బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఎడ్డెం అంటే తెడ్డెం…ఇదో ” మిథునం”

ఒక్కసారి గుర్తుచేసేసికోండి– ఆరోజుల్లో భార్యాభర్తలు ఎలా ఉండేవారో, అదే ఈ రోజుల్లో ఏమాత్రం మాటతూలినా అంతే సంగతులు.Bapu Ramaneeyam 077 కొట్టుకుంటూనో, తిట్టుకుంటూనో కాపరాలు సజావుగానే సాగించినట్టే. ఏదో పెళ్ళయి ఓ పిల్లో, పిల్లాడో పుట్టేదాకా మొగుళ్ళ మాట వింటారు కానీ, ఆ తరవాతైతేనా అమ్మో… అమ్మో.. ఊరికే వేయలేదు గురువుగారు పై కార్టూన్. ఎంతోమంది జీవితాలని పరిశీలించి మరీ,  తన కుంచెకి పనిచెప్పారు.

ఏదో ఉద్యోగం ధర్మమా అని , మరీ వీధిన పడలేదు కానీ, అప్పటికీ శనాదివారాలు ” అప్పచ్చులు ” ఉండేవే, కానీ మర్నాడు ఆఫీసుకెళ్ళొచ్చులే అనే ఉద్దేశంతో భరించేసేవారేమో.అదేమిటో కానీ, ఈ భార్యలున్నారే తమ మాటే చివరిదవాలని తపన. అదేదో టెన్నిస్ లో ఆడినట్టు దెబ్బకి దెబ్బ. బయటివాళ్ళకి చూడ్డానికి ఎంతో శాంతమూర్తుల్లా కనిపిస్తారు. వాళ్ళకేం తెలుసూ అసలు సంగతీ? అసలు అదో ” హాబీ ” అనుకుంటా వాళ్ళకి. ఇప్పుడంటే భార్యలు ఉద్యోగాలకి వెళ్తున్నారు కానీ, ఆరోజుల్లో చూడలేదుగా. పైగా టీవీలూ జీడిపాకం సీరియళ్ళూ లేనేలేవాయె.  ఇంక తేరగా దొరికేదెవరూ, కట్టుకున్నవాడేగా. ఆ పిల్లలు రేపోమాపో వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. మిగిలిన బక్కప్రాణి జీవితాంతం కాపరం చేయొద్దూ, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, ఏదో అప్పుడప్పుడు తన అస్థిత్వాన్ని నిరూపించడంకోసం , నోరెత్తడం కానీ, అంతకంటే దురుద్దేశ్యం ఉండేది కాదనుకుంటా. లేక పోతే శ్రీ బాపు గారికి అన్నన్ని Topics  ఎలా దొరికాయంటారూ?

పదవీ విరమణ అయిన తరవాత ఉండే కాలక్షేపం ఇదే కదూ. పిల్లలు వాళ్ళ సంసారాల్లో బిజీ అయిపోతారు. మరీ ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే ఏం బావుంటుందీ?  వాతావరణం కొంచం గంభీరమైనా, ఏదో సందడిగా ఉంటుంది. అయినా అస్సలు జీవితంలో మాటామాటా తేడా రాని జీవితాలూ ఓ జీవితమేనా? బయటకెళ్ళినప్పుడు ఒకళ్ళమీదొకళ్ళు పడిపోతూ, తమదే ఓ పెద్ద ఆదర్శకాపరమూ అని చూపించుకుంటూంటారే  వాళ్ళదంతా  Image building Exercise. తప్ప మరోటికాదు. ఊళ్ళోవాళ్ళందరికీ కళ్ళు కుట్టాలనే ఓ తపన. నిజంగా ఒకరంటే ఒకరికి ప్రేమంటూఉంటే గింటే , రోజూ కొట్టుకుంటూనే ఉండాలి, బాపు గారి కార్టూన్  కి ప్రాణం పోయాలి.

ఈ టపాకి మూల కారణం 30 ల్లో శ్రీ శ్రీపాద వారు రాసిన      షట్కర్మయుక్తా — శ్రీపాద్ అనే  ఓ కథ.. కథ పూర్తిగా చదివి ఆనందించండి. అదో ” శబ్దరత్నాకరం ” లాటిది. పరిస్థితి ఎలా  handle  చేయాలో నేర్చుకోవచ్చు. చాలామంది చదివే ఉంటారనుకోండి, అయినా ఒకటీ అరా మర్చిపోతే ఉపయోగిస్తుందేమో అని ఈ టపా…

%d bloggers like this: