బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– “Being taken for a ride…”


 సాధారణంగా జనాలని వెర్రి వెధవలు చేసినప్పుడు బహుశా “being taken for a ride..” అంటారనుకుంటా.. మన రాజకీయ నాయకులనే చూడండి.. ఎన్నికల సమయంలో ఎన్నో ఎన్నెన్నో ” తాయిలాలు” చూపించి, వారి ని ఎలాగోలాగ ఎన్నికయ్యేటట్టు చూసుకుంటారు. గ్రామస్థాయి పంచాయితీ ఎన్నికలనుండి, జాతీయ ఎన్నికలదాకా ఇదే తంతు. అయినా సరే,  గొఱ్ఱె కసాయివాడినే నమ్ముతుందన్నట్టు, వాళ్ళ వెనక్కాలే పడతాము. ఏ రంగం తీసికున్నా ఇదే రంధి. సాధారణ ప్రజలకి ఈ విద్య రాదూ, వాళ్ళకి వచ్చూ.అంతే తేడా..

ఆర్ధిక సంస్కరణల ధర్మమా అని, ఎక్కడపడితే అక్కడ Malls  వచ్చేశాయి. కొత్త ఎప్పుడూ వింతే కదా, అప్పటిదాకా ఒక్కో వస్తువుకీ, కాళ్ళరిగేలా తిరిగేబదులు, ఒకే  ఛత్రంకింద, అన్నిటినీ కొనుక్కోవచ్చని అందరమూ చంకలెగరేసికున్నాము. విశ్వాసపాత్రంగా అన్నేళ్ళూ మనకి సేవలందిస్తూ, ” అరువు” కూడా ఇస్తూన్న, చివరకి సరుకులన్నీ కొన్న తరువాత, ఓ బెల్లం ముక్క కూడా ఉచితంగా ఇస్తూ, ” ఎలాగున్నారండి అబ్బాయి గారూ..” అంటూ, ఎంతో అభిమానంగా పలకరించే, కిరాణా కొట్టువాడు కాస్తా, ” కాకరకాయ ” అయిపోయాడు.  కానీ, ఎప్పటికోఅప్పటికి మనుషుల్లోనూ  realisation  అనేది వస్తుందే కదా.  బయటి కొట్లలో కనీసం బేరమేనా ఆడొచ్చు. ఈ Malls  లో ఆ అవకాశమేలేదు.అదేదో లేబులూ, దానిమీదో నెంబరూ, దాన్ని అదేదో మెషీను పెట్టి అలా అలా తిప్పితే, దాని ధరెంతో మన బిల్లులోకి వస్తుంది. ఆ పన్నూ, ఈ పన్నూ కలిపి తడిపిమోపెడవుతుంది.  పైగా అవసరమైన సరుకులన్నీ, అల వైకుంఠపురము లోలాగ ఎక్కడో పెడతారు.  మనకి అసలు అవసరమైనవి దొరికేదాకా,  పెద్ద మాల్స్ లో కనీసం, ఓ వందా రెండువందల గజాలైనా ఓ ట్రాలీ నడుపుకుంటూ పోవాలి. దారిపొడుగునా, ఆకర్షణీయంగా కనిపించి, ఎందుకూ అవసరంలేనివన్నీ పెడతారు. పైగా అందులో  Buy one get one free   అని బోర్డులోటీ. మొత్తం కుటుంబంతో కలిసి, ఈ మాల్స్ కి వెళ్ళామా, అంతే సంగతులు. ఆ ట్రాలీలో అతి చిన్న పిల్లనో, పిల్లాడినో కూర్చోపెట్టి, దాన్ని నెట్టుకుంటూ , వెళ్ళేలోపల, ఆ పిల్లో,పిల్లాడో  ” నాకు అదికావాలి డాడీ..” అంటునో, “అరే  ఇదేదో బాగానే ఉందండోయ్.. ” అంటూ , భార్యో, అడగడం, తీరా మనం కొనాల్సిన వస్తువు, కొనేలోపలే, మన ట్రాలీ, నానా  అనవసరమైన చెత్తతోనూ నిండిపోవడం చూస్తూనే ఉంటాము.   ఈ ఖరీదుల్లో , అక్కడుండే స్టాఫ్ జీతాలూ, వాళ్ళ లైట్లూ, ఏసీ ల బిల్లిలూ , అన్నీ కలిపి మన నెత్తిమీద రుద్దుతారు. అయినా సరే ఏదో చిన్నప్పుడు తీర్థాలకి వెళ్ళినట్టు, నెలకోసారో, రెండుసార్లో వెళ్ళాలే. పైగా ఇంకో విషయం.. మీ  గ్రోసరీస్ ఎక్కడ తీసికుంటారూ అని ఏ పక్కింటివాళ్ళో అడిగితే,   We go to Reliance/ Dmart/ Big Bazaar   అని ఇంగ్లీషులోనే చెప్పడం ఓ  Status Symbo లాయె.. అదే రోడ్డు పక్కనుండే కూరల కొట్టులోనో, బళ్ళమీద తెచ్చేవాళ్ళనో, నిమ్మకాయలు ఎంతోయ్ అంటే, వాడు  పదిరూపాయలకి మూడూ, అంటాడు.. వాడికీ తెలుసు మనం నాలుగిమ్మంటామని. ఏదో మెహరుబానీ చేస్తున్నట్టు, వాడూ ఇచ్చేస్తాడు. ప్రతీదానికీ బేరం చెయొవచ్చు. వాడివ్వకపోతే ఇంకో కొట్టు. కొట్లు లేవా ఏమిటీ? కానీ అవే నిమ్మకాయలు, ఏ మాల్ లోనైనా తీసికోండి, ముక్కుపిండి, మూడింటికీ కనీసం ఓ పన్నెండు రూపాయలు వసూలుచేస్తాడు.. మాల్స్ కీ, మన వాడికగా తీసికునే కిరాణా షాప్పుకీ తేడా  ఎక్కడా అంటే, అక్కడ మాల్స్ లో ఆడపిల్లలు యూనిఫారం లోనూ, Good Morning Sir, Thank you sir అనడం , ఇక్కడేమో కొట్టువాడు , కాటాముందర కూర్చునో, లేదా ఏ బనీనులోనో నుంచునో, కొట్టంతా సరుకుల సువాసనలతో ఘుమఘుమలాడుతూండడమో.  ఒక్కోసారి గిరాకీలెక్కువగా ఉంటే ఆగాల్సొస్తుందేమో. ఈ కొట్టువాడు మాత్రం బిల్లులూ గట్రా ఇవ్వడు. మహా అయితే, ఇంట్లో చూపించడానికి  ఓ తెల్ల కాయితం మీద నాలుగంకెలు వేసిస్తాడు. 

ఇలాటిదే ఇంకో రంగం ఉంది. రవాణా వ్యవస్థ. ఆటోలవాళ్ళు మీటర్లు వేయకుండా, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారనీ, మనలాటి సాధుపుంగవులని దోచేస్తున్నారనీ, అప్పుడెప్పుడో ఓ రెండు మూడు  Taxi Service లు వచ్చాయి. ఇదివరకటిరోజుల్లో అసలు టాక్సీలనేవి, ఒక ఊరునుంచి ఇంకో ఊరికి వెళ్ళాల్సొచ్చినప్పుడూ, మహానగరాల్లో మాత్రమే ఉపయోగిస్తారనే అపోహ ఉండేది. కానీ, ఈ కొత్తగా వచ్చిన  Ola, Uber, TFS  వాళ్ళు, మన గుమ్మంలోకే వచ్చి, ఏసీ కార్లలో తీసికెళ్ళినా, ఆటోలకి పెట్టే ఖర్చుకన్నా సగానికి సగమే అవడంతో , చాలామంది ఈ టాక్సీలే పిలిచేవారు. పైగా  ఆటోలోనో, బస్సులోనో వెళ్ళడం కంటే, పెద్ద స్టైలుగా, కారులో దిగడం, చూసేవాళ్ళకీ బావుంటుందికదా.. అది టాక్సీయా, స్వంతకారా, తెల్ల నెంబరు ప్లేటా, పసుప్పచ్చ నెంబరు బోర్డా ఎవడు చూడొచ్చాడు? ఏదో మొత్తానికి ఊళ్ళో తిరగడాలక్కూడా టాక్సీల్లోకి వచ్చేశారు జనాలు. పైగా ఇంకోళ్ళకి కూడా సలహాలివ్వడం… “హాయిగా టాక్సీ పిలిచేయండీ, ఈ దిక్కుమాలిన ఆటొలవాళ్ళు దోచేస్తున్నారూ..” అని.  జనాల హుషారు చూసి, ఈ పైచెప్ప బడిన టాక్సీలవాళ్ళూ, తెలివి మీరిపోయారు. రుచి మరిగారు.. ఒక్కో టైముకి ఒక్కో రేటు. ఇదివరకు నాలుక్కిలోమీటర్లకి 49 రూపాయలుండేదల్లా, రెండుకిలోమీటర్లకి మార్చేశారు. పైగా వీటికి సాయం ఒకడేమో ప్రయాణ వ్యవధి నిమిషానికి రూపాయన్నరైతే, ఇంకోడేమో రూపాయి ముప్పావలా.. పైగా ఏ ట్రాఫిక్కు జామేనా అయితే, అంతే సంగతులు.మనం గమ్యం చేరేటప్పటికి  బిల్లు తడిపి మోపెడవుతోంది. పైగా ఏమైనా అంటే  Terms and conditions apply..

  ఈగోలంతా ఎందుకు రాశానంటే, ఈవేళ పొద్దుట, మా స్నేహితుల ఇంటికి వెళ్ళడానికి టాక్సీ వాడు అక్షరాలా తొంభైతొమ్మిది రూపాయలూ, 5 కిలోమీటర్ల ముచ్చటకి, అదే దూరం, ఆటోవాడు మీటరుమీద అరవై రెండురూపాయలూ తీసికున్నాడు.. అరవైరెండు బదులు, అరవై అయిదిచ్చినా   పుణ్యం కూడానూ.

ఒకానొకప్పుడు ఆటోలవాళ్ళది ” దోపిడీ ” అనుకుంటే, ఈరోజుల్లో టాక్సీ సర్వీసువాళ్ళు చేసేది  ” నిలువుదోపిడీ…”

5 Responses

 1. అక్షరాలా నిజం.మరో విషయం.మాల్స్ లో పళ్ళు చాలా ఆకర్షణీయం గా పేక్ చేస్తారు.ఇంటికి వచ్చాక విప్పీ చూస్తే అన్నీ డాగులే.మర్నాడు అసలు రంగు బయటపడుతుంది.కుళ్ళు పళ్ళు తినలేం…పారేయలేం.

  Like

 2. నీలు నిక్కియు బేర మాడియు
  గోలు మాలును లేక నిచ్చెర
  వీలు కోమటి వాడు వీధిన ఉండె సరసన గద !
  మాలు కథలను వినుము సోదర !
  కాలు బెట్టిన బోయె కాసులు
  మాలు మీదే యనెర మాయను జేసె ధూంధాం ! ధాం !

  ***

  ఓరి ఆటో వస్తివా యన
  పోరడి మీటరు హీటునయ్యె
  మారకము బోయెగద మా డబ్బులతనికి రోజూ!
  కారులు వచ్చె ఓలొ వచ్చెను
  జోరుగ నుండె మొదట ఆపై
  వారు యేలిరి మమ్ము వారెవ్వా ! చమురు వదిలెర !

  చీర్స్
  జిలేబి

  Like

 3. రాధారావు గారూ,

  అలాటివి అంటకట్టడంలో వాళ్ళు మాత్రం గొప్ప experts…

  జిలేబీ,

  మీ కలానికి ( కీబోర్డుకి) పదునుమాత్రం బాగా ఉంది. నేను ఎలాటి పోస్టుపెట్టినా, దానికి వ్యాఖ్య అచ్చతెలుగు పద్య రూపమే… ధన్యవాదాలు. అప్పుడప్పుడు వచనరూపంలో కూడా ఉంటే ఇంకా బావుంటుంది…

  Like

 4. “Will you walk into my parlour?” said the Spider to the Fly,

  సాలెపురుగు లాగా ఆకర్షణీయంగా గూడు అల్లుతారు. ఈ కార్పొరేట్ల లీలలు వర్ణించ తరమా! కార్పొరేట్ సంస్కృతికి స్వాగతం పలికి Pandora’s box ని తెరిచాం, స్వదేశీ వ్యవస్ధలు కుప్పకూలిపోవడానికి దోహదం చేసాం, అనుభవించాలి తప్పదు. ప్రజాభిప్రాయానికి మన దగ్గర ఏమంత విలువ లేదు. ప్రజాభిప్రాయానికి జంకి తమ తీరు మార్చుకునే కార్పొరేట్లు అరుదేమో!
  పైన రాధారావు గారు చెప్పినట్లు ఓ మాల్‌లో ఆపిల్ పళ్ళ గురించిన ఓ టీవీ వాణిజ్య ప్రకటన ఈ మధ్య టీవీలో వస్తోంది. పండుకి మాసిక వేసినట్లు చూపిస్తారు దాంట్లో? (అంతకు మించి ఆ ప్రకటన అర్ధం కాలేదు – చాలా టీవీ ఏడ్‌ల లాగానే).
  ఇక కాబ్‌ల దోపిడీ చెప్పక్కరలేదు. సాలెగూడుకి సరైన ఉదాహరణలు. ప్రయాణించిన దూరానికి డబ్బు తీసుకోవడం సరిపోక ప్రయాణానికి పట్టిన టైముకి కూడా నిమిషాల లెక్కన ఛార్జీలు వసూలు చేయడం వెనక లాజిక్ నాకు అర్ధం కాదు. ఇంకా పీక్‌టైం (peak time) ఛార్జ్ అని మరి కొంత వడ్డింపు. ఉదయం దూరప్రయాణ ట్రైన్లు చేరుకునే టైములో కాబ్ రేట్లు 2.5 రెట్లు, 3.5 రెట్లు చూపిస్తుంటాయి. ఇది రైలు ప్రయాణీకుల అవసరాన్ని దోపిడీ చేయడం కాక మరేమిటి? (స్టేషన్, బస్స్టాండ్ దగ్గర ఒకప్పుడు రిక్షాలు, తర్వాత ఆటోల పద్ధతి ఇలాగే ఉండేది కదా. కానీ మరీ దారుణం కాదులెండి. ఇప్పుడు ఆధునిక కాబ్‌లది పూర్తి దోపిడీ మనస్తత్వం. రిక్షా వాళ్ళతోను, ఆటోలతోను కనీసం బేరమాడే అవకాశం ఉంది). వీట్లన్నిటితో కూడా వాళ్ళ ఆత్మలు శాంతించడం లేదేమో, హైదరాబాదులో ఊబర్ వారు “సర్జ్ (surge)” అనే రుసుమోటి మొదలుపెట్టారట. “సర్జ్” ఏమిటి అనే వివరణ లేదుట (బహుశః డ్రైవర్ గేరు మారిస్తే బండి ముందుకు దూకడానికి – సర్జ్ – కూడా మనమే డబ్బు చెల్లించాలేమో). దీన్ని గురించి ఈ రోజు ఇక్కడి డెక్కన్ క్రానికల్ పేపర్లో ఓ బాధితుడు తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆయన వెళ్ళిన 10.61 kms దూరానికి సాధారణంగా అయ్యే 135, 140 రూపాయల బదులు “సర్జ్” పేరుతో మరో 176 రూపాయలు ఎక్స్ట్రా కలిపి 312 రూపాయలు వసూలు చేసాడట ఊబర్ – అంటే కిలోమీటర్‌కి దగ్గర దగ్గర 30 రూపాయలన్నమాట. అదీ మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో! బాగుంది కదా! మరోటండోయ్, ఈ కాబ్‌లు మధ్య దారిలో మనవారెవరినీ పికప్ చేసుకోవడానికి ఒప్పుకోరట, వాళ్ళ కంపెనీకి మరో బేరం దొరికే అవకాశం పోతుందనేమో! Yes, certainly being taken for a ride. ఆనందమానందమాయెనే. మేరా భారత్ మహాన్.
  (ఒకప్పుడు relation-based గా ఉండిన మన వ్యాపారాలు ఈనాడు only transaction-based వ్యాపార సంస్కృతిగా మారిపోయాయి. ఆ transaction వరకే పరిమితం. అందువల్ల, మీరు పోస్ట్ క్లుప్తంగా వ్రాసినా నేను వ్యాఖ్య రూపంలో నా ఆక్రోశం ఎక్కువగానే వెలిబుచ్చినట్లున్నాను. తెలుగు సినిమా వాళ్ళు చెప్పినట్లు “లెన్‌త్” ఎక్కువయింది. సారీ.)

  Like

 5. నరసింహరావుగారూ,

  మీ వ్యాఖ్య , నా టపా కంటే పెద్దదిగా ఉందేమో అని మాత్రం అనుకోవద్దు. నేను స్పృసించిన పాయింట్లను మీరు వివరంగా, ఉదాహరణలతో చెప్పారు.. అయినా ఇదంతా మన కంఠశోషే… వినేవాడెవడూ లేదు. అలాగని మనం వేలెత్తిచూపకుండా ఉండాలేము. ఏమిటేమిటో కబుర్లు చెప్తారు, ఈ తరంవారు, కానీ ఇలాటి నిలువుదోపిడీలని అరికట్టడానికి మాత్రం ప్రయత్నం చేయరు… ఏదో ధనాభావం వల్ల మనం మాట్టాడుతున్నామని అనుకున్నా, చేసేదేమీ లేదు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: