బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు

మా చిన్నప్పుడు, పుట్టినరోజుకి   తలంటు, కొత్త బట్టలూ,   పిండివంటలతో భోజనమూ, ఉంటే గింటే ఓ సినీమా…. మా అమ్మమ్మగారు  కొబ్బరిపాలతో పరమాన్నం చేసి, ఓ రూపాయి చేతిలో పెట్టేవారు. ఆరోజుల్లో అదే పదివేలుగా ఉండేది. అమలాపురంలో ఉన్నదెంతా ఓ 18 ఏళ్ళు. తరవాత ఉద్యోగం, పెళ్ళి పిల్లలూ. . మరీ అలాటప్పుడు, మన పుట్టినరోజుకి అంత ప్రాముఖ్యత ఉండదు. అయినా, పాపం మా ఇంటావిడ, ప్రతీ పుట్టినరోజుకీ ఓ surprise gift  ఇచ్చేది. ( ఇప్పటికీ ఇస్తూనే ఉంది.  God bless her )   తేడా ఏమిటంటే  ఆ  surprise element  తగ్గడం. అయినా నెలముందరినుండీ, మనక్కావాల్సినదానిగురించి అదేదో loud thinking  చేస్తూంటే , తప్పేదేముందీ?

కాలక్రమేణా, మనవలూ, మనవరాళ్ళ దగ్గరకొచ్చేసరికి, మొదట్లో ఏవో ఆడుకునేవిచ్చేవాళ్ళం. ఒక్కో క్లాసూ పెరుగుతూంటే, ఇంకా ఆటబొమ్మలేమిటీ, అనుకుని పై ఇద్దరికీ  ఏ  Crossword Gift Voucheరో  ఇవ్వడం మొదలెట్టాను. వాళ్ళ అమ్మలకీ, నాన్నలకీ అయితే, ఎప్పుడో మొదలెట్టేశాను.. మా రెండో మనవరాలు, నవ్యకి మొదలెడదామని, తననే అడిగేస్తే పోలా అనుకుని, అదేదో Kindle Coupon  ఇమ్మంది. అదేమిటో కానీ, పుస్తకం కొనిద్దామనిపించింది. ఈమధ్యన   e Books  కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనుకోండి. కానీ చేతులో పుస్తకం పట్టుకుని చదివితే ఉండే ఆనందమే వేరని నా అభిప్రాయం..

” పుస్తకం హస్తభూషణం ” అనేవారు ఆ రోజుల్లో. ఇప్పుడో  ” e బుక్కే  మా హక్కు ”  అంటున్నారు… కారణాలు ఏవేవో చెప్తున్నారు, అడవులూ, కలపా, పల్పూ, కాగితం  etc.. etc.. కొంతవరకూ నిజమే, కానీ  అక్కడికేదో   కాగితం తయారీ తగ్గిస్తేనే పర్యావరణ రక్షణ కలుగుతుందనడం కొంచం ఎక్కువేమో కదూ. అదికూడా ఓ కారణం. అలాగని పర్యావరణం రక్షించడానికి మనవాళ్ళు చేస్తున్నదేమిటీ, అభివృద్ధి పేరుతో, ఉన్న చెట్లన్నీ కొట్టిపారేసి, అవేవో ” మొక్కా- నీరూ ” అంటూ మొదలెట్టారు.

నాకు చిన్నప్పటినుంచీ ఉన్న అలవాటు, పుస్తకాలు చదవడం. క్లాసు పుస్తకాలు తప్పించి, ఇంకోటేదైనా సరే. అందుకే బడుధ్ధాయిలా ఇలా తేలాను. ఏం చేయమంటారూ చదువనేటప్పటికి, రిటైరయి 12 ఏళ్ళు కావొస్తున్నా, ఇప్పటికీ పీడకలలు వస్తూనేఉంటాయి.. వారం వారం వచ్చే పత్రికలూ, కిళ్ళీకొట్లో డిటెక్టివ్ పుస్తకాలూ లైబ్రరీకి వెళ్ళి తెలుగు నవలలూ ఒకటేమిటి, ఓపికున్నన్ని చదవడం..

నాకు తగ్గట్టు మా ఇంటావిడకీ ఇదే ” వ్యసనం “. పుస్తకం తేవడం తరవాయి, వెంటనే చదివేదాకా నిద్రపట్టదు. అంతర్జాలం లో రాయడం మొదలెట్టిన తరువాత, చాలామట్టుకు  నెట్ లోనే దొరకడం మూలాన కానీ, లేకపోతే ఇంటినిండా పుస్తకాలే. ఇలా అందరూ  e books  కే  అలవాటు పడ్డంతో , పెద్ద పెద్ద ప్రచురణ సంస్థలు మూత పడుతున్నాయి.  అచ్చు పుస్తకం చూడాలంటే, ఏ మ్యూజియం కో వెళ్ళి చూడాల్సిన రోజు త్వరలోనే వస్తుందేమో.

ఈ పుస్తకాల గురించి శ్రీ  వేలూరి శివరామ శాస్త్రిగారు,  ” భారతి ” లో రాసిన వ్యాసం చదవండి    పుస్తకం– శ్రీ వేలూరి

 

 

%d bloggers like this: