బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ” నిన్న లేని అందాలేవో…..”


 పాత పధ్ధతులు , పాత అలవాట్లూ ఎంతకాలం పట్టుకుని వేళ్ళాడతాం,  జీవితంలో మార్పనేది అవసరమే కదా. ఓ నాల్రోజులు అలవాటైతే చాలు. ప్రస్తుతం నా పరిస్థితీ అదే. ఏ ముహూర్తాన్న మా ఇంటావిడ నా చేతిలో ఆ కొత్త Smart Phone  పెట్టిందో కానీ, నా రోజువారీ దినచర్య అంతా రాత్రికి రాత్రి మారిపోయింది. ఏదో ఇంటికి వచ్చినవారెవరైనా, అరే మీ ఇంట్లో న్యూసు పేపరే తెప్పించరా అని ఎక్కడ అనిపోతారో అని,  డొమీనియన్ ప్రతిపత్తిలోంచి, ఫుల్ స్వాతంత్రం వచ్చినప్పటినుండీ, అంటే ఉద్యోగంలో చేరినప్పటినుండీ , ప్రతీ రోజూ  కొనుక్కునే  వార్తా పత్రిక ( పైగా ఓ ఇంగ్లీషూ, ఓ తెలుగూ ) మానేశాను. పీడా వదిలింది. అయినా ఈరోజుల్లో వార్తాపత్రికల్లో చదవడానికి ఏముందీ? ఎక్కడ చూసినా ఒకరినొకరు తిట్టుకోవడమో, లేకపోతే రోడ్డు ప్రమాదాల గురించీ తప్ప ఏమీ ఉండదు. ఈమాత్రందానికి డబ్బులు వేస్టు చేసి, ఆ పేపర్లు కొనడం, ఆ పేపర్లన్నీ , నెలకో రెండునెలలకో, అలమారా నిండా పేరుకుపోవడం, ఎప్పుడో, ఇంటావిడ చివాట్లేసినప్పుడు, రోడ్డుమీద అరుస్తూ వెళ్ళే  ” రద్దీ వాలా” ని పిలిచి, వాడిచ్చిందేదో  నోరుమూసుకుని తీసికోవడమూ.. వాడు తూచేటప్పుడు, మనల్ని బోల్తా కొట్టిస్తున్నాడని తెలుసు, మనం ఆ పేపర్లు కొనడానికి ఎంత ఖర్చుపెట్టామో కూడా తెలుసు.అయినా కళ్ళల్లో నీళ్ళెట్టుకుని, వాడిచ్చిన  పాతికో యాభయ్యో తీసికోవడం. బయటకి వెళ్ళి ఏ కిరాణా కొట్లోనో ఇస్తే, ఓ రూపాయో అర్ధో ఎక్కువే వస్తుంది.. కానీ మోసుకెళ్ళొద్దూ? మనకేమైనా కార్లా స్కూటర్లా.. ఆజన్మ పాదచారినాయె ( సైకిలు తొక్కడం కూడా రాని అర్భకుణ్ణి).. అమ్మయ్యా ఓ గొడవొదిలింది. ఇన్నాళ్ళూ, నేను బయటకి వెళ్ళి తెలుగుపేపరు తేవడమూ, మా ఇంటావిడేమో హాయిగా తన Tab  లో అదేదో App  పెట్టేసికుని, అప్పటికే అన్నీచదివేసి,  కర్మకాలి నేను చదివినదేమైనా పెద్ద గొప్పగా తనతో చెప్తే, ” నాకూ తెలుసులే…… ” అంటూ, నేను చెప్పినవార్త పూర్వాపరాలు కూడా చెఫ్ఫేది. ఆ  E-Paper లో  ఆ వార్తకి సంబంధించిన   Read this also  అని రాస్తూంటారుకదా.. రోజులు మారిపోయాయండీ, ఇదివరకటిలాగ, ఏదో మొగుడు చెప్పాడూ, ” అలాగాండీ ” అని ఆశ్చర్యపడే రోజులు కావివి..” బడుధ్ధాయీ, అసలు ఆ  గొడవెందుకొచ్చిందంటే..” అంటూ , ఇంకా కొన్ని వివరాలు చెప్పడం. దానితో  సంసారపక్షంగా ఏదో పేపర్లు చదివేవాళ్ళందరికీ  ” మానసిక సంతులన్ ”  గతి తప్పుతోంది.. అసలు ఆ పేపర్లే కొనడం మానేస్తే గొడవే ఉండదుగా.. పైగా దేశవిదేశాల వార్తలన్నీ కూడా హాయిగా చదువుకోవచ్చు.. బిఎస్ ఎన్ ఎల్ వాళ్ళకి ఆ  Broadband  కి నెలసరి డబ్బులు ఎలాగా కడుతున్నాము. ఖర్చులో ఖర్చు ఆ పేపర్లు కూడా చదివేస్తే  హాయి కదా. ”  అడుక్కుతినేవాడికి  అరవై కూరలని” .. అన్ని రకాల పేపర్లూ చదవడం, వినేవాడంటూ ఉంటే వాణ్ణి బోరుకొట్టడమూ, ఫలానా పేపర్లో అలా రాశాడండీ అంటూ,అక్కడకి మనకే అన్నీ తెలుసున్నట్టు.. అదో కాలక్షేపం

  ఇన్నాళ్ళూ ఆ Desktop  ధర్మమా అని, రైల్వేస్టేషనుకెళ్ళి రిజర్వేషను చేయంచడం, ఎప్పుడో మానేశాను.పైగా ఎవరైనా సమవయస్కులు వెళ్ళినా, వాళ్ళకి సలహాలివ్వడం.. వాళ్ళు వినేవారు కాదనుకోండి, అది వేరే విషయం. కానీ , ఈరోజుల్లో ఎక్కడ చూసినా, చేతుల్లో ఉండే ఆ  Smart Phone  లో అదీ ఇదీ కెలకడం, క్షణాల్లో మనచేతిలో ఉండే ఇక్ష్వాకులకాలంనాటి బావురుమంటూ ఉండే పాత మొబైల్ లో , మన ప్రయాణ టిక్కెట్టు   SMS  రూపంలో వచ్చేయడం.. ఏమిటో అంతా చిత్రం అనుకునేవాడిని.. ఇంకా మొదలెట్టలేదూ, ఎప్పుడో దానిక్కూడా శుభారంభం చేసేయాలి..

ఏదో   Wi-fi  ఉన్నచోటే, అవీ ఇవీ కెలుకుతున్నా. బయటకి వెళ్ళినప్పుడు , అదేదో      Network Data  ని వాడుకోవచ్చుట. అప్పుడెప్పుడొ ఓసారి వాడుకున్నా, ఆ నెల బిల్లు తడిపి మోపెడయింది.  అయినా ఈ వయసులో, ప్రతీ క్షణమూ, ప్రపంచంలో ఏమేం జరుగుతుందో తెలిసికోవడం అంత అవసరమా, వేషాలు కాపోతే.   ఉద్యోగాలు చేసేవాళ్ళకి బహుశా అవసరమేమో కానీ, కాలేజీకీ,, స్కూళ్ళకీ వెళ్ళే పిల్లలు కూడా, ఏదో ఒకటి కెలుకుతూనే ఉంటారు. అయినా వాళ్ళేమైనా బిల్లులు కట్టాలా పెట్టాలా? అయినా అదో వేలం వెర్రి. అడిగేవాళ్ళు లేక.

 

4 Responses

 1. తాను చెప్పెను వేష్టు పేపరు
  కాన కొనును కొననిక ! కరమున స్మార్ప్టు ఫొనె గలదుర !
  దీని చేతన్ బూని పనులున్ !
  మేనికి గలిగె సుఖము! పేపరు
  గాన బజారు బోవ గాడియు కలదె ? ఔరా స్మార్ట్ !

  చీర్స్
  జిలేబి

  Like

 2. ఫోను స్మార్టూ బాబు గారూ
  తాను చెప్పెను వేష్టు పేపరు
  కాన కొనును కొననిక ! కరమున స్మార్ప్టు ఫొనె గలదుర !
  దీని చేతన్ బూని పనులున్ !
  మేనికి గలిగె సుఖము! పేపరు
  గాన బజారు బోవ గాడియు కలదె ? ఔరా స్మార్ట్ !

  Like

 3. పేపరు వలదుర ! స్మార్ట్ ఫోన్
  సాపుగ సరసన గలదుగ సర్వము చదువన్
  మోపుర న్యూసుల పేపరు!
  షాపుల బోవన్ వలదిక! షాపే చేతన్

  Like

 4. జిలేబీ,

  నా టపాల మాటెలా ఊన్నా… మీ కవిత్వానికి చాలా పదును పెట్టేస్తున్నారు… చెప్పానుగా నాకు కవిత్వం రాయడంలో మీ కున్న సృజనాశక్తి లేదు.,. ఏదో చదివి సంతోషించడం తప్ప.. ధన్యవాదాలు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: