ సినిమావాళ్ళు మాత్రం దేశంలో జరిగే నేరాలనే చిత్రిస్తున్నామంటారు..మరి ఇద్దరూ కరెక్టే కదా.. పేద్దపెద్ద నేరాలు జరగ్గానే మన ప్రభుత్వాలు అవేవో  fast track courts  పెట్టామంటారు..  కేంద్రప్రభుత్వమైతే  Cr.P.C  లో మార్పులు తెస్తామంటారు…  ఉత్తిత్తి మాటలంతే…

 మరో అద్భుతమైన చిత్రం ఏమిటంటే, దేశంలో ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు ప్రతీవాడూ స్పందించేయడమే.. వాడికున్న పరపతిని బట్టి ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది.. స్పందించినవాడు కూడా ఇదివరకు ఏదో దౌర్భాగ్యపు పని చేసి పట్టుబడ్డవాడైనా సరే..  టీవి ల్ళో చర్చలూ గట్రా మరో పేద్ద జోక్..చట్టసభలలో చర్చలు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… నిజం చెప్పాలంటే, ఆ చట్టసభల ప్రత్యక్ష ప్రసారాలు  మాత్రమే మనకి  Entertainment Channels..  అర్ధరాత్రులదాకా కూర్చుని మరీ కొట్టుకుంటారు..అదో కాలక్షేపం..

 అదేమిటో ఎక్కడ చూసినా, ఆర్ధిక మేధావులు ( నోబెల్ ప్రైజ్ వచ్చినాయనతో సహా) మన ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోతోందనేవారే.. ఆమధ్యన జైలుకెళ్ళి బెయిల్ మీద వచ్చినాయన కూడా..కానీ మన ప్రభుత్వం మాత్రం, దేశమంటే భక్తిలేనివాళ్ళనే మాటలే అని కొట్టిపారేస్తూంటారు.  అయినా మన వెర్రికానీ, దేశమంటే ఎవరూ ..పెద్ద పెద్ద రాజకీయనాయకులే కదా.. వాళ్ళ సంగతికేం శుభ్రంగా ఉన్నారు.. ఉల్లిపాయలు 200/- రూపాయలైతేనేమిటి, గాస్ సిలిండర్ 600/- పైనేతేనేమిటి, వాళ్ళేమైనా కొనాలా పెట్టాలా? ఫైగా “ మా ఇంట్లో అస్సలు ఉల్లిపాయలే ముట్టని ఛాందసకుటుంబం ..”     అంటుంది   ఒకావిడ.. మరో సాధుపుంగవుడైతే  “ ఉల్లిపాయలా.. అంటే ఎలా ఉంటాయీ..” అంటాడొకాయన. కానీ సామాన్య ప్రజానీకం మాత్రం అంతంత ఖరీదులు పెట్టి కొనుక్కుని,  వచ్చిన ఉల్లిపాయల్ని ఏ వంటమనిషీ ఎత్తుకుపోకుండా, బిరువాల్లో జాగ్రత్త చేసుకుంటున్నారు.

 ఒకానొకప్పుడు  పత్రికా విలేఖర్ల సమావేసాలని ఉండేవి.. ఈ అంతర్జాలం వచ్చిన తరువాత ప్రతీవాడూ  Net savvy  అయిపోయారు..ప్రతీదానికీ Twitter  వాడుతున్నారు. ఏదో పోస్ట్ చేసిన తరువాత ఏదైనా తేడా వస్తే.. వెంటనే delete  చేసేయొచ్చు.. రాత్ గయీ బాత్ గయీ.. -=

 మేరా భారత్ మహాన్…

%d bloggers like this: