బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు..మా వైష్ణోదేవి యాత్ర…


మొన్న ఫిబ్రవరి 28 వ తారీకున , నేనూ, మా ఇంటావిడా కలిసి  44 సంవత్సరాలు ప్రయాణం పూర్తిచేశాము. మా గురువుగారు శ్రీ బాపు గారు చెప్పినట్టు… Bapu garu   మరీ  కొట్టుకుంటూనో, తిట్టుకుంటూనో అని కాకపోయినా, మొత్తానికి పూర్తిచేశాము. ఈ సుదీర్ఘ ప్రయాణానికి,  ” అమ్మ” ఆశీర్వచనాలే  ముఖ్య కారణం అనడంలో సందేహమే లేదు. ఎప్పటినుంచో, మా ఇంటావిడకి ఓ కోరిక ఉండిపోయింది. ఎలాగైనా సరే, త్రికూట పర్వతాలలో కొలువై ఉన్న శ్రీమాతా వైష్ణోదేవి దర్శనం చేసికోవాలనీ. ఆవిడ పిలుపు వస్తేనేకానీ, ఆవిడేమో మనల్ని రానీయదుట. నిజం చెప్పాలంటే దేనికైనా ఓ టైము రావాల్సిందేగా.. అక్కడెక్కడో జమ్మూ కాశ్మీరులో ఉందావిడ.  అసలే జమ్మూ కాశ్మీరంటే, ముందుగా గుర్తుకొచ్చేది ఉగ్రవాదులు. హాయిగా రోజులు వెళ్ళిపోతున్నాయీ, ఇక్కణ్ణుంచే ఓ దండం పెట్టేసికుంటే పోదా అని నేనూ, హాత్తెరీ అలా కుదరదూ, ఎప్పటికో అప్పటికి ఆమ్మ పిలుపొస్తుందీ, మనం వెళ్తున్నామూ  అని మా ఇంటావిడా.   అంతెత్తు కొండ ఎక్కలేనేమో, నా మోకాళ్ళ నొప్పితో అని తప్పించుకుందామనుకున్నా, అదీ కుదరలేదు. మరీ నడవక్కర్లేదూ, హాయిగా హెలికాప్టరులో పైకి చేరొచ్చూ,అంది. అసలే నాకు విమానాలూ అవీ అంటే భయం. దానికి సాయం ఈమధ్యనే, శ్రీమాతావైష్ణోదేవి దర్శనానికి వెళ్తూన్న ఓ హెలికాప్టరు కాస్తా, అందరి కళ్ళముందే కూలిపోయింది. ఆ భయంకర దృశ్యాలన్నీ గుర్తొచ్చాయి. ఎలా రాసుంటే అలా జరుగుతుందీ, పోనిద్దూ ఇద్దరమూ కలిసే ఉంటాము, అని సద్దిచెప్పుకున్నాను.

అప్పుడెప్పుడో, మా ” దేవదూత” శ్రీ దాసరి అమరేంద్రగారితో యధాలాపంగా అన్నాను– మమ్మల్ని వైష్ణోదేవి తీసికెళ్ళాలి మాస్టారూ అని. ఈ దేవుళ్ళందరూ ఆయన ద్వారానూ, మా ఇంకో “దైవదూత” శ్రీ రవిచంద్రన్ దంపతులద్వారానూ, సందేశాలు పంపుతూంటారు.మమ్మల్ని రమ్మని.. మా ఇంటావిడకైతే, ఆ పిలుపులు రాగానే పట్టపగ్గాలుండవు.. పోనిద్దూ, నేనెలాగూ  initiative తీసికుని, ప్రయాణాలు చేయనూ, ఇంకోరెవరో పిలిచినప్పుడైనా వెళ్ళడానికేమిటీ అనుకుని,మొత్తానికి సరే అన్నాను. చెప్పలేదూ, ఇందులో నేను చేసిందేమీ లేదు,  రమ్మని పిలుపొచ్చింది, తోడుండడానికి అమరేంద్రగారెలాగూ ఉన్నారని, ఆయనద్వారా “అమ్మ ” పిలుపు అందగానే, రిజర్వేషన్లు చేసేశాను, హెలికాప్టరు, టిక్కెట్టుతో సహా. ఆయన ఫోను చేసి చెప్పారు, ” మీ ఇద్దరికే హెలికాప్టరు చేసికోండీ, నేను నడిచే వస్తానూ కొండపైకీ” అన్నారు. ఓహో మేమిద్దరమే అన్నమాట, ఏదైనా అయినా, కనీసం తెలిసినవారొకరైనా ఉన్నారూ మనకేదైనా జరిగినా తెలియచేయడానికీ  అని సరిపెట్టుకున్నాను. అనుకుంటాం కానీ, ప్రతీదానికీ భయపడ్డం మొదలెడితే జరుగుతాయా పన్లూ? జరిగేదేదో జరక్కా మానదు. అయినా ఇంకా బతికి ఎవర్ని ఉధ్ధరించాలీ అనుకున్నాను.  ఎందుకొచ్చిన గొడవా, పోనీ నడిచే ఎక్కేద్దామా అనీ అనుకున్నాను.  దీనికంతా నాకున్న హెలికాప్టరు భయమే కారణం. 26 న బయలుదేరి 27 కి ఢిల్లీ, 28 కి కట్రా చేరి , మొత్తానికి హెలికాప్టరు ఎక్కి, ఆ 8 నిముషాలూ ఉగ్గబెట్టుకుని కొండపైకి చేరామండి. అక్కడనుండి, అమ్మ దర్శనానికి ఇంకో నాలుగు కిలోమీటర్లు నడవాలిట.  ఎలాగోలాగ హెలికాప్టరు గొడవ ఒదిలిందనుకుంటే, మళ్ళీ ఇంకో గొడవ మొదలయింది. గుర్రాలు ఎక్కాలిట. అసలే సైకిలెక్కడం కూడా రాని నాలాటివాడికి ఇన్నేసి కష్టాలా? కష్టాలు మానుషులకి కాక, మానులకి వస్తాయా ఏమిటీ?

ఇద్దరినీ చెరో గుర్రం మీదా  ఎక్కించారండీ.  ఏదో చిన్నప్పుడు గుర్రబ్బండి ఎక్కాను కానీ, మరీ ఇలా  అచ్చంగా గుర్రం ఎక్కిన మొహమేనా నాదీ? ఎక్కడ పట్టుకోవాలో తెలియదు. ఏం  మాట్టాడితే ఏం ముంచుకొస్తుందో తెలియదు. దానిదారిన అది దౌడుతీస్తే  ఆపడం ఎలాగో తెలియదు. ఎంతో భయపడిన ఆ హెలికాప్టరే హాయిగా ఉంది, కర్మ కాలి గుర్రం మీదనుండి పడితే ఇంకేమైనా ఉందా? మొత్తానికి ఓ 40 నిముషాలు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, ఏడవలేక నవ్వి, గుర్రం మీదనుంచి పడిపోతే పట్టుకోడానికి ఓ ఇద్దరు  helper  లను పెట్టుకుని, అమ్మ దర్శనం చేసికుని, ఆవిడ ఆశీర్వచనం పొంది, మా 45 వ సంవత్సర ప్రస్థానం ప్రారంభించామండి. ఆ యాత్రా వివరాలు మా ఇంటావిడ తన బ్లాగులో ఓ టపా పెట్టింది. కింద పెట్టిన ఫొటోలో, మరీ బాగోదని, ఆ  helper   (నా గుర్రానికి సంబంధించిన వాడు), పక్కకు తప్పుకున్నాడు!!  మిగిలిన కబుర్లు ఇంకో టపాలో…ఇంకా చాలానే ఉన్నాయి..

hr 1

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

http://bsuryalakshmi.blogspot.in/2016_03_01_archive.html

7 Responses

 1. బాగున్నాయండి మీ వైష్ణోదేవి యాత్రా విశేషాలు (మీ బ్లాగు, మీ శ్రీమతి గారి బ్లాగు రెండూ కలిపి). మీ పోస్ట్(లు) చదివిన తర్వాత ఇంతకాలం నాకున్న ఓ అభిప్రాయం కాస్తా తల్లక్రిందులయింది (నేను ఈ యాత్ర చెయ్యలేదులెండి) – అదేమిటంటే అక్కడి హెలికాప్టర్ ప్రయాణీకుల్ని గుడికి అతి దగ్గరలో (మహా అయితే ఓ వంద రెండొందల గజాల దూరంలో) దింపుతుందని అనుకునేవాడ్ని. అలా కాదనీ, మరీ నాలుగు కిలోమీటర్ల ఇవతలే దింపేస్తుందనీ ఇప్పుడు మీ పోస్ట్ ద్వారా తెలిసింది 😦 ఎక్కడుండే ఇబ్బందులు అక్కడుంటాయనుకోండి; మరి హెలికాప్టర్ వారు గుర్రాల వారు కూడబలుక్కునుంటే చెప్పలేం.
  ఈ యాత్ర నిర్విఘ్నంగా పూర్తి చేసినందుకు మీ దంపతులకి అభినందనలు. అలాగే 44వ వైవాహిక వార్షికోత్సవ శుభాకాంక్షలు. Many More Happy Returns of the Day.

  Like

 2. భమిడి పాటి దంపతులకు శుభాకాంక్షలు !

  గుఱ్ఱము నెక్కిరి చట్టన
  బర్రున బోయిరి గుడికిర! బాతా ఖానీ
  సర్రన వచ్చెను చూడర
  జుర్రెను నలుబది అయిదుగ జోడిర జూడన్

  చీర్స్
  జిలేబి

  Like

 3. నరసింహారావు గారూ,
  ముందుగా మీ Greetings కి ధన్యవాదాలు. ఇంక హెలికాప్టరు వారూ, గుర్రాల వాళ్ళూ కూడ బలుక్కునే అవకాశం లేదు. అక్కడి Geological పరిస్థితే అలా ఉంది. ఒక విషయం. ప్రతీ దానికీ ఒక రేటు అంటే గుర్రాలకి ఇంత, డోలీకి ఇంత అని దేవస్థానం వారే నిర్త్ణయించారు. దానికంటే ఒక్క పైసా కూడా అడగరు..

  జిలేబీ,
  మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు. పద్యాలు రాయలేను. కానీ, మీరు ఆ పద్యం లో చెప్పినవి అర్ధం చేసికుని… ఇలాటి పద్యాలకి జిలేబీ దే patent అని ఇంకోసారి తెలిసింది.. Thanks a lot.

  Like

 4. sir,
  చాల రోజులకు బ్లాగ్ లో కనిపించారు. మీ శైలి అనితరం. చాల బావుంది. వివాహవారిష్కోత్శ్వ subhkanshalu.
  a.v. ramana

  Like

 5. వెంకట రమణ గారూ,

  ఇటుపైన తరచూ కనిపిద్దామని ఉద్దేశ్యం మాత్రం ఉంది. మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు. ఇంక శైలి అంటారా, నాకు తెలిసిన పధ్ధతి ఇదేనండీ. అదేదో ” అనితరం” అనడం మీ గొప్పదనాన్ని తెలియచేస్తోంది. Thanks.

  Like

 6. అదే రోజు మా పెళ్ళి రోజు కూడా. హ్యాపీ యానివెర్సరీ. ఆరోజు మేము ఏమి చేశామో గుర్తులేదు.

  Like

 7. రామకృష్ణారావు గారూ,

  భార్యాభర్తలు కలిసి చేసే ఏకైక సంబరం.. మరీ ఏం చేశారో మర్చిపోతే ఎలా మాస్టారూ? మీస్పందనకు ధన్యవాదాలు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: