బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు— గురువుగారూ… మరీ అంత అవసరమంటారా ?


    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి, 2009 లో మేము రాజమండ్రి కాపరానికి వెళ్ళే వరకూ తెలియదు. ఈ ప్రవచనాలు వగైరా, కూడా వినడం మొదలెట్టింది, రాజమండ్రి లో, మొట్టమొదట సారి, శ్రీ గరికపాటి వారి ప్రసంగం, ప్రత్యక్షంగా విన్నప్పుడే. ఆరోజుల్లోనే, భక్తి టీవీ వారు ప్రతీరోజూ, శ్రీ గరికపాటి వారి మహాభారతం మొదలెట్టారు, ప్రతీరోజూ క్రమం తప్పకుండా వినేవాళ్ళం. అప్పుడు, తెలిసింది, మా ఇంటికి ఎదురుగా ఉండే ఒకాయనద్వారా, శ్రీ చాగంటి వారి గురించి. ఆరోజుల్లోనే, నా అంతర్జాల ప్రస్థానం, బ్లాగులూ, మొదలవడంతో, కొద్దిగా నెట్ గురించికూడా తెలిసింది. శ్రీ చాగంటి వారి ప్రవచనాలకి ప్రత్యేకంగా ఒక సైట్ ఉన్నట్టుకూడా అప్పుడే తెలిసింది. ఇదంతా పూర్వరంగం.

    శ్రీ చాగంటి వారి ప్రవచనాలు వినేవారు ప్రపంచంలో ఎంతమంది ఉంటారో లెక్క కట్టలేము. దానికి కారణం, వారి భాషాపటిమ, ధారణాశక్తి.. ఏ విషయం గురించి చెప్పినా, అరటి పండు ఒలిచిపెట్టినట్టు చెప్పడం వారి ప్రత్యేకత. ఒకలా చెప్పాలంటే శ్రీ చాగంటి వారి ప్రవచనాలకి addict అయిపోయాము. ఇప్పటిదాకా, వారి ప్రవచనాలు ప్రత్యక్షంగా వినే అదృష్టం కలగలేదని బాధపడుతూంటాము. ఆయనేమో పూణే రారూ, మాకేమో , ఆయన ప్రవచనాలు చెప్పేటైములో మన ప్రాంతాలకి వెళ్ళే అవకాశం ఉండదూ. పోనిద్దూ, ఎప్పుడు రాసిపెట్టుంటే అప్పుడే జరుగుతుందీ, అని వదిలేశాము.

    ఈమధ్య, గోదావరీ పుష్కరాల సందర్భంలో, ఆయన ప్రవచనాలమీద, కొన్ని విమర్శలు, అవీ తోటి ప్రవచనకారుల నుండి, రావడం, విని కొద్దిగా బాధపడ్డాము. ఎక్కడో అనిపించింది, బహుశా శ్రీ చాగంటి వారికి వస్తూన్న, Public Exposure కూడా ఓ కారణం అయుండొచ్చని. ఏ తెలుగు టీవీ చానెల్ చూసినా, శ్రీ చాగంటి వారే. దానితో, ఎక్కడలేని publicity వచ్చేసింది. దానికి పూర్తి హక్కుదారే కూడా. అందులో సందేహం లేదు. తోటి ప్రవచనకారులకి, అంతంత ప్రాచుర్యం రావడం , ఎవరికైనా అసూయ కలగడం కూడా but natural. దానికి సాయం, మన మీడియా వారికి కూడా చాలా కాలక్షేపం . ఆవిషయం పక్కకు పెడదాం.

    మన దేశంలో Hero Worship ఒక బలహీనత. ఏదైనా రంగంలో ఎవరైనా ప్రముఖులయారంటే చాలు, వారు ఏం చేసినా సరైనదిగానే భావిస్తారు, వారి అభిమానులు. ఓ ప్రముఖ సినీ నటుడు ఉన్నాడనుకోండి, వాడు తప్పతాగి కారు నడిపి, మనుషుల్ని చంపేసినా సరే, ఇంకోడెవడో, నెలకో పెళ్ళి చేసికున్నా సరే,ఇంకోడెవరో, రాజకీయపార్టి ప్రారంభించి,పదవులకోసం అధికారపార్టీలో, తను స్థాపించిన పార్టీని విలీనం చేసినా సరే అలాటివన్నీ just one of those things అంటారు. ఇంకొంతమందైతే, సమాజ సేవ అని పేరుపెట్టి, టీవీ ప్రకటనల ద్వారా, జనాలని impress చేసి, వారికి కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగించినా సరే, లేదా వాళ్ళు endorse చేసినవి తిని, రోగాలు తెచ్చికున్నాసరే, ఆ celebrities మీద మాత్రం ఈగ వాలనీయరు.. అది మన దౌర్భాగ్యం.

     ఒక వ్యక్తి పేరు చెప్పగానే మనం వారిని ఒక విషయానికి relate చేస్తాము. అలాగే శ్రీ చాగంటి వారి ప్రవచనం అనగానే, ఏ లలితామ్మవారి గురించో, సౌందర్యలహరి గురించో, ఏ శంకర భగవద్పాదుల గురించో, వెంకటేశ్వర వైభవం గురించో, కాదూ కూడదూ అంటే, ముక్తిమార్గం గురించో, పునర్జన్మ గురించో చెప్తారని ఒక IMAGE ఉంది.. మధ్యమధ్యలో కాలేజీలకి వెళ్ళి, Pesonality Development మీద కూడా ప్రసంగాలు చేస్తూంటారు. వారు ఏ Subject మీదైనా అనర్గళంగా చెప్పగలరు. శ్రధ్ధగా వింటారు కూడానూ విద్యార్ధులు. అలాటి సందర్భాలలో, శ్రీ చాగంటి వారు, ఓ Professional Consultant లాగే కనిపిస్తారు, ఓ ప్యాంటూ, చొక్కా వేసికుని. కానీ ప్రవచనాల విషయం వచ్చేసరికి మాత్రం, ఓ పంచా, లాల్చీ, కండువా, మెడలో ఓ దండతోనే, సందర్భానుసారం దర్శనం ఇస్తారు. ఈమధ్యన భాగ్యనగరంలో, శంకరాభరణం గురించి ప్రవచనం అని చదివాము. ఏ శంకరుడి గురించో, లేదా శంకరుడి ఆభరణం వాసుకి గురించో, లేదా అప్పుడప్పుడు వారు చెప్పే సంగీత ప్రవచనాల సందర్భంలో, ఏ “ శంకరాభరణం “ రాగం గురించో, అనుకున్నాము కానీ, మరీ శంకరాభరణం సినిమా గురించి అని మాత్రం ఊహించలేదు..

     శంకరాభరణం was definitely a good Film , but not The Greatest Film శ్రీ చాగంటి వారు చెప్పినట్టుగా. ఆరోజుల్లో వచ్చిన సినిమాలకంటే, ఇది కొద్దిగా వైవిధ్యంగా ఉంది. పైగా అలాటి చిత్రాలు, జయభేరి , భక్త జయదేవ లాటివి ఎప్పుడో వచ్చాయి. కొద్దిగా అతిశయోక్తి చేసి చెప్పారేమో అనిపించింది. అయినా శ్రీ చాగంటి వారు ఏ దేవుడి గురించి చెప్పినా, ఏ పుణ్యక్షేత్రంగురించి చెప్పినా Totally Devoted and Committed గానే చెప్తారు ఉదాహరణకి, తిరుమల, కాశీ, అరుణాచలం, శ్రీశైలం ల గురించి చెప్పినప్పుడు, మానసిక దర్శనం పేరుచెప్పి, ఆయా క్షేత్రాల దర్శనంలో, చూడగలిగే విశేషాలు, కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు. వెంటనే, అక్కడకి వెళ్ళి దర్శనం చేసికోకపోతే మన జన్మ వ్యర్ధం అనుకుని, తీరా వెళ్తే, ఆయన చెప్పిన విషయాలు మనం చూడడం సాధ్యంకాదు. తిరుమలలో అన్నీ చూసే భాగ్యం, శ్రీ చాగంటివారు కాబట్టి వీలైంది కానీ, మనలాటి అనామకులకి క్షణంలో లక్షో వంతు కూడా దొరకదు. అది అందరికీ తెలిసిందే, అయినా ఆయన చెప్తారు మనం విని సంతృప్తి చెందుతాము..

    ప్రస్తుత ప్రవచనం లో, శ్రీ చాగంటి వారు సినిమాలోని ఒక్కో దృశ్యం గురించి ప్రసంగిస్తూ, దానిని, పురాణాలలోని ఘట్టాలతో పోల్చి చెప్పారు. చాలా బాగుంది. కానీ, ఆ సభలో ఉన్న శ్రీ విశ్వనాథ్, ఆయన హావభావాలు చూసినప్పుడు నాకు అనిపించిందేమిటా అంటే ..” అఛ్ఛా.. అలాగా.. అసలు నేనలాగే అనుకోలేదూ…” అని. బహుశా నేనకున్నది తప్పైయుండొచ్చు. కానీ , నాకు మాత్రం అలాగే అనిపించింది. ఆమధ్యన “జులాయి” అని ఓ సినిమాలో, హీరో, పోలీసు స్టేషన్ లో, బ్రహ్మాజీ అసిస్టెంట్లని ఎడా పెడా బాదేస్తాడు. అది చూసి, ఓ పోలీసు “ అయ్యబాబోయ్.. నా టెబుల్ మీద ఇన్ని మారణాయుధాలున్నాయా… “ అంటాడు. నాకు శ్రీ విశ్వనాథ్ గారిని చూస్తే అదే గుర్తొచ్చింది.

    3 గంటల, 36 నిముషాల “ప్రవచనం” లోనూ, అలాటి సినిమా తీయడానికి ధైర్యం చేసిన శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారి గురించి కానీ, అద్భుతమైన బాణీలు కట్టిన శ్రీ మహదేవన్ గారి గురించి కానీ, ఒక్కమాట లేకపోవడం చాలా బాధేసింది. ఈరోజుల్లో జరిగే అదేదో, ఆడియో ఫంక్షన్ లాగ ఉందనిపించింది. కానీ చెప్పింది గురువుగారు శ్రీ చాగంటివారాయె, శిరోధార్యం కదా… గురువుగారూ… మీరు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తేనే బాగుంటుందండీ… మరీ సినిమాల వైపుకి వద్దు సార్ , ఎంత “గొప్ప” సినిమా అయినా సరే. మా దృష్టిలో మీరు ఎప్పుడూ శిఖరం మీదే ఉండాలి. కిందకు దిగాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అపర శంకరాచార్యుల గా కొలిచేవారు,ఎందరో ఉన్నారు…

    రేపెప్పుడో బాహుబలి గురించి ప్రవచనాలు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. It is the Order of The Day…

    ఆ విడియో మీరు కూడా చూసి “తరించండి “

1. https://www.youtube.com/watch?v=d8rbI6VbMKQ

2. https://www.youtube.com/watch?v=HowdXu-tO60

12 Responses

 1. మీరన్నట్లు చాగంటి వారు ఆధ్యాత్మిక ప్రవచనాలకే confine ఐతే మంచిది.సినిమాలు,రాజకీయాలు మొదలైనవాటి జోలికి వెళ్ళకుండా .గరిక పాటివారిలాగ ప్రసంగం మధ్యలో వాటిపైన అప్పుడప్పుడు చెణుకులు విసిరితే పరవాలేదు.

  Like

 2. Even his other lectures are full of action by him.Nearer to a common person he excels in his subject with full authority.we heard he is not money minded.

  Like

 3. dear sir,
  Namaste. miiru prog ki raakundaane anni choosinatlu raayadam chaalaa aschryam. KV Mahadevan, Edida Nageswara Rao tho sahaa andari gurinchi… Chaaganti vaaru prastaavinchaaru. Adi prog attend ayina vaallaku telusu. ika Viswanath gari spandana miiru choosinatlu leru. Aaayana chaalaa vinayamgaa… andhulo chaalaa varaku alaa daiva vasaathoo jarigaaye thappa, anukoni chesinavi kaavani Cheppaaru. Ayinaa mii maatallo vyangyame thappa vaasthavam thakkuva gaa vundi. Chaganti vaaru thaanu ii SANKARABHARANAM miida enduku maatlaaduthunnadi koodaa munde sudeerghamgaa cheppaaru. Adi vere charcha. Oka Telugu vaadi goppadanam, Kalaa srishtiki KAvya gouravam vaste vilunte Aanamdinchaali. Visaala hridayam tho abhinamdinchaali. Aakrosam gaa… vyangya baanaalu veyadam sarikaademo.

  Like

  • phanibabu garu cheppindi nijame anipistundi. Changanti varu diva pravachanalu istene baguntundi.phanibabu garu ekkada vyangyam ga rayaledu.

   Like

 4. రమణారావుగారూ,
  నా టపా ఉద్దేశ్యం అదేనండి.

  రాధారావు గారూ,

  మీరన్నదానిలో సందేహమే లేదు..

  photo4print గారూ,

  నేను కింద ఇచ్చిన విడియో చూసి మాత్రమే రాశాను., అందులో,శ్రీ మహదేవన్ గారి గురీంచి కానీ, శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి గురించి కానీ ప్రస్తావించలేదు. బహుశా ఎడిట్ చేసుంటారు.. “శ్రీ చాగంటి వారు తాను ఈ సినిమా గురించి ఎందుకు మాట్టాడుతున్నానో సుదీర్ఘంగా చెప్పారు”– ఆ విషయం నేనూ విడియోలో విన్నాను/ చూశాను. శ్రీ చాగంటి వారు అసలు ఆ విషయం ఎందుకు ప్రస్తావించారంటారు? ఎక్కడో వారికి కూడా ఓ అనుమానం వచ్చే కదా– తమ అభిమానులకి నచ్చదేమో.. అని? లేకపోతే, ప్రతీ ప్రవచనం ముందూ ఇంత సంఝాయిషీ ఇచ్చినట్టు ఎప్పుడూ వినలేదే. ఇంక, నేను రాసిన దాంట్లో వ్యంగ్యం గా ఏమనిపించిందో అర్ధం అవలేదు.
  గురువుగారిని అభిమానించే కోట్లాది మందిలో నేను కూడా ఉన్నాను.. ఈ సినిమా, ” ప్రవచనం” చెప్పేటంత స్థాయిలో లేదు. ఆ విషయమే వ్రాశాను. ఇంతకంటే అద్భుతమైన సినిమాలు వచ్చాయి. కానీ, ఆ సినిమాల గురించి ఎప్పుడూ చెప్పినట్టు వినలేదే. అదే నేను రాసింది కూడా. నేను రాసినదానిలో ” వ్యంగ్యం” కనిపించడం, నా దురదృష్టం.ఏదైనా మన దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. అందుకే నాటపాకి ” అంత అవసరమంటారా..” అని శీర్షిక పెట్టాను. అది ఓ అభిమాని ఆవేదన గా భావించండి.

  జ్యోతి గారూ,
  నా ఉద్దేశ్యం కరెక్టుగా అర్ధం చేసికున్నందుకు ధన్యవాదాలు.

  Like

 5. ముందుగా ఆ వీడియోల లింకులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అద్భుతమైన ఆ ఉపన్యాసాల మీద మీరు ఇలా ఎందుకు అనుకుంటున్నారో ఆశ్చర్యంగా ఉన్నది. ఒక అద్భుతమైన సినిమా గురించి ఆయన చెప్పారు. మరేమీ కాదు కదా. దాదాపుగా నాలుగు దశాబ్దాల క్రితం తీయబడ్డ సినిమా గురించి చెప్పి, ఆ సినిమాలో దాగి ఉన్న అనేకమైన అర్ధాలను తెలియచెప్పటం చాలా బాగున్నది.

  తరువాత మీరు “శ్రీ మహదేవన్ గారి గురీంచి కానీ, శ్రీ ఏడిద నాగేశ్వరరావు చెప్పలేదు” అన్నారు. నేను మూడు వీడియోలు చూసాను చివరి భాగంలో వారి ప్రస్తావన ఉన్నది.

  Like

 6. నా ఉద్దేశ్యంలో చాగంటి వారు, మన భారత చరిత్ర (ఆంగ్లేయులు/కమ్యూనిస్టులు వ్రాసిన నిజాలు దాచి పెట్టిన, అబద్ధాల చరిత్ర కాదు) అంటే అసలైన చరిత్ర కూడా ఇలా ప్రవచన రూపంలో చెబితే ఎంతైనా బాగుంటుందని ఎప్పటినుంచో అనుకుంటున్నాను.

  Like

 7. శివరామప్రసాద్ గారూ,

  మీ స్పందనకు ధన్యవాదాలు. ముందుగా ఒకవిషయం.– నేను చూసిన రెండు విడియోలలోనూ, ” శ్రీ మహదేవన్, శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారి గురించీ ప్రస్తావించకపోవడం, బాధాకరం ” అన్నాను. నేను పెట్టినవి కూడా ఆ రెండు విడియోలే అని గమనించప్రార్ధన. మీరు, మూడో విడియోలో , ఆ ఇరువురి గురించీ ప్రస్తావించారన్నారు. సంతోషం.
  ఆయన చెప్పినది ఒక ” అద్భుతమైన” సినిమా అన్నారు. సరే.. అదీ బాగానే ఉంది, ఎవరి అభిప్రాయాలు వారివీ.. నా అభ్యంతరమల్లా, సినిమా గురించి ” ప్రవచనం ” అన్నందుకే. సాధారణంగా, ఈ ప్రవచనాలూ, Discourse లూ ఏదో ఒక అధ్యాత్మిక్ విషయాలగురించే చెప్తారని, నా అభిప్రాయం ఇన్నాళ్ళూ.. ఇప్పుడు తెలిసింది– సినిమాల గురించీ, రాజకీయాల గురించీ కూడా ” ప్రవచనం ” చెప్తారని..
  వారు , ఆధ్యాత్మిక విషయాలే కాకుండా, ఇంకా ఎన్నో ఎన్నెన్నో విషయాల గురించి, కాలేజీ విద్యార్ధులకి ప్రసంగాల రూపంలో చెప్పారు. ఆ ఒరవడిలోనే, ఈ సినిమా గురించి కూడా, ” ప్రసంగం” అనేస్తే గొడవుండేది కాదు.. ఒక వ్యక్తి గురించి అందరూ ఒక IMAGE ఏర్పరుచుకుంటారు, అలాటప్పుడు, ఒక సినిమా గురించి ” ప్రవచనం ” అన్న మాట కొద్దిగా disappointing గా ఉంది, అదే వ్రాశాను.. నేను నా టపాలో, ఎక్కడా కూడా, శ్రీ చాగంటి వారిని కించపరుస్తూ వ్రాయలేదు,. ఆ సినిమా గురించి వారు అభిప్రాయం ఎలా వ్యక్తపరిచారో, అలాగే శ్రీ చాగంటి వారిమీద ఉండే భక్తి గౌరవాలూనూ.. అలాటివారు సినిమాల గురించికూడా చెప్పడం, దానిని “ప్రవచనం ” అనడం కొద్దిగా disappointing గా ఉంది..

  Like

  • ఎవరి అభిప్రాయాలు వారివి అని బాగా చెప్పారు.

   చాగంటి వారు శంకరాభరణం గురించి చెప్పినది ప్రవచనం అనండి, ప్రసంగం అనండి, విషయం అదే కదా! నాకు బాగున్నది. మంచి సినిమా, మంచి సాహిత్యం గురించి కూడా ఆయన చెప్పటం మొదలు పెట్టాలని నా ఆకాంక్ష. ఒక విషయాన్ని కూలంకషంగా విశ్లేషిస్తూ చెప్పగల సత్తా ఉన్నవారిని ఇదే చెప్పండి, ఇవి చెప్పద్దు అని కట్టడి చెయ్యటం కరెక్ట్ కాదని అని నా అభిప్రాయం. చాగంటి వారి మంచి రెఫరెన్సులు తీసుకుని మన భారత చరిత్ర కూలంకషంగా చెబితే ఎంతైనా బాగుండును.

   Like

 8. భమిడి పాటి వారూ మీరూ రాసేసారూ ..:)

  చాగంటి వారు వారి ఈ ప్రవచనానికి వచ్చిన సద్విమర్శనల్ గమనిస్తారని ఆశిస్తున్నా 🙂

  రాబోయే కాలం లో ఇట్లాంటి అనవసరపు పోకడలకు పోకుండా ఉంటారేమో చూద్దాం.

  అయినా వారు ఏది చెప్పినా ‘శ్రోత’ ప్రియం గా చెబుతారనటం లో సందేహం లేదు.

  కాని ఏది వారు చెప్పాలో వారు చెప్పాల్సిన అవసరం లేదో అది వారు సరియైన నిర్ణయం తీసుకుని చెబుతారని ఆశిద్దాం.

  శంకరాభరణం గొప్ప చిత్రమే . ఎందుకంటే అది వచ్చిన కాలం లో ట్రెండ్ బ్రేకర్ .

  అట్లాగే ఆ చిత్రం పై ప్రవచనం చెప్పి ‘ట్రెండ్’ బ్రేక్’ చేసేసారు చాగంటి వారున్నూ జేకే 🙂

  చీర్స్
  జిలేబి

  Like

  • ‘కొస’ తునక 🙂

   ఇంకా కష్టే ఫలే వారు ఈ విషయం పై మౌనం గా ఉన్నారు

   ఏమండీ కష్టే ఫలే వారూ మీరూ ఒక టపా రాద్దురూ

   జిలేబి

   Like

 9. శివరామప్రసాఅద్ గారూ,
  మీరన్నట్టే ఎవరి అభిప్రాయం వారిదీ… అయినా … ప్రవచనానికి కొన్ని పారామీటర్లు ఉంటాయనుకుంటాను. ప్రతీ ఉపన్యాసాన్నీ, ప్రసంగాన్నీ ప్రవచనం అనలేము కదా, దానికే నా అభ్యంతరం కానీ, శ్రీ చాగంటి వారి ఉపన్యాసం ( I still call it like that only..) గురించి ఎక్కడా హీనంగా వ్రాయలేదు.

  జిలేబీ గారూ,

  : “భమిడి పాటి వారూ మీరూ రాసేసారూ ..” ఇదేదో ” “Et tu, Brute?” ” అన్నట్టుగా ఉంది కదూ..
  ఇంకో విషయం– సాధారణంగా, శ్రీ చాగంటి వారు ఏ వేదిక మీద ప్రవచనం చెప్పినా, వారు కూర్చుండే స్థానం వెనుక, పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాస్తారు. కానీ ఇక్కడ దానికి విరుధ్ధంగా, “స్వర్ణభూమి” వారి ప్రకటనే highlight చేస్తూ కనిపించింది. పోనీ , వారే sponsor చేశారు కాబట్టి, వారిపేరే కనిపించిందీ అనొచ్చు. ఈ సందర్భంలో ఒక లింకు చదివాను…
  http://www.telugu360.com/te/real-estate-companies-encashing-caste-feeling/
  ఎక్కడో, అనిపిచింది.— శ్రీ చాగంటి వారు ఎలాగూ commercial Ads కి ఒప్పుకోరూ, పుణ్యం పురుషార్ధం అనుకుని , వారి పేరు ఉపయోగించుకున్నారా అని.
  I leave it to your guess. ఏది ఏమైనా, శ్రీ చాగంటి వారి, ప్రవచనాలు కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరంలేదనే నా అభిప్రాయం.
  ఇంక శర్మగారి విషయమంటారా… అయనిష్టం…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: