బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు


  తిన్నతిండి అరక్క చేసే పనుల్లో ఒకటి- ఈరోజుల్లో తెలుగు సినిమా చూడ్డం. అదే నిన్న చేసిన పని. మొన్న ఏదో మా బంధువుల ఇంట్లో పెళ్ళి కి వెళ్ళి, తిరిగి ఇంటికొచ్చేటప్పటికి అర్ధరాత్రి దాటింది. పొద్దుటే, తెలుగు పుస్తకాలు తెచ్చుకోడానికి, స్టేషనుకి వెళ్ళి , వస్తూంటే, అబ్బాయి ఫోనూ… ” సాయంత్రం తెలుగు సినిమాకి వస్తారా.. ” అంటూ.. పిల్లలతో ఇంకొంచంసేపు గడపొచ్చూ అనుకుని, సరే అని , మా ఇంటావిడకి ఫోను చేసి చెప్పాను.. స్వయంగా సినిమాలకి వెళ్ళి , వాటికయ్యే ఖర్చూ, ఆ థియేటరులోని , భయంకరమైన డాల్బీ సౌండూ, భరించే ఓపిక లేక, అసలు థియేటరుకి వెళ్ళి సినిమాలు చూడ్డమే మానుకున్నాము.. అలాగని మేమేదో జీవితంలో ఏదో కోల్పోయామని కూడా అనుకోవడం లేదు. మహా అయితే, ఇంకో తెలుగువారెవరైనా, ఫలానా సినిమా చూశామూ, మీరు కూడా చూశారా అన్నప్పుడు,  అయ్యో, ఇదివరకటి రోజుల్లోలాగ ఏదో పాత సినిమాలు కాకుండా, ఆంధ్రదేశంలో రిలీజైనరోజే, పరాయి రాష్ట్రాల్లోకూడా రిలీజవుతున్నప్పుడు కూడా, అలాటి సదావకాశాన్ని సద్వినియోగపరచుకోలేదే అని అనుకుంటూంటాము.. అలాటి భావోద్వేగాలకి లోనైనప్పుడు మాత్రం ఓ తెలుగు సినిమా చూసి, పాపప్రక్షాలణ చేసికోవడం. ఓ సినిమా చూడ్డం, మళ్ళీ ఓ రెండు సంవత్సరాలపాటు, సినిమా యాడ్లుకూడా చూడకపోవడం. జీవితం బాగానే వెళ్ళిపోతోంది.

 ఏదో ఉన్నవాళ్ళకంటే ఇంకొంచం బాగా చేస్తూన్న, అల్లు అర్జున్  సినిమా కదా, పోనీ వెళ్దామూ అనుకున్నాము.   అసలు ఆ సినిమా ఏమిటో, కథేమిటో, ఒక్కో సీనులో పదేసిమందిని, ఒక్కోసారి హీరో, ఇంకోసారి హీరో  చంపేయడమేమిటో, మాట్టాడితే అయిటం  సాంగులేమిటో , అస్సలర్ధం అవలేదు.  పైగా, పరాయిరాష్ట్రాల్లో తెలుగేతరులని కూడా హింసించడానికి,  Subtitles  ఒకటీ.. పాటల లిరిక్స్ తో సహా..   ఇవన్నీ సరిపోవన్నట్టు, హీరో ఇదివరకు ఆర్మీలో పని చేశాడని , మాటలద్వారా తెలిసింది. ఈ హీరో బయటకొచ్చేయడం వలన, మన దేశ సరిహద్దులు , ఎంత పటిష్ఠంగా ఉన్నాయో తెలిసింది.  హీరోయిన్  ఒక  MLA  ట. శుభం. ఇప్పుడర్ధమవుతోంది, మన శాసనసభలు అంత దరిద్రంగా ఎందుకుంటున్నాయో.. ఎప్పుడుచూసినా హీరోలతో డ్యాన్సులు చేస్తూంటే, ఇంక ప్రజలగురించేం పట్టించుకుంటారు మరీ? అలాగని పట్టించుకోవడం లేదూ అనడానికీ లేదూ… పట్టించుకున్న ఓ విషయమూ flop show  అవుతుంది. ఇంక హాస్యమంటారా, కొన్ని కొన్ని డయలాగ్గుల ద్వారా  routine  కి  different  గా తమాషాగానే ఉన్నాయి. ఒక్కో నటుడికీ, మొత్తం సినిమా అంతటికీ ఓ గుప్పెడు డయలాగ్గులూ. ఇదివరకటి రోజుల్లో ప్రముఖ నటులెవరైనా సినిమాలో వేస్తే, ” అతిథి పాత్ర ” లో అనేవారు. ఈరోజుల్లో, హీరో, విలనూ తప్పించి అందరూ “అతిథి పాత్ర” ల్లోనే. ఇంక డ్యాన్సులంటారా, అవేవో రికార్డింగు డ్యాన్సుల్లా ఉన్నాయి.

 అయినా ఈరోజుల్లో, ఏవేవో expectations  పెట్టుకుని, తెలుగు సినిమాకి వెళ్ళడమేమిటీ? అస్సలర్ధంలేని మాట. డబ్బులున్నాయా వెళ్ళు. ఓపికుందా సహించు. లేదంటావా నోరుమూసుక్కూర్చో.. అంతేకానీ, ఇలా  రాయడం వచ్చుకదా అని అవాకులూ, చవాకులూ రాసి, తెలుగువారి మనోభావాలు కించపరచొచ్చా… హన్నా…

టీవీల్లోనూ, పత్రికల్లోనూ ఆ సినిమా గురించి అభిప్రాయాలూ, రివ్యూలూ హోరెత్తించేస్తున్నారే,  మొదటిరోజు ఇన్ని కోట్లూ.. రెండో రోజు ఇన్ని కోట్లూ, ఫలానా హీరో సినిమాకంటే ఇంతెక్కువా అని . పైగా ఒక్కో చానెల్ లో ఆ హీరోయిన్లతో , వచ్చీరాని తెలుగులో ఇంటర్వ్యూలూ. హాయిగా ఇవన్నీ చూసి కాలక్షేపం చేసినా గొడవుండేది కాదు. “చేసిన పాపం చెప్పుకుంటే పోతుందిట ” అందుకే ఈ టపా..  మొత్తం నాకు నచ్చిందల్లా ఆ థియేటరులోని  సీట్లు. హాయిగా కాళ్ళు జాపుకుని  relax  అయ్యేలాగ  సోఫాలు. అదికూడా ఈమధ్యనే మొదలెట్టారుట. మా మనవడు అగస్థ్య  వచ్చి, సీటు కి పక్కనుండే అదేదో నొక్కి, కాళ్ళు బార్లాజాపుకునేటంతగా చేసి, వాడి దారిన వాడు పడుక్కున్నాడు హాయిగా…

 

3 Responses

 1. >> ఏదో ఉన్నవాళ్ళకంటే ఇంకొంచం బాగా చేస్తూన్న, అల్లు అర్జున్ సినిమా కదా…

  ఏలోకంలో ఉన్నారు సార్? అసలు ఈ అల్లు గారికి ఏక్షన్ అంటే తెలుసా? వాళ్ళ తాత (ముత్తాత?) పుణ్యమా అని ఇలా ఫీల్డులోకి వచ్చారు. కానివ్వండి. కానివ్వండి (ఇది మాయాబజార్ లో కృష్ణుడి దయలాగు). ప్రవాసాంధ్రులు – అంటే ఆంధ్రా/తెలంగాణా బయటా ఉన్నవారు ఇప్పటికీ (నాతో కలిసేనండోయ్) నేర్చుకోని విషయం – తెలుగు సినిమా అనేదానికి కధ, పాటలు, మాటలు, నృత్యం (అంటే?), నా శ్రాద్ధం, పిండాకూడు ఉండవు. మరెప్పుడూ ఇలాంటి పనికిమాలిన పనులు చేయకండి. లెంపలు వేసుకుని బుద్దిగా అమ్మవారి విగ్రహానికి ఓ నమస్కారం చేసుకోండి. సర్వే జనా సుఖినోభవంతు.

  Like

 2. మాస్టారూ ! కాస్త కళాపోషణ లేకపోతే ఎలా సారూ ? తప్పదు పిల్లల సరదాలు తీరుస్తూనే కాస్త మన బ్లాగులకి తగిన సబ్జెక్టు లు వెతుక్కోవాలి కదా ! అదో తుత్తి ,అవునా ?

  Like

 3. రాధారావు గారూ,

  మీరన్నది నిజమే అనుకోండి.. అయినా, మిగిలిన సినిమా ” వారసుల” కంటే, ఏదో కొద్దిగా బావుంటాడేమో అని అభిప్రాయం. అయినా ఈ దౌర్భాగ్యపు సినిమాలు చూడడం కంటే, మీరన్నట్టు హాయిగా ఏ అమ్మవారినో తలుచుకోడమే హాయి పుణ్యమైనా దక్కుతుంది.

  శాస్త్రిగారూ,

  అందుకే కదా నేను తెలుగు సినిమాలు చూసేదీ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: