బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఏదో అనుకుంటాం ఇంకోటేదో జరుగుతుంది…

ఎప్పటికప్పుడు ఏదో రాద్దామనుకోడం, కానీ పరిస్థితులు చూసి నిరాశా , నిస్పృహా  రావడం. మనకెందుకొచ్చిన  గొడవా అని వదిలేయడం.. ఇవేళ ఇలా కాదనుకుని , కనీసం  గత రెండు నెలలుగా జరుగుతూన్న సంఘటనలమీద , ఎవరైనా చదివినా చదవకపోయినా, ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా, ఉన్నదేదో కక్కేస్తే, కనీసం ప్రశాంతంగా ఉంటుందీ అనుకుని , ఇదిగో ఇలా మీముందుకువచ్చాను.

సాధారణంగా, నిద్రపోతున్న ప్రజలని లేపాలంటే , ఓ ఉద్యమం  మొదలెడితే చాలు, పనిపాటా లేనివారు మన దేశంలో పుష్కలంగా ఉన్నారు.అప్పుడెప్పుడో గుర్తుందా, అన్నా హజారేగారు ,ఏదో మొదలెట్టారు, ఇంక చూడండి, ప్రతీవాడూ ఓ గాంధీ టోపీ పెట్టేసికుని, (అసలు గాంధీగారే పెట్టుకోలేదు ! దేశమంతా ధర్నాలూ, సత్యాగ్రహాలూ, ఒకటేమిటి, రాజధానిలో అదేదో జంతర్ మంతర్ దగ్గర బహిరంగ సభలూ, ఒకటెమిటి … ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్షప్రసారాలూ, చర్చలూ… అవన్నీ చూసి, విని  రాత్రికి రాత్రే అదేదో  లంచరహిత స్వర్ణభారతం వచ్చేస్తుందని కలలు కనేశారు. ఓ నెలరోజులు దేశమంతా హడావిడి జరిగింది. అదేదో చట్టం అన్నారు, దానికి మళ్ళీ సవరణలోటీ… ఏదో మొత్తానికి ఓ నాలుగు నెలల హడావిడి చేసి, తరువాత మళ్ళీ తుపాగ్గుండుకి కూడా దొరక్కుండా, ఒకాయన ముఖ్యమంత్రయాడు,  ఆయనతో పోటీచేసినావిడేమో  గవర్నరుగా   enjoy  చేస్తున్నారు.  All that “corruption free India ”  has gone for a Toss.

  ఒక్కవిషయం మాత్రం ఒప్పుకోవాలి– మన దేశంలో  ఉద్యమాలూ వగైరాలు చేయడానికి , కావాల్సినన్ని తాయిలాలు ఉన్నాయి… వెతకడం ఆలశ్యం అంతే. 2014 లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు– ” స్వఛ్ఛభారత్” అన్నారు. ఇదివరకటి రోజుల్లో బహిర్భూమికి వెళ్ళేవాళ్ళందరినీ  ఠాఠ్ అలా కుదరదూ, ఇంట్లోనే వెళ్ళాలన్నారు. మెడమీద తలున్న ప్రతీవాడినీ  Brand Ambassador  చేసేశారు. నెలకో రెండునెలలకో ఊళ్ళో ఉన్న ప్రముఖులు, చెత్త ఎక్కువగా లేని ప్రదేశాల్లోనో, ఓ చీపురూ బుట్టా పట్టుకుని ఫొటోలూ వగైరా. ఇక్కడ ఫొటోలు ముఖ్యం. ఆ పెద్దాయనకి చూపించొద్దూ మరి? 

ఈ మధ్యలో ఆంధ్రదేశంలో , అదేదో ” ప్రత్యేక హోదా” త, దానిమీద గొడవా. వచ్చిందీ లేదూ పెట్టిందీ లేదు.. అయినా హోదాలొస్తే ఉపయోగం ఏమిటీ, డబ్బులు కదా కావాల్సింది. అంత పెద్ద కబుర్లు చెప్పిన  నాయుడుగారూ, అవేవో లక్షలకోట్లు   నిధి అనగానే , ప్లేటు మార్చేశారు. ఇదీబావుందీ, నాలుగురాళ్ళు వెనకేసుకోవచ్చూ అనుకునుంటారు.  ఇద్దరు నాయుళ్ళూ కలిసి తెలుగువాళ్ళని వెర్రివెధవలు చేశారు. అయినా కొత్తగా చేయడానికేముందీ..

ఆమధ్యన ఉగ్రవాద దాడులు జరగ్గానే, మామూలుగా మన సైనికదళాల వారు  ఇచ్చే తిరుగుజవాబునే, అదేదో ఫాషనబుల్ గా ఉందీ, అందరి నోళ్ళలోనూ నానుతుందీ అనుకుని, దానికి  surgical strikes  అని ఓ ముద్దు పేరు పెట్టారు. గత 70 సంవత్సరాల్లోనూ ఏ ప్రభుత్వమూ చేయనివిధంగా ఈ ప్రభుత్వం చేసిందీ అని హడావిడి చేశారు.  రక్షణమంత్రిగారు కూడా… ” అవునూ నేను ఉద్యోగంలో చేరిన తరవాత పాత రికార్డులన్నీ చూశానూ.. ఇంత అద్భుతమైన ఆపరేషన్ ఎప్పుడూ జరగలేదూ.. ” అని వక్కాణించారు.చివరకి మన విదేశాంగ కార్యదర్శి గారు, ” అదేమీ కాదూ, ఇలాటివి ఎప్పుడూ జరిగేవే, వాటికి ముద్దుపేర్లూ, మాధ్యమాల్లో ప్రచారాలూ ఉండేవి కావూ…” అని వీధిన పెట్టేశారు. ఇందులో మనకి లభించినదేమిటయ్యా అంటే , మన పదజాలాల్లోకి ఓ కొత్త పదం  ”  Surgical Strikes 

ఇంకేముందీ, జనాలంతా ఎడాపెడా వాడడం మొదలెట్టేశారు.దేనికిపడితే దానికే ఆ పేరు. కొత్తగా పుట్టిన పిల్లలకికూడా పెట్టారేమో తమాషాగా ఉంటుందని.. తెలియదు. మన ప్రధానమంత్రిగారికి ఓ సౌలభ్యం ఉంది– సంసార బంధాలు లేవు, ఈతిబాధలు లేవూ, పిల్లలకి పాఠాలు చెప్పక్కర్లేదూ, భవబంధాలకి అతీతులు. ఏదో తనూ, ప్రజలూనూ… మైక్కు ముందరకి వెళ్తేచాలు, కావాల్సినన్ని ఉపన్యాసాలు… చెప్పవలసిన చోట తప్పించి, దేశవిదేశాల్లో ఓ మైక్కివ్వండి చాలు…  మనమూ ఏదో ఒకటి చేసి, అందరినీ ఓ  Surgical Strike  చేస్తే ఎలా ఉంటుందీ అనుకున్నారు. అదేమీ పెద్ద Strike  కాదనుకోండి, అధికార పార్టీ వారూ, మిత్రపక్షాలూ, సద్దుబాట్లు చేసుకున్నతరువాత, నవంబర్ 8 అర్ధరాత్రి తరవాత  500, 1000 నోట్లూ చెల్లవు పొమ్మన్నారు.. రాత్రికి రాత్రి ATM  లలో ఉన్న వందనోట్లు ఖాళీ… పాత నోట్లు మార్చుకోమన్నారు.. అదేదో అన్నారు ఇదేదో అన్నారు.. 50 రోజులన్నారు, నల్లధనం అన్నారు, జాలీ నోట్లన్నారు… డిశంబర్ 31 న మళ్ళీ ఇంకో సంచలనాత్మక నిర్ణయం ప్రకటిస్తారేమో అని రోజంతా  చూడ్డం, ఓ పేద్ద బిల్డప్ ఇచ్చేసి  చివరకి తుస్సుమనిపించారు మన ప్రధానమంత్రి. 

 నల్లధనం అలాగే ఉంది, మార్పల్లా ఏమిటంటే. ఇదివరకటిరోజుల్లో  ఉదాహరణకి 1000 కట్టలకి బదులు 500 కట్టలతో పనైపోతోంది. ఇదివరకు 1000 రూపాయల దక్షిణతో జరిగే పనులకి 2000 అవుతోంది. ఎంతైనా  inflation  కదండీ.

ఈ మధ్యలో తిన్న తిండరక్క, ఆంధ్రదేశంలో తెలుగు మీడియానికి బదులు ఇంగ్లీషన్నారు. ఈ మాత్రందానికి మన భాషకి ” ప్రాచీన హోదా ” కూడా ఎందుకూ?. అయినా విద్యావిధానాన్ని ప్రెవేటీకరణ చేయడంతోనే దరిద్రం మొదలయింది. నారాయణలూ, చైతన్యలూ…అక్కడికేదో మనవాళ్ళందరూ ఆంగ్లంలో ఉద్దండ పండితులైనట్టు , ఒక్క leave letter  కూడా తప్పుల్లేకుండా రాయలేరూ, ..  ఏమిటో వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటో అర్ధం అవదు. ప్రస్తుతం దేశవిదేశాల్లోని ప్రముఖ తెలుగు వ్యక్తులందరూ , తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నారు.ఆ విషయం మర్చిపోయి, ఎప్పుడైనా ఏ దెబ్బైనా తగిలితే  ఇదివరకు ” అమ్మా, అమ్మోయ్.. ” అన్నవాళ్ళందరూ  ”  Oh Mother.. ”  అనాలనేమో మన పాలకుల సదుద్దేశ్యం…

..

%d bloggers like this: