బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Friendship Day ట….

   అన్ని “దినాల” లాగానే ఈరోజు “ Friendship “ దినంట.. అసలు ఈ “ దినాల” ప్రాముఖ్యం ఏమిటో నాకైతే అర్ధం అవదు. అలా అంటే చాలామంది మనోభావాలు కించపరచినట్టవుతుందేమో అని భయం. అయినా “నలుగురితోపాటు నారాయణా” అని , నా మిత్రులందరినీ ఈ రోజున అభినందిస్తూ… ఓ నాలుగు మాటలు, అదీ నా మిత్రుల గురించే వ్రాయాలని ఈ టపా…

    గత పదిహేను, ఇరవై సంవత్సరాలనుండే, ఈ “ దినాలు” మొదలయ్యాయి. ప్రత్యేకంగా సంవత్సరంలో ఓ రోజు ఒక్కోకరిని గుర్తుచేసికోవడం. ఓ రోజు Fathers Day, ఇంకో రోజు Mothers Day, ఓ రోజు Womens Day. నా ఉద్దేశ్యంలో పైచెప్పినవారందరినీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి కానీ, ప్రత్యేకంగా ఒక్కటంటే ఒక్క రోజే కేటాయించడం అంత బాగా లేదు. ఈరోజుల్లో, ప్రతీరోజూ గుర్తుపెట్టుకోవడానికి టైము చాలడం లేదు కాబట్టి, విదేశాలలో ఏ తలమాసినవాడో ఈ పధ్ధతి మొదలెట్టేసరికి , మన వాళ్ళకీ, ఈ వేలంవెర్రి ప్రారంభం అయుంటుంది. ఇంక మొదలు—ప్రతీ షాప్ లోనూ, రెండేసి రూపాయలకి వచ్చే అవేవో రింగులూ, బ్యాండులూ… సింగినాదాలూ .. వందలు పోసి కొనుక్కుని, కనిపించినవాళ్ళందరికీ కట్టుకుంటూ పోవడం ఓ Status Symbol గా మారిపోయింది. పైగా ఈ రోజున చేతికి ఏదీ కనిపించలేదంటే, “అసలు స్నేహితులే లేరా అయ్యో..” అంటారు.

   అసలు విషయంలోకి వద్దాము. అసలు స్నేహానికి అర్ధమైనా తెలుసునా అని నా అనుమానం. కొంతమందికైతే చుట్టాలకంటే, స్నేహితులే ముఖ్యం. నిజంగా, స్నేహం చేయాలంటే, అదంత తేలికైన పని కాదు. అవేవో Wavelength, Frequency లు కలవాలి. లేకపోతే, ఒకడు ఎడ్డెం అంటే, ఇంకోడు తెడ్డెం అంటే, ఆ స్నేహం మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుంది. ఒకరిగురంచి, ఇంకోరు యాగీ చేసికోవడమే జరిగేది.

   చాలామందికి రైలు ప్రయాణాలలోనూ, యాత్రలకి వెళ్ళినప్పుడో కలుస్తూంటారు. ఒకరి నెంబరు ఇంకోరూ, ఈరోజుల్లో అయితే మెయిల్ ఐడీ లూ…ఇలాటి స్నేహాలు మహా అయితే , ఓ ఏడాది పాటు నిలుస్తాయి. रात गयी बात गयी…
అసలు స్నేహానికి నిర్వచనం చెప్పాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది — తెలుగువారికే స్వంతమైన “ బాపు- రమణ” స్నేహం. పైగా వారి స్నేహం అందరిలాగా , ఏడాదీ, రెండేళ్ళూ కాదు, అయిదు పుష్కరాల పైమాటే. అంతగా Friendship Day గా గుర్తించాలంటే, ఆ ఇద్దరి జయంతులో, వర్ధంతులో అయితే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. అయినా ఆంఆద్మీలైన మనందరికీ అంతగా స్నేహాన్ని నిలుపుకోవడం, సాధ్యం కాకపోవచ్చు.

   ఈరోజుల్లో అంతర్జాల మహిమ ధర్మమా అని, ప్రపంచంలో చాలామందితో, బ్లాగుల ద్వారానో, ఫేస్ బుక్ ద్వారానో స్నేహాలు కలుస్తున్నాయి. కానీ, అభ్యంతరకరమైన విషయాలు, రాయనంతకాలమే నిలుస్తాయి. తిన్నతిండరక్క, తీరికూర్చుని, ఓ కులంగురించో, ఓ సమాజాన్ని గురించో రాయడం ఈరోజుల్లో ఫాషనైపోయింది. ఒకరినొకరు తిట్టుకోడంతోటే సరిపోతోంది. దానితో రెగ్యులర్ గా టపాలు రాసేవారూ, వీటికి దూరంగా వెళ్ళిపోతున్నారు.

   ఇన్ని గొడవలున్నా, పాత స్నేహితులని గుర్తుపెట్టుకునేవారు, బహుకొద్దిమందే ఉంటారు. ఆ విషయంలో, నేను మాత్రం చాలా అదృష్టవంతుడిని. నాకున్న స్నేహితులైతే, వేలల్లో ఉన్నారు, అంతర్జాలం ద్వారా. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన కొంతమంది స్నేహితుల గురించి ఇదివరకు ఒక టపా పెట్టాను. అది, 2011 లో, కానీ ఈ నాలుగేళ్ళలోనూ, ఇంకొందరితో స్నేహం చేసే భాగ్యం కలిగింది. నెలకోసారైనా ఫోను చేసి క్షేమసమాచారాలు అడుగుతారు. డెభై ఏళ్ళొచ్చేశాయికదా, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు.
ఈమధ్యన పుష్కారలకి వెళ్దామని, నాలుగునెలల ముందుగా రిజర్వేషనైతే చేసికున్నాను. కారణాంతరాలవలన, వెళ్ళలేకపోయాము. ఆ విషయం మా అమెరికా ఫ్రెండు శ్రీ అబ్బులు గారు ఫోను చేసినప్పుడు చెప్పాను. అయ్యో పాపం అన్నారు. కానీ, ఆ మధ్యన ఓరోజు ఫోను చేసి, కొరియరు అందిందా అన్నారు. ఇదివరకు రెండు పుస్తకాలు పంపారు, మళ్ళీ ఇంకో పుస్తకమేదైనా పంపేరేమో అని చూస్తే, “ గోదావరి పుష్కర పుణ్య జలాలు.”.Misc 042 అసలు నన్ను గుర్తుపెట్టుకుని, అంత హడావిడిలోనూ, ఆ పుణ్యజలాలు పంపారే, అదీ స్నేహానికి మారు రూపం. అలాగే ఇంకొక స్నేహితులు శ్రీ రామచంద్రరావు గారు, ఎంతో అభిమానంతో, శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి, రామాయణ, భాగవత అక్షరరూపాలు. ఇంక రోజువిడిచి రోజు, క్షేమసమాచారం విచారించే, మా కొంపెల్ల శాస్త్రిగారైతే అడగక్కర్లేదు. ఆయనకున్న భవబంధాల హడావిడిలో, రెండురోజులకోసారి ఫోను చేయడం మాత్రం మర్చిపోరు. అలాగే , నెలకో, రెణ్ణెలలకో సింగపూర్ నుండి ,ఫోనుచేసి, క్షేమసమాచారం అడిగే,
చి. వాత్సల్యా …వీరే కాకుండా, కొంతమంది ” దేవదూతలు” ఉన్నారండోయ్… శ్రీ అమరేంద్రగారు, ఆనందా, రవీ దంపతులూ— వీరిని దేవదూతలని ఎందుకన్నానంటే, ఎప్పుడూ గుమ్మం వదలని నాలాటివాడికి చేయూతనిచ్చి, దైవ సందర్శనాలు చేయించి పుణ్యం కట్టుకున్నారు.వీరందరినీ ప్రస్తావించానంటే, మిగిలిన వారెవరినీ తక్కువ చేశానని కాదు, అందరూ ఆత్మీయులే,నా స్నేహితుల గురించి వ్రాయాలంటే, ఓ ఏడాది పొడుగునా, రోజుకో టపా పెట్టినా సరిపోదు. నాకున్న స్థిరచరాస్థి నా స్నేహితులే. అప్పుడప్పుడు అనుకుంటూంటాను—ఏ జన్మలో ఏ పుణ్యం చేసికున్నానో, ఇంతమంది స్నేహితులు లభించారు. వారందరికీ శుభాకాంక్షలు.
అందరిలాగా రింగులూ, ఫ్రెండ్ షిప్ బ్యాండులూ, పంపలేనేమో కానీ, నా అమూల్యమైన స్నేహితులని సాధ్యమైనంతవరకూ ఎప్పుడూ గుండెల్లో దాచుకుంటాను. అది కాస్తా ఆగిపోతే చేసేదేమీ లేదు….

   సర్వేజనా సుఖినోభవంతూ…

%d bloggers like this: