బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ఒక్కటీ తెలియదు కానీ అన్నీకావాలి…

నేను ప్రతీవారం ఒక టపా రాయడానికి ముఖ్య కారణం– మా ఆవిడ చదివి, ఎంతో బాగుందనిపించే కథలు ( పాత వార, మాస  పత్రికలోనివి,) నాకు ఇవ్వగా వాటిని మీ అందరికీ పరిచయం చేయాలనే సదుద్దేశ్యంతో. మరీ ఆ కథ ఒకటీ పెడితే బాగోదని, ఈ కబుర్లన్నీనూ…  ఇదివరకటి రోజుల్లోనే హాయిగా ఉండేది. మొదట్లో చూపుడు వేలు పెట్టి నెంబర్లు తిప్పే ఫోనులూ, 21 వ శతాబ్దం వచ్చేసరికి అవేవో నెంబర్లు నొక్కుకునే బుల్లి బుల్లి ఫోన్లూ. ఏ గొడవా లేకుండా కాలక్షేపం చేసేశాము. కానీ మనకోసం టెక్నాలజీ ఆగదుగా.. కొత్తగా అవేవో Smart Phones  వచ్చేసి , నాలాటివారిని వీధిలో పెట్టేశాయి. వాటిగురించి ఎటువంటి పరిజ్ఞానమూ లేదు. అయినా అందరితోపాటూ, మనమూ చూపించుకోవాలి. సొంతంగా కొనుక్కుంటే మజా ఏముంటుందీ? ఎవరైనా బహుమతి ఇస్తే అందులో ఉండే మజాయే వేరు. తేరగా దొరికేది కట్టుకున్న ఇల్లాలే గా.  పైగా సెంటిమెంటోటుంటుంది… అందరిదగ్గరా Smart Phonలూ, పాపం ఈయనకీ ఒకటి ఇచ్చేస్తే పోలా. అనుకుని, మొత్తానికి కొనిపెట్టింది.  రావడం అయితే వచ్చింది కానీ, దాంట్లోకి అవేవో సిమ్ములూ, సింగినాదాలూ పెట్టాలిగా.  దగ్గరలోనే ఉండే ఓ కొట్టుకి వెళ్ళి, అతన్ని పట్టుకున్నాను. మా ఆవిడకి ఫోను అక్కడే కొన్నానులెండి, దానితో అతనికీ ఓ  obliga షనూ. తనదగ్గర ఎందుకు కొనలేదంటాడేమో అని, మా వాళ్ళమీద పెట్టేశాను. Surprise gift  అని.  Surpris జూ లేదూ, పాడూ లేదూ, రెణ్ణెల్ల ముందరినుండీ  loud thinking  చేయగా చేయగా ఇచ్చింది, నా బాధ భరించలేక కొనిపెట్టిన ఫోను . అవన్నీ వాడికెక్కడ చెప్పనూ? ఫొటోలో పక్కనుందే ఆ పుడకతో మొత్తానికి ఆ సిమ్ముని ఫోనులో పెట్టాడు. ఇంకేముందీ, నాకున్న పరిమిత జ్ఞానంతో, అన్ని రకాల యాప్పులూ పెట్టేసికుని, నవయుగంలో నేనూ ఒకడినైపోయాను.Blog Photo

ఊరికే కొత్త ఫోను వాడ్డంతో అవుతుందా? దానికి ఎప్పుడైనా  జలుబూ రొంపా చేస్తే వాడాల్సిన మందుకూడా తెలియాలిగా. అయినా ఓ భరోసా కొట్టువాడెలాగా ఉన్నాడని. చివరకి రానే వచ్చింది, ఆ శుభ ముహూర్తం. ఆ ఫోను ఓరోజున కిందపడింది. వెంటనే, అదికాస్తా ” మూగబోయిన వీణ ” అయిపోయింది. అలాతిప్పి, ఇలాతిప్పి, నానా తిప్పలూ పడ్డా, రింగ్ సౌండు వినిపించదే. చలో షాప్ .. అని కొట్టుకివెళ్తే, వాడు దాన్ని అటుతిప్పీ, ఇటుతిప్పీ,  సర్వీస్ సెంటరుకి వెళ్ళమన్నాడు. ఈ కంపెనీ 1+ కేమో అలాటివేవీ లేవూ, కానీ ఆ కొట్లో కుర్రాడు, మొత్తానికి దానికి సౌండ్ తెప్పించాడు. తీరా చూస్తే పెద్ద రోగం ఏమీ కాదు, పక్కనే ఉండే ఓ బుల్లి బటన్ స్థానభ్రంశం చెందింది. తెలిసిందేమిటంటే, ఎప్పుడైనా ఇలా జరిగితే , అన్ని బటన్లూ ఓసారి నొక్కి చూస్తే తెలుస్తుందీ అని.

ఇంక మా ఇంటావిడ జ్ఞానబోధ– జాగ్రత్తగా వాడండీ అంటూ. వినాలే కదా. అయినా కావాలని ఎవరైనా కింద పారేస్తారా చిత్రం కాకపోతే? ఏమిటో చెయ్యికిందుంటే ఎప్పుడూ లోకువే. ఇదికాదు పని అనుకుని ఓ కవరు కొన్నాను. కింద పడ్డా మరీ డామేజవదని. పోనీ ఆ కవరైనా సరైనదా, ఏదో 1+  పేరుందికదా అని తీసికున్నా. ఓ రెండు నెలలయేసరికి, కవరు దారి కవరుదీ, ఫోను దారి ఫోనుదీ. నుంచోబెడితే, ఆ కవరులోంచి ఫోనుకాస్తా బయటకొచ్చేస్తోంది.. ఆ కవరుకాస్తా తీసిపారేశాను. నేనూ ఫోనూ మిగిలాము.అప్పణ్ణుంచీ తీసికోవాల్సిన జాగ్రత్తలు తీసికుంటూ ఉన్నాను.

అయినా కక్కొచ్చినా కల్యాణం వచ్చినా ఆగవన్నట్టు, ఆ ఫోనుకి కిందపడాలని రాసుంటే, మానవమాత్రులం, మనమేం చేస్తామూ? ఆరోజూ వచ్చింది. అక్కడికేదో రాత్రిళ్ళు కూడా ఫోన్లొస్తాయన్నట్టు, పక్కనే   bedbox  మీద కళ్ళజోడూ, ఈ ఫోనూ పెట్టుకోడం. నిద్రలో ఏ చెయ్యో తగిలిందేమో, పొద్దుటే లేచి చూసేటప్పటికి, మాయం అయిపోయింది. తీరా చూస్తే, ఈ బాక్స్ కీ గోడకీమధ్య పడుంది.  మా ఆవిడ లేచిందా లేదా అని చూసుకుని, అమ్మయ్యా లేవలేదూ అని సంతోషపడి, ఫోను పరిశీలిస్తే, అన్నీ లక్షణంగానే ఉన్నట్టు కనిపించాయి. కానీ ఏదో కీడు శంకించాను. ఫోనులో పైన ఓ  Scroll– No sim Card అంటూ. ఇదెక్కడ గొడవరా బాబూ, అని మళ్ళీ టెన్షనూ. పైగా ఆరోజు మా స్నేహితుడు శ్రీ కృష్ణమోహన్ గారు, హైదరాబాద్ నుంచి పొద్దుటే వచ్చి ఫోను చేస్తానన్నారు. పాపం ప్రయత్నించే ఉంటారు.  నా ఫోనేమో  Brain Dead  అయిపోయింది.పోనీ మా ఆవిడ ఫోనులో చేద్దామా అంటే, మీ ఫోనుకేమొచ్చిందీ అంటుందేమో అని భయం.. ఇంకో ఫోనుందిలెండి, దీంట్లో ఆయన నెంబరు వెదికి మొత్తానికి ఆయనకి ఫోను చేయగలిగాను. ఆయనేమో 11 గంటలకి వస్తానన్నారు. ఈలోపులో , ఫోనుకి ప్రాణం పోయాలే. చివరకి చెప్పాల్సొచ్చింది మా ఆవిడకి– “అదేమిటోనోయ్ సిమ్ లేదంటోందీ.. “అని ఏమీ తెలియనట్టు.. కిందేమైనా పడిందా అంటూ  Cross Exam  ప్రారంభం. “పడ్డట్టుంది” ( నేను ), “అనుకున్నానులెండి అయినా పక్కనే ఎందుకూ పెట్టడం ( తను).కంటిన్యూ.. పొద్దుటేదో చప్పుడు వినిపించింది మీ ఫోనే అయుంటుందనుకున్నాను ( తను).  కంటిన్యూ…. అస్సలు జాగ్రత్తలేదు మనిషికీ, పోతే మళ్ళీ కొనిస్తాననా.. ఏదో ఓసారంటే పరవాలేదుకానీ, ఇంకోసారి  No way..  ( తను ). ఆ సిమ్మేదో పక్కనెక్కడైనా పడిందేమో చూసుకోండి.. మళ్ళీ నన్నదుగుతారు.. ( తను).”. ఈ భారీ క్లాసు వినడం కంటే బయటకెళ్ళి బాగుచేయించుకోడం బెటరూ అనుకుని, చెప్పా పెట్టకుండా బయటకి వెళ్ళిపోయాను. 

 షాపులన్నీ 11 అయితేనేకానీ తెరవరాయె. అప్పటికి మా ఫ్రెండు వచ్చేవేళవుతుంది, పైగా లంచ్ కి కూడా రమ్మన్నాము. ఎలాగరా భగవంతుడా అనుకుంటూ, వెదికితే  Vodafone  కొట్టు తెరిచుంది. అక్కడ ఓ పిల్ల ఉంటే వెళ్ళి అడిగాను–  చేసిన పాపం చెప్పుకుంటే పోతుందీ అనుకుని,  accidentally  ఫోను పడిపోయిందీ, తీరా చుస్తే No sim  అంటోందీ, ఏమైనా సహాయం చేయగలవా అని. ఈ కొత్త ఫోన్లు ఇస్తారూ వాటి టెక్నాలజీ తెలిసి చావదూ ( అక్కడికేదో మిగతావన్నీ తెలుసున్నట్టు !)

 ఏమనుకుందో ఏమో, పెద్దాయనా వచ్చాడూ అనుకుని  ఫోను తెరిచి ఇస్తే చూస్తానూ అంది. ఏదో ” ఆయనే ఉంటే… ” అన్నట్టు, ఆ తెరవడం తెలిస్తే ఇక్కడకెందుకూ  అనుకుని, జేబులో పెట్టుకున్న ఆ బుల్లి పుడక చేతిలో పెట్టాను. ఆ పిల్లేమో, ఓ చిన్న రంఢ్రంలోకి ఈ పుల్లని పెట్టి తిప్పితే , పాపం అదేదో slot  రావడం వచ్చింది. తీరా చూస్తే అదేదో  memory card ట. సిమ్ము బయటకి తీయడం ఆ పిల్లకీరాదూ. ఓ గంటాగితే మా వాళ్ళొస్తారూ అని చెప్పింది. అక్కడచేసేదేముందీ అనుకుని బయటకి వచ్చేశాను.  బయట wait  చేస్తూంటే, పక్కనే ఉన్న iphone  వాడు కొట్టు తెరిచి అడిగితే, మేము  apple  వి తప్పించి , మిగిలినవన్నీ  untouchable  అన్నట్టు మాట్టాడాడు. చేసేదేమీలేక బయట ఆ కొట్లేవో తెరిచేదాకా ఉండడమే ఉత్తమం అనుకుని, ఊరికే ఓసారి చూద్దామని ఫోను చూసేసరికి, ఇంకేముందీ,  సకుటుంబసపరివారంగా సిమ్ము ప్రత్యక్షం. ఈ చిత్రం ఏమిటా అని  చూస్తే,  everything was in place !  ఇదేం చమత్కారం, పొద్దుణ్ణించీ అన్ని తిప్పలు పెట్టిందీ అనుకున్నాను. అప్పుడు తట్టింది- ఇందాకా ఆ పిల్లేదో కెలికిందిగా అప్పుడు సద్దుకునుంటాయి అన్నీ.  అదేదో శ్రీరాముడి స్పర్శతో అహల్య మానవరూపం చెందినట్టు, ఆ పిల్ల ధర్మమా అని నేనూ నాఫోనూ  back to normal.  కథ సుఖాంతం.. వెళ్ళి ఆ అమ్మాయికి  thanks  చెప్పి కొంపకి చేరాను. అందుకే అంటుంట– ఊరికే కొనిపించేయడమే కాదు, వాడ్డంతోపాటు వైద్యంకూడా తెలియాలి.  ఈసారి ఆ ” పుడక” ఉపయోగం తెలిసింది.

 

 ఈ టపాతో పాటు  శ్రీ భోగరాజు నారాయణ మూర్తిగారు రాసిన కథ చదవండి….నల్లబిందె-దుక్కచెంబు

%d bloggers like this: