బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Food for thought…

మనదేశంలో చాలామంది అకస్మాత్తుగా నిద్ర లేస్తూంటారు.  సామాజిక మాధ్యమాల ధర్మమా అని, ఒకరు మొదలెడితే, అంచలంచలుగా దేశం అంతా పాకిపోయి, ప్రతీవారూ సై అంటే సై అనేయడం చూస్తూంటాం.. మనదేశంలో సమస్యలకేం కొదవా? చూడాలనుకోవాలేకానీ, కావాల్సినన్నున్నాయి. ఎక్కడో ఎవరికో తడుతుంది, అంతే  social media  లో ఓ group  తయారుచేసేయడం.. అదేమీ తప్పనడంలేదు– ఎవరో ఒకరు నడుం కట్టాలిగా. ఇంక ఆ group  లో , ఎవరికి నచ్చినట్టు వారు స్పందిస్తారు… “అసలు ఈ చానెళ్ళవాళ్ళండీ…” అంటూ, టీవీ చానెళ్ళ గురించి కొందరూ, రైతుల ఆత్మహత్యల గురించి కొందరూ, స్త్రీలపై అత్యాచారాల గురించి కొందరూ,  Evergreen corruption  గురించి కొందరూ,  intellectuala (  మేధావులు ) తమతమ అమూల్యమైన అభిప్రాయాలు చెప్తారు.  ఆ గ్రూప్ లోని మిగిలిన సభ్యులకి కూడా గుర్తొస్తుంది.. ” అవును కదూ.. ” అని.  That is the beginning and end of the story. ఓ వారం పదిరోజులు మీడియాలో హల్ చల్ చేసి, కనుమరుగైపోతుంది.. నాలాటివాడు ఏదైనా అంటే, “అలా అంటే ఎలాగండీ, మన భావితరాలను బాగుచేయడం మన కర్తవ్యం కదా… అందరూ మడికట్టుక్కూర్చుంటే ఎలా కుదురుతుందీ.. మన సామాజిక బాధ్యత మర్చిపోతే ఎలా… ” అని దుమ్మెత్తిపోస్తారు.

కానీ ఒక్కరైనా, సమస్యని సరైన కోణంలో  analyse  చేయడానికి ప్రయత్నిస్తారా అంటే, అబ్బే, అలా చేసుకుంటూ పోతే  మొదలెడితే మన  నెత్తికి చుట్టుకోదూ?.. ఎవరికి వారే, తెలుగు ప్రసారమాధ్యమాల్లో వస్తూన్న కార్యక్రమాలగురించి, ఎంతో  ” ఆవేదన ”  వ్యక్తపరుస్తున్నారు. నిజమే, అత్యంత దౌర్భాగ్యపు కార్యక్రమాలే చూపిస్తున్నారు 80 శాతం. చూడ్డం ఇష్టంలేకపోతే మానేయచ్చుగా అని, ఆ కార్యక్రమాల నిర్మాతలంటారు.. వాళ్ళ మాటా రైటే కదా. పనికట్టుకుని చూడమనెవడన్నాడుటా?.ఇది సామాన్యంగా వినే  escapist arguement..   తయారుచేసి  వీక్షకులని క్షోభ పెడుతున్న కార్యక్రమాలు ఎందుకు చూపిస్తున్నారురా అంటే, ”  నా పుట్టలో వేలెడితే కుట్టనా.. ” అని ” ఏడు చేపల “కథలో..చీమన్నట్టుగా ఉంది. అలాగే ఒక  NV Joke—  ఒకావిడ  తనభర్తతో ” పక్క రూమ్ములో అబ్బాయి బట్టల్లేకుండా తిరుగుతాడండీ..” అంటే, ” అసలు నిన్ను ఆ కిటికీలోంచి తొంగిచూడమనెవరు చెప్పారూ ” అన్నాడుట భర్త.. అర్ధం అయిందా? అసలు గొడవంతా ఇక్కడే మొదలవుతోంది. ఏదో చూసేసి బావేసుకోవాలనే యావ మనలోనే ఉంది. గుమ్మిడికాయదొంగంటే భుజాలు తడుముకున్నట్టు, అసలు విషయం ఎత్తితే అందరూ భుజాలు తడుముకుంటారు..  టీవీ యే ఒక వ్యసనం, అందులోనూ తెలుగు చానెల్సైతే చెప్పక్కర్లేదు.అదో నల్లమందులాటిది.. పైగా ఏమైనా అంటే, కాలక్షేపానికి చూస్తూంటామండీ అని ఓ వెర్రి సాకోటీ. నిజమే, ఈరోజుల్లో , కొడుకూ కోడలూ ఉద్యోగాలకి వెళ్ళిపోయినతరువాత, మరీ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోలేరుగా, ఏదో ఒక కాలక్షేపం ఉండాలే. కానీ, కార్యక్రమాలు నచ్చడంలేదంటూ, తెలుగు చానెల్స్ నే పట్టుక్కూర్చుంటే ఎలా?  వివిధభాషల్లోనూ వందలకొద్దీ చానెల్సున్నాయి. భాష రాదనుకోడానికి కూడా లేదు.. టీవీ లో ” భాష మార్పిడి ” చేసి, హాయిగా తెలుగులో కూడా చూడొచ్చు … కదా…వీటికి సాయం, ఈమధ్యన  కేబుల్ టీవీ ఉన్నాకూడా  set top box  అనివార్యం అని ఒక రూల్ పెట్టినప్పుడు, కావాల్సిన చానెల్స్  నే చూడొచ్చుగా.

భావితరాలవారు పాడైపోతారేమో అని ఘోషించేకంటే, ముందరే మనకు మనమే,  తెలుగు చానెల్స్ చూడ్డం మానేస్తే బావుంటుందేమో.  ఏ కార్యక్రమం ఏ టైములో వస్తుందో అందరికీ కంఠోపాఠం. పోనీ , పెద్దమనిషితరహాగా, కొన్ని రోజులు చూడ్డం ఆపేసినా, మళ్ళీ ఓ ఉత్కంఠాయె– ఫోనీ ఏం చూపిస్తున్నాడో చూద్దాంలెద్దూ.. ఒరేయ్ ఓసారి ఆ రిమోటిలా ఇయ్యీ…. అని తిప్పడం. ఇంత వయసొచ్చి, మనకే నియంత్రణ లేనప్పుడు, ఇంకోరిమీద ఏడవడం ఏమాత్రం సవ్యం?

ఆమధ్యన ఒక స్నేహితుడు, ” మాఇంట్లో టీవీ లేదండీ, పిల్లలకి పరీక్షలు కదా.. ” అన్నాడు. నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఉపయోగకరమైన వేలాది కార్యక్రమాలున్నాయి, వాటిని చూడనీయొచ్చుగా.. ఒకనొకప్పుడు  General Knowledge  కోసం, రకరకాల పుస్తకాలు కొని, చదివి నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడేమో టీవీ లు వచ్చి, ఆ పుస్తకాలు  అటకెక్కేశాయి. 

” మన బంగారం మంచిదైతే… ” అన్నట్టు, ముందర మనం బాగుపడి, ఆ  so called  చెత్త కార్యక్రమాలు చూడ్డం మానేస్తే,  automatic  గా పిల్లలూ మానేస్తారు. మనల్నేకదా అనుకరించేదీ పిల్లలూ? ” స్వఛ్ఛభారత్ ” అని ఓ కార్యక్రమం మొదలెట్టారు. ఆమధ్యన , ఎవరో రాశారు.. ఓ మెర్సిడీజ్ కారులో వెళ్తూ, కార్ విండోలోంచి, చెత్త రోడ్డుమీదకు విసిరేశారూ అని. అంతే “డబ్బు కాదండీ, సంస్కారం ఉండాలీ”అని అందరూ స్పందించారు. నిజమే కదా, ఆ సంస్కారం, self discipline  లేకపోవడం మూలాన్నే, ఏ ఒక్క ఉద్యమమూ,  succeed  అవడం లేదు. ఈ ” ఉవాచ ” కూడా అందరూ చెప్పేదే. నేనుకూడా అనేస్తే ఓ గొడవొదిలిపోతుంది… ” మేధావుల ” క్యాటిగరీలోకి చేరిపోవచ్చు.

మరీ పెద్దపెద్ద  resolutions  కాకపోయినా, just    టీవీ లో వస్తూన్న కొన్ని కార్యక్రమాలు చూడ్డం మానేసి ఓసారి ప్రయత్నించి చూడండి. ..   FYI..( For your information ) మేము ఏ కొద్ది కార్యక్రమాలో తప్ప, తెలుగు చానెల్స్ చూడం. అదేదో ” మా ఇంట్లో ఇంగ్లీషు పేపరే తెప్పిస్తామండీ.. ” అన్నట్టు గొప్పలు చెప్పుకోడానికి చెప్పడం లేదు. చూడకపోవడం మూలాన, మా ఆరోగ్యాలేమీ పాడవలేదు. ఆస్థి నష్టం ఏమీ జరగలేదు. హాయిగా ఉన్నాం.

%d bloggers like this: