బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు— గురువుగారూ… మరీ అంత అవసరమంటారా ?

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి, 2009 లో మేము రాజమండ్రి కాపరానికి వెళ్ళే వరకూ తెలియదు. ఈ ప్రవచనాలు వగైరా, కూడా వినడం మొదలెట్టింది, రాజమండ్రి లో, మొట్టమొదట సారి, శ్రీ గరికపాటి వారి ప్రసంగం, ప్రత్యక్షంగా విన్నప్పుడే. ఆరోజుల్లోనే, భక్తి టీవీ వారు ప్రతీరోజూ, శ్రీ గరికపాటి వారి మహాభారతం మొదలెట్టారు, ప్రతీరోజూ క్రమం తప్పకుండా వినేవాళ్ళం. అప్పుడు, తెలిసింది, మా ఇంటికి ఎదురుగా ఉండే ఒకాయనద్వారా, శ్రీ చాగంటి వారి గురించి. ఆరోజుల్లోనే, నా అంతర్జాల ప్రస్థానం, బ్లాగులూ, మొదలవడంతో, కొద్దిగా నెట్ గురించికూడా తెలిసింది. శ్రీ చాగంటి వారి ప్రవచనాలకి ప్రత్యేకంగా ఒక సైట్ ఉన్నట్టుకూడా అప్పుడే తెలిసింది. ఇదంతా పూర్వరంగం.

    శ్రీ చాగంటి వారి ప్రవచనాలు వినేవారు ప్రపంచంలో ఎంతమంది ఉంటారో లెక్క కట్టలేము. దానికి కారణం, వారి భాషాపటిమ, ధారణాశక్తి.. ఏ విషయం గురించి చెప్పినా, అరటి పండు ఒలిచిపెట్టినట్టు చెప్పడం వారి ప్రత్యేకత. ఒకలా చెప్పాలంటే శ్రీ చాగంటి వారి ప్రవచనాలకి addict అయిపోయాము. ఇప్పటిదాకా, వారి ప్రవచనాలు ప్రత్యక్షంగా వినే అదృష్టం కలగలేదని బాధపడుతూంటాము. ఆయనేమో పూణే రారూ, మాకేమో , ఆయన ప్రవచనాలు చెప్పేటైములో మన ప్రాంతాలకి వెళ్ళే అవకాశం ఉండదూ. పోనిద్దూ, ఎప్పుడు రాసిపెట్టుంటే అప్పుడే జరుగుతుందీ, అని వదిలేశాము.

    ఈమధ్య, గోదావరీ పుష్కరాల సందర్భంలో, ఆయన ప్రవచనాలమీద, కొన్ని విమర్శలు, అవీ తోటి ప్రవచనకారుల నుండి, రావడం, విని కొద్దిగా బాధపడ్డాము. ఎక్కడో అనిపించింది, బహుశా శ్రీ చాగంటి వారికి వస్తూన్న, Public Exposure కూడా ఓ కారణం అయుండొచ్చని. ఏ తెలుగు టీవీ చానెల్ చూసినా, శ్రీ చాగంటి వారే. దానితో, ఎక్కడలేని publicity వచ్చేసింది. దానికి పూర్తి హక్కుదారే కూడా. అందులో సందేహం లేదు. తోటి ప్రవచనకారులకి, అంతంత ప్రాచుర్యం రావడం , ఎవరికైనా అసూయ కలగడం కూడా but natural. దానికి సాయం, మన మీడియా వారికి కూడా చాలా కాలక్షేపం . ఆవిషయం పక్కకు పెడదాం.

    మన దేశంలో Hero Worship ఒక బలహీనత. ఏదైనా రంగంలో ఎవరైనా ప్రముఖులయారంటే చాలు, వారు ఏం చేసినా సరైనదిగానే భావిస్తారు, వారి అభిమానులు. ఓ ప్రముఖ సినీ నటుడు ఉన్నాడనుకోండి, వాడు తప్పతాగి కారు నడిపి, మనుషుల్ని చంపేసినా సరే, ఇంకోడెవడో, నెలకో పెళ్ళి చేసికున్నా సరే,ఇంకోడెవరో, రాజకీయపార్టి ప్రారంభించి,పదవులకోసం అధికారపార్టీలో, తను స్థాపించిన పార్టీని విలీనం చేసినా సరే అలాటివన్నీ just one of those things అంటారు. ఇంకొంతమందైతే, సమాజ సేవ అని పేరుపెట్టి, టీవీ ప్రకటనల ద్వారా, జనాలని impress చేసి, వారికి కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగించినా సరే, లేదా వాళ్ళు endorse చేసినవి తిని, రోగాలు తెచ్చికున్నాసరే, ఆ celebrities మీద మాత్రం ఈగ వాలనీయరు.. అది మన దౌర్భాగ్యం.

     ఒక వ్యక్తి పేరు చెప్పగానే మనం వారిని ఒక విషయానికి relate చేస్తాము. అలాగే శ్రీ చాగంటి వారి ప్రవచనం అనగానే, ఏ లలితామ్మవారి గురించో, సౌందర్యలహరి గురించో, ఏ శంకర భగవద్పాదుల గురించో, వెంకటేశ్వర వైభవం గురించో, కాదూ కూడదూ అంటే, ముక్తిమార్గం గురించో, పునర్జన్మ గురించో చెప్తారని ఒక IMAGE ఉంది.. మధ్యమధ్యలో కాలేజీలకి వెళ్ళి, Pesonality Development మీద కూడా ప్రసంగాలు చేస్తూంటారు. వారు ఏ Subject మీదైనా అనర్గళంగా చెప్పగలరు. శ్రధ్ధగా వింటారు కూడానూ విద్యార్ధులు. అలాటి సందర్భాలలో, శ్రీ చాగంటి వారు, ఓ Professional Consultant లాగే కనిపిస్తారు, ఓ ప్యాంటూ, చొక్కా వేసికుని. కానీ ప్రవచనాల విషయం వచ్చేసరికి మాత్రం, ఓ పంచా, లాల్చీ, కండువా, మెడలో ఓ దండతోనే, సందర్భానుసారం దర్శనం ఇస్తారు. ఈమధ్యన భాగ్యనగరంలో, శంకరాభరణం గురించి ప్రవచనం అని చదివాము. ఏ శంకరుడి గురించో, లేదా శంకరుడి ఆభరణం వాసుకి గురించో, లేదా అప్పుడప్పుడు వారు చెప్పే సంగీత ప్రవచనాల సందర్భంలో, ఏ “ శంకరాభరణం “ రాగం గురించో, అనుకున్నాము కానీ, మరీ శంకరాభరణం సినిమా గురించి అని మాత్రం ఊహించలేదు..

     శంకరాభరణం was definitely a good Film , but not The Greatest Film శ్రీ చాగంటి వారు చెప్పినట్టుగా. ఆరోజుల్లో వచ్చిన సినిమాలకంటే, ఇది కొద్దిగా వైవిధ్యంగా ఉంది. పైగా అలాటి చిత్రాలు, జయభేరి , భక్త జయదేవ లాటివి ఎప్పుడో వచ్చాయి. కొద్దిగా అతిశయోక్తి చేసి చెప్పారేమో అనిపించింది. అయినా శ్రీ చాగంటి వారు ఏ దేవుడి గురించి చెప్పినా, ఏ పుణ్యక్షేత్రంగురించి చెప్పినా Totally Devoted and Committed గానే చెప్తారు ఉదాహరణకి, తిరుమల, కాశీ, అరుణాచలం, శ్రీశైలం ల గురించి చెప్పినప్పుడు, మానసిక దర్శనం పేరుచెప్పి, ఆయా క్షేత్రాల దర్శనంలో, చూడగలిగే విశేషాలు, కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు. వెంటనే, అక్కడకి వెళ్ళి దర్శనం చేసికోకపోతే మన జన్మ వ్యర్ధం అనుకుని, తీరా వెళ్తే, ఆయన చెప్పిన విషయాలు మనం చూడడం సాధ్యంకాదు. తిరుమలలో అన్నీ చూసే భాగ్యం, శ్రీ చాగంటివారు కాబట్టి వీలైంది కానీ, మనలాటి అనామకులకి క్షణంలో లక్షో వంతు కూడా దొరకదు. అది అందరికీ తెలిసిందే, అయినా ఆయన చెప్తారు మనం విని సంతృప్తి చెందుతాము..

    ప్రస్తుత ప్రవచనం లో, శ్రీ చాగంటి వారు సినిమాలోని ఒక్కో దృశ్యం గురించి ప్రసంగిస్తూ, దానిని, పురాణాలలోని ఘట్టాలతో పోల్చి చెప్పారు. చాలా బాగుంది. కానీ, ఆ సభలో ఉన్న శ్రీ విశ్వనాథ్, ఆయన హావభావాలు చూసినప్పుడు నాకు అనిపించిందేమిటా అంటే ..” అఛ్ఛా.. అలాగా.. అసలు నేనలాగే అనుకోలేదూ…” అని. బహుశా నేనకున్నది తప్పైయుండొచ్చు. కానీ , నాకు మాత్రం అలాగే అనిపించింది. ఆమధ్యన “జులాయి” అని ఓ సినిమాలో, హీరో, పోలీసు స్టేషన్ లో, బ్రహ్మాజీ అసిస్టెంట్లని ఎడా పెడా బాదేస్తాడు. అది చూసి, ఓ పోలీసు “ అయ్యబాబోయ్.. నా టెబుల్ మీద ఇన్ని మారణాయుధాలున్నాయా… “ అంటాడు. నాకు శ్రీ విశ్వనాథ్ గారిని చూస్తే అదే గుర్తొచ్చింది.

    3 గంటల, 36 నిముషాల “ప్రవచనం” లోనూ, అలాటి సినిమా తీయడానికి ధైర్యం చేసిన శ్రీ ఏడిద నాగేశ్వరరావుగారి గురించి కానీ, అద్భుతమైన బాణీలు కట్టిన శ్రీ మహదేవన్ గారి గురించి కానీ, ఒక్కమాట లేకపోవడం చాలా బాధేసింది. ఈరోజుల్లో జరిగే అదేదో, ఆడియో ఫంక్షన్ లాగ ఉందనిపించింది. కానీ చెప్పింది గురువుగారు శ్రీ చాగంటివారాయె, శిరోధార్యం కదా… గురువుగారూ… మీరు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తేనే బాగుంటుందండీ… మరీ సినిమాల వైపుకి వద్దు సార్ , ఎంత “గొప్ప” సినిమా అయినా సరే. మా దృష్టిలో మీరు ఎప్పుడూ శిఖరం మీదే ఉండాలి. కిందకు దిగాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అపర శంకరాచార్యుల గా కొలిచేవారు,ఎందరో ఉన్నారు…

    రేపెప్పుడో బాహుబలి గురించి ప్రవచనాలు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. It is the Order of The Day…

    ఆ విడియో మీరు కూడా చూసి “తరించండి “

1. https://www.youtube.com/watch?v=d8rbI6VbMKQ

2. https://www.youtube.com/watch?v=HowdXu-tO60

%d bloggers like this: