బాతాఖాని – లక్ష్మిఫణి కబుర్లు–ఇంక సినిమా ఏం చూస్తారూ…


గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు  సినిమాహాళ్ళ దగ్గర చిన్న చిన్న ఫిలిం ముక్కలు బయట పారేసేవారు, వాటిని ఏరుకుని వచ్చి, ఏ ఆదివారాప్పూటో, ఏ ఫ్రెండింట్లోనో , గోడకి తెల్ల దుప్పటీ కట్టి, దానిమీద బొమ్మేసి చూసి ఆనందించే వాళ్ళం. ఎవరికెన్ని ముక్కలు దొరికితే అంత గొప్ప.. తరవాత కొద్ది కాలానికి టూరింగు టాకీసులని వచ్చాయి. అందులో ఒకే ప్రొజెక్టరూ దానితో రెండో మూడో ఇంటర్వెళ్ళుండేవి రీలుకీ రీలుకీ మధ్య.. కాలక్రమేణా సినిమా హాళ్ళొచ్చాయి. నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ , ఎవరి స్థాయిని బట్టి వారు టిక్కెట్టు కొని సినిమా చూసేవారు. అందులో కొన్ని  ” ఫ్రీ కోటా” లు కూడా ఉండేవి. పోలీసాళ్ళకీ, ఎలెట్రీ వాళ్ళకీ . ఫ్రీ టిక్కెట్టివ్వకపోతే ఏ ఆదివారప్పూటో కరెంటాపేస్తారని భయంతో, ఆరోజుల్లో కరెంటు పోతే జనరేటర్లుండేవి కాదుగా. పైగా ఓ ప్రకటన– ” ఏకారణం చేతైనా విద్యుత్ సప్లై ఆగిపోతే డబ్బు వాపసివ్వబడదూ ” అని.. అన్నిటికంటే ముఖ్యం– ” స్త్రీలకు ప్రత్యేక స్థలం ” అని ఓ తాత్కాలిక ” అడ్దం ” ఒకటెట్టేసేవారు.. పొగ త్రాగరాదు అని నోటీసున్నా,  చాలామంది నోట్లో సిగరెట్టో, చుట్టో, బీడీతోనే కనిపించేవారు. ఇంక ఎంటీవోడూ, నాగ్గాడూ, కాంతారావూ తెరమీదకొస్తే ఈలలూ, కేకలూ చప్పట్లూ సరేసరి. ఇంటర్వెల్లో సినిమా పాటల పుస్తకమూ, కలరు సోడా అయితే ఉండేవే. తాలూకా ముఖ్య పట్టణం లోనే కొత్త సినిమాలు. సెకండ్ రన్ లోనే మిగిలిన చిన్న చిన్న గ్రామాల్లో. మళ్ళీ కొన్ని సినిమాలకి శతదినోత్సవాలూ, ఆ సినిమావాళ్ళంతా వచ్చి సభలూ అవీనూ..రానురాను కొత్తగా కట్టే థియేటర్లకి జనరేటర్లు అనివార్యం చేయడంతో ,  సినిమా ఏ అడ్డంకీ లేకుండా పూర్తిగా చూసే యోగం పట్టింది.

స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ   16 mm projector  తో  కొన్ని సినిమాలు చూపించేవారు. ఇవి కాకుండా పండగలకీ పబ్బాలకీ , శ్రీరామనవమి ఉత్సవాలకీ, దసరా నవరాత్రులకీ  అయితే ఫ్రీ సినిమాలుండేవే. రేడియోల్లో ఆదివారాలు ” సంక్షిప్త శబ్ద చిత్రాలు ”  అయితే సరే సరి. ఓ సినిమాకి అదీ సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళడమనేది ఎప్పుడో కానీ జరిగేది కాదు. బయటి గ్రామాల వాళ్ళైతే, ఏ రెండేడ్ల బళ్ళలోనో వచ్చి, రోజులో ఆ ఊళ్ళో ఉండే మ్యాట్నీ షో, ఫస్ట్ షో, రేండో ఆటా చూసి మరీ వెళ్ళేవారు, ఖర్చు కలిసొస్తుందని. ఇంకో విషయం కూడా ఉంది ఆరోజుల్లో వచ్చే సినిమాలూ అలాగే ఉండేవి. సోషల్ సినిమా లో కొద్దో గొప్పో సందేశం ఇచ్చేవారు. ఓ అరడజను మధురాతిమధురమైన పాటలూ ఉండేవి. ఇంకో కొత్త సినిమా చూసేదాకా అంతకుముందు చూసిన సినిమాల్లోని దృశ్యాలూ, పాటలూ  నెమరేసికోడం.

కాలక్రమేణా సినిమా హాళ్ళూ అభివృధ్ధి చెందాయి. విశాఖ పట్టణం లాటి  ఊళ్ళలో  BOX Seats  అని ఉండేవి. అలాగే హైదరాబాద్ లో ముస్లిం స్త్రీలు కూర్చోడానికి వీలుగా ” ఘోషా బాక్సులూ ” వారి privacy  వారికుండేది. తరవాత్తరవాత Dolby Sound, Multiplex  లూ వచ్చేశాయి. ఈ మధ్యలో 60-70 ల్లో అనుకుంటా, బొంబాయిలో ఓ  Drive in Theatre, అలాగే అదేదో ”  Cine Ramaa ” అని  థియేటర్లూ వచ్చాయి.  పాతరోజుల్లో సినిమాకి వెళ్తే, ఎంత పెద్ద టిక్కెట్టు కొనుక్కున్నా, నల్లుల బాధలు తప్పేది కాదు. కుర్చీలకింద తిని పడేసే, చెత్త కాగితాలూ, పకోడీ పొట్లాల కాగితాలూ, అంతా పరమ అసహ్యంగా ఉండేది. సిగరెట్టు పొగైతే ఉండేదే..

ఇంకొంచం ముందుకెళ్ళి, ఈమధ్యన కొన్ని థియేటర్లలో  కాళ్ళు బార్లాచాపుకుని చూడ్డానికి సదుపాయం కల్పించారు. అదీ బాగానే ఉంది.. కానీ వీటన్నిటికీ  ULTIMATE LUXURY  ,  వడోద్రాలో ప్రారంభించిన  రిలయెన్స్ వాళ్ళది.

 

 

ఇంక సినిమా ఏం చూస్తారూ?

 

7 Responses

  1. ఎంతైనా చిన్నప్పుడు సినిమాలు చూసే అనుభవం వేరే.యాభై ఏళ్ల హీరో కాలేజీ కి వెళ్తోంటే చప్పట్లు కొట్టేవాళ్ళం.ఇప్పుడేమో పడుకుని టీ.వీ లో సినిమా చూసే రోజులు.మధ్యలో కునికిపాట్లు పడుతూ.మొత్తానికి బ్లాగ్ లో సినిమా చూపించా రండి.. ధన్యవాదాలు.

    Like

  2. రాధారావు గారూ,
    పడుక్కోడానికి సౌకర్యంగా ఉండడానికేనేమో, ఫొటో లో చూపించిన సిటింగ్/ స్లీపింగ్ ఎరేంజ్ మెంట్లు….

    Like

    • మా పెళైన కొత్త లో రాజమహేంద్రవరం అశోకా టాకీస్ లో ఒక సినిమా చూశాం బాక్స్ టికెట్ కొనుక్కొని మరీ.ఇప్పటిదాకా ఎంత ఆలోచించి నా మా ఇద్దరికీ సినిమా పేరు కూడా గుర్తు కావడం లేదు.😭

      Like

  3. నాకు అలాంటి పడక సీట్లలో నిద్ర పోతూ సినిమా చూసీచూడని గుర్తుంది.
    సినిమా గుర్తు లేదు కాని నిద్ర బాగా పొయిన గుర్తుంది.
    ఇంటి కంటే గుడి పదిలం అనే సామిత తిరిగ రాయాలేమో!!
    మ్యూసింగూ ఫోటోలూ బాగున్నాయి

    Like

  4. రాధారావు గారూ,

    అలాటి ” మధుర క్షణాలు ” మర్చిపోతే ఎలా మాస్టారూ? పోనీ నేను పెట్టిన ఫొటోలో ఉన్న థియాటర్ కి వెళ్ళిరండి… ఏమైనా గుర్తొస్తుందేమో. విజయవాడలో కూడా ప్రారంభిస్తున్నారుట… మీ గుఇంచే అయుంటుంది…

    డాక్టరు గారూ,

    ఇంట్లో అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోగలమూ? అందుకే ఇంకొంచం సుఖపడాలని థియేటర్లు కొత్త పధ్ధతులు మొదలెడుతున్నాయి.

    Like

  5. పాత రోజులు గుర్తు చేశారు.. ఏం చేస్తాము ఈ రోజుల్లో థియేటర్లు బావుంటున్నాయి కానీ సినిమాలే బావుండట్లేదు కదా

    Like

  6. చంద్రిక గారూ,

    మీ స్పందనకు ధన్యవాదాలు.సినిమాలు బావుండే రోజుల్లో ” నల్లుల బాధ”. తీరా థియేటర్లు బాగుపడేసరికి, సినిమాలూ, కథలూ ” కంచి ” కి చేరిపోయాయి కదూ…

    Like

Leave a comment