బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– Appraisals..


చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు,   అర్ధసాంవత్సరిక (  Half yearly),  సాంవత్సరిక (  Annual )  పరీక్షలముందు, ప్రతీనెలా  అవేవో స్లిప్ టెస్టులు (  Sliptests)  అని ఉండేవి గుర్తుందా? ఏదో పరీక్షలముందు రాత్రిళ్ళు టీ లు తాగేసి, బట్టీ పట్టేసి, మర్నాడు ఏదో రాసేద్దామనుకునే, నాలాటి వాళ్ళకు ఇదో పెద్ద గండం. ఎక్కడ సుఖపడిపోతామో అని, ప్రతీ నెలా ఇదో గోలా. ఏడాదంతా చదవమంటే ఎలా కుదురుతుందమ్మా?  అయినా అప్పుడు నేర్చుకున్న ప్రపంచ చరిత్రా, హిందూ దేశ చరిత్ర, ఛందస్సూ, ఇవన్నీ భావి జీవితంలో ఏముపయోగించాయంటారు?  చదివిన చదువుకీ, చేసిన ఉద్యోగానికీ ఎక్కడా సంబంధం లేదు. ఎలాగోలాగ ఓ డిగ్రీ తగిలించుకుంటే ఉద్యోగాలు వచ్చేవి ఆరోజుల్లో.ఇప్పుడంటే అవేవో  creative skiళ్ళూ, సింగినాదం కావాలంటున్నారు..

ఉద్యోగంలో చేరిన తరువాత, మనం ఆ ఏడాదంతా సరీగ్గా పనిచేశామో లేదో, ఆఫీసరుకి ఒంగి ఒంగి సలాములు పెట్టామో లేదో అనే ప్రాతిపదిక మీద, ఆ ఆఫిసరు , తన కింద పనిచేస్తున్న వారిగురించి, ACR ( Annual Confidential Report)  రాసేవాడు. ఆఫీసర్లందరూ నిజాయితీగా ఉండేవారా అంటే చెప్పడం కష్టం. వారితో మన ప్రవర్తన ఆధారంగా రాసిన సందర్భాలూ చూశాను.. ఎంతైనా 42 ఏళ్ళు పనిచేశానుగా..   మన దారిన మనం నిజాయితీగా ఉంటే గొడవే లేదు అలాకాకుండా ఉన్న ఆఫీసరుకి ” కాకా” పట్టి, రోజులు గడిపేసికుంటే  జరిగే పని కాదు. ఆ తరవాత వచ్చినవాడినీ, ఆ తరవాత వచ్చినవాడినీ… అలా ఉద్యోగ జీవితంఅంతా ఎవరోఒక పైవాడికి దాసోహం అంటునే ఉండాలి. ఎందుకొచ్చిన బతుకూ? గవర్నమెంటు సర్వీసులో, పనితనం చూసేవాడెవడూ ? మనం ఫలానా క్యాటిగరీలో ఉన్నామా లేదా, ఉన్నట్టైతే ఈ ACR  లూ అవీ ఉత్తుత్తివే. అయినా చేతిలో పనున్నప్పుడు భయపడ్డం ఎందుకూ?  అయినా ఈ ACR  లు ఏవో ఉధ్ధరించేస్తాయని కాకపోయినా, చెడ్డగా రాస్తే చిరాగ్గా ఉంటుంది. గమ్మత్తేమిటంటే, బాగా రాసినప్పుడు ప్రమోషన్లు రాలేదు.అదృష్టం ఏమిటంటే 42 ఏళ్ళూ, ఎవరిచేతా మాటపడకుండానే రిటైరయ్యాను.

పైచెప్పిన   ACR  లనె ఈరోజుల్లో అవేవో   Appraisals  అంటారుట. ప్రతీ ఏడాదీ , ప్రెవేటు కంపెనీల్లో  ఎప్పుడు  విన్నా వీటి గొడవే. పైగా ఈ appraisals  ని బట్టే, ఆ ఏడాది  ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా కూడా తేలుస్తారుట. వామ్మోయ్, గవర్నమెంటులో మరీ ఇంత సీరియస్సు కాదు.

ఇవన్నీ ఓ ఎత్తైతే, ఇళ్ళల్లో భార్యలు చేసే  appraisals  ఇంకోలా ఉంటాయి. ఈ ఏడాదిలో, ఎన్ని సినిమాలకి తీసికెళ్ళాడూ, ఎన్నెన్ని ఊళ్ళు తిప్పాడూ,  కొంచం వయసొచ్చిన తరువాత ఎన్నెన్ని పుణ్యక్షేత్రాలకి తీసికెళ్ళాడూ, ఆ వెళ్ళినప్పుడు ఏ స్టార్ హొటల్లోనే ఉన్నామా లేక  ఏ దేవస్థాన సత్రంలోనేనా? విడిగా వెళ్ళామా, లేక టూర్లవాళ్ళతో వెళ్ళామా, విడిగా వెళ్తే ఏసి 2  లేక స్లీపరా?  On a scale of 10  ఇన్నేసి ఉంటాయి. , వీటన్నిటినీ ఎలాగోలాగ నెగ్గుకురావొచ్చులెండి, ఏదో ఇద్దరికీ హాయిగా బతికేటంత పెన్షనెలాగూ ఇస్తున్నారాయె, బాధ్యతలుకూడా లేవు. ఎవరికో దాచిపెట్టాలని కూడా లేదు. పిల్లలు వాళ్ళంతటివారు వాళ్ళైన తరువాత అలాటి బాధ్యతలు కూదా తగ్గుతాయి. హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేయొచ్చు. మరి అలాటప్పుడు ఈ   భవిష్యత్తుని నిర్ణయించే ఈ  appraisals  గొడవేమిటీ అనుకుంటున్నారు కదూ.. అక్కడికే వస్తూంట…

 మన ఇల్లాళ్ళలో కొందరికి వేసవికాలం వచ్చిందంటే ఊరగాయలు స్వయంగానే పెట్టాలనుకుంటారు, మార్కెట్ లో ఎన్నిరకాల ఊరగాయలు దొరుకుతున్నా సరే. అదో తృప్తీ వాళ్ళకి.బయట దొరికే ఊరగాయల్లో ఏం నూనె వాడాడో ఏమిటో, ఆవపిండీ, కారం ఈరోజుల్లో ఎక్కడ చూసినా కల్తీయే కూడానూ. పోనిద్దూ ఒంట్లో ఓపికున్నంతకాలం ఓ యాభై కాయలు ఒరుగులుగానూ, ఇంకో నలభై కాయలు ఆవకాయా, మాగాయా కలిపేస్తే, పిల్లలు కూడా తింటారూ  అదేమైనా పెద్ద బ్రహ్మవిద్యా ఏమిటీ అని అనుకుంటారు. ఆశయం మహోన్నతమైనదే. కానీ ఆచరణలో బలైపోయేవాడు ఏ పనీపాటా లేకుండా రిటైరయి ఇంట్లో కాళ్ళకీ చేతులకీ అడ్డుపడే మొగుడు.దగ్గరలో ఉండే ఏ మాల్ కో వెళ్ళి నువ్వులనూనె, కారం, ఆవపిండీ, ఉప్పూ, ఓ ఇంగువడబ్బా తెచ్చికోడం… దానికి తోడొస్తారు. ఆ తెచ్చినవన్నీ ఆవకాయ గుండ  కలిపేసి ఇంక కాయలు వర్షం పడేలోపలే తెమ్మని రోజూ గుర్తుచేస్తారు. గత 43 ఏళ్ళ అనుభవ దృష్ట్యా, ” పోనీ నువ్వుకూడా వస్తావేమిటీ.. ఆ కాయలేవో నువ్వే చూసుకోవచ్చు..” తో మొదలవుతుంది. అబ్బే వాళ్ళా లొంగేదీ.. భార్య :-    ఆమాత్రం దానికి ఈ ఎండలో నేనెందుకులెండి, మీరే  మంచి కాయలు, టెంక పట్టినవేవో చూసి తెచ్చేయండి..ఇన్నేళ్ళనుండీ తేవడం లేదూ.. మీ సెలెక్షన్ ఫరవాలేదులెండి..  భర్త : – ఎన్నికాయలూ ?.. భార్య: ఎంతోకాదులెండి.. ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు చాలు..  ఆ గిన్నేమిటో ఆ కొలతలేమిటో ఛస్తే అర్ధం అవదు ఈ బక్క ప్రాణికి. పోనీ ఆ గిన్నేదో తీసికెళ్తేనో..  భార్య ఓ చూపు ( ఈమాత్రానికి ఆ గిన్నెందుకండీ అనే అర్ధం లో ) చూసేసరికి గిన్నె వదిలేసి, మార్కెట్ కి బయలుదేరడం.వాళ్ళు మాత్రం  ససేమిరా కాయలకోసం మార్కెట్ కి రారంటే రారు. సెలెక్షన్ ప్రాసెస్ లో వీళ్ళుకూడా ఉండి, ఆ కాయలు కోసిన తరువాత బాగాలేకపోతే, చివాట్లేయడానికి ఎవరో ఒకరుండొద్దూ? దానికన్నమాట. ఈ విశాల హృదయం.. కానీ భర్తపడే మానసిక ఒత్తిడి ఎవరికి తెలుస్తుందీ? ఆ నాలుగ్గిన్నెల కొలత గుర్తుపెట్టుకోవాలి. టెంక ఉండేటట్టు ముక్కలు కోయించాలి. మళ్ళీ తక్కువైపోతాయేమో అని ఇంకో కిలో కోయించడం. మొత్తం అన్నీ ఓ ఆటోలో వేసికుని కొంపకి చేరడం. ఇదిగో  ఈ ప్రకరణం అంతా   part and parcel of annual appraisal  అన్నమాట. పాసయ్యామా, ప్రతీరోజూ ధోకా లేకుండా కొత్తవకాయ, లేదా పాతావకాయే.  By the way…  నిన్నటి టెస్టులో పాస అయినట్టే కనిపిస్తోంది…

 

 

11 Responses

 1. సర్,
  అబ్బబ ! సర్! ఎంత అలవోకగా ఒడుపుగా రాస్తేరండి బాబు. నవ్వుఅపుకొలెకపొయము
  ఆ.వ. ramana

  Like

 2. అమ్మయ్య నాకు క్రితం వారం అనుభవం same to same మక్కి to మక్కి మీకు అయిందా !! బలే బలే

  Like

 3. మామిడికాయలు శ్రేష్టమయినవి ,ముక్కలు అన్నిటికి టెంక ఉండేటట్టు కొట్టించాలి,మాడుగుల సన్నాఅ వాలు పొడి (తాజాది ),మరి నువ్వులనూనె మడ్డి ఉండకూడదు ,కారం ఎర్రగా ఉండాలి గుంటూరు మిరప పొడి.వగైరా వగైరా ఇవండీ నా Tasks .ఫస్ట్ క్లాసు గా పాస్ అయి చక్కని కొత్త అవకాయే ఈ రొజు స్పెషల్ ముఖ్య ఆధరువు + ముద్దపప్పు.

  Like

 4. ఇదివరకు మా నాన్నగారి టైమ్ లో కారాలు ఇంట్లోనే కొట్టించేవారు.మామిడి చెట్ల నీడలో రోలు,రోకలీ వేసి ఉదయం నుండీ అదే పని.అత్తాకోడళ్ళు వంతులవారీగా సూపర్వైజ్ చేసేవాళ్ళు.అదంతా గతం.ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చాక మార్కెట్ లో మిక్స్ చేసిన గుండ తెచ్చుకోవడమే.ఏ ఏటి కా ఏడు ఇంక పెట్టలేకపోతున్నాం అనుకోవడం.ధన్యవాదాలు ఫణిబాబు గారూ..నోరూరించారు ఆవకాయ తో.

  Like

 5. మీ అప్రైజల్ కబుర్లు – వాటిని ఆవకాయకి అన్వయించిన తీరు బహు బాగున్నాయి.

  Like

 6. రమణ గారూ,.

  చదివేవారికి నవ్వులాటకిందే ఉంటుందండి బాబూ. అనుభవిస్తే తెలుస్తుంది.. వామ్మోయ్ పాసవుతానాలేదా అని క్షణక్షణం భయమే…

  శాస్త్రిగారూ,

  దూరదృష్టి మాస్టారూ.. ఇంట్లోకూర్చునుండే విశ్రాంత ఉద్యోగులందరికీ జరిగేదే. కొందరికి చెప్పుకోడానికి నామోషీ.. మనలాటివాళ్ళు ఇలా వీధిన పడతారు..

  రాధారావు గారూ,

  ఎందుకొచ్చిందిలెండి? ఆనాటివి గుర్తుచేసికోవడం?

  లలిత గారూ,

  నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు.

  Like

 7. మీ సంవత్సర పరీక్ష ఏ అవాంతరాలు లేకుండా పాసయినందుకు శుభాకాంక్షలు!!
  మీ ఈ కబుర్ల మూలంగా నేను కుడా ఈపరిక్ష పాస్ ఐయ్యాను. క్రొత్తావకాయ భేషుగ్గా కుదిరింది.
  ఈ తరంలో కూడా భమిడి పాటి వారి పేరు హాస్య రచనలలో నిలుపుతున్న ఘనత మీదే!!

  Like

 8. డాక్టరుగారూ,

  అయితే మీకూ Congratulations. ఈ ఏటికి పనైపోయినట్టే. కొత్తావకాయతో తినొచ్చు.

  Like

 9. మాకీ సంవత్సరం పరీక్షలే బేన్ అయిపోయాయి, అసలు కాయే లేదు 🙂

  Like

 10. శర్మగారూ,

  అదేమిటీ? పరీక్ష లేకపోతే , పాతావకాయే గతి…

  Like

 11. మళ్ళీ సంవత్సరం పరిక్షలకి ఇప్పుడే సిద్ధంకండి. ఈ టిప్స్ పాటిస్తే డిస్టింక్షనే, పాస్స్ ఏం కర్మ 🙂

  ఆవాకాయ కాయ ఏదన్నదికాదు, పేరు కాదు కొశ్చను పీచుండటం, పులుపుండటం పాయింటు.

  కాయ వాసన చూస్తే వసవాసనఒస్తే ఊరికే ఇస్తానన్నా తేకండి, తెచ్చేరా అయిపోయినట్టే.

  అసలైన కోనసీమవాళ్ళం ఆవకాయ లో ఫెయిలవ్వడమేంటండి బాబూ. మిగతావన్నీ పెద్ద బాధలేనివేలెండి

  ఈ సంవత్సరం చెట్టూ కాయలేదు, బయటా కాపు లేక మంచి కాయలేదు, అందుకే పరిక్షలే లేవు.

  పాతావకాయా అయిపోయింది.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: